అధ్యాయం - 40
మహిషాసుర సంహారం
🕳️🕳️🕳️🕳️🕳️🕳️🕳️🕳️🕳️
ఇలా పారిపోయిన మహిషాసురుడు కాస్త…. తన రాజ్యానికి వెళ్లి….ఎలా అయిన అమ్మవారి పొందు కోసం… పొందు సుఖం పొందాలని….పిచ్చి ఆవేశంతో యుద్ధ పథకాలు చేయడం ఆరంభించాడు. ఇది ఇలా ఉండగా దుర్గాదేవి ఉగ్రరూపాన్ని అమ్మవారు కాస్త తన మాటలతో శాంత మూర్తిగా మార్చి…. దుర్గా! నీవు ఆవేశం పడటంలో అర్థం ఉంది . కానీ మన శత్రువు సామాన్యుడు కాదు. అపారమైన శివ భక్తి కలిగిన వాడు. శివలింగమును మెడలో ధరించిన శివయోగి. వాడిని ఉపాయంతోనే జయించాలి. కాబట్టి వీడికి మనం ఒక అవకాశం ఇచ్చి చూద్దాం…. వాడు ఎలా అయితే మన దగ్గరికి ఒక దూతను పంపించి వాడి సందేశం ఇచ్చాడో …..అలాగే మనం కూడా వాడి దగ్గరికి మన దూతను ఒకరిని పంపించి… ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. ఎందుకంటే స్త్రీ జంతువు మీద పురుష జంతువు అనేది మోహంతో ఆకర్షించబడుతుంది కదా! అలా మన దూత మాటలకి వీడు కాస్త ఆకర్షించబడి…. అధర్మ మార్గంలో నడిచేవాడు కాస్త ధర్మ మార్గంలో నడుస్తాడేమో చూద్దాము. తపస్వులకు ఎప్పుడూ కోపం ఉండరాదు కదా! దీనిని పరిత్యదించాలి కదా! అందువలన తపస్వి అయిన నేను కాస్త….. కోపమును వదిలి ధర్మానికి హాని కలగకుండా వ్యవహరించాలి కదా! అందుకే నా దూతగా కోతి ముఖము మార్చుకొని బృహస్పతిని పంపిస్తాను అంటూ….. బృహస్పతిని మహిషాసురుడి దగ్గరికి దూతగా పంపించడం జరిగింది.
కోతి ముఖముతో ఉన్న బృహస్పతి కాస్త బెదురుతో, భయంతో, మహిషాసురుడికి సమీపించి…. ఓయి మహిషా! నేను కాస్త దేవి దూతగా నీ దగ్గరికి మా అమ్మ సందేశం వినిపించడానికి వచ్చాను. నీవు అరుణాద్రీశుని భాదిస్తే, క్షణకాలంలో సమస్త శక్తులు అలాగే నీ శక్తి సామర్థ్యం నశించిపోవును కదా! నీవు శివ భక్తుడివి అయి ఉండి…. శివుడి రూపమైన అరుణాద్రి మీద దండ ఎత్తడం అంటే …..సాక్షాత్తుగా శివుడితో యుద్ధం చేస్తున్నట్లే కదా! శివుడితో పెట్టుకున్న వాడు ఎంతటి శక్తివంతుడైన కూడా మిడత వలె ఆయన కోపాగ్నిలో నశించడమే కదా! శివుడి అనుగ్రహం వలన లభించిన నీ వైభవం అంతా కూడా ఆయన కోపాగ్నిలో క్షణకాలంలో నశించిపోవును కదా! నీవు చేసుకున్న పూర్వజన్మల పుణ్యం వలన….. నీవు శివ భక్తుడివి అయ్యి ఆయన అనుగ్రహం పొంది…. సాటిలేని మేటి సంపదతో బలము, శక్తి, సామర్థ్యం పొందడం జరిగింది. కానీ నీ అవివేక బుద్ధివలన నీకు అనుకోని దుర్బుద్ధి కలిగి, నీ బుద్ధిహీనతను పొంది, నీ వినాశనమునకు నీకు నీవే తెచ్చుకుంటున్నావని ఇప్పటికైనా గ్రహించు. నువ్వు ఆ పర్ణశాలలో చూసిన ధ్యాన తపస్విని… సామాన్య స్త్రీ మూర్తిగా కనిపించే అసామాన్య ఆదిపరాశక్తి అని ఇప్పటికైనా గ్రహించు. తెలుసుకో. మసులుకొని జాగ్రత్త పడు. నిన్ను అలాగే…. నీ సర్వ సైన్యమును కాపాడుకో! ధర్మవృత్తి కలిగి శాస్త్రవచనాలతో నువ్వు ఇప్పటికైనా శాంతిని పొంది…. మాతో సంధి అంగీకరించు. మాతో యుద్ధం చేయాలనే తలంపు రానివ్వకు. కాదు కూడదు అంటే నీ సర్వ సైన్యమును తీసుకొని మాపై యుద్ధములకు ప్రకటించు. ఏ సైన్యముతో త్రిలోకాలు జయించావో…. ఆ సైన్యమును కూడా మా మీదకి తెచ్చుకో! శివుడి ఆలోచన ఎవరికి తెలుసు. నీకు అలాగే….. నీ సర్వ సైన్యానికి మా అమ్మ చేతిలో ముక్తి పొందాలని ఆ సర్వేశ్వరుడు కాస్త విధాతగా రాశాడేమో…. ఎవరికి ఎరుక. ప్రారబ్దమును అనుభవించక తప్పదు కదా! నీవు నీ దుర్బుద్ధిని వదలకపోతే….. దాని ఫలితమును ఘోరాతి ఘోరంగా అనుభవించక తప్పదు కదా! నువ్వు అపార శివ భక్తుడివి కనుక….. నీకు ప్రాణ రక్షకోసం అమ్మవారు కరుణతో నీకు శాంతి మార్గముగా ఇది చెప్పడానికి ఒక అవకాశంగా ఇవ్వడం జరిగింది. అనగానే….. ఇది విన్న మహిషాసురుడికి ఎక్కడ కాలాలో అక్కడ కాలి ఒక ఆడదాని చేతిలో తను ఓటమి అంగీకరించడమా! అంటూ యుద్ధానికి సిద్ధపడమని…. నా సందేశముగా చెప్పు అంటూ బృహస్పతి మీదకి . లంఘించేసరికి ఇతను కాస్త….అక్కడ అదృశ్యమై అమ్మవారి ముందు దృశ్య మహిషాసురుడి సందేశమును చెప్పడం జరిగింది.
దానితో ఇటు అమ్మవారి సైన్యము… అలాగే అటు మహిషాసురుడి సైన్యము… కాస్త యుద్ధభేరీ మ్రొగించాయి. యుద్దానికి సన్నాహాలు మొదలయినాయి. దానితో దుర్గాదేవి కాస్త అమ్మవారితో లోకమాత! ఈ యుద్ధము గురించి నీవు ఆలోచించవద్దు. నువ్వు పాల్గొనవలసిన అవసరమే లేకుండా…. నీ అంశ అయిన కాళికా ,సప్తమాతృకలు, దశమహావిద్య దేవతలు ,నవదుర్గలు, అష్ట భైరవీలు, ఇలా నా సైన్యముతో ఉండి….. ఆ దుష్టుడైన మహిషాసుర సైన్యమును సర్వనాశనము చేసి, వాడి తలను నీకు తెచ్చి బహూకరిస్తాను. మేము ఈ యుద్ధంలో జయం పొందేటట్లు మమ్మల్ని… నీవు అభయముతో ఆశీర్వాదం ఇచ్చి పంపు. నీవు చింతగా నీ ధ్యానతపస్సు కొనసాగించు అనగానే…… అమ్మవారు కాస్త దుర్గ ! మీ శక్తి సామర్థ్యాలు నావే కదా! అలాగే నీ సర్వ సైన్యాలు నా ప్రతిరూపాలే కదా! ప్రత్యక్షంగా మీరంతా యుద్ధం చేస్తున్నప్పటికీ నా అంశా రూపమైన మీరందరిలో పరోక్షంగా ఉన్నది నేనే కదా! నాకు అలాగే నీకు ఏ విషయంలోనూ భేదభావం లేదు కాబట్టి…. నువ్వు యుద్ధంలో జయం పొందిరా. అలాగే నేను కూడా నా ధ్యాన తపస్సు యందు జయం పొంది….నా పతి దేవుడైన శంకరుడని చేరుకుంటాను అనగానే..నీ ఓదార్పు మాటలతో నాకు అమితమైన ఆనందం…… అలాగే అభయం ఇచ్చావు. ఇంక నాకు ఈ యుద్ధంలో జయమే తద్యము. ఇదే నిశ్చయము అంటూ ఉండగా…. ఇదంతా వింటున్న అక్కడ ఉన్న దేవతలు, అలాగే మహర్షులు కాస్త దుర్గాదేవికి ఒక్కొక్కరుగా తమ తమ బల శక్తులు అలాగే ఆయుధాలు మరియు శస్త్రాలు స్వాధీనం చేశారు. దానితో ఉగ్రరూప దుర్గాదేవి కాస్త మహా ఉగ్రరూప దుర్గాదేవిగా రూపాంతరం చెంది….. దివ్య తేజస్సుతో మహాభీకర ఆకారంతో సర్వ ఆయుధాలు ధరించి…. ఉగ్రరూప సింహం ఎక్కి…. అరుణగిరి పాద అరణ్యములో…. మహిషాసురుడితో యుద్ధం కోసం విహరించ సాగింది. తన శరీరం నుంచి సహస్ర మాతృకలు సృష్టించింది. నాలుగు ముఖాలతో ఉన్న దండినులను సృష్టించింది. 64 కోట్ల మంది యోగినీలను సృష్టించింది.దానితో వీరందరూ కూడా వాహనాలుగా ఎద్దులు, గరుడ పక్షులు, మంటలను ,పెద్దపులులను, వరాహాలను, ఏనుగులను, గుర్రాలను ఎక్కి శంఖచక్ర ఆయుధాలతో…. మరికొందరు కాస్త రోకలితో, నాగాళ్లను, ఖడ్గాలను, శక్తి ,దండ ,హలా, ముసలా ఆయుధాలను ధరించి….యుద్ధానికి బయలుదేరారు.
అటు చూస్తే మహిషాసురుడు కాస్త ఖరాలుని , భిక్షకుని, విమరాలుని, భాస్కల, దురుముక, చండముండా, కాలనేమి మున్నగు అతి మహా భయంకరమైన రాక్షసులతో…. సర్వశక్తివంతమైన సైన్యం తీసుకొని…. అరుణగిరి మీదకి దండెత్తి రావటం జరిగింది. దేవి సైన్యమునకు ధైత్యసేన కి మధ్య భీకర యుద్ధం ఆరంభమయింది. ఈ రాక్షస రాజు సైన్యములో…. రధ, గజ, గుర్ర, మానవ సైన్య దళాలతో….. దేవి సైన్యం అయిన భూత, ప్రేత ,పిశాచ, బేతాళ శక్తి గణాలు తలబడి…. యుద్ధం చేసుకోసాగారు. దైత్య సైన్యము ప్రయోగించిన ఆయుధాలను… కాస్త దేవి సైన్యము కాస్త తమ బాణాల వర్షముతో ఒక్కొక్కటిగా నాశనం చేయడం ఆరంభమయ్యే సరికి….. దానితో దేవి సైన్యంలోనే కొందరు కాస్త ఆకారాలుగా అనగా డాకిని, శాకిని, యోగినీ ధరించగానే దైత్య సైన్యములో పిశాచ, భూత ,రాక్షస గణాలుగా మారి యుద్ధం చేయడం ఆరంభించారు. ఎటు చూసినా కూడా…. దేవి సైన్య ధాటికి ధైత్యసేన నాశనం అవ్వడం జరిగింది. దానితో దుర్గా సైన్యం కాస్త ఈ రాక్షసుల రక్త మాంసాలను పీక్కొని తినడం ఆరంభించి…..ఆనంద నృత్యాలు చేయడం ప్రారంభించారు. దేవి సైన్యంలో ముఖ్యురాలైన చాముండి కాస్త …..రౌద్రముఖముతో పదునైన కోరలతో….ఒక రాక్షసుడుని సంహరించి వాడి మాంసమును ఆనందంగా భుజిస్తూ…. మరో పక్క వాడి తలను చేతిలో పట్టుకొని సైన్యము మధ్యలో విహరించ సాగింది. యోగినీలా బాణాల దాటికి రాక్షసుల తలలు తెగి…. రక్తం కాస్త ధారలై పారింది. వీళ్ళ ఆయుధాలు అయిన దండ, శక్తి, హల, ముసల, చక్రాది ముందు….. రాక్షస సైన్యంలో అందరూ సర్వనాశనమై చివరికి వీళ్ళ సైన్యాధిపతులు మాత్రమే మిగిలారు..
ఇక ఈ సేనాపతులు వరుసగా దుర్గా శక్తులలో ఒకరైన బ్రహ్మ శక్తి కాస్త ….తన దండముతో ఖరారుని రాక్షసుడిని వధించగా …..మహేశ్వరి కాస్త దుర్గరుని శిరస్సుని వధించగా….. కౌమారీకాస్తా బిక్షరుని శక్తి ఆయుధంతో వధించగా…. చాముండ దేవి కాస్త చండముండలను వదించగా…..వైష్ణవి కాస్త తన చక్రాయుధముతో వికరాలుని ఖండించగా….. ఇంద్రాణి కాస్త తన వజ్రాయుధమును దుర్ముఖుని వధించగా…. వారాహి శక్తి కాస్త…. తన ముసలముతో భాష్కలుని కొట్టగా… ఇలా ఈ రాక్షస సేనాపతులు కాస్త ….దేవి శక్తులతో హతమవడం జరిగింది. దానితో మిగిలిన రాక్షస సేనాధిపతులైన చండ,ప్రచండ,అమర మహాకాళి,ఉగ్ర దహనులు, జ్వాలస్య, వికటాక్ష కాస్త ఉగ్రులై తమ రాజైన మహిషాసురునికి రక్షణ కవచంగా మారి…. దుర్గాదేవి మీదకి యుద్ధం చేయడానికి బయలుదేరారు . ఇలా వీరందరూ కూడా యుద్ధ ఉన్మాదంతో సింహనాదం చేస్తూ….. అతిశక్తివంతమైన బాణాల ప్రయోగము …..దేవి సైన్యం వైపు ప్రయోగించారు. ఈ బాణాల దాటికి దేవి సైన్యంలోని సైన్యాధిపతులైన సప్తమాతృకులు కాస్త తాళలేక….తట్టుకోలేక…..సింహ వాహిని అయిన దుర్గాదేవిని సమీపించి.. తల్లి! జగజ్జనని! లోకమాత! నీవే త్రిమూర్తుల స్వరూపము. నీవే త్రిమాతల శక్తుల రూపము. నీవే లక్ష్మివి. నీవే సరస్వతి. నీవే కాళికవి. నీవే పార్వతివి. నీవే దుర్గవి. నీకు మించినది ఏదీ లేదు. నీవే కాళికగా మారి శ్రీకృష్ణుడికి సహాయం అందించావు కదా! నీవే మమ్మల్ని కూడా రక్షించే సమర్ధురాలివి అంటూ వేడుకునే సరికి….. దుర్గా సంతోషించి…. వీరికి అభయం ఇచ్చి మహిషాసురునితో యుద్ధం చేయడానికి బయలుదేరింది.
దుర్గాదేవి మహా ఉగ్రరూపమును చూసిన ధైత్య సేనాధిపతులను చూస్తూ…. దుర్గాదేవి కాస్త విజృంభించి…. మండలాగ్రహంతో ప్రచండుడిని అలాగే బిండివాలముతో…. చామరుని శక్తి ఆయుధంతో…వికటాక్షుని ముసలముతో…. దహనుని క్షురికతో…. మహా మౌళిని అలాగే కర్పూరంతో మహాహనువును, ముద్గరముతో జ్వాలాముఖిని….కుటారంతో ఉగ్రవక్తుని అంత మొందించి ఉగ్రరూపంతో…. మహా రోషముతో…. చక్రయుధముతో…. మహిషాసురుడి ముందు భీకరమైన సింహనాదమును చేస్తూ…. నిలబడే సరికి…..ఈ రాక్షస రాజు కాస్త తన బాణాలతో ఈమె కపాలమును, స్తనములను, తీవ్రముగా గాయపరిచాడు. దానితో కోపోద్రేకురాలైన దుర్గాదేవి కాస్త….. క్షురప్రము అనే ఆయుధమును ఇతని బాహులకు,వక్షమును, ముఖము మీద కొట్టగా …….. మహిషుడు కాస్త మూడు బాణాలతో దుర్గాముఖము పైన కొట్టాడు. దానితో దుర్గా మరింత కోపోద్రీకురాలై…. ఉగ్రరూపురాలై 20 బాణాలను ఏకకాలంలో…. రెండు బాణాలను ఇతని బాహువుపైన, మరో రెండు బాణాలను నేత్రాలపైన, ఒక బాణమును ఇతని రథసారథి పైన, మూడు బాణాలను ధనస్సు మీద, నాలుగు బాణాలు ధ్వజము మీద, ఆఖరిగా ఎనిమిది బాణాలను గజ అశ్వాల మీద సంధించేసరికి….. మహిషుడు కాస్త రథం లేకుండా నేల మీద నడుస్తూ ….మండుతున్న శతఘ్ని ఆయుధమును దుర్గాదేవి పై ప్రయోగించాడు. ఈమె తేరుకునే లోపే ఇతను కాస్త కామరూపుడు విద్య తెలిసిన వాడు కావడం చేత….తనకి కావలసిన రూపాన్ని పొందుతూ ఈమెతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. దానితో ఇతను కాస్త కామరూపిగా….సింహ రూపమును ఎత్తి దుర్గా మీద బిగ్గరగా గర్జిస్తూ లంఘించాడు. దేవీ వాహనమైన సింహం కాస్త తన పదునైన తెల్లని గోర్లతో తీవ్రమైన కోరలతో ఈ మహిషరూపమైన సింహం మీదకి దూకి దాని వక్షస్థలమును చీల్చినను వీడు చావలేదు. ఇంతలో ఈ మహిషుడు కాస్త మరో కామరూపిగా, పులి రూపం ధరించి…. నోరు తెరిచి…. దుర్గ పైకి వస్తూ ఉండేసరికి…. ఇది గమనించిన ఈమె కాస్త…. తన చేతిలోని శూలాయుధముతో బలంగా ఈ పులిని పొడవగా…. అప్పుడు వీడు చావక పోగా…. ఈసారి వీడు కాస్త ఏనుగు రూపం ధరించి….ఈమె మీదకి గీంకార నాదముతో లంఘించేసరికి….. ఈమె వాహనమైన సింహం కాస్త ఈ ఏనుగు మీద గీం కరిస్తూ దూకేసరికి…. అప్పుడు కూడా వీడు చావక ….ఈసారి వీడు కాస్త గజరూపమును వీడి….. ఒక మహావీరుడై ఈమె ముందు నిలిచేసరికి….ఈమె కాస్త తన చక్ర ఆయుధాలతో విడి తల నరికినా కూడా వీడు చావకపోయేసరికి ఇదంతా గమనిస్తున్న గౌతమ మహర్షి కాస్త….ఈమె దగ్గరికి వెళ్లి…. తల్లి! వాడు శివ వరప్రసాదము. వాడి మరణం వాడి నిజరూపమైన మహిషాసుర అనగా దున్నపోతు రూపముగా ఉండగానే….. నీ చేతిలో మరణం పొందే వరమును పొందాడు. కాబట్టి వాడు ఎప్పుడైతే అనుకోకుండా వాడి నిజరూపంతో…. నీ మీదకి దండెత్తి వస్తాడో… ఆ క్షణమే వాడి తలను నీ పాదం మీద అణిచిపెట్టి ఊపిరి ఆడకుండా సంహరించు. అప్పటిదాకా ఈ మరణ సమయం ఆసన్నమయ్యేదాకా….. వేచి ఉండక తప్పదు అంటూ ఉండగానే….. మహిషుడు కాస్త ఒక్క క్షణం ఆకాశంలోనికి,, మరొక క్షణం భూమి మీదకి ,మరొక క్షణం భూమి లోపలికి, మరొక క్షణం అన్ని దిక్కులలో మాయం అవుతూ… మళ్లీ కనపడుతూ, అదృశ్యం అవుతూ…. దృశ్యం అవుతూ ఉన్నాడు. వీని చేతలను గమనించిన దుర్గాదేవి కాస్త పెద్దగా నవ్వేసరికి….. వీడికి రోషం వచ్చి తన నిజ స్వరూపమైన మహిష అనగా దున్నపోతు రూపముతో ఉగ్రరూపధారిగా మారి…. దుర్గముందు నిలిచి…. భయంకరమైన కన్నులు తెరిచి….. వాడి అయిన కొమ్ములతో ఆకాశ మేఘాలను చీల్చి… పర్వత శిఖరమును తన ముట్టెతో పెకిలించి….. అగ్నిశిఖ లాంటి నాలుకతో ఈ శిఖరమును నాకుతూ…. తన కాలి గిట్టలతో భూమిపైన ఉన్న ధూళిని లేపుతూ…. తన తోకతో దేవతల సైన్యములోని వారి ఆయుధాలను విరిచివేస్తూ …..దుర్గాదేవి మీదకి తన మృత్యువు కొరకు తానే, తనకి తానే ఉరికాడు. ఇదే అదను కోసం ఎదురుచూస్తున్న దుర్గాదేవి కాస్త…. తన చేతిలో ఉన్న త్రిశూలంతో…మహిషుని దున్నపోతు తలను గట్టిగా పొడిచేసరికి…..మహా పర్వతము లాంటి జగదీశ్వరి ముందు వీడు కాస్త ఆసక్తుడై నేలకి ఒరగగానే తక్షణమే…. దుర్గ కాస్తా వీని కంఠము పైన తన పాదమును మోపి బలముగా తొక్కి పెట్టి…. ఉంచుట వలన వీడి ప్రాణాలు పోయాయి. గాలిలో కలిసిపోయాయి. దేవి చేతిలో మోక్షమును పొందాడు. దానితో దేవీపాద స్పర్శ చేత వీడు కూడా పాపాత్ముడు నుండి పుణ్యాత్ముడిగా పూజనీయుడు అయ్యాడు. ఇలా దుర్గా చేతిలో మహిషాసురుడి సంహారం జరుగగా….. దేవతలు, మహర్షులు, మునులు, సిద్దులు, కాస్త పరమానందంతో లోక కంటకుడు గతించాడని నృత్యాలు చేస్తూ…. దివ్య పుష్పాల వానను దుర్గపై కురిపించారు. దేవతలందరూ కూడా దుర్గకి ప్రణమిల్లారు. అలాగే దేవేంద్రుడు కాస్త దుర్గాదేవిని స్తుతించాడు.
అమ్మ జగజ్జనని! దుర్గాంబిక! సమస్త భూత బీజరూపిణి! ఏకమే అయినా…. నీవు సమస్త విశ్వరూపిణిగా వెలిశావు. నీవే సర్వకార్య కారిణివి. సమస్త దేవతల యొక్క శక్తులతో, ఆయుధాలతో, శస్త్రాలతో ప్రకాశిస్తున్న ఈ మహిషాసుర మర్దిని రూపముతో…..మా అందరి కోసము పూజించదగ్గ ఈ రూపముతో ఇక్కడే ప్రతిష్టించబడుగాక! నీవు ఈ మహిమాన్వితమైన రూపము సర్వలోకవాసుల చేత పూజించబడును గాక! మీ పాదాలయందు తన శిరస్సుని ఉంచిన మహిషుడు కూడా లోకపుత్రుడు అవ్వుగాక! అని స్తుతించబడే సరికి…. ఉగ్ర మూర్తిగా ఉన్న దుర్గ కాస్తా శాంతమూర్తిగా మారి మహిషుని కంఠమున దివ్య కాంతి తేజస్సుతో వెలుగుతూ ఉన్న జ్యోతిర్మయి అను స్ఫటికశివలింగమును చూసి ఆకర్షితురాలై….ఈ శివలింగం పూజించడానికి తన చేతిలోనికి తీసుకొని… రక్తముతో తడిసి ఉన్న ఈ లింగమును నీళ్లతో కడగటానికి ప్రయత్నించేసరికి…. ఇది కాస్త తన చేతికి అతుక్కుని ఊడి రాలేదు. దానితో ఈమెకి భయం వేసి ….గౌతమ మహర్షి దగ్గరికి వెళ్లి సర్వ సర్వ ధర్మములు తెలిసిన వేదర్షి, గౌతమ మహర్షి! దేవతలను, మహర్షులను, మునులను, సిద్దులను, త్రిలోకవాసులను రక్షించడానికి శివ భక్తుడైన ఈ మహిషుని సంహారం చేశాను. కానీ ఇతనిని వధించుట మహా పాపముగా మారింది. ఎందుకంటే లింగమును తన మెడలో ధరించే లింగధారులు అలాగే నియమ నిష్ఠలతో కూడిన శివ భక్తులు అంటే మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రులు కదా! అంతెందుకు….. లింగ దారులైన త్రిపురాసుర సంహారం కూడా…శివుడు మొదట జయించలేదు కదా! ఎప్పుడైతే వీరందరూ కూడా తమోగుణం పొంది….ధర్మ మార్గం నుంచి అధర్మ మార్గమును ఎంచుకోవడంతో….. వీళ్ళ మెడలో ఉన్న లింగాల శక్తి నశించి…. అవి వీళ్లంత వీళ్లే విడిచిపోయిన తరువాతనే శివుడు వీళ్ళని సంహరించాడు కదా! ఇలాంటి లింగధారి అయిన ఈ మహిషాసురుడి యొక్క శివలింగము నా చేతి నుండి ఊడి రావటం లేదు. దీనికి ప్రాయశ్చిత్తమార్గంలో ఈ త్రిలోకాలలో ఉన్న సమస్త శివ క్షేత్రాలు దర్శిస్తూ…. అలాగే సర్వ తీర్థాలలో స్నానం ఆచరిస్తూ…. శివుడి అనుగ్రహంను నామీద కలిగే వరకు తీర్థయాత్ర చేస్తాను . అనగానే ….దుర్గా పరితాపమును చూసిన గౌతమ మహర్షి కాస్త…. తల్లి! గిరిజ భయపడకు. దిగులు చెందకు. ధర్మ సూక్ష్మములు చెబుతాను. జాగ్రత్తగా వినుము. ఎవరైతే శివధర్మమును ధిక్కరిస్తారో….. వారిని వధించడానికి అర్హులేనని ముందుగా నువ్వు తెలుసుకోవాలి. ఈ అసురుడు కాస్త పూర్వజన్మలో ఈ అరుణాద్రిని సేవించి పూజించి…. అపార కుబేరుడై… సార్వ భౌమ పదవిని పొందడంతో…. దేవతలను సైతం అలాగే త్రిలోకాలను జయించడం జరిగింది. కానీ వీడు చేసిన తప్పేమిటంటే ….లింగ ధారులు ధరించే శివలింగమును దీక్ష లేకుండా ఎలాంటి నియమాలు పాటించకుండా ధరించడంతో…. వాడి వినాశనాన్ని వాడే కొనితెచ్చుకున్నాడు. దానితో వీడు కాస్త విపరీత అహంకారపూరితుడై …. ధ్యాననిష్టలో ఉండే మహర్షులను సైతం… వీడి వికృత చేష్టలతో ఇబ్బంది పెడుతూ ఉండేసరికి…. సహనం కోల్పోయిన వీరు కాస్త వీడిని మహిషుడవు కమ్ము అని శాపం ఇవ్వడంతో…. అప్పుడు గాని వీడికి తలకెక్కిన అహంకారం వదిలి, వీళ్ళకి శరణాగతి అయ్యి తన మహిష స్వరూపము నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందో చెప్పమని కన్నీటితో వేడుకునే సరికి…
ఓ మహిషాసుర! మా శాపానికి తిరుగులేదు. శాపములు అనుభవించక తప్పదు. కాకపోతే శివుడు వామ భాగం పొందుటకు ఆదిపరాశక్తి అయిన కామాక్షి ఇక్కడికి తపస్సు చేసుకోవడానికి వస్తుంది. అప్పుడు శివానుగ్రహం వలనే దేవి చేత సంహరించబడి…. నీవు విముక్తి పొందుతావు. అలాగే నువ్వు శివలింగధారివి కావడం చేత…. మేము నీకు కామరూప సిద్ధిని వరంగా ప్రసాదిస్తాము. అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో…..ఆనాటి నుండి ఈ రాక్షస రాజు కాస్త తన కామరూప సిద్దితో తనకు కావలసిన రూపమును ఎత్తుతూ…. త్రిలోకాలను నానా ఇబ్బందులకు గురి చేస్తూ….. చివరికి ఇలా నీ చేతిలో… నీ పాదస్పర్శతో మరణమును పొంది ముక్తిని పొందడం జరిగింది. కాకపోతే వీడు కాస్త శివలింగ ధారి కావడం చేత…. వీడి సంహారం అనేది బ్రహ్మహత్యా దోషముతో సమానంగాబట్టి…. నవ తీర్థాలలో స్నానమాచరించి…. అరుణాచలేశ్వరుని స్మరిస్తూ….ఒక శివలింగమును ప్రతిష్టించి…. దానికి మూడు మాసాలపాటు శివలింగారాధన చేస్తే…కానీ రాక్షస సంహార దోషం నుంచి నీకు విముక్తి లభించదు అని గౌతమ మహర్షి చెబుతూ ఉండగా…. చెలికత్తెల ద్వారా దుర్గాదేవి విజయ వైభవం విని కుల పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న కామాక్షి దేవి కాస్త…. దుర్గ దగ్గరికి వచ్చి…ఓ వింధ్య వాసిని…..! నీవు అతి కష్టమైన పనిని సాధించి జయం పొందావు. నీ వలన నా తపస్సుకి ఎలాంటి విఘ్నములు లేకుండా పూర్తి అయింది. నీ చేతికి అంటిన వాడి శివలింగమును వదిలించుకుని పరిశుద్ధురాలివి కమ్ము అనగానే…. దుర్గా కాస్త దేవితో అమ్మ! నేను అదే పనిలో ఉన్నాను. వాడి లింగమును నేను పూజించాలని చేతిలో పట్టుకుంటే…. అది కాస్త నా చేతి నుండి ఊడి రాకుండా అతుక్కుపోయింది. దీనికి పరిష్కారం మార్గముగా నవ నదుల తీర్థాలలో స్నానమాచరిస్తే గాని ఈ శివలింగధారి భక్తుడి దోష నివారణ కాదు అని తెలిసింది. ఇప్పుడు పరిష్కార మార్గముగా ఈ నవ నదుల కోసం…. శివ క్షేత్రాలు దర్శనానికి బయలుదేరి వెళ్లాలి అనగానే …
కామాక్షి కాస్త దుర్గా! అంత అవసరం లేదు. నా పతి దేవుడైన అరుణాచలేశ్వరుని స్మరిస్తూ…. నీ ఎదురుగా ఉన్న బండమీద నీ ఖడ్గముతో బలంగా మోదు. ఆయన అనుగ్రహంతో నవ తీర్థాలు ఉన్న తీర్థం నీకు ఇక్కడే లభిస్తుంది. ఈ తీర్థంలో స్నానంచేత ఈ రాక్షస శివ భక్తుడి పాపం భస్మమై …..శివలింగము నీ చేతి నుంచి ఊడి వస్తుంది అనగానే…. దుర్గ తక్షణమే “ఓం నమో శోణాద్రినాధాయ” అని బిగ్గరగా జపిస్తూ…. తన చేతి ఖడ్గముతో తనకి ఎదురుగా ఉన్న అతి పెద్ద రాతి శిల మీద పాతాళము వరకు బద్దలయ్యే విధంగా బలంగా కొట్టేసరికి పాతాళంలో ప్రవహించే నవ నదులు అనగా… గంగా, యమునా, సరస్వతి, కావేరి, నర్మదా, గోదావరి, సింధు, సోనా నది, సోననద, ఇలా నవ నదులు కలిసి ఒక తీర్థజలముగా మారి పాతాళం నుంచి పైకి రావడం జరిగింది. దానితో ఈ తీర్థం నందు దుర్గాదేవి స్నానం ఆచరించేసరికి….తన చేతి నుంచి మహిషాసుర కంఠ శివలింగమైన స్పటిక లింగం ఊడి రావటంతో…. దుర్గా అమిత ఆనంద భరితురాలై …..అక్కడే ఉన్న కామాక్షి చేతికి ఈ మహత్తర స్పటిక శివలింగం ఇస్తూ ధ్యానంలో దీనిని అంటి పెట్టుకో! నీ భర్త ఎడబాటు కొంతమేర అయినా తీరుతుంది. నీ భర్త శక్తికి సరి సమాన శక్తివంతమైన ఈ శివలింగమును ఈ భూమి మీద నువ్వు తప్ప ఎవరూ భరించలేరు. అలాగే పూజించలేరు అంటూ…. కామాక్షికి ఈ శివలింగం ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత దుర్గాదేవి కాస్త తన పాప వినాశనం కోసం అనగా శివలింగ భక్తుని సంహార పాప దోషం కోసం స్వయంగా పాపనాశనుడు అనే శివలింగమును ప్రతిష్ట గావించి పూజలు చేయడం ఆరంభించింది. ఇలా మూడు మాసాల పాటు ఈ శివలింగ ఆరాధన అలాగే తన ఖడ్గము నుంచి వచ్చిన నవతీర్థ స్నానం ఆచరిస్తూ ఉండటం చేతనే …..ఈమె చేసిన పాపము నుంచి విముక్తి పొందడం జరిగింది. దానితో దుర్గాదేవి కాస్త మహిషాసుర మర్దని రూపంలో ఇంద్రుడి కోరిక మేరా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయింది. ఈమె ఖడ్గం చేత ఉబికి వచ్చిన నవ నదుల తీర్థం కాస్త ఖడ్గ తీర్థముగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఈ అరుణాచల క్షేత్రంలో ఈ ఖడ్గ తీర్థం ఉన్న దుర్గాదేవి గుడిని దర్శనం చేసుకోవచ్చును. అలాగే ఈ దేవాలయము నందు బ్రహ్మాండంగా అతి వైభవంగా దేవి నవరాత్రుల పండుగ జరుగుతుంది.
ఇదిలా ఉండగా…. ఈ శివలింగమును తీసుకున్న కామాక్షి దేవి కూడా ఈ ఖడ్గ తీర్థము నందు ఒక నెల రోజులపాటు ప్రతిరోజు స్నానం ఆచరిస్తూ…. పాపనాశనుడు గుడిలోని శివలింగ ఆరాధనను చేసింది. అయినా కూడా ఈమెకి శివానుగ్రహం లభించలేదు. శివ సాక్షాత్కారము లభించకపోవడంతో…. ఈ స్పటిక శివలింగము తీసుకొని…. సూదిమొన లాంటి దానిమీద ఒంటికాలితో నిలబడి…. ధ్యాననిష్టను మూడు మాసాల పాటు కొనసాగించినప్పటికీ…. ఎట్టి ఫలితం లభించకపోయేసరికి….శివానుగ్రహం కోసం గౌతమ మహర్షిని సంప్రదించగా…. అమ్మ! లోకమాత నీకు తెలియంది కాదు… ఈ అరుణగిరి అగ్నిస్వరూపమే కదా! కార్తీక పౌర్ణమి నాటి రాత్రి నీవు ఒక జ్యోతిని వెలిగించి…. గిరిప్రదక్షిణము పూర్తి చేస్తే….. ఈ అరుణాచలేశ్వరుని దర్శనమును పొందుతావు. తద్వారా నీవు అనుకున్న అభీష్ట సిద్ధిని పొందుతావు. కామాక్షి అమ్మవారు కాస్త కార్తీక పౌర్ణమి ఘడియ కోసం…. శివుడు అనుగ్రహం పొందుటకు నాలుగు వైపులా హోమాగ్నులు ప్రతిష్ట జరిపించి , మధ్యలో పంచాగ్ని ఏర్పాటు చేసుకొని ఈ శివలింగం చేత పట్టుకొని ….దీని మధ్యలో నిలబడి ఘోరతపస్సుని పగలు సూర్యుణ్ణి అలాగే రాత్రివేళ చంద్రుని తదేకంగా చూస్తూ …..నిద్రాహారాలు మానేసి…. ధ్యాన తపస్సు చేయడం ఆరంభించింది.
చత్వారింశత్(40వ) అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి