అధ్యాయం -33
తిరువూడల్ ఉత్సవం
••••••••••••••••••••••••••••
తిరువూడల్ ఉత్సవం
ఇక రెండవది అయిన తిరువూడల్ ఉత్సవం గురించి తెలుసుకోండి. ఇది సహజంగా సంక్రాంతి మరునాడు అయిన కనుమతో ఈ ఉత్సవం మొదలవుతుంది. ఈ ఉత్సవం అనేది ప్రణయ కలహం అన్నమాట. దీనికి కారణం ఏమిటంటే…. మూడు కాళ్లు ఉన్న భృంగి ….శక్తితో నిమిత్తం లేకుండా అనగా అమ్మవారు లేకుండా శివుడిని మాత్రమే ఆరాధించే ఈ భక్తుడికి మోక్షం ఇవ్వకూడదని అమ్మవారి పట్టుదలకు పోయి మొండితనం చేయడమే ఈ కలహానికి ప్రధాన కారణం అవుతుంది. భక్త సులభుడైన శంకరుడు ఏమాత్రం ఈ విషయంలో తగ్గక….ఎలాగైనా బృంగికి మోక్షం ఇవ్వాలని సంకల్పించడంతో…. ఈ కలహానికి నాంది అవుతుంది. అలిగిన దేవి కాస్త అస్తమయ వేళకి ఆలయంలోనికి వెళ్లి తలుపులు వేసుకోవడంతో….. చేసేది ఏమీ లేక శివుడు ఒక్కడే గిరిప్రదక్షిణ చేస్తాడు అన్నమాట !
శివుడు ఎంత బతిమిలాడినా అమ్మవారు అలక మారదు. దానితో గత్యంతరం లేక తన భక్తుడైన సుందరార్ ద్వారా….శివుడు కాస్త మధ్యవర్తిగా రాయబారిగా పంపిస్తాడు. అప్పుడు ఇతను అమ్మవారి దగ్గరికి వెళ్లితే…. తనకి నచ్చని శివుడు పద్ధతులు….గంగను తెచ్చి పెట్టుకోవడం …. ఆమెను నెత్తి మీద మోయటం… శరీరం మీద బూడిద పూసుకోవడం…. స్మశాన వాటికలో ఆవాసం చేయటము… కపాల మాలలు ధరించడం….. కపాల భోజనం చేయడము…. ఎండిన జంతు శర్మాలు ధరించడం…..నగ్నంగా సప్త ఋషుల భార్యలకి దర్శనం ఇవ్వడము…. ఎక్కువ సమయం ధ్యానంలో ఉండటము….. తనతో సమయం గడపకపోవడం లాంటివి గురించి ఫిర్యాదు చేస్తే….. ఇతను కాస్త ఈ సమాచారమును శివుడికి చేరవేస్తే…. అప్పుడు ఆయన కాస్త పార్వతి ఆరోపించిన విషయాలకు లోక కళ్యాణర్థమై తాను ఎందుకు అలా ఉండవలసి వచ్చిందో…. వివరించడంతో ఇతను కాస్త తిరిగి అమ్మవారి దగ్గరికి వెళ్లి సన్నిహితంగా సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించినప్పటికీ…. అమ్మవారి సమాధాన పడకుండా….. భర్త మీద మరింత అలిగి తలుపు బిగించుకుంటుంది.
విధి లేని పరిస్థితులలో అమ్మవారు లేకుండానే…. తను ఒక్కడే ఆ రాత్రికి గిరిప్రదక్షిణమునకు బయలుదేరతారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మవారు కాస్త తన మాయాశక్తితో దొంగల ముఠాను సృష్టించి….. శివుడి దగ్గరికి దొంగతనానికి పంపిస్తుంది. అప్పుడు అదే సమయంలో శివుడు కాస్త గిరి ప్రదక్షిణ మార్గంలో భృంగి ఉన్న పలని అండవార్ ఆలయానికి దగ్గరగా వచ్చేసరికి…. ఈ దొంగలు కాస్త శివుడి ఆభరణాలు, ఆయుధాలు అలాగే దుస్తులు అన్ని దోచుకుంటారు. ఈ ఆలయం ఇప్పటికీ ఈ దొంగల దోపు సంఘటనకి ప్రత్యేకంగా ఉంది.తన బాహ్య అలంకారాన్ని కోల్పోయిన శివుడు కాస్త గిరిప్రదక్షిణం పూర్తి చేసుకొని…. ఉదయం కల్లా తిరిగి ఆలయానికి వచ్చేసరికి…. అమ్మవారిని తలుపు తీయమని బతిమిలాడుకోవడం కొనసాగిస్తాడు. అప్పుడు అమ్మవారు కాస్త తలుపు తీయకుండా లోపల నుంచి నాకు అంతా తెలుసు….. రాత్రి దొంగలు పడి నీ సొత్తు మొత్తం దోచుకున్నారు కదా! దొంగల నుంచి కాపాడుకోలేని వాడివి…..ఇంక నువ్వు నన్నేం రక్షిస్తావు….. మీ పౌరుషం ఏమైంది! అటకెక్కిందా! పోగొట్టుకున్న వాటిని తిరిగి పొంది….. మీ శక్తి సామర్థ్యంతో ఒంటి కాలు మీద నిలబడి నృత్యమును నా ముందు ప్రదర్శిస్తే గాని…. అప్పుడు తలుపు తీస్తానని ఖరాఖండిగా చెప్పడంతో చేసేది లేక…. శివుడు కాస్త తన రుద్ర గణాల ద్వారా రాత్రి దొంగతనం చేసిన దొంగల ముఠా సమాచారం తెలుసుకొని వీళ్ళు ఆవాసం చేసే ఖిల్ నాతూర్ గ్రామానికి వెళ్లి….. వీళ్ళ దగ్గర నుండి తను పోగొట్టుకున్న వస్తువులను యాచన చేసి తిరిగి పొంది….. ఆలయానికి వచ్చి తను తెచ్చిన ఆభరణాలు చూపించగానే…. ఆమె ముందు ఒంటి కాలిపై నృత్య ప్రదర్శన ప్రారంభిస్తాడు. ఈ ముగ్ధ మనోహర నృత్యానికి అమ్మవారు కాస్త సర్వం మర్చిపోయి….. మైమరిచిపోయి…. తలుపు తీసి శివుడిని ప్రేమతో లోపలికి రమ్మని స్వాగతిస్తుంది. ఇలా వీరిద్దరూ తిరిగి దంపతులై ఏకమయ్యే భాగం ఉత్సవాన్ని మరు వూడల్ అని పిలుస్తారు. అంటే తిరువూడల్ ప్రళయోత్సవం కాస్త మరువూడల్ ప్రణయోత్సవంగా మారి కథ సుఖాంతం అవుతుంది. ఈ ఉత్సవం ఒక పగలు, ఒక రాత్రి కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
ఈ ఆలయ పూజారులు కాస్త ఈ కలహాన్ని దొంగల దోపు సంఘటనలు, రాయబారి, బతిమిలాడుకునే సంఘటనలు అతి రసవత్తరంగా జరుపుతారు. ఈ తిరు వూడల్ జరిగే వీధిని తిరు వూడల్ వీధి అని పిలవటం జరుగుతుంది.ఉదయం ఐదు గంటలకి స్వామివారిని పెరియ నాయకర్ గా…. అమ్మవారిని అపితకుచాంబిక గాను అలంకరణ ఉత్సవ మూర్తులుగా ఆలయ మాడవీధుల్లోకి మూడు విడతలుగా అనగా మొదట బ్రహ్మ స్వరూపముగా…. రెండవసారి విష్ణు స్వరూపముగా…. మూడవసారి రుద్రస్వరూపంగా ఊరేగింపులు జరుగుతాయి. ఇందులో ఆఖరి ఊరేగింపు మూడవది రాత్రి సమయంలో జరుగుతుంది.
ఇవి కాకుండా ఈ క్షేత్రంలో మహాశివరాత్రి అలాగే శరన్నవరాత్రుల ఉత్సవము మరియు వసంత ఉత్సవం అలాగే ఆవణీ ఉత్సవము మరియు ఆరుద్ర ఉత్సవము అలాగే దీపావళి ఉత్సవము మున్నగు ఉత్సవ పండుగలు జరుగుతాయి. ఇందులో మాఘమాసం అనగా ఫిబ్రవరి, మార్చి నెలలో పుణ్య దినమే మహాశివరాత్రి. ఈరోజు తెల్లవారుజామున రెండు గంటలకే ఆలయమును తెరిచి స్వామివారికి అభిషేకము…. ప్రాతఃకాల పూజ చేసిన అనంతరం లక్షబిల్వార్చన జరుగుతుంది. ఇది దాదాపుగా మధ్యాహ్నం రెండు గంటల దాకా కొనసాగుతుంది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకి బ్రహ్మ ,విష్ణువులకి దర్శనం ఇచ్చిన తేజోలింగమూర్తి లింగానికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలతో ఆరోజు రాత్రి బిల్వార్చనతో శివనామస్మరణతో జాగరణ కార్యక్రమం పూర్తి అవుతుంది. అలాగే మార్చి, ఏప్రిల్ లో వచ్చే ఫాల్గుణ పౌర్ణమి రోజున వసంత ఉత్సవం పది రోజులపాటు జరుగుతుంది. అనగా శివుడు కాస్త మన్మధుడిని దహించినందుకు…. చేసుకునే ఉత్సవం అన్నమాట! ఇక నవరాత్రి ఉత్సవములు అనేవి…. తొమ్మిది రోజుల పాటు చాలా గొప్పగా చేస్తారు. ఈ ఉత్సవములు అనేవి దుష్ట శిక్షణకి అలాగే శిష్ట రక్షణ కూడా సమానమని తెలపటానికి జరుగుతాయి. అనగా పార్వతీదేవి కాస్త మహిషాసుర సంహారం చేసినది….ఈ క్షేత్రం కావడం చేతనే ఈ నవరాత్రి ఉత్సవాలు చేయడం జరుగుతుంది.
ఇక దీపావళి పండుగను కూడా ఇక్కడి వాళ్ళు జరుపుకుంటారు. సత్యభామ సమేతుడై శ్రీకృష్ణుడు కాస్త నరకాసురుని వధించిన ఇతివృత్తానికి ప్రతిగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట! అలాగే ధనుర్మాసంలో అనగా డిసెంబర్, జనవరి నెలలో మధ్యలో వచ్చే ఆరుద్ర దర్శనం రోజున జరుపుకుంటారు. ఈ నక్షత్రం రోజునే బ్రహ్మ ,విష్ణువులకు కాస్త పరమేశ్వరుడు ఒక దివ్య రూపుడిగా దర్శనమిస్తే…. వీరిద్దరూ కలిసి దీని ఆది అంతం తెలుసుకోవాలని ప్రయత్నించిన దినము అన్నమాట! ఈరోజునే నటరాజమూర్తికి పెద్దగా ప్రత్యేకమైన అభిషేకం ఉత్సవం చేయడం జరుగుతుంది. శ్రావణ మాసంలో వచ్చే మూల నక్షత్రం నాడు ఆవణి ఉత్సవమును జరుపుతారు. ఇదే కాకుండా అరుణాచలేశ్వర స్వామి వారు కాస్త భక్తులను అనుగ్రహించుటకు సంప్రదాయ పరంగా ప్రతి సంవత్సరం కొన్ని ప్రదేశాలకి వెళ్లి వస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో భల్లాలుడు అనే రాజు శ్రాద్ధ కర్మలు చేయటానికి… పల్లికొండ పట్టు అనే గ్రామానికి వెళ్లి వస్తాడు. అలాగే ఆగస్టులో వచ్చే శ్రావణమాసం నందు కీల్నతూరు గ్రామానికి వేంచేసి వస్తాడు. ఇక్కడ కుడుములు ఉత్సవం జరుపుతారు. ఎందుకంటే మాణిక్య వాచకరులు అనే శివ భక్తుడిని రాజు కాస్త అకారణముగా చెరసాలలో పెట్టిస్తే… స్వామి వారు కాస్త ఈ రాజ్యానికి చేరువలో ఉన్న వైఘ నదికి వరదలు తెప్పించడం జరుగుతుంది. అప్పుడు రాజు కాస్త ఇంటికి ఒకరు చొప్పున వంతు వారీగా వచ్చి నదికి మట్టితో కట్ట పోయమని ఆజ్ఞ ఇవ్వటంతో ….అందరూ వెళ్లిపోస్తూ ఉంటారు. ఒకరోజు ఇదే ఊరిలో ఉన్న ఒక ముసలి అవ్వకి ఇంటిలో తను తప్ప ఎవరూ ఉండకపోవటంతో ……స్వామి అరుణాచలేశ్వరుని భక్తితో ప్రార్థించగా స్వామివారు కాస్త ఒక యువకుడి వేషంతో వచ్చి తనకి కుడుములు చేసి పెట్టి ఇస్తే కట్టపొస్తానని అనడంతో….. ఈ ముసలి అవ్వ కాస్త కుడుములు చేసి ఇవ్వటంతో వీటిని తింటూ పాటలు పాడుకుంటూ కట్టబోస్తూ ఉంటాడు. వరదలు తగ్గుముఖం పట్టేసరికి…. రాజుకి ఆశ్చర్యం వేసి ఆరా తీస్తే అవ్వ విషయం అలాగే ఈ యువకుడు విషయం తెలియడంతో…. రాజు కాస్త యువకుడి దగ్గరికి వచ్చి ఇది ఎలా సాధ్యమైంది? అనగానే ఆ యువకుడు కాస్త ఇందులో ఆశ్చర్య పోవడానికి ఏముంది? నా భక్తుడైన మాణిక్య వాచకర్ ని బంధించి చెరసాలలో ఉంచావు. ఈ నదికి వరద తెప్పించాను. ఇప్పుడు ఈ అవ్వ భక్తికి మెచ్చి ఈమెకి సహాయం చేయడానికి వచ్చి ఈ వరద తగ్గించాను అంటూ ఉండగా….. అవ్వ కాస్త పుష్పక విమానం ఎక్కి శివలోకానికి వెళ్లడం…. ఆ రాజుతో పాటుగా అక్కడ ఉన్న వారందరూ చూస్తూ ఉండగా…. ఈ యువకుడి రూపంలో వచ్చిన అరుణాచలేశ్వర స్వామి కాస్త అంతర్దానం అవుతాడు. దానితో ఆ రాజుకి తను చేసిన తప్పు తెలుసుకొని శివ భక్తుడైన మాణిక్యవాచకార్ ని చెరసాల నుంచి బంధ విముక్తిని చేసి గౌరవ మర్యాదలతో సత్కారం చేసి ఇంటికి పంపిస్తాడు. ఈ మధుర సంఘటనకి ప్రతీకగా ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో ఈ ఉత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా ఆచారంగా మారింది.
నిజానికి పండుగలు జరిపే విధానాన్ని ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఇందులోని అర్థము అలాగే పరమార్థం ఏమిటో మనకి అర్థమవుతుంది. అనగా కార్తీకదీపం నాడు కార్తీకదీపం వెలిగించడం అంటే బుద్ధిని అంతర్ముఖం చేస్తూ….. హృదయం నందు నిలిపి…..ఆత్మయందు లీనం చేయడం అన్నమాట! అలాగే వసంతోత్సవం జరపడం అంటే…. మనలోని కామ గుణమును దహించుకుని…. మనసుని పరిశుద్ధ గావించుకోవడం అన్నమాట! నవరాత్రి ఉత్సవం అంటే….. మన దేహంలో ఉండే నవరస గుణాలను నాశనం చేసుకొని…. మనసుని క్షయింప చేసుకోవడం అన్నమాట! ఇక దీపావళి పండుగ అర్థం ఏమిటంటే…. శరీరం నేను అనే అభిమానం ఉన్నవాడే నరకాసురుడు అవుతాడు. ఈ అభిమానమే నరకం అవుతుంది. ఇతి బాధలకి, కష్టాలకి కారకమవుతుంది. ఈ అభిమానమునే నరకాసురుని వధించడమే అంటే….. తనకి తానుగా తన శరీర అభిమానమును నిర్మూలించుకుని….. తనకి తానుగా ప్రకాశించడమే దీపావళి అవుతుంది. అంటే నరకమగు శరీరము నేనే అనేవాడు కాస్త నేను ఎవరు అని జ్ఞాన దృష్టితో ఆత్మ విచారణ చేసుకుంటూ పోతే….. నరకుని వధించేవాడే నారాయణుడు అనగా…. శరీర అభిమానము నాది అనే నేను యొక్క మనసుని నాశనం చేస్తే నారాయణ స్వరూపమైన పరమాత్మ యొక్క ఆత్మ స్థితిని పొందటమే దీపావళి నరక చతుర్దశి అవుతుంది.
అలాగే తిరువూడల్ ఉత్సవంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు కాస్త గొడవలుగా ఆపై కలహాలుగా మారకుండా తప్పు ఎవరిది ఉందో వారు కాస్త తగ్గి…. ఒకరినొకరు క్షమాపణలు చెప్పుకుంటే…. సమస్య కాస్త సమసిపోతుందని తిరు వూడల్ ఉత్సవం ద్వారా లోకానికి దంపతులు ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. ప్రళయ ఉత్సవం కాస్త ప్రణయోత్సవంగా శివుడు ఎలా అయితే మార్చుకున్నాడో …..అలా భార్యా - భర్త మార్చుకోవాలని ఈ ఉత్సవం చెప్పడం జరుగుతుంది.
త్రయత్రింశత్ (33వ) అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి