అధ్యాయం 10
నరసింహ స్వామి దర్శనం
నాకు ధ్యానంలో పదేపదే… ఒక మగ సింహం కనిపించేది. ఇది గిరి అగ్రభాగంలో, అలాగే గిరి కింద చుట్టు పక్కల సంచారం చేస్తూ కనిపించేది. అప్పుడప్పుడు ధ్యాన సమాధిలో ఉన్న సాధకుల స్త్రీ లేదా పురుషమూర్తుల శరీరాలను ఆహారంగా తీసుకునే దృశ్యాలు కనిపించేవి. అలాగే రెండు పులులు కూడా ధ్యానమునందు కనిపించేవి. ఇవి ఒకప్పుడు ఈ గిరి మీద నిజంగా ఉండి ఆవాసం చేసేవని…. ఇక్కడ ఈ స్థానిక సాధువులకి నా ధ్యాన అనుభవాలు చెబితే, వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు ధ్యానంలో కనిపించే సింహానికి త్రినామము ఉండేది. నాకు ఆశ్చర్యం వేసేది. ఇలా త్రి నామము ఉంది అంటే….. అది సాధారణ సింహం కాదని…..దైవ స్వరూపమైన యోగ నరసింహ స్వామియే ఇలా సంచారం చేస్తారని…. ఒక వయో వృద్ధ సాధువు నాకు చెప్పేసరికి…. ఇంతటి నరసింహస్వామి ఉపాసకుడు ఎవరో సాధన చేసి ఉండి ఉండాలి…. ఇతని సాధనా ఫలితం గానే ఇతనికి తన నిజరూప దర్శనం కోసం ఇలా త్రినామాల సింహముగా ఇప్పటికీ సజీవ మూర్తిగా ఈ గిరి యందు నరసింహ స్వామి సంచారం చేస్తూ ఉన్నారని….. నాకు అర్థం అయి ఈ ఉపాసకుడు సాధన చేసిన ప్రదేశం వెతకాలని నాకు బలంగా అనిపించి….. గిరి చుట్టుపక్కల ఏమైనా నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయేమోనని పరిశోధన చేశాను. కానీ నాకు ఎక్కడా ఈయన ఆలయం కనిపించలేదు. కానీ రెండు చోట్ల సింహం బొమ్మ ఉన్న సింహ తీర్థాలు కనిపించాయి. అందులో ఒకటి రమణ స్వామి ఆశ్రమం దాటిన తర్వాత సింహం బొమ్మ ఉన్న తీర్థం కనిపిస్తే…..అష్టనందులలో ఒక నంది అయిన సింహనంది దగ్గర కూడా సింహం బొమ్మ ఉన్న సింహ తీర్థము కనిపించాయి. కానీ ఖచ్చితంగా నరసింహస్వామి ఉపాసన చేసిన సాధకుడు ఉన్నాడని….. లేకపోతే త్రినామాలు ఉన్న సింహ రూపమైన నరసింహస్వామి నాకు ధ్యాన అనుభవం అవ్వదని నాకు బలంగా అనిపించింది.
అనుకోకుండా ఒకసారి నేను కాస్త గిరి పైకి ఎక్కి అక్కడ ఉన్న గుహలను చూసే పనిలో ఉండగా చూత గుహకి వెళ్లడం జరిగింది. ఈ గుహలోపల విచిత్రంగా యోగ నరసింహస్వామి ఇత్తడి విగ్రహ మూర్తి కనిపించేసరికి….. నా ప్రశ్నకి సమాధానం దొరికినట్లుగా అనిపించింది. దానితో ఈ గుహయందు ధ్యానంలో కూర్చునేసరికి నాకు ధ్యానములో కనిపించే త్రినామాల సింహం కనిపించడం…. అలాగే అప్పటిదాకా నాకు వినిపించని దీని యొక్క సింహగర్జన చాలా స్పష్టంగా ఈ గుహ యందు వినిపించేసరికి…. ఈ సింహ నాదానికి నాకు ధ్యాన భంగమై…. కళ్ళు తెరిచి చూసేసరికి…. ఎదురుగా ఉన్న నరసింహస్వామి విగ్రహ మూర్తి కాస్త సజీవ మూర్తిగా కనిపించి అభయ ముద్రలో నన్ను దీవించిన ప్రత్యక్ష దృశ్యం కనిపించేసరికి….. ఆయనకి సర్వస్య శరణాగతితో నమస్కారం చేసేసరికి….. నా కన్నుల వెంట కన్నీటి ధార రావడం జరిగింది. పిలిస్తే పలుకుతాను అన్నట్లుగా ఇక్కడ యోగ నరసింహస్వామి కాస్త సింహ రూపంలో సంచారం చేయటం అమిత ఆనందం వేసింది.ఆదికామాక్షి గుడి అలాగే మనకి ఆది కామాక్షి దేవాలయంలో ఒక ఉప ఆలయంగా యోగ నరసింహస్వామి ఉంటారు. ఇక్కడ ఈయన అమ్మవారిని స్తుతిస్తున్నట్లుగా గుడి స్థల విశేషాలు చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి క్షేత్రమునందు… గిరిపైన చూత గుహ యందు….. అలాగే గిరికింద అంటే ఈ ఆది కామాక్షి దేవాలయం నందు యోగ నరసింహస్వామి మూర్తి దర్శనాలు అవుతాయన్నమాట!నిజముగా ఇక్కడ ప్రస్తుతానికి సింహాలు సంచారం లేదు. కాకపోతే ఒక 80 సంవత్సరాల క్రితం పులులు, సింహాలు ఏనుగులు, సంచారం ఉండేదని స్థానిక సాధువులు చెప్పడం జరిగింది.
ఇకపోతే ధ్యానములో కనిపించే రెండు పులుల విషయం తెలుసుకోవాలని పరిశోధన చేయడం ప్రారంభించాను. అనుకోకుండా వీటి సంగతి ఈశాన్య దిక్కులో ఉండే ఈశాన్య లింగము దగ్గరలో ఈశాన్య జ్ఞాన దేశికర్ అనగా టైగర్ స్వామి ఆశ్రమం కనిపించింది. ఈయన విగ్రహ మూర్తి పక్కన రెండు చిరుతపులుల బొమ్మలు పెట్టి ఉండటం… గమనించి ఈ ఆశ్రమ వాసులను దీనిని గురించి అడిగితే….
ఈశాన్య జ్ఞాన దేశికర్స్వామివారు అర్ధరాత్రి సమయంలో కళ్ళు మూసుకుని తీవ్రమైన ధ్యాననిష్ఠలో ఉన్నప్పుడు…. ఈయనకి ఇతర జంతువుల వలన ఎలాంటి ఆపద రాకుండా ఉండటానికి… మగ, ఆడ పులులు వచ్చి ఈయనకి చెరువుకు పక్కన చేరి విశ్రాంతిగా పడుకుని కాపలా కాసేవి. సుమారుగా తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో స్వామివారు కాస్త ధ్యానము నుండి కళ్ళు తెరిచిన తరువాత….. ఈ రెండు పులులు ఈయన దగ్గరికి వచ్చి ఈయన చేతి స్పర్శను పొంది తిరిగి అడవికి వెళ్ళిపోయేవి…. అని ఇలా దాదాపుగా 12 సంవత్సరాల పాటు ఇలాంటి దినచర్య కొనసాగింది అని …..ఈయన సజీవ సమాధి అనంతరం ఈ రెండు పులుల జాడ ఎవరికీ కనిపించలేదని…..బహుశా ఇవి పరమేశ్వర పరమేశ్వరి అంశలే అయి ఉంటాయని…. లేదా శివగణాల అంశలు అని వీరు చెప్పడం జరిగింది. ఈ రెండు పులులే నాకు ధ్యానంలో కనిపిస్తున్నాయి అని….. ఈ పులి బొమ్మలు చూసిన తరువాత నాకు అర్థమయింది. ఆయనకి అప్పుడు సజీవ మూర్తులుగా కనిపించే…. ఇప్పుడు ఇది నాకు ధ్యానంలో కనబడుతున్నాయన్నమాట! ఇలా ఈ రెండు పులులు సంచారం గిరి మీద ఉన్నదన్నది యదార్థమేనని ….నాకు ఈ ఆశ్రమం చూసిన తర్వాత అర్థమయింది….
అలాగే ఇప్పటికీ సప్త ఋషులలో ఒకరైన అగస్త్య ముని వారు ఇప్పటికీ సజీవమూర్తిగా చాలామందికి కనిపిస్తారని….అలాగే ఈయన గుహ దగ్గర ఇప్పటికీ ఒక మగ జింక రూపంలో ఈయన సంచారం చేస్తారని… స్థానిక సాధువులు చెప్పిన విషయాన్ని నేను పరిశోధన చేస్తే నాకు ఈయన గుహయందు ఒక మగ జింక మాత్రమే సంచారం చేస్తూ కనిపించేది.భాగవతం ప్రకారం చూస్తే…..ఎక్కడైతే కృష్ణ జింకల సంచారం చేస్తాయో, ఆ ప్రాంతంలో స్వయంభు దైవిక శక్తి ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం బట్టి చూస్తే ఈ గుహ యందు ఈ మహర్షి సంచారం సత్యమేనని అనిపించక మానదు. అంతెందుకు పసిపాప మనసున్న ప్రతివాడిలో పరమాత్మ ఆవాసం ఉంటారని శాస్త్ర వచనం కదా! ఇలా దైవ ఉపాసకులు ఎప్పుడైతే కల్మషం లేని స్వార్థం లేని మాలిన్యాలు లేని మానవత్వస్థితికి అదే పసిపాప మనస్సుకి చేరుకుంటారో…..వారి దగ్గరికి వచ్చే క్రూరమైన జంతువులు కూడా సౌమ్యంగా మారతాయి అన్నమాట! అంటే పులులు కాస్త పిల్లలు అవుతాయి…. అలాగే ఏ ప్రాంతము నందు స్వయంభుగా ఎవరి ప్రమేయం లేకుండా దేవతావృక్షాలు అయిన బిల్వము ,తులసి, వేప, రావి, మేడి, మర్రి చెట్లు ఉద్భవించి….. విరివిగా కనపడతాయో…. ఆ ప్రదేశంలో ఖచ్చితంగా ఇలాంటి పసిపాప మనస్సు పొందిన యోగశక్తి లేదా యోగి సమాధి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలాగే జింకలు, కుక్కలు, కోతులు, పాములు కప్పలు, పక్షులు, పులులు, సింహాలు ఎక్కడైతే భయం లేకుండా స్వేచ్ఛగా ఎదేచ్ఛగా ఆనందంగా సంచారం చేస్తాయో….. ఆ ప్రాంతంలో ఖచ్చితంగా స్వయంభు దైవిక శక్తి లేదా యోగశక్తి ఉండి తీరుతుంది. ఇలాంటి ఈ జంతువుల వాతావరణం నాకు గిరి పైన ఉన్న అగస్త్యమని గుహ పరిసరాలలో కనిపించడంతో….. ఈ గుహ గురించి ఆరా తీస్తే ఇది ఆదిలో అగస్త్య ముని గుహ అని …..ప్రస్తుతం అమ్మనీఅమ్మన్ గుహగా పేరు మారిందని తెలుసుకున్నాను. ఇలా ఎప్పుడైతే ఈ దేవతా వృక్షాలు అలాగే….. దేవతా జంతువులు…. కనబడితే వాటి పరిసరాలలో యోగుల సమాధులు లేదా దేవాలయాలు ఖచ్చితంగా తప్పనిసరిగా దర్శించుకుని….. వారి ఆశీస్సులు పొందండి. ఇలా ఉన్న గిరి పైన ఉన్న చూత గుహలోని యోగ నరసింహ స్వామిని అలాగే అగస్త్య ముని గుహలో ఉన్న అంతర్గత గుహలో స్వయంబు చిన్న శివలింగం దర్శనం చేసుకుని ధన్యులై…. తరించి వీరి ఆశీస్సులు పొందండి.
దశమ అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం అరుణాచల శివార్పణమస్తు




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి