అధ్యాయం 4
ఆదిదంపతుల నిజరూప దర్శనం
ఈ యదార్థ సంఘటన ఈ క్షేత్రవాసి అయిన అరుణగిరి యోగి కావ్యకంఠ గణపతి ముని జీవితంలో జరిగింది. ఒక రోజు వీరు, అలాగే ఈయన తమ్ముడు ప్రతినిత్యం జప ధ్యానాదులు చేసుకునే కొండమీద ఉండే మామిడి తోట గుహ యందు ధ్యానం చేసుకోసాగారు. రాత్రివేళ అయ్యింది…. తమ్ముడికి బాగా ఆకలి వేయడంతో…. వీరిద్దరూ కొండ దిగువకి వచ్చి భోజనం కోసం భిక్షాటనకు బయలుదేరారు. ఆరోజు ఏకాదశి కావడంతో ఆరోజు రాత్రి ఎవరూ కూడా ఈ క్షేత్రవాసులు భోజనం వండుకోలేదు. అందువలన వీరికి ఎక్కడా కూడా భిక్ష దొరకలేదు. ఎవరైనా పసిపిల్లలు ఉన్న బాలింతరాలి ఇంటిలో అన్నం వండుకోక తప్పదు కదా! అనుకుని వీరిద్దరూ ఇలాంటి ఇంటి కోసం వెతికారు…. కానీ వీరికి అగుపించలేదు. ఆకలి అంతకంతా పెరిగిపోతుంది తప్ప తగ్గే మార్గం వీరికి అగుపించలేదు. ఊరి చివరకి చేరుకున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించకపోయేసరికి…. ఆకలి బాధతో… నిస్పృహతో నిరాశగా వెనుతిరిగి వస్తూ ఉండగా…. సరిగ్గా రమణస్వామి ఆశ్రమానికి ఎదురుగా ఉన్న ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్న ఒక పెద్దాయన వీళ్ళకి కనిపించి వీరితో…. స్వామి! ఇలా అర్ధరాత్రి పూట అరణ్యం నుండి వస్తున్నారు… చూస్తుంటే మీరిద్దరూ బ్రాహ్మణులుగా ఉన్నారు. ముఖాలు చూస్తుంటే ఆహార దప్పికల కోసం అలమటిస్తున్నట్టుగా ఉన్నారు…. అనగానే
కావ్యకంఠ గణపతి
గణపతి ముని కాస్త ఈయనతో అవునయ్యా! నిజంగానే మేమిద్దరం కూడా ఆకలి బాధతో అలమటిస్తున్నాము…. నేను కాస్త ఆకలికి తట్టుకోగలను కానీ, మా తమ్ముడు తట్టుకోలేకపోతున్నాడు… భిక్షాటన కోసం అని ఊరంతా తిరిగి వస్తున్నాము… ఈరోజు ఏకాదశి తిధి కావడంతో… ఎవరు కూడా భోజనం వండుకోలేదు. అందుకని మాకు బిక్ష దొరకలేదు. అందుకే నిరాశగా వెనుతిరుగుతున్నాము అనగానే…. ఆయన కాస్త
అరెరే! మీలాంటి బ్రాహ్మణుల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మా ఇంటి ఆవిడకి ఒక నియమం ఉంది …అదేమిటంటే, ఏకాదశి తిథి రాత్రి ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెడితే కానీ… తను భోజనం చెయ్యదు. నక్షత్ర దర్శనం అయ్యింది..బ్రాహ్మణుల కోసం మేము ఇద్దరం ఎదురు చూస్తున్నాము…. మీరిద్దరూ అగుపించారు. కాబట్టి ఈరోజు మా ఇంట్లో విందు ఆరగించండి అనగానే… గణపతి ముని కాస్త అయ్యా! మేము ధర్మనిష్టా గరిష్టులము …మాకంటూ ఆచార వ్యవహారాలు ఉన్నాయి… మేము ఎవరి ఇంట పడితే ఆ ఇంట బిక్ష చేయము… కాబట్టి మీ ఇద్దరి పేర్లు చెప్పండి అనగానే ….ఆయన కాస్త ….మా ఇంటి ఆవిడ నీ కన్నా ధర్మ ఆచార వ్యవహారాలలో నిష్టురాలే… అందులో మీకు ఎలాంటి ఆచార దోషము అంటదు. నా పేరు సుందరాయన్… మా ఇంటి ఆవిడ పేరు మీనాక్షియన్ అనే అనగానే… వీరిద్దరూ కూడా సంతోషించి భోజనం చేయడానికి ఈయన ఇంటి లోపలికి వెళ్లారు. వీరిద్దరికీ… వారిద్దరూ కలిసి ప్రేమతో, ఆప్యాయతతో, మమకారములతో కొసరి కొసరి వడ్డించి…. అమృతప్రాయమైన అద్భుత రుచి భోజనమును వడ్డించారు. గణపతి ముని కూడా ఆరోజు ఏకాదశి అయినా కూడా ఈ భోజన సువాసనకి మైమరచి భోజనమును గురుప్రసాదంగా…. దైవప్రసాదంగా… స్వీకరించడం జరిగింది. ఒకటి గుర్తుంచుకోండి… దైవ క్షేత్ర సన్నిధిలో లేదా భౌతిక గురు సన్నిధిలో ఏకాదశి నియమాలు అంటూ పెట్టుకోకుండా… వారి సన్నిధిలో దొరికిన దానిని దైవ లేదా గురు ప్రసాదంగా స్వీకరించండి. లేదంటే మీకు అన్న దోషం లేదా దైవ లేదా గురు శాపాలు కలుగుతాయి. ఈ విషయం తెలిసిన బ్రహ్మ జ్ఞాని కావడంతో గణపతి ముని ఏమాత్రం ఆలోచించకుండా ఈయన ఇంట భోజనం చేయటం జరిగింది. ఇలా వీరిద్దరూ పుష్టిగా భోజనం చేయటం…భుక్తాయసముతో వచ్చి తిరిగి కొండ ఎక్కి మామిడి తోట గుహకి వెళ్లడానికి శరీరాలు ఏమాత్రం సహకరించడం లేదని గ్రహించి… ఆ దంపతులతో రాత్రికి మేమిద్దరం మీ ఇంటి లోపల ఉన్న అరుగు మీద విశ్రమించటానికి అనుమతిని కోరగా… దానికి ఆ దంపతులు సంతోషించి దానికేం భాగ్యం! మీరు ఎంత సేపు పడుకోవాలి అనుకుంటే… అంతసేపు పడుకోండి. మాకు ఎలాంటి అభ్యంతరము లేదు అంటూ… వీళ్ళకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆ దంపతులు లోపల గదిలోకి వెళ్లి నిద్రకి ఉపక్రమించారు. వీళ్ళిద్దరూ కూడా తాంబూలాలు తీసుకుని.. వాటిని భుజించే ఓపిక లేక కడుపులో ఖాళీ లేకపోవటంతో, అమిత నిద్ర ఆవహించడంతో తాంబూలాలు పక్కనే పెట్టుకొని ఆ అరుగు మీద నిద్రకు ఉపక్రమించారు. గాఢ నిద్రలోకి జారుకున్నారు.
ఆలయ గణపతి
గుడి గంటల ధ్వని వినిపించడంతో వీరిద్దరికి మెలకువ వచ్చి చూస్తే… గణపతి గుడి లాగా అగుపించింది. రాత్రి ఇక్కడ ఉన్న ఇల్లు తెల్లవారేసరికి గుడి ఎలా అయిందో… వీరిద్దరికి అర్థం కాలేదు. అరుగు మీద లేస్తూ ఉండగా… ఆ రాత్రి వీరికి దంపతులు ఇచ్చిన తాంబూలాలు కనిపించేసరికి… రాత్రి ఇక్కడ తాము ఇద్దరం భోజనం చేయడం సత్యమైనప్పుడు… ఇల్లు కాస్త గుడి ఎలా అయింది? అసలు తమకి భోజనం పెట్టిన దంపతులు ఎవరు? అనుకొని గణపతి మునికి ఏదో అనుమానం వచ్చి…
ధ్యానంలోకి వెళ్ళగానే, తనకి రాత్రి భోజనం పెట్టిన దంపతులు కాస్త మధుర మీనాక్షి గాను… సుందరేశ్వరస్వామి గాను ఆదిదంపతులుగా సాక్షాత్కరించగానే ఈయనకి ధ్యానభంగమై కళ్ళు తెరిచి విచారణ చేసుకుంటే… అవును! వీళ్ళిద్దరూ నిజంగానే ఆదిదంపతులైన మీనాక్షి సుందరేశ్వరులే….. ఎందుకంటే తను వీళ్ళ పేర్లు అడిగితే సుందరాయన్… మీనాక్షియన్ అని చెప్పిన విషయం ఈయనకి గుర్తుకు వచ్చి…. అంటే తమ ఆకలి తీర్చడానికి స్వయంగా ఆదిదంపతులు సజీవ మూర్తులుగా వచ్చి…. తమ చేతులతో భోజనం వడ్డించి… ఆకలి తీర్చారని అనుభవ అనుభూతి కలుగుతూ ఉండేసరికి…

ఆలయ అరుగు
ఈ ఆలయ అరుగుకు హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఎందుకంటే ఈ ఆదిదంపతులు కాస్త వీరిద్దరికీ ఈ అరుగు మీద కూర్చుని వడ్డన చేయటం జరిగింది. స్వయంగా సజీవ మూర్తులుగా ఆ ఆదిదంపతులు కూర్చున్న ఈ అరుగు పరమ పావనమైనది కదా అనుకుంటూ… గుడి ఆదిదైవమైన గణపతికి ….గణపతి ముని కాస్త నమస్కార కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుండి ఎంతో తన్మయత్వంతో వీరిద్దరూ కూడా కొండపైన ఉన్న… తమ ఆవాసమైన మామిడిచెట్టు గుహకి(చూత గుహ) వెళ్ళటానికి బయలుదేరడం జరిగింది.
గణపతి దేవాలయం
ఇందుకు సాక్ష్యంగా ఇప్పటికీ ఈ గణపతి దేవాలయం మనకి రమణ స్వామి ఆశ్రమానికి ఎదురుగా ఉంటుంది. ఎప్పుడైనా అరుణాచల క్షేత్రానికి వెళ్లినప్పుడు తప్పకుండా.. మర్చిపోకుండా ఈ గణపతి గుడికి వెళ్లి దర్శించుకోండి .అక్కడ ఉన్న అరుగు, అలాగే మధుర మీనాక్షి సుందరేశ్వర స్వామి, గణపతి విగ్రహమూర్తులను దర్శించి ఈ గాధను గుర్తుచేసుకొని తన్మయత్వం పొందండి.
శ్రీ అన్నపూర్ణా స్తోత్రం
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ।
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 1 ॥
నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ ।
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 2 ॥
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ ।
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 3 ॥
కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ ।
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 4 ॥
దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విజ్ఞాన-దీపాంకురీ ।
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 5 ॥
ఉర్వీసర్వజయేశ్వరీ భగవతీ మాతా కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ ।
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 6 ॥
ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ ।
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 7 ॥
దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ ।
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 8 ॥
చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 9 ॥
క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ ।
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ॥ 10 ॥
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే ।
జ్ఞాన-వైరాగ్య-సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ ॥ 11 ॥
మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః ।
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం ॥ 12 ॥
సర్వ-మంగళ-మాంగళ్యే శివే సర్వార్థ-సాధికే ।
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోఽస్తు తే ॥ 13 ॥
ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ అన్నపూర్ణా స్తోత్రమ్ ।
చతుర్ధ అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం అరుణాచల శివార్పణమస్తు







కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి