అధ్యాయం - 27

 అధ్యాయం - 27 

పాప కర్మలు - ప్రాయశ్చిత్తములు 

~~~~~~~~~~~~~~~~~~~~~~~


నరక లోకమునందు నరక శిక్షలు


స్వామి  అరుణాచల శివ!  అరుణాచలేశ్వర!  వ్రత ,తీర్థ, తపో ,దాన, వేద, జ్ఞాన, యజ్ఞ నియమాలు, యాగముల ఫలము మీ పర్వత లింగమైన అరుణగిరిని దర్శనం చేసుకుంటే కలుగుతాయని నాకు అర్థం అయింది.  కానీ గత జన్మలలో తెలిసో తెలియకో చేసిన పాపపు కర్మలకి ఫలితాలు అనుభవించటానికి నరక లోకమునందు భయంకరమైన 21 నరక శిక్షలు నీవు ఏర్పాటు చేసితివి.  ఏ పాపాలు చేస్తే ఏ ఏ  నరక శిక్షలు పడతాయో….. అలాగే ఇవి పడకుండా ఉండటానికి వాటి నివారణ మార్గాలైన ప్రాయశ్చిత్త కర్మలు ఏం చేయాలో….ఎలా చేయాలో….. నాయందు దయ ఉంచి…. మీ అనుగ్రహ భాషణము సెలవివ్వండి. అనగానే …..


వత్సా!  గౌతమా ! నీ భక్తికి సంతోషించాను.  ఇప్పుడు దాకా నా క్షేత్ర గిరి యందు  ఉన్న పవిత్ర తీర్థాల మహత్యము నా ద్వారా తెలుసుకున్నావు.  ఇప్పుడు గత జన్మలో చేసిన పాపకర్మ నరక శిక్షలు ఏమిటో వివరంగా చెబుతాను.  అలాగే ఈ నరక బాధలు పడకుండా నివారించడానికి…. నాక్షేత్రము నందు ఏమి చేసి ప్రాయశ్చిత్తము చేయాలో నీకు వివరంగా చెబుతాను.  నీకు చెబితే లోకానికి చెప్పినట్లే కదా!  నువ్వే  వీటిని ప్రచారం చేస్తావు కదా!  అంటూ….. గత జన్మలో చేసిన పాప ఫలితమును అనుభవించడానికి యమదూతలు కాస్త పాపిని తీసుకుని యమలోకానికి తీసుకువెళ్లి అక్కడ వాడిని తాళ్లతో కట్టి….దుడ్డు కర్రలతో పొడిచి…. శూలాలతో పొడుస్తూ…. వాడు చేసిన పాపకర్మలకు తగ్గట్లుగా…. నరక శిక్షలు వేస్తూ…. హింసించడం జరుగుతుంది. ఈ శిక్షలో భాగముగా రాబందులు వాడి శరీరాన్ని ముక్కులతో పొడుస్తూ…గోర్లతో రక్కుతూ హింసిస్తాయి.  క్రూరమైన సర్పాల చేత పదేపదే కాట్లు వేయిస్తాడు.  వేట కుక్కలు, పెంపుడు పెద్ద పులులు వంటి క్రూర జంతువుల చేత కరిపించి, రక్కించి…. చంపే దాకా హింసిస్తారు.  మోయలేని భారాలు మోయిస్తూ.. ఆయుధాలతో పొడుస్తూ….వేడి వేడి నూనెలో పోస్తూ…. సూదులతో శూలాలతో పొడుస్తూ…. మరుగుతున్న నూనెలో ఉంచుతూ…. మంటలతో దహింపచేస్తారు.  ఇది పాపికి నరకమునందు నా చేత భయంకరమైన 21 నరక శిక్షలు ఏర్పాటు చేయబడింది. పాప భయం లేకపోతే అహం పెరుగుతుంది కదా!  పెరుగుట విరుగుట కొరకే కదా! నరక లోకము నందు ఈ శిక్షలన్నీ పాపుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 


బ్రాహ్మణుడిని హత్య చేసిన వాడికి మహారౌరవాది నరకములను తీసుకొని పోయి అక్కడ నూనెలో మరిగించిన తర్వాత గాడిద, కుక్క, పంది లేదా చండాల రూప జన్మలు ఎత్తుతాడు. ఈ హత్య చేసిన వాడికి క్షయరోగంతో భూలోకమునందు పీడించబడతాడు.  దీనికి ప్రాయశ్చిత్తం నా క్షేత్రంలో ఒక సంవత్సరం పాటు ఇంద్రియ నిగ్రహంతో ఉండి….. ఖడ్గ  తీర్థమునందు స్నానమాచరించి…. భస్మ రుద్రాక్షలతో…. కాషాయ వస్త్రధారియై…. ఏదో ఒక  దీక్ష తీసుకొని నా నామస్మరణ అరుణాచల లేదా అరుణాచల శివ అని జపిస్తూ భిక్షాటనతో భుజిస్తూ….. బ్రాహ్మణులకు అన్నప్రసాదం దానం చేస్తూ….. నా అరుణాచలేశ్వర లింగమును నియమనిష్టతో పూజలు చేస్తే…. కానీ ఈ బ్రాహ్మణ హత్య దోషము నుండి విముక్తి కలగదు.  తద్వారా ఇలా చేస్తే నరకంలోక ప్రాప్తి పొందకుండా ఇలా శివ లోక  ప్రాప్తి పొందడం జరుగుతుంది. బ్రాహ్మణుడి ధనమును లేదా బంగారమును అపహరించిన వాళ్లు బ్రహ్మ రాక్షసులు అవుతారు. ఈ దోషం వలన వాడు కాస్త కుళ్లిపోయిన గోర్లతో బాధపడతాడు.  దీనికి ప్రాయశ్చిత్తం ….నా ఈ క్షేత్రమునందు నన్ను బిల్వపత్రాలతో పూజ చేసి…. బ్రాహ్మణులకు భోజనం పెట్టి….ఎవరికైనా వారికి తోచినంత  దక్షిణ తాంబూలాలు ఇచ్చి సంతృప్తిపరిస్తే ఈ దోషాలు పోతాయి.


సురాపానం చేసేవారు లేదా బ్రాహ్మణుడికి రౌరవ నరకమున నరక శిక్షలు అనుభవించి….ఆ తరువాత పునః జన్మలుగా క్రిములు, కీటకములు, దీపపు పురుగులుగా జన్మలు ఎత్తుతాడు . ఇలాంటి తాగుబోతులకి దంతాలు పుచ్చిపోవడం…. పంటి దోషాలు కలిగి పంటి బాధలు పడతారు.  ఇలాంటి వారికి ప్రాయశ్చిత్తముగా  నా క్షేత్రంలో ఉన్న ఖడ్గ తీర్థంలో స్నానమాచరించి ….భస్మ రుద్రాక్షలు ధరించి…. నా అరుణాచలేశ్వర స్వామి లింగానికి పాలతో అభిషేకం చేస్తూ….. ఒక సంవత్సరం పాటు ఇంద్రియ నిగ్రహంతో ఉండి నా నామస్మరణ చేస్తే కానీ ఈ సురాపాన సేవన దోషం హరించదు. 


గురువు భార్యతో సంగమించే వాడికి  అసి పత్ర వనములోని ఆకులే చురకత్తులుగా మారి ఇతనిని హింసించును.  మరుజన్మలో నపుంసకుడిగా జన్మించును.  ఈ దోషం చేసినవాడు దుర్గంధ భరితమైన కుష్టువ్యాధితో ఈతి బాధలు పడతాడు.  దీనికి ప్రాయశ్చిత్తముగా నా ఈ క్షేత్రంలో మూడు నెలల పాటు ఉండి సహస్రదీపాలు వెలిగిస్తూ ఒక కన్యని అందంగా అలంకరించి…. బ్రాహ్మణునికి దానం ఇస్తే గురు భార్యతో చేసిన సంగమ  దోషం తొలగిపోతుంది. తద్వారా నరక ప్రాప్తి నుంచి విముక్తి కలిగి….. శాశ్వత శివలోకము నివాస ప్రాప్తి కలుగుతుంది.


పరస్త్రీ లేదా పర పురుష సంగమము  చేసిన స్త్రీ పురుషులు కాస్త కాలసూత్రము అనే నరకంలో కాల్చిన ఇనుప కడ్డీతో పొడవబడుతూ…. కాలుతున్న స్త్రీ, పురుషుల యొక్క ఇనుప బొమ్మను కౌగిలించుకొనే భయంకరమైన శిక్ష ఉంటుంది.  ఈ జన్మలో కుంటివాడిగా పుట్టి ఈతి బాధలు పడతాడు.  దీనికి ప్రాయశ్చిత్తము నా ఈ క్షేత్రం నందు ఒక మాసం ఉండి ఇంద్రియ నిగ్రహం కలిగి సుగంధ పుష్పాలతో నా శివలింగారాధన చేస్తూమీ… నిజ  భక్తుడిగా శక్తి కొలది  ధనమును దానమును చేస్తే…. ఇలా పరుల భార్య, పరస్త్రీ పరపురుష దోషాలు పోవును . 


గురు ద్రోహం చేసిన వాడు అపస్మారక వ్యాధితో బాధపడతాడు.  దీనికి ప్రాయశ్చిత్తముగా నా ఈ క్షేత్రమునందు ఒక మాసము ఉండి నాకు అలాగే బ్రాహ్మణుడికి సహస్ర గోవుల దానం చేసి ఒక పండుగ దినము నాడు బ్రాహ్మణులకు అన్న ప్రసాదం లేదా అన్నదానం పెట్టి ఒక నల్ల ఎద్దు లేదా ఆంబోతును వదిలిపెడితే కానీ….. ఈ గురు ద్రోహికి పాప విముక్తి కలగదు. 


ఇకపోతే   అశ్వ హంతకాలు కాస్త గాలి చొరబడని నరకమునందు…. ఊపిరి అందక ఈతి బాధలు పడే నరక శిక్షలు అనుభవిస్తారు.  అలాగే గోవు హత్య చేసినవాడు కాస్త దారుణ అనే నరకమునందు నరక శిక్షలు విధిస్తారు.  అలాగే స్త్రీ,పురుష హంతకులు కాస్త కుకూలా అనే నరకం నందు నరక శిక్షలు వేస్తారు.  అదే శిశువులను హత్య చేసిన హంతకులకి చండా అనే నరకమునందు నరక శిక్షలు అనుభవిస్తారు. ఇలాంటి హత్య దోషాల నివారణకి నా ఈ క్షేత్రమునందు వ్యతిపాతం నందు నువ్వులు దానము చేస్తే …. ఈ దోషాల విముక్తి పొందడం జరుగుతుంది . 


బావులు, దిగుడు బావులు, చెరువులు, పొలాలు, అపహరించేవాడు అసివన నరకమునందు నరక శిక్షలు అనుభవిస్తూ చిత్రహింసను అనుభవిస్తాడు. దీనికి ప్రాయశ్చిత్తముగా నా ఈ క్షేత్రం నందు బావులు లేదా చెరువులను తవ్విస్తే…. ఈ దోషము పోతుంది. అలాగే నాకు తన పొలము లేదా ఇతరుల పొలమును ధనముతో కొని నాకు సమర్పణ చేస్తే…… ఇతరుల నుండి పొలమును అపహరించిన దోషం పోతుంది. అలాగే ఇతరుల పంట పొలాలు లేదా తోటలను నాశనం చేస్తే వచ్చే దోషము నివృత్తి కోసం ఈ నా క్షేత్రమునందు నాకు తోటలు దానం చేస్తే దోష నివృత్తి అవుతుంది.


దేవతల ధనము లేదా దేవాలయం… గుడిలో హుండీలో ధనమును అపహరించిన వాళ్లు కాస్త దహన అనే నరకమునందు నరక శిక్షలు…. అలాగే ఇతరుల ధనాన్ని అపహరిస్తే గంగోరా అనే నరకంలో నరక శిక్షలు అనుభవిస్తారు.  ఇలా ఈ రెండు దోషాల నివృత్తి కోసం నా ఈ క్షేత్రం నందు నాకు లేదా ఇక్కడ నివసించే సాధువులకి తగినంత ధనమును సమర్పించి…. వారిని  సంతృప్తి పరిస్తే  ….. ఈ దోషం తొలగిపోతుంది.  అలాగే ఒక విషయం గుర్తుంచుకో!  ఈ జన్మలో ఏ వస్తువులు అయితే దొంగతనం చేస్తావో….. ఆయా వస్తువులు నీ తర్వాత జన్మలో లేకుండా పోతాయని తెలుసుకో. మాంసమును అనగా చచ్చిన వాటిని తింటే ఎలాంటి దోషం లేదు కానీ బతికున్న వాటిని బలవంతంగా జంతుబలిలో చంపి తింటే తరాల అనే నరకం నందు ఈ జంతువులతో నరక శిక్షలు వేయడం జరుగుతుంది. ఇవి తన పదునైన దంతాలతో లేదా గోర్లతో లేదా పదునైన ముక్కుతో చేసే  చిత్రహింసను అనుభవించక తప్పదు.  ఈ దోష నివృత్తి కోసం నా క్షేత్రమునందు మూడు మాసాలు ఉండి నా అరుణాచలేశ్వర శివలింగానికి మనోహరమైన ప్రతిరోజు రుచికరమైన నైవేద్యాలు సమర్పిస్తూ…. ప్రతిరోజు మూడుసార్లు నా నామమును ఉచ్చరిస్తూ ఉంటే ఈ మాంసభక్షణా దోషాలు తొలుగుతాయి.


ఇతరుల ఇళ్లను స్వాధీనపరుచుకునే వాడు లేదా తగలబెట్టినవాడు లేదా అపహరించిన వాడికి ఘోర నరకం నందు నరక శిక్షలు వేయడం జరుగుతుంది.  ఇలాంటి గృహ సంబంధాలు, త్రిదోషాలు చేసే వారికి నివృత్తి కోసం ఈ  నా క్షేత్రమునందు  నా దేవాలయం నిర్మించాలి.  లేదా నా శివ భక్తుడికి నా ఆవాసం చేయటానికి వీలుగా ఏర్పాటు చేయాలి… లేదా ఇలాంటి వారికి గృహదానం చేస్తే పాప విముక్తుడై శాశ్వత నా శివ సాన్నిధ్యం పొందడం జరుగుతుంది.


రహస్యముగా పాపాలు చేసేవారు కాస్త సంహారమనే నరకమునందు నరక శిక్షలు అనుభవిస్తారు. ఈ దోష నివృత్తి కోసం ఈ నా క్షేత్రం నందు నియమబద్ధంగా జీవిస్తూ గుప్త దానాలు చేస్తూ ఉంటే…. ఈ దోష నివృత్తి అవుతుంది.  వర్ణాశ్రమ భ్రష్టులు శివ అపచారము చేసిన వారు….. ఈ నా క్షేత్రమునందు మూడు రోజులు ఉంటే…. ఈ పాప విముక్తి పొందుతారు. అసత్యం చెప్పేవాళ్లు కాస్త భయానకం అని నరకము నందు నరక శిక్షలు అనుభవిస్తారు.  ఈ దోష నివృత్తి కోసం ఈ నా క్షేత్రం నందు ఆరు మాసాలు ఉండి శివదీక్ష పరులై నా స్తోత్రాలు నిత్యం పఠిస్తూ ఉంటే ఈ దోష పరిహారం అవుతుంది. 


శివ నింద,పర నింద లేదా ధర్మనింద చేసే వాళ్ళు కాస్త అవీచి అనే నరకమునందు నరక శిక్షలు అనుభవిస్తారు.  ఈ దోష నివృత్తి కోసం ….ఈ నా క్షేత్రమునందు ఒక సంవత్సర కాలం పాటు ధర్మబద్ధంగా…. నియమబద్ధంగా నివసిస్తూ యధాశక్తిగా…. ఇక్కడ యాగాలు చేయిస్తూ…. నా శివార్చన చేస్తే ఈ దోష పరిహారం కలుగుతుంది.  అలాగే నీకున్న లోభత్వము పోవాలంటే…. నా క్షేత్రం నందు వేద పఠనం చేస్తూ ఉచితంగా బ్రాహ్మణులకు వేదం నేర్పాలి. 


ఇకపోతే ఇతరులకి విషం ఇచ్చేవాడు కాస్త సుఘోర నరకమునందు…. లోభికి మహా ఘోర నరకమునందు…. మిత్ర ద్రోహికి  కరాళ నరకము నందు…. ఇతరులను హింసించే వారికి భీమ నరకము నందు…. పరులకు హాని తలపెట్టే వారికి వజ్ర నరకము నందు….. అలాగే తల్లిదండ్రులకు ద్రోహం చేసే వారికి తీక్షణ అనే నరకమునందు…. జపాలలో దూషించే వాడికి తాపము అనే నరకమునందు…. నరక శిక్షలు అనుభవింప చేస్తారు. అలాగే తప్పుడు సాక్ష్యాలు చెప్పే వాడికి మూగవాడిగాను…. అతిగా పూజించే వాడికి అజీర్ణ రోగంతో….. విద్య లేదా పుస్తకాలు దొంగిలించే వాడికి కంటి జబ్బులు లేదా అంధుడి గానూ….. పరనింద  చేయువాడు చెవిటి వాడిగాను….. దొంగతనాలు చేసే దొంగకి చెడిపోయిన నాలుక వ్యాధి పొందే వాడిగాను …..పర్వదినాలలో  భార్యతో లేదా పరస్త్రీ లేదా పరపురుషులతో రమించే వారికి మేహవ్యాధి లేదా వీర్య వ్యాధి లేదా సుఖ వ్యాధి పొందేవాడిగాను…అభోజ్య వస్తువులను భుజించే వాడికి నోటిపూత వ్యాధి వచ్చేవాడిగా…. కఠినంగా మాట్లాడే వాడికి  కుక్క గాను …..  సదాచార రహితుడికి పంది జన్మగాను….. అతిథులు లేదా బీదవారికి నిర్లక్ష్యం చేసే వాడికి చెవిపోటుతోను….. మర్యాద పాటించని వాడికి దాసుడిగాను…. వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఇతివాసాలు నిందించే  వాడు  చండాలుడి జన్మగాను…. ప్రమాణం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోని వాడికి అల్పాయుష్కుడు గాను….విష్ణు ద్రోహి  ఊసరవెల్లి గాను…. అలాగే శివ ద్రోహి పందికొక్కు జన్మలు పొందడం జరుగుతుంది. అలాగే ఈ జన్మ ఈతి బాధలు పొందవలసి పడవలసి వస్తుంది. 


సప్త వింశతిః (27వ) అధ్యాయం సమాప్తం 

 శుభం భూయాత్ 

సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి