అధ్యాయం 17
శ్రాద్ధ కర్మ పెట్టే అరుణాచల శివుడు
•••••••••••••••••••••••••••••••••••••
మీరు విన్నది నిజమే… అక్షర సత్యమే… ఇలా ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ఈ అరుణాచల క్షేత్రంలో…. అరుణాచలేశ్వరుడి చేత ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తన భక్తుడికి శ్రాద్ధ కర్మ చేయడం ఇప్పటికి కొనసాగుతుంది. దీని వివరాలలోకి వెళితే……క్రీ.శ 1292వ సంవత్సరంలో మూడవ వీరభల్లాల మహారాజు సింహాసనం ఎక్కి తిరువన్నామలైని తన రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగిస్తూ ఉండేవాడు. ఇతను అరుణాచలేశ్వర స్వామిని తన ఇష్ట దైవముగా ప్రాణప్రదముగా పూజిస్తూ…. ప్రతిరోజు శివార్చన తప్పకుండా చేస్తూ…. ఈ అరుణాచల క్షేత్రంలో నివసిస్తూ ఉండేవాడు. ఒకనాడు అరుణాచలేశ్వర స్వామికి ఇతని యొక్క భక్తిని పరీక్షించదలచి తన పరివారముతో శైవ జంగమ వేషములో ఈ రాజు దగ్గరికి వచ్చి…. అతని ఆతిథ్యం స్వీకరించి… రాజా ! నీ భక్తికి చాలా సంతోషించాను. నాకు అలాగే నా పరివార శిష్యులు అందరికీ ఈరోజు రాత్రి ఒక్కొక్క దేవదాసిని సమర్పించవలసిందిగా….. అనడంతో ఈ రాజు కాస్త ఈ ఏర్పాట్లు చేశారు. కానీ ఆఖరి క్షణంలో ఈ జంగమదేవరకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ దేవదాసీలు ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఆయనకి దేవదాసి దొరకపోవడం ఈ రాజుకి చాలా బాధ వేసింది. ఏం చేయాలో ఎలా ఏర్పాటు చేయాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉండగా…. రాజుగారి విచారమును గమనించిన ఈయన ఇద్దరి భార్యలలో చిన్న రాణి చెల్లమ్మ కాస్త….. రాజు దగ్గరికి వచ్చి…. స్వామి! మీరు అనుమతిస్తే నేను కాస్త దేవదాసిగా మారి ఆ జంగమ దేవర దగ్గరికి వెళతాను అనగానే…. రాజు ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళమని అనుజ్ఞ ఇవ్వటం జరిగింది. ఈమె కాస్త జంగమదేవర గదికి వెళ్ళగానే…. ఈయన మంచి గాఢ నిద్రలో ఉండడం గమనించి….. తన చేతితో ఈయనని తట్టి లేపుతూ ఉండగానే జంగమ దేవర స్థానంలో ఒక పసిపిల్లవాడు కనిపించాడు. వాడు కాస్త ఏడుపు అందుకునేసరికి…. ఈ చెల్లమ్మ కాస్త ఈ పిల్లవాడిని తన చేతిలోకి తీసుకొని…. తనకి పిల్లలు లేరనే లోటును ఆ శివుడే ఈ రూపంలో వచ్చి తీర్చాడు అని ఆనందపడుతూ….ఈ పిల్లవాడిని తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళింది. జరిగిన విషయం చెప్పింది. అంతా విన్న రాజు కాస్త అమితానంద పడిపోతూ…. ఈ పిల్లవాడిని తన చేతిలోనికి తీసుకోగానే ఆ పిల్లవాడు కాస్త అదృశ్యమై….. అశరీరవాణి కాస్త రాజా! నీకు బిడ్డలు లేని లోటును నేను ఈ బిడ్డడు రూపంలో వచ్చి తీర్చాను….. నేను నీ కుమారుడిగా ఉండి….. నీ మరణం తర్వాత ప్రతి సంవత్సరం ఈ పుణ్య తిథి నాడు…. నా చేత నీ శ్రాద్ధకర్మ జరుపబడుతుంది. ఇది నా ఆన… అని చెప్పి నందీశ్వరుడి మీద ఆసీనుడైన అరుణాచలేశ్వర స్వామి సాక్షాత్కారమై అంతర్దానం అయ్యాడు.
క్రీస్తు శకం 1343వ సంవత్సరంలో ముస్లింలతో చేసిన యుద్ధంలో ఈ భల్లాల రాజు మరణించడం జరిగింది. ఈయన చనిపోయిన మాసి (ఫిబ్రవరి) మాసంలో ఈ బల్లాలుని శ్రాద్ధం అరుణాచలేశ్వర స్వామి చేత పెట్టించడం జరిగింది . అంటే ఇప్పుడు అరుణాచలేశ్వర స్వామి ముందు బళ్లాల రాజు మరణ వార్త చదివి…. ఆ తర్వాత ఈయనని ఒక పల్లకిలో ఊరేగింపుగా “పల్లికొండ పట్టు” గ్రామానికి తీసుకొని వెళ్లి….. అక్కడ ఉన్న ఏరులో స్నానం చేయించి….. ఆ రాజు పేరు మీద అరుణాచలేశ్వర స్వామి చేత శ్రాద్ధం పెట్టించడం….. ఈ రాజు చనిపోయి, ఇప్పటికీ 600 సంవత్సరాలు అవుతున్న కూడా….. ప్రస్తుత కాలంలో కూడా ఈ శ్రాద్ధ విధి నేటికీ ఖచ్చితంగా జరుపబడటం విశేషంగా చెప్పుకోవచ్చును. ఒక భక్తుడికి తనే కుమారుడై శ్రాద్ధ కర్మ చేయడం….ఈ అరుణాచలేశ్వర స్వామికి మాత్రమే చెల్లింది. అలాగే పూరీ క్షేత్రంలో ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి “నవ కళేబర” పూజతో పాత విగ్రహమూర్తులను అనగా జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర లను భూమిలో పాతిపెట్టి వాటి స్థానంలో కొత్త ఈ విగ్రహమూర్తులను ప్రతిష్టించడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో దేవుళ్ళు కాస్త శరీరత్యాగం చేస్తే…. అదే అరుణాచల క్షేత్రంలో తన భక్తుడికి తన చేతుల మీదుగా శ్రద్ధ కర్మ చేయడం విశేషమే కదా… ! అమిత భక్తి విశ్వాసాలకి అరుణాచలేశ్వరుడు భక్తదాసుడు అవుతాడని చెప్పడానికి ఇంతకన్నా ప్రత్యక్ష నిదర్శనం మనకి మరొకటి అవసరం ఉండదు కదా! అరుణాచల శివ అని భక్తితో ఆర్తిగా పిలిస్తే…..నేను ఉన్నానని బోయవాడిగా కోయదొరగా…..పసివాడిగా అగుపించి …..మన సమస్యని పరిష్కరించి…. ఇప్పటికీ తను ఉన్నానని ఎన్నో సజీవ నిదర్శనాలు చూపిస్తూ……అరుణాచలేశ్వర స్వామి మన వెంట మన నీడలాగా ఉన్నారని గ్రహించి….. ధన్యులై తరించండి.
సప్తదశ అధ్యాయము సమాప్తము
శుభం భూయాత్
సర్వం అరుణాచల శివార్పణమస్తు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి