అధ్యాయం -39
మహిషాసుర సంవాదం
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
గౌతమ మహర్షి కాస్త అమ్మవారు ధ్యాన తపస్సు చేసుకోవడానికి వీలుగా…. అరుణగిరి ఎడమవైపు భాగమున్న ఒక పర్వతము మీద పర్ణశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాతావరణం అంతా కూడా పచ్చని చెట్లతో పచ్చగా మారడంతో…. ఆదికామాక్షిని కాస్త ఈ క్షేత్ర వాసులు అందరూ…. కూడా పచ్చయ్యన్ అమ్మగా పిలుచుకోవటం… అలాగే తమ కులదేవతగా ఆరాధించడం ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో ఉన్న సహజ సిద్ధమైన నంది ముఖము నుండి జాలువారే జలపాతమును చూసి మురిసిపోయింది. జింకలు ఏనుగులు, పులులు, సింహాలు మున్నగు జంతువులు హాని కలిగించకుండా…. తమతో తాము కలిహించుకోకుండా…. శత్రుజాతి భావం లేకుండా…. యదేచ్ఛగా, స్వేచ్ఛగా సంచారం చేస్తూ ఉండేసరికి…. అమ్మకి అమిత సంతోషం అయింది. కోయిల రాగాలు, రామచిలుకల పలకరింపులు, గోరింకల అరుపులు, కాకుల గోలలు, ఇలా జంతువులు, పక్షులు చేసే సందడిని చూసి… ముగ్ధురాలయ్యింది. ఇదే తన తపస్సుకి సరియైన , అనువైన, ఏకాంతమైన ప్రశాంత ప్రదేశమని గ్రహించి….. ఇక్కడ పర్ణశాలను ఏర్పాటు చేసిన వారికి ఆశీస్సులు ఇస్తూ ఉండగా…దేవేంద్రునితో పాటు ఇతర దేవతలు అలాగే …మహర్షులు ,మునులు, సిద్దులు, యోగుల ముఖాలు ఆందోళన భావంతో ఉండేసరికి….అమ్మవారు కాస్త అక్కడే ఉన్న దేవేంద్రుడితో … దేవేంద్ర! ఏమి జరిగింది…. అందరూ అలా ఉన్నారు…. అనగానే ….అమ్మ నీకు తెలియనిది కాదు! మహిషాసుర రాక్షసుడు పెట్టే బాధలు తట్టుకోలేక చాలామంది దేవతలు, మహర్షులు కాస్త ఈ క్షేత్రమును వదిలిపెట్టి వారి లోకానికి తిరిగి వెళ్ళిపోతున్నారు. నువ్వే మాకు దిక్కు. నిన్ను శరణువేడి మా భయాలను పోగొట్టుకునే విధంగా మేము నీ నుంచి అభయం పొందాలని అనుకుంటున్నాము అనగానే …..
దేవేంద్ర! ఈ రాక్షసుడి అకృత్యాలు నేను కాస్త కైలాసంలో ఉన్నప్పుడే కొంత విన్నాను. ఇప్పుడు ఇది ఇక్కడ ఈ క్షేత్రం దాకా వస్తుందని నేను అనుకోలేదు… ఊహించలేదు. వాడు కాస్త పరమశివ భక్తుడైన నా పతి దేవుడి అనుగ్రహంతో…. స్త్రీ చేతిలోనే మరణం పొందాలని వరం పొందాడని విన్నాను. కాబట్టి మీరు ఎవరూ కూడా భయపడవద్దు….శివవరము చేత వాడు గర్వితుడై, అహంకార పూరితుడై ఇలా ప్రవర్తిస్తున్నాడు. అపాయాన్ని ఉపాయంతోనే దాటాలి. ఇప్పుడే వాడిని హతం చేయుట సాధ్యపడదు. ఎందుకంటే శివలింగం మెడలో ధరించే శివ భక్తుల సంహారం అనేది కూడా….. సాక్షాత్తు శివుడి చేతిలోనే ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి శివ భక్తుల మరణం అనేది….. వారి ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ఇలాంటి వాళ్లు ధర్మ జీవులై అధర్మ మార్గంలో నడిచే దాకా మనం అంతా కూడా ఎదురు చూడక తప్పదు. నేనే సమయం చూసుకొని వాడి అధర్మం హద్దులు దాటిన మరుక్షణంలోనే ఉపాయంతో వాడిని హతం చేస్తాను. ఇదే నా అభయం అనగానే….. దేవతలందరూ ఆ అభయమునకు ఆనందభరితులై…. అమ్మవారిని తపస్సు చేసుకోవడానికి ఏకాంతం కోసం అందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. దానితో అమ్మవారు కాస్త తన ఒంటి మీద ఉన్న అన్ని రకాల ఆభరణాలు తీసివేసింది. రుద్రాక్ష మాలలు ధరించింది. దివ్యమైన వస్త్రాలు తీసివేసి…. ఆకుపచ్చ నార వస్త్రం ధరించింది. చక్కటి జుట్టును ముడివేసి తపస్విని వలె….. జటాజూటముగా చుట్టుకుంది. కుంకుమ లేపనమునకు బదులుగా…. భస్మ ధారణ చేసుకుంది. తనకి రక్షణగా దుందుభి, ఆనవమి, సత్యవతి, సుందరి అనే వారిని పిలిచి….ఈ గిరికి నాలుగు దిక్కులలో రక్షణగా ఉంచింది. అలాగే కాళికా మరియు దుర్గాదేవి తనకి రక్షణగా ఉంచుకుంది. సప్త ఋషులు కాస్త అమ్మవారి రక్షణార్థం సప్త మునులుగా మారి మూడు అంచెలుగా…. స్థూల, సూక్ష్మ సూక్ష్మాతి సూక్ష్మాంశ రూపాలతో…. రక్షణ కవచంగా పదునైన ఖడ్గమును చేత పట్టుకొని….వీరాసన భంగిమలో కూర్చుని….. కాపలా కాయడం జరిగింది. అలాగే అమ్మవారికి రక్షణగా సప్తమాతృకలు, నవదుర్గలు, దశమహావిద్య దేవతలు…. ఇలా శ్రీ చక్రంలో ఆవాసం ఉండే 323 మంది దేవి దేవతలు కాస్త ఈ భూలోకములో ఉన్న అరుణగిరి అనే శ్రీ చక్రమునకు రక్షణా కవచంగా సూక్ష్మరూపదారులై….అమ్మవారి తపస్సుకి భంగం వాటిల్లకుండా ఉండటానికి ఆవాసం చేయడం జరిగింది. దానితో పచ్చయ్యన్ అమ్మన్ కాస్త మోహిని రూపంతో ధ్యాన తపస్సు చేయడానికి సిద్ధపడింది. ప్రతిరోజు బిక్షాటన చేసి ఆకలి దప్పికలు తీర్చుకుంటూ….. అరుణాచల అనే జ్ఞాన పంచాక్షరి నిత్యనామస్మరణ చేస్తూ….. జ్ఞాన తపస్సు చేయ సాగింది. ప్రతిరోజు పరమ పావనమైన కమలా నదిలో ప్రాతః కాలము నందే స్నానం ఆచరించి….ఎరుపు తామర పువ్వులతో ప్రత్యక్ష భగవానుడైన సూర్య భగవానుడని ఆరాధించేది. ఆ తర్వాత ఈ నది ఒడ్డున దర్భలు , అక్షింతలు, నువ్వులు కలిపి తిలోదకాలు తన పితృదేవతలకి అలాగే….. దేవర్షులకి తర్పణాలు ఇచ్చేది. తన చేతుల మీదుగా స్వయంగా శివుడి ఆత్మలింగానికి సమానమైన స్పటిక శివలింగమును ఒక దానిని ఏర్పాటు చేసుకొని….. దానిని అగమశాస్త్రం ప్రకారంగా ప్రతిష్టించి…. పూజించి….. ఆరాధించేది. అంగన్యాస,కరణ్యాసములతో అష్టదిక్పాలకులను నవగ్రహాలను అర్చించేది. అతి శుద్ధమైన పవిత్రమైన గంగాజలమును తీసుకొని మంత్రాలతో…. పూజా ప్రదేశం అంతా కూడా సంప్రోక్షించి ….భూత శుద్ధి అలాగే భూశుద్ధి గావించి…. శివారాధన ఆరంభించేది. ఇలా ఆర్గ్యపాదులతో అంగపూజ గావించి…. షోడశ పూజను విధియుక్తంగా జరిపేది. పూజ అయిన తరువాత…. అగ్నిని ప్రజ్వలించి ….శైవాగమనంలో చెప్పిన విధంగా ద్రవ్యాలతో నిత్యం హోమం చేసి కందమూల ఫలాలు అతిథులకు ఇచ్చి….సేవించి తాను భుజించేది. ఆశ్రమానికి వచ్చే క్రూర జంతువులైన పులులు, సింహాలకి, ఏనుగులకి అడవి దున్నలకి, ఖడ్గమృగాలకి కావలసిన ఆహారమును…. అలాగే జలమును….వీటికి అందించి ఆనందపడేది. అలాగే పక్షులకి అవసరమైన ధాన్యమును సేకరించి….వీటికి ఆహారమును ఇచ్చేది. కలశములతో నీటిని పర్ణశాలకి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న అన్ని రకాల వృక్షాలకి, మొక్కలకి నీళ్లు పోసి…. వాటిని అపురూపంగా పెంచసాగేది. అలాగే తను నిత్యం అరుణాచల శివనామస్మరణ గావిస్తూ…. తన హృదయ స్థానంలో అరుణాచలేశ్వరుని ప్రతిష్ట గావించుకొని…. ఆత్మనివేదన భక్తితో సర్వస్య శరణాగతి భావంతో….. తన చెలికత్తెలతో అరుణగిరి ప్రదక్షిణము చేసేది. ఇలా ప్రతినిత్యం నియమం తప్పకుండా…. అమ్మవారు కాస్త తీవ్ర తపస్సు చేస్తూ ఉండేది.
ఈమె చేసే తపస్సుకి…. అరుణగిరి అంతా కూడా శుభప్రదమైన వాతావరణం ఉండేది. సూర్య తాపం ఎప్పుడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు. సకాలంలో వర్షాలు కురిసి…. అపారమైన పంటఫలం లభించేది. అలాగే ఇక్కడ ఉన్న ఫలవృక్షాలు సకాలంలో ఫలాలు ,పుష్పాలు ఇవ్వడం జరిగేది. జంతువులన్నీ కూడా పరస్పర విరోధ భావజాతిని మరిచిపోయి…. నిర్భయంగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉండేవి. ఈ గిరి ఉన్న మూడు యోజనాల పరిధిలో… ఉన్న వారికి అకాల మృత్యుభయము, అకాల వ్యాధి భయము లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండేవారు. సుఖసంతోషాలతో….. అనుకున్న కోరికలు తీరుతూ ఉండేసరికి…. సకల భోగ, సుఖాలతో ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండేవాళ్లు.
ఇది ఇలా ఉండగా… ఒక రోజు మహిషాసురుడు తన సైన్య పరివారంతో అరుణాచల అరణ్యంలో వేటకి బయలుదేరాడు. ఇతని సైన్యము కాస్త కనిపించిన జంతువుని వెంటాడుతూ…. వేటాడుతూ…. చంపి తినడం చేస్తున్నారు. అనుకోకుండా కొన్ని జంతువులు తమ ప్రాణ రక్షణ కోసం అని….. అమ్మవారు తపస్సు చేసుకునే పర్ణశాల వైపుకు పరిగెత్తాయి. ఈ విషయం గమనించిన కొంతమంది ఈ రాక్షస రాజు సైనికులు….. ఈ జంతువులను వెంబడిస్తూ ఈ పర్ణశాల లోపలికి ప్రవేశిస్తుండగా….. అమ్మవారి శక్తి గణాలు వీళ్ళని ఆ లోపలికి వెళ్ళరాదని అమ్మవారు తప్పస్సు చేసుకుంటున్నారు అని….. ఆమెకి ఎట్టి పరిస్థితులలో ధ్యానభంగం కలిగించరాదని….. వీళ్ళకి చెప్పి వెనక్కి పంపించడం జరిగింది. దానితో ఈ సైనికులలో కొంతమందికి ధ్యాన తపస్సు చేసే స్త్రీ మూర్తిని చూడాలని….. తపన తాపత్రయముతో పక్షులుగా మారి పర్ణశాల లోపల ఉన్న వృక్షాల మీద వాలి అమ్మవారిని చూసి ఆవిడ సౌందర్యానికి ముగ్ధులై…..ఈమె పొందు తమ రాజైన మహిషాసురుడికి దక్కాలని అనుకుని….రాజు దగ్గరికి వెళ్లి ….అమ్మవారి గురించి చెప్పగా… తన రాజ్యంలో తనకి తెలియకుండా ఒక సౌందర్య రాశి ధ్యాన తపస్సు చేయటం ఏమిటి? అనుకుని తన దూతగా ఒక స్త్రీని అమ్మవారి దగ్గరికి పంపించాడు. ఈమె కాస్త అమ్మవారి పర్ణశాలకు వెళ్లి… సరాసరిగా అమ్మవారితో అమ్మ! నువ్వు చూస్తే సుకుమారిగా ఉన్నావు. ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉన్నావు. నిత్య యవ్వనముతో అతిలోక ముగ్ధ మనోహర సౌందర్యంతో మెరిసిపోతున్నావు. నీ అందం ముందు ఎవరైనా దాసోహం అవ్వక తప్పదు కదా! నీ చూపు కోసం….. నీ సుఖం కోసం ఎంతటి వాడైనా కాంతాదాసుడు అవ్వక తప్పదు కదా! ఇంతటి స్థితిలో ఉన్న నీవు….. అందమైన అంతఃపురంలో ఉండక ఈ వనములో ఉండటం ఏమిటి? నిత్య యవ్వనములో కామకోరికలు తీర్చుకోకుండా….. స్మశాన వైరాగ్యంతో ఎందుకు ఉన్నావు. దేవతలు కూడా చేయటానికి భయపడే తీవ్రమైన తపస్సు ఎందుకు చేస్తున్నావు. ఎవరికోసం చేస్తున్నావు. ఇవన్నీ కూడా ఆ బైరాగి ,వైరాగి అయిన శివుడి కోసమేనని నాకు తెలుసు. వాడు ఎప్పుడో నిన్ను వదిలేసాడు కదా! దేవతలలో నీకు సరియైన వరుడు ఎవరు ఉండరు…. కానీ మా రాక్షస జాతిలో నీ స్థాయికి ఏమాత్రం వన్నె తగ్గని సుకుమారుడైన మా మహారాజు మహిషాసురుడు ఉన్నాడు. ఇతనిని నీవు ఒకసారి చూస్తే చాలు… నీ కఠోర తపస్సుని వదిలిపెట్టి… ఆ ముగ్ధమనోహరుడి వెంట పడతావు. అంతెందుకు…. నీ గురించి విన్న క్షణం నుంచి అతడు విరహవేదనకి గురి అయ్యి నిన్ను తన వద్దకి తీసుకొని రమ్మని నన్ను దూతకిగా నీ దగ్గరికి పంపించాడు అనగానే…
ఇదంతా విన్న అమ్మవారు మౌనంగా ఉండేసరికి ……విజయ కాస్త ఈ దూత మీద కోప్పడి పంపించి వేసింది. దానితో ఈ దూతకి కాస్త ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా మహిషాసురునికి చెప్పేసరికి….. తన దూత మాటలు లెక్కచేయని ఈమె ఎవరో…. ఈమె అందచందాలు ఏమిటో చూడాలని ఈ కోరికతో మహిషాసురుడి కాస్త తన మాయతో ఒక వృద్ధ సాధువుగా మారి అమ్మవారి పర్ణశాలకు చేరుకున్నాడు. ఈ విషయం ఏమీ తెలియని అమ్మవారు సేవకురాలు కాస్త…. ఈ వృద్ధ సాధువుని తమ పర్ణశాల లోపలికి ఆహ్వానించి…. ఆర్గ్యపాదులు ఇచ్చి గౌరవించారు. అప్పుడు ఇతను కాస్తా చెలికత్తెలతో మీ అమ్మగారు ఎందుకోసం…. ఎవరికోసం… ఈ ఘోర తపస్సు చేస్తున్నారని ప్రశ్నించగా…. దానికి వీళ్ళు కాస్త స్వామి! ఏముంది ఆమె పతి దేవుడైన శంకరుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది. కానీ ఎంత కాలం తపస్సు చేసినా…. ఈమె పతి ఇంకా దయ అలాగే అనుగ్రహం మీద కలుగలేదు. ఈమెకి ఈ పతి అనుగ్రహం కలిగేదాకా….ఇలాగే ఈ ఘోర తపస్సు ఆపకుండా…. ఆగకుండా చేస్తూనే ఉంటుంది అనగానే….. ఈ వృద్ధ సాధువు కాస్త నిజ స్వరూపంగా మహిషాసురుడిగా మారి అక్కడే ఉన్న అమ్మవారితో ఓ బాల! నా పేరు మహిషాసురుడు. కామరూపుడిని. త్రిలోకాలు అనగా స్వర్గ, నరక, భూలోకాలు నా స్వాధీనం. నవగ్రహాలు నా ఆధీనం. నవ నిధులు నా సొంతం. దేవేంద్ర పదవి నా చెప్పు చేతలలో ఉంటుంది. విశ్వకర్మ, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం,వజ్రాయుధము ఇలా మనకు అతి శక్తివంతమైన అలాగే క్షణాలలో కోరికలు తీర్చేవి, నా ఆధీనంలో ఉన్నాయి. అష్టదిక్పాలకుల వాహనాలు నా వాహనాలుగా మారాయి. అంతెందుకు…. ఇంద్రుడి వాహనమైన ఐరావతం అలాగే ఉచ్చైశ్రవం అయిన ఇంద్ర అశ్వము మీద నేను నిత్యం ఎక్కి దేవలోకంలో ఉన్న అప్సరసలతో నందనవనంలో క్రీడిస్తూ ఉంటాను. అలాగే అగ్ని దేవుడి వాహనమైన మేకని నా పుత్రుడికి వాహనముగా చేశాను. యముడి వాహనమైన దున్నపోతుని తెచ్చి… నా రధమునకు కట్టుకున్నాను. దేవతలు, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు, సిద్దకన్యలు, అప్సరసలు ఇలా మున్నగు వారంతా కూడా….. నా సేవకి అలాగే నా గృహ అవసరాలకు వినియోగించుకుంటున్నాను అంటే…. నేను ఎంతటి బలశాలి మరియు ధీరశాలి అయి ఉండి ఉంటానో….నీకు వివరించవలసిన అవసరం లేదు అనుకుంటున్నాను. కాబట్టి నీ తప ఫలమును నేనే అని తెలుసుకో. నీవు కోరుకున్న నవ వరుడిని నేనే అని గ్రహించు. నీకు కావలసిన సమస్త సర్వభోగాలను క్షణాలలో అందించగల సమర్ధుడని గ్రహించుము. నన్ను వరించి నీ తపస్సు ఫలితమును సార్ధకం చేసుకో! అనగానే ఇదంతా విన్న అమ్మవారు కాస్త శాంతమూర్తిగా…. సౌమ్యంగా…. ఇతనితో ఓ మహావీర ! నేను నిజమైన సాటినేని బలశాలిని ధీరశాలిని మాత్రమే వరిస్తాను. నీ శక్తి సామర్థ్యాల గురించి నీవు గొప్పలుగా చెప్పుకుంటే సరిపోదు. అది నిజమో కాదో నాకు తెలియాలి కదా! కాబట్టి అనవసరమైన ప్రసంగం ఆపి….నీ ప్రతాపం ఏమిటో చూపించు. దానికి సమాధానం మా చెల్లికత్తిలే తమ ప్రతాపం చూపిస్తారు. నీవు నాతో యుద్ధం చేసే శక్తి నీకు లేదు. ఆడదాని చేతిలో ఓడిపోయాను అని అపకీర్తి తెచ్చుకోకు. నీకు మంచిది కాదు అనగానే….. ఈ మాటల విన్న మహిషాసురుడికి అమితమైన కోపావేశాలు ,మహా రోషము వచ్చి… అమ్మవారి మీదకి తన పదునైన ఖడ్గమును ప్రయోగించగా ఇది గమనించిన అమ్మవారి రక్షకురాలైన దుర్గాదేవి కాస్త ఉగ్రరూపమును పొంది…. ఇతని ఖడ్గమును తునాతునకలు చేసేసరికి…. మహిషాసురుడు కాస్త మహిషరూపము ఎత్తి తన పదునైన కొమ్ములతో కుల పర్వత శిఖరము పెళ్ళగించి విసిరేసేసరికి దుర్గాదేవి కాస్త…. అనేక చేతులతో , అనేక శస్త్రాలతో, ఆయుధాలతో ఉగ్రరూపమైన సింహమును అధిరోహించి…. మహా తేజముతో, ఉగ్ర స్వరూపంగా మారేసరికి…. ఈమె ఉగ్రరూపాన్ని చూసి మహిషాసురుడు అక్కడి నుంచి పారిపోయి…. తన రాజ్యానికి చేరుకున్నాడు.
నవత్రింశత్(39వ) అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి