అధ్యాయం -1
గణపతి ముఖ దర్శనం
~~~~~~~~~~~~~~~~
సంకట నాశన గణేశ స్తోత్రం
నారద ఉవాచ ।
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ ।
భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే ॥ 1 ॥
ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకమ్ ।
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్థకమ్ ॥ 2 ॥
లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ ।
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తథాష్టమమ్
॥ 3 ॥
నవమం భాలచంద్రం చ, దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననమ్
॥ 4 ॥
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్
॥ 5 ॥
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ।
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్
॥6 ॥
జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ ।
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
॥ 7 ॥
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ ।
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః
॥ 8 ॥
ఇతి శ్రీనారదపురాణే సంకష్ట నాశనం నామ గణేశ స్తోత్రమ్ ।
గజముఖ గణపతి ముఖ దర్శనం
అరుణగిరి అగ్రభాగమును చూస్తే, సజీవ మూర్తిగా ఉన్న గజముఖ ఆకారముగా ….మనకి ఆది అన్నామలై గుడి దగ్గర నుండి చూస్తే కనపడుతుంది. ఏనుగు ముఖం, ఏనుగు తొండం, ఏనుగు కన్ను, ఏనుగు చెవి చాలా స్పష్టంగా ఇక్కడి నుండి అరుణగిరి అగ్రభాగమును చూస్తే కనపడుతుంది. అలాగే గణేశ పురాణంలో చెప్పబడిన 32 గణపతులు కూడా ఈ క్షేత్రంలో అరుణగిరి పరిసర ఆలయాలలో మనకి కనబడడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కొన్ని గణపతి ఆలయాలు కాస్త జీర్ణావస్తకి చేరితే…. మరికొన్ని అయితే కాలగర్భంలో కలిసిపోయాయి. సరియైన ఆదరణ లేకపోవడంతో పోషణ చేసేవాళ్ళు లేకపోవడంతో…. వారసత్వ ధర్మకర్తలు గుడులను పాడు పెట్టి వెళ్లిపోవడం శోచనీయం. ఇలాంటి ఆలయాలు మనకి గిరిప్రదక్షిణ సమయంలో అగుపించి మనసుకు తెలియని బాధను కలిగిస్తాయి.
అరుణాచలేశ్వర ఆలయంలో మనకి 15 గణపతి ఆలయాలు ఉన్నప్పటికీ….. వాటిలో ముఖ్యమైనవి అష్ట గణపతులుగా ప్రసిద్ధి చెందాయి.
శక్తి గణపతి
@ అందులో మొదటిది…. మనకి ఈ ఆలయ రాజగోపురం కింద కనిపించే గణపతిని శక్తి గణపతి అంటారు. సర్వ గణపతుల శక్తికి ఈయన మూలశక్తి గణపతి అని మనకి కాశీ క్షేత్రంలో డూండీ గణపతి అనుగ్రహంతో జన్మించిన కావ్య కంఠ గణపతి ముని చెప్పటంతో ఈ మూల శక్తి గణపతి గురించి చెప్పడం జరిగింది. విచిత్రం ఏమిటంటే…. ఈయన జననం గణపతి చవితినాడు జరిగితే, ఈయన జీవ సమాధి కూడా గణపతి నిమర్జనం రోజునే జరిగిందని ఈయన జీవిత చరిత్రలో చెప్పడం జరిగింది.
@ రెండవ గణపతి…. ఈ ఆలయం లోపల ఉన్న స్తంభాకార కుమారస్వామి ఆలయానికి… వెనకవైపు సర్వ సిద్ధి గణపతిగా పూజలు అందుకుంటూ ఉంటాడు .
@ ఇక మూడవ గణపతి విషయానికి వస్తే ఈయన మనకి సుందరేశ్వర లింగమూర్తి ఆలయం దగ్గర ఉన్న ఈ ఆలయ స్థల వృక్షమైన పొగడ చెట్టు కింద ఈ గణపతి ఉంటాడు . ఈయనని మాంగై పిళ్ళయార్ అని పిలుస్తారు. పెళ్లి కాని వాళ్ళు ఈ గణపతిని ఆరాధన చేస్తే… పెళ్లికి ఉన్న అడ్డంకులు, అవాంతరాలు, సమస్యలు పోతాయని స్థానిక భక్తుల అనుభవాలు నిరూపణ చేస్తున్నాయి.
@ ఇక నాలుగవ గణపతి ఆలయం….. మనకి కిలి గోపురమునకు ఎడమవైపున ఈ ఆలయం కనబడుతుంది. ఈ గణపతిని ఏనుగుల గణపతి అని విచిత్ర నామంతో పిలుస్తారు. ఎందుకంటే ఒక రాజు తన చేసిన పాప దోష నివారణ కోసం ఈ గణపతికి ఏనుగులను సమర్పించడంతో…. ఆనాటి నుంచి ఈ గణపతిని ఏనుగుల గణపతి అని పిలవడం జరుగుతుందని స్థల పురాణంలో చెప్పడం జరిగింది.
@ ఇక ఐదవ గణపతి క్షిప్ర గణపతిగా పిలుస్తారు. ఈయన ఆలయంలో మనకి పడమర గాలి గోపురం దగ్గర ఉన్న రుద్ర పాదాలయం అలాగే సూక్ష్మ లింగాలయం దగ్గర ఈ గణపతి ఆలయం కనబడుతుంది. ఇక్కడ చేసే శంఖ నాదం కాస్త అరుణగిరి లోపల ఉన్న… అంతర గుహలో ఉండే…. వటవృక్షం కింద ఆవాసుడైన… సిద్ధ పురుషుడైన… అరుణగిరి యోగి అయిన దక్షిణామూర్తికి వినపడుతుంది. చాలామంది సాధవులు ఈ గణపతి ఆలయానికి వచ్చి శంఖ నాదం చేసే దృశ్యం చూస్తే…. ఆ ఓంకార నాద శబ్దానికి మన మనస్సు పులికింతలు అవడం అక్షర సత్యం అవుతుంది.
@ ఇకపోతే ఆరవ గణపతి ఆలయం…. మనకి అరుణాచలేశ్వర ఆలయం దగ్గరికి వెళితే, దీనికి ఎడమవైపు ఈ గణపతి ఆలయం కనబడుతుంది. ఈయనకి సంబంధార్ అనే కాళీ భక్తుడు తన భక్తి గీతాలతో స్వయంభూ గణపతి వెలియడం జరిగింది. ఈయన తంత్ర గణపతిగా ప్రసిద్ధి చెందాడు. ఎందుకంటే ఈ గణపతి కాస్త రాక్షస సంహారం తర్వాత ఇతని రక్తాన్ని ఒంటికి పోసుకోవడం జరిగిందని…. అందుకే ఈ భారీ గణపతి చూడటానికి ఎరుపు రంగులో ఉంటాడని…. అలాగే చేతబడి, దయ్యాలు, పిశాచాలు, భూతాలు పట్టిన వారిని…. లేదా ఏదైనా క్షుద్ర ప్రయోగాలు జరిగిన వాళ్ళు…. ఈ గణపతిని దర్శించుకొని ఆరాధన చేస్తే సర్వతాంత్రిక దోషాల నుండి విముక్తి పొందడం జరుగుతుందని స్థల పురాణం చెప్పడం జరిగింది .
@ ఇక ఏడవ గణపతి మనకి అమ్మవారి ఆలయంలో దర్శించుకునే ముందు….ఎడమవైపు ఉన్న ఆలయంలో సింధూరవర్ణంతో భారీ గణపతిగా సింధూర గణపతి పేరుతో పూజిస్తారు.
బిందు గణపతి
@ ఇక ఆఖరిది ఎనిమిదవ గణపతికి ఆలయం ఉండదు. కానీ ఈయన చూడటానికి 3 అంగుళాలకు మించి ఉండడు. అందుకే ఈయనని బిందు గణపతిగా పిలుస్తారు. ఈ గణపతి మనకి అపిత కుచాంబికా అమ్మవారికి ఎదురుగా ఉన్న గుడి బయట ఉన్న రెండు స్తంభాలలో అమ్మవారికి ఎడమవైపు స్తంభం కింద గూటిలో ఈయన ఉంటాడు. ఈయనకి ముందు దీపారాధన అలాగే మందార పువ్వు తప్పనిసరిగా ఎవరో ఒకరు ఉంచుతారు. దీనిని బట్టి ఈ బిందు గణపతిని మనం దర్శించుకోవచ్చును. తరించవచ్చును. ఇంత సూక్ష్మాతి సూక్ష్మ రూప గణపతి మనకి ఈ క్షేత్రంలో తప్ప ఎక్కడ కూడా అగుపించదు. సరిగ్గా అమ్మకి ఎదురుగా…. కుమారుడిగా ఈ బిందు గణపతి ఉండటం విశేషం అని చెప్పుకోవచ్చును. ఇలా అమ్మవారి సమక్షంలో సూక్ష్మ గణపతిగా ఉంటే…. అదే అరుణగిరి అగ్రభాగంలో స్థూల గణపతిగా అగుపించి పూజలు అందుకుంటున్నారు.
మూలస్థాన గణపతి
అలాగే ఆది అన్నామలై ఆలయానికి బయట వైపు ఉన్న పెద్ద రావి లేదా పొగడ చెట్టు కింద ఎవరూ చెక్కకుండా, స్పష్టమైన శరీర ఆధారం లేకుండా, స్వయంభుగా…. అరుణగిరి అగ్రభాగము నుంచి మడతలతో…. గణపతి ఆకారంతో వచ్చిన గణపతి శిలను ప్రతిష్టించి…. మూలస్థాన గణపతి గా పూజలు అందుకోవడం జరుగుతుంది. ఇలా ఈ క్షేత్రగణపతులు కాస్త ఆయనని భక్తితో కొలిచేవారికి కొంగుబంగారమై అనుగ్రహిస్తున్నారు. కోరికలు నెరవేరుస్తున్నారు . సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. విద్యని అడిగితే విద్యను…. ధనమును అడిగితే ధనమును…. లాభం అడిగితే లాభమును…. మోక్షమును అడిగితే మోక్షమును అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా అరుణాచల క్షేత్రానికి వెళితే, ఆది అన్నామలై గుడి నుండి అరుణగిరి అగ్రభాగంలో కనిపించే గణపతి ఆకార ముఖమును చూసి… దర్శించి…. తరించండి. అలాగే ఈ ఆలయమునకు బయట వైపున స్వయంగా గణపతి శిలయైన మూలస్థాన గణపతి విగ్రహ మూర్తిని దర్శించుకోండి. అలాగే అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్న అష్ట గణపతుల ఆలయాలు తప్పకుండా దర్శించి ….వారి అనుగ్రహంతో మీ ఇష్ట కోరికను నెరవేర్చుకోండి. తరించండి .
ప్రథమ అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్






కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి