అధ్యాయం 15

 అధ్యాయం 15 

 క్షేత్ర మాయలు 

•••••••••••••••••••••••••




అహంకారమాయ:

ఈ అరుణాచల క్షేత్రంలో తప్పనిసరిగా మాయా ప్రభావమును పొందడం జరుగుతుంది. అది కాస్త అహంకారమాయ, మోహిని మాయ, యక్షమాయ, అపస్మారక మాయ, జ్ఞానమాయ, కీర్తి మాయ ఇలా పలు మాయలు ప్రతి జీవుడిని అలాగే సాధకుడిని ఈ క్షేత్రంలో పట్టుకొని పీడిస్తాయి.  ఎవరైతే ఈ మాయలు దాటగలుగుతారో…..వారికే అరుణాచల శివ అనుగ్రహం పొందడం జరుగుతుంది. ఈ అనుగ్రహం పొందుటకు మనకి అర్హత,యోగ్యత, యోగం ఉన్నదో లేదో…. ఈ మాయలు నిత్యం పరీక్షలు పెడుతూనే ఉంటాయి. వీటిలో జయం పొందిన వాడికి ఇదే వాడి ఆఖరిజన్మ అవుతుంది. మోక్షజన్మ అయ్యి ఏ శూన్యం నుంచి వచ్చాడో ఆ శూన్యమునకు చేరి శూన్యమైపోతాడు. కర్మ జన్మా రాహిత్య స్థితి….. అన్నింటికి అతీతమైన స్థితి పొందడం జరుగుతుంది. బ్రతికి ఉండగానే జీవన్ముక్తుడు అవుతాడు. జీవుడు లేడని,శివుడే ఉన్నాడని…. శివోహం స్థితి పొందుతాడు.  మనసు పని చేయని స్థితికి…. మాటకి అందని మౌనస్థితికి…… అన్నింటి యందు సాక్షిభూత స్థితికి…… అన్నింటి యందు స్థితప్రజ్ఞత స్థితికి…. చివరికి శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ మున్నగు వాటికి అతీత స్థితి పొంది…… నిశ్చల స్థితిలో నిర్జీవ మూర్తిగా మారతాడు. ఇక ఈ మాయలలో ప్రధానమైనది అహంకారమాయ.  ఇది అన్నీ మాయలకి మూలం అన్నమాట!  ఇది కామం వలన, ధనము వలన, కీర్తి ప్రతిష్టల వలన, జ్ఞానము వలన, అందము వలన, చదువు ఉద్యోగం వ్యాపారం ఇలా మున్నగు 18 స్థితుల వలన 18  ఈ అహంకారమాయలు వస్తాయి.  అదే ఈ క్షేత్రంలో ఈ అహంకార మాయ అనేది….నాకు అన్నీ తెలుసు, నేనే గొప్పవాడిని, నేను ఏదైనా చేయగలను, నేనే జ్ఞానిని, నేనే దేవుడిని, నేనే గురువుని, నేనే ఇది, నేనే అది, అంటూ మొదలవుతుంది. 


ఒకసారి సప్త ఋషులు యాగము చేస్తున్నారు …..పరమేశ్వరుడు కాస్త వీరి భార్యల యందు నగ్నముగా ప్రత్యక్షమయ్యాడు. వీళ్ళ మనసులు మనోవికారాలు పొందడం,  అరుంధతి గ్రహించి….. తనే మిగిలిన వాళ్ళుగా మారి ఈ పరమేశ్వరుడి చెంత ఉంది. ఇది తెలియని సప్త ఋషులు కాస్త యాగము పూర్తిచేసుకుని వచ్చేసరికి….. నగ్నముగా ఉన్న పరమేశ్వరుడి దగ్గర తమ భార్యలే ఉన్నారని అనుకొని….ఈయనని చూస్తూ…. ఏ మర్మాంగ బలం ఉన్నదని అహంకరించి మా భార్యల ముందు నిలబడ్డావో ఆ అంగము తెగి భూమి మీద పడుగాక అని అహంకారముతో శాపము ఇచ్చారు.  తక్షణమే పరమేశ్వరుడి రూపంలో ఉన్న మాయా వేషధారి మర్మాంగం కాస్త భూమి మీద పడిపోతుంటే….. ఈ శక్తిని విశ్వ జగత్తు తట్టుకోలేదని….. విశ్వ లోకాలు అల్లాడిపోతాయని గ్రహించిన ఆదిపరాశక్తి కాస్త…. ఈ మర్మాంగమును తన యోని భాగములో నిక్షిప్తం చేసుకుంది.  ఆనాటి నుండి మానవ పూజిత శివలింగం అయింది. దీనికి  నిదర్శనమే తిరుపతి దగ్గరలో ఉన్న గుడిమల్లం దేవాలయంలో పురుషాంగమును పోలిన లింగోద్భవ శివలింగం ఉంటుంది.  ఈ లింగము మధ్యలో అపస్మారక రాక్షసుడు మీద నిలుచున్న పరమేశ్వరుడు ఉంటే…. ఈ లింగము అగ్రభాగంలో హంస రూప బ్రహ్మ అలాగే…..ఈ లింగము క్రింద భాగములో వరాహరూప విష్ణుమూర్తి ఉండడం గమనించవచ్చును.  ఇలా ఈ విశ్వసృష్టిలో ఆది జీవ లింగము ఉద్భవించింది. ఇలా ఏర్పడిన శివలింగమూర్తిని చూసిన సప్త ఋషులు విషయం తెలిసి…. తప్పును క్షమించమని కోరగా…. అందుకు మాయా వేషధారి రూపము నుండి పరమేశ్వరుడు కాస్త ప్రత్యక్షమై అహంకారములు వీడండి…… మీకున్న జ్ఞాన అహంకార మాయను దాటండి… మీరు పూర్ణజ్ఞానులే కావచ్చును…. మీకున్న ఈ జ్ఞానమును ఇచ్చిన నన్ను మర్చిపోతే ఎలా? మీకు ఈ జ్ఞాన ప్రదాత నేనే కదా! నేను కానీ ఈ జ్ఞానమును మీకు ఇవ్వకపోతే…..మీరు ఎలా పూర్త జ్ఞానులు అవుతారో ఆలోచించండి…. జ్ఞాన అహంకార మాయ వలన నాకే శాపం ఇచ్చారు.  ఇది కూడా విశ్వలోక కళ్యాణార్థ కార్యముగా జరిగింది… దీనికి నేను చింతించడం లేదు.  కాకపోతే మీ అందరూ కూడా ఈ క్షణం నుండి మీ అహంకారమునకు నాకు దానంగా ఇవ్వండి.  నేను  పుచ్చుకుంటాను అని వీరి దగ్గర అహంకార దానమును తీసుకొని పరమేశ్వరుడు కాస్త అదృశ్యం అయ్యాడు.  ఆనాటి నుండి అరుణాచల శివ కాస్త తన భక్తుల అహంకారమును దానము తీసుకోవడం ప్రారంభమైంది. 


అంతెందుకు….. జ్ఞాన సంబంధర్ అనే భక్తుడు కాస్త మొట్టమొదటిసారిగా అరుణాచల క్షేత్ర దర్శనానికి వచ్చినప్పుడు…. నన్ను మించిన జ్ఞాని లేడని…. అలాగే నన్ను మించిన ఐశ్వర్యవంతుడు లేడని తన రచన కావ్యాలతో…. బంగారు ఆభరణాలతో…. మంది మార్బలంతో బయలుదేరాడు.  శిష్యులు కాస్త ఈయన ఎక్కిన పల్లకి మోస్తూ ఉండగా…. మరికొంతమంది ఈయన ఛత్రం పట్టుకొని….. మరికొంతమంది ఈయనకి కావలసిన భోజన సౌకర్యాలు చూసుకుంటూ ఉండగా….. ఇలా సుమారుగా 80 మంది శిష్యులతో ఈ యాత్రకి బయలుదేరాడు.  ఈ క్షేత్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా…. కొంతమంది బందిపోట్లు వచ్చి ఈయన పల్లకిని ఛత్రము, బంగారపు ఆభరణాలు, కావ్యాలు ,భోజన పదార్థాలు వంట పాత్రలు, గుర్రాలు ఇలా అన్నీ కూడా ఎత్తుకొని పోయారు. దానితో శిష్యులకి విపరీతమైన ఆకలి దప్పికలు వేయడంతో… తమకి భోజనాలు పెట్టమని ఇతనిని ఒత్తిడి చేస్తూ ఉండేసరికి…. అప్పుడు కానీ ఇతనికి తను చేసిన తప్పు ఏమిటో అర్థం కాలేదు.  ఈ క్షేత్రంలోకి వచ్చేటప్పుడు ఏమీ తెలియదని, ఏమీ చేయలేనని, సర్వస్య శరణాగతి భావంతో ప్రవేశించాలే కానీ….. నాకు అన్నీ ఉన్నాయి…. లేదా నాకు అన్నీ తెలుసు…. లేదా నేను అన్నీ చేయగలను…. అనే గర్వ అహంకారాలతో ఈ క్షేత్రంలోకి ప్రవేశిస్తే,  ప్రవేశం దొరకకపోగా…. అవమానాలు, అవస్థలు పడవలసి వస్తుందని గ్రహించి…. అప్పుడు శరణాగతితో అరుణాచలేశ్వరుడి మీద స్తోత్రాలు చేయడం ప్రారంభించాడు.  కొన్ని క్షణాల తర్వాత ఒక నలుగురు వ్యక్తులు వీళ్ల దగ్గరికి వచ్చి….. ఇతనితో స్వామి! మీరంతా ఆకలితో ఉన్నట్టుగా ఉన్నారు. ఇక్కడికి దగ్గరలో మా బంధువుల వివాహ కార్యక్రమం జరుగుతుంది. అందరూ అక్కడికి వెళ్లి భోజనాలు చేద్దాం అని వీరందరినీ పెళ్లికి తీసుకొని వెళ్లి భోజనాలు పెట్టించారు.  ఈ భోజన కార్యక్రమాలు పూర్తి అవ్వడంతో వీరందరికీ విపరీతమైన నిద్ర ఆవరించడంతో నిద్రపోయారు.  లేచి చూసేసరికి తమకి భోజనాలు పెట్టిన పెళ్లి గుంపు కనిపించలేదు.  అలాగే నలుగురు వ్యక్తులు అగుపించలేదు.  దానితో వీరికి ఏం జరిగిందో అర్థం అవ్వక…. కాలినడకతో అరుణాచల క్షేత్రానికి చేరుకున్నారు.  అక్కడి ప్రజలకి ఈయన గురించి ముందుగానే తెలియడంతో….. ఈయనకి స్వాగత సత్కారాలు చేస్తూ స్వామి! నిన్న రాత్రి దొంగలు పడి మీ వస్తువుల దోచుకుని వెళ్తూ మా కంటపడ్డారు.  మేము వారిని అటకాయించి ఈ వస్తువులు వారి దగ్గర నుండి లాక్కొని వారికి దేహశుద్ధి చేసి పంపించాము. వాళ్ల ద్వారా మీరంతా వస్తున్నారని తెలుసుకొని….. మీ రాక కోసం ఎదురు చూస్తూ ఈ ఏర్పాటు చేయడం జరిగింది అనగానే…. ఈయన కాస్త వాళ్ళతో ఇది అంతా అరుణాచల శివలీలా మాయ.  నాలో ఉన్న జ్ఞాన, ధన అహంకార మాయల వలన ఈ మాయలను ఈ లీలతో మాయం చేశాడు. అన్నీ ఉన్నాయి అనే స్థితి నుండి ఏమీ లేని స్థితికి తీసుకొని వచ్చారు.  నేను ఉన్నాను స్థితి నుండి నేను లేను….. ఉన్నది ఆయనే అనే మనోస్థితికి చేర్చాడు….. అంటూ అప్పటికప్పుడు అరుణాచలేశ్వరుడు మీద అశువుగా పద్యాలు చెప్పడం ఆరంభించాడు.  ఇలా ఈ భక్తుడి ద్వారా లోకానికి….. ఈ క్షేత్రానికి వచ్చేటప్పుడు ఎలాంటి గర్వము, మదము, అహంకారము లేకుండా ప్రదర్శించకుండా వినయంతో అనుకువతో సర్వస్య శరణాగతి భావముతో….. మెలుగుతూ రావలసి ఉంటుందని చెప్పడం జరిగింది అన్నమాట!  ఇలా అహంకారమాయను మనము దాటవలసి ఉంటుంది. మనలో మనకి తెలియకుండా 18 రకాల అహంకారమాయలు ఈ క్షేత్ర ప్రవేశ సమయంలో బయటపడతాయని…..నా స్వానుభవంలో చాలా సార్లు తెలుసుకున్నాను.  వాటిని అహంకారానికి విరుగుడు ఓంకారమని గ్రహించండి….అరుణాచల శివనామస్మరణయే…. సర్వస్య శరణాగతి భావము మనకి కలిగిస్తుందని తెలుసుకోండి. 


మోహిని మాయ:


ఇకపోతే రెండవ మహామాయ అయిన మోహిని మాయ ఎలా వస్తుందో తెలుసుకోండి. ప్రధాన ఆలయమైన అరుణాచలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న కిలిగోపురం క్రింద నాట్యకత్తె రూపంలో ఉన్న మోహిని విగ్రహ మూర్తి ద్వారా మనకు వస్తుంది. అరుణగిరి నాధర్ అనే యోగికి ఈ మోహిని పిశాచం పట్టడంతో…. వయస్సులో ఉన్నప్పుడు వేశ్య దాసుడు అయ్యాడని… ఈయన గ్రహించి ఈమెను ఈ గోపురం కింద తన మంత్ర బలముతో బంధించడం జరిగింది.  అలాగే దీనికి ఒక నియమ నిబంధన కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే స్వామివారి దర్శనానికి వెళుతూ ఈ మోహిని విగ్రహ మూర్తిని దర్శించుకుంటే……ఎలాంటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ కలిగించదు. అలాకాకుండా స్వామివారిని దర్శించుకుని తిరిగి వచ్చేటప్పుడు ఈమెను దర్శించుకుంటే మాత్రం….. ఈమె మీ వెంట ఖచ్చితంగా పడుతుందని…. కాబట్టి వెళ్లేటప్పుడు చూసినా పర్వాలేదు కానీ, తిరిగి వచ్చేటప్పుడు దీనిని చూడరాదని ఖచ్చితమైన నియమముగా పెట్టడం జరిగింది. ఈ నియమం తప్పిన వారికి ఈ మోహిని పిశాచం వెంటపడటం నా స్వానుభవం కాదు…. ఎంతోమంది స్వానుభవాలు నేను చూడటం జరిగింది.  ఎలా అంటే ఈ నియమం తప్పి రెండవసారి ఈమెను దర్శనం చేసుకున్న వారికి ఇది పిశాచముగా మారి పక్కనే నీడగా వెంటాడుతుంది.  పట్టుకొని ఉంటుంది.  ఇది ఇలా ఉన్నదని మనోనేత్రం ద్వారా చూస్తే మాత్రమే కనపడుతుంది. అంతేకానీ భౌతిక నేత్రాలకి అది అగుపించదు. ఇది ఇలా మనల్ని పట్టుకుంటే….అప్పటిదాకా పాతివ్రత్య ధర్మంతో అనగా తన భార్య లేదా తన భర్త తనకి సర్వస్య సర్వస్వమని భావంతో ఉండే భార్యాభర్తకి ఈమె మోహిని మాయ ప్రభావం వలన అక్రమ సంబంధాలకి దారితీస్తుంది.  పర స్త్రీ లేదా పర పురుష  వైపు సంసారులు బ్రహ్మచార్యులు ,యోగులు, సాధకులు, గురువులు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఇలా ఎందరో కూడా ఈ మోహిని బారిన పడి… కాంతా దాసులైన  వారిని నేను ఎందరినో ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అందెందుకు నా జీవిత స్వానుభవముగా కూడా ఈ నియమము కావాలని అన్నీ తెలిసినా కూడా రెండవసారి అనగా స్వామివారిని దర్శించుకుని తిరిగి వచ్చేటప్పుడు కావాలని ఈమెను చూడటం జరిగింది.  స్వప్నంలో అలాగే ధ్యానంలో ఈమె సజీవమూర్తిగా నాట్య కత్తె గా కనపడటం ఆరంభించింది . కొన్ని రోజుల తర్వాత నా జన్మాంతర భార్య అంటూ….ఒక స్త్రీ మూర్తి నా వెంటపడింది.  ఆమెను వదిలించుకోవడానికి నాకు 8 నెలలు పట్టింది.  ఆ తర్వాత నాకు స్వప్నంలో ఈ మోహిని నాట్య  కత్తె కాస్త నన్ను విడిచి పెడుతూ…. నా ఇంటి నుంచి వెళ్ళిపోతున్న దృశ్యం కనిపించింది . ఆనాటి నుండి మళ్లీ నేను కాస్త ఈ మోహిని నాట్య కత్తె విగ్రహ మూర్తిని ఒకసారి చూసే ప్రయత్న సాహసము చేయలేదు.  చేస్తే ఖచ్చితంగా మోహిని పిశాచంగా వెంటపడుతుందని తెలిసి…. తర్వాత స్వానుభవం అయిన తరువాత…. ఇంక సాహసం చేసే స్థితికి ఎవరికి ఉంటుంది….ఉండదు కదా!  కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా ఖచ్చితముగా ఈ నియమమును పాటించండి.  స్వానుభవం కావాలంటే ఈ నియమం తప్పి రెండవసారి దర్శించుకుని నానా అవస్థలు, అవమానాలు ,మానసిక ప్రశాంత స్థితి, శారీరక, అనారోగ్య సమస్యలు పొందండి…. ఇక మీ ఇష్టం… వింటే బాగుపడతారు,  లేదంటే బాధపడతారు. 


అసలు ఈ మోహిని మాయ ఈ క్షేత్రానికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని శాస్త్ర గ్రంధాలు చదవడం ఆరంభించాను.  అందులో ఒకచోట బ్రహ్మ దగ్గరికి ఒకసారి ఇంద్రుడు వచ్చి తపోధ్యానము చేసే వారికి తపస్సు భంగము అయ్యే విధంగా తన అంద చందాలతో ముగ్ధులను చేసే ఒక దివ్యశ్రీ మూర్తిని సృష్టించమని అడిగితే….. ఈయన కాస్త దివ్య మోహిని స్త్రీ మూర్తిని సృష్టించి…. ఈమె  మోహ మాయాలో ఏకముగా బ్రహ్మ పడిపోయి… తన కామకోరిక తీర్చమని ఈమె వెంట పడడం జరిగింది.  ఈమె  కాస్త ఒక రామచిలుక రూపముగా మారి అరుణాచల క్షేత్రానికి చేరుకొని….అరుణాచలేశ్వరుని వేడుకోవడం జరిగితే… ఈయన కాస్త తన వెంట పడుతూ ఈ క్షేత్రానికి వచ్చిన  బ్రహ్మతో “ఏమిరా !నువ్వు చేసిన స్త్రీ మూర్తితో ఎలా సంభోగించాలని అనుకుంటున్నావు ? ఈమెకి నీవు తండ్రివి అవుతావు కదా? ఈమె నీ కూతురు అవుతుంది కదా?  మోహ.మాయ మత్తులో పడి వావివరసలు మర్చిపోయావా? ” అని ఒక బోయవాడిగా వచ్చిన పరమేశ్వరుడు కాస్త ఈయన మీద బాణం ఎక్కు పెట్టి అనేసరికి….. ఈయన రూపం చూసిన బ్రహ్మకి మోహము నశించి స్వామి ! నన్ను క్షమించండి, నేను సృష్టించిన మోహిని మాయకి నేనే పడిపోయాను.  నన్ను క్షమించు… పాపకర్మలు చేసే మాలాంటి వారిని నీవు తప్ప ఇంక ఎవరు రక్షించగలరు… పాపపూరితమైన ఈ దేహమును సంహరించి మరొక కొత్త సృష్టికర్తను సృష్టించు అని వేడుకునే సరికి…. బోయవాడు కాస్త పరమేశ్వరుడిగా మారి “ఓ చతుర్ముఖ బ్రహ్మ!  నీ సృష్టి మాయలో నీవే పడి ఈ తప్పిదం చేశావు ….కానీ కావాలని చేయలేదుగా! పదవిలో ఉన్నవారికి రాగద్వేషాలు వదలవు కదా! కావాలని చేసినా లేదా తెలియక చేసిన తప్పు తప్పే కదా! కాబట్టి నువ్వు చేసిన ఈ తప్పిదానికి శిక్షగా నీవు నా నుండి దూరమై…. ఈ క్షేత్ర వాసిగా కొన్నాళ్ళు ఉండి నా తేజోలింగం అర్చించుకో!  స్మరించుకో!  నువ్వు చేసిన పాపము నశించును..  అంటే ఈ క్షేత్రములో ప్రదక్షిణ, నమస్కారం, నామస్మరణ స్తోత్రాలు దీపారాధన ,అరుణ జ్యోతి దర్శనం, పూజలచే నన్ను ఆరాధిస్తే వారికి శరీరముతో, మనస్సుతో మాటలతో ,బుద్ధితో, అహంకారంతో తెలిసో లేదో తెలియక చేసిన సర్వపాపాలు అన్నీ కూడా నశించును అని చెప్పి…. అంతర్దానం అయినారు.  అప్పుడు బ్రహ్మ కాస్త తనకి మోహమాయా బంధ విముక్తి కలిగించినందుకు గుర్తుగా బ్రహ్మాలింగముగా ప్రతిష్టించడం జరిగింది. ఇదే ఈ క్షేత్రంలో ఆది అన్నామలై గుడి అయింది.  అప్పుడు ఈ మోహిని కాస్త చిలుక రూపంలో తిరుగుతూ…. తీవ్ర ధ్యాననిష్టలో ఉండే వారి మీద ఇంద్రుడి ఆజ్ఞ మేర వారి తపో నిష్ఠను భంగం చేయడానికి మోహిని యక్షిణిగా….. మోహిని పిశాచముగా…. మారి ఈ క్షేత్ర తపో నిష్ఠలకి, ధ్యాన నిష్ఠలకి, ఆత్మ నిష్ఠలకి ,ధర్మ నిష్ఠలకి నిత్య మోహిని మాయ పరీక్షలు పెడుతూనే ఉంది.  నూటికి 99 శాతం మంది ఈమె మోహ మాయలో పడి…. మోక్షము పొందవలసిన వారంతా కూడా పునః సృష్టికి వెళ్లడం గమనించిన ఈ ఆధునిక కాల అరుణగిరి నాధర్ యోగి తన మంత్ర బలముతో ఈమెను కిలి గోపురం కింద మోహిని యక్ష బంధనముతో ఈమెని నాట్య కత్తె విగ్రహ మూర్తిలో….. అదికూడా ఒక నియమముతో బంధించడం జరిగింది.  ఈ నియమం కావాలని తప్పిన వారికి ,కావాలని కష్టాలు కానీ తెచ్చుకోవడం అవుతుందని గ్రహించి …..జాగ్రత్తగా మెలగండి .ఒకవేళ ఈమె మోహిని మాయలో పడితే…. ఆ అరుణాచలేశ్వర స్వామి అనుగ్రహం తప్ప ఇంక ఎవరూ కూడా ఈ మాయాబంధనం నుంచి విముక్తులు చేయలేరని గ్రహించండి.  ఎలా అంటే ఈ మోహిని మాయ విముక్తి కావటం……ఈ మోహిని మాయ అనగా పెళ్లి అయిన మీరు కాస్త …..పరస్త్రీ లేదా పర పురుష మోహమాయలో పడుతున్నారని అనిపించినా….. లేదా బ్రహ్మచారులు కాస్త   సంసారులు  అవ్వాలని తపన తపన, తాపత్రయాలు కలుగుతున్నా కూడా….. వెంటనే ఈ మాయ నివారణ కోసం ఈ ఆది అన్నామలై గుడికి వెళ్లి అక్కడ మూడు లేదా ఐదు లేదా 8 లేదా 11సార్లు గుడి ప్రదక్షిణాలు చేసి గుడి లోపల ఉన్న బ్రహ్మ ప్రతిష్ట శివలింగం దర్శనం చేసుకుని 1008 సార్లు ఈ గుడి ఆవరణలో కూర్చుని….. అరుణాచల శివ నామస్మరణ చేస్తే ఈ మోహిని మాయ పోతుంది. నేను ఇలాగే చేసుకొని ఈ మోహమాయ నుండి విముక్తి పొందడం జరిగింది. 


యక్షులు యక్షిణి మహమాయ 

ఇక ఈ క్షేత్ర మూడవ మహామాయగా యక్షులు యక్షిణి మహమాయ వస్తుంది. ఇది ఆది అన్నామలై గుడి గాలిగోపురం మోస్తూ…. లోపలి వైపు వీరిద్దరూ యక్ష యక్షిణి విగ్రహమూర్తులు ఇప్పటికీ మనకి కనపడతారు.  ఈ ఆలయ స్థల పురాణము చూస్తే…. ఈ దేవాలయమునకి ఎన్ని సార్లు గాలిగోపురం కట్టినప్పటికీ….. ఏదో ఒక కారణంతో లేదా అకారణముగా కట్టిన గాలి గోపురం మాత్రం పడిపోయేది. గాలిగోపురం లేని దేవాలయం అనేది దర్శనానికి పనికిరాదని….. ఆగమ శాస్త్ర వచనం కాబట్టి, ఈ క్షేత్ర ప్రజలకి దీనికి పరిష్కార మార్గం గురించి మదన పడుతూ ఉంటే….. ఈ క్షేత్ర పరమేశ్వరుడు కాస్త ఒక వయోవృద్ధ సిద్ధ పురుషుడిగా వచ్చి….. ఈ గాలిగోపురం పడిపోకుండా ఉండేందుకు….. తన సిద్ధ బలముతో యక్షుడిని అలాగే యక్షిణినీ బంధనం చేసి…. ఈ గాలిగోపురం పడిపోకుండా మోసే బాధ్యతను అప్పగించి అదృశ్యం అవటం జరిగింది. ఆనాటి నుండి వీరిద్దరూ కూడా ఇప్పటికీ ఈ గుడి గాలిగోపురమున మోస్తూ విగ్రహమూర్తులు కాస్త సజీవ మూర్తులుగా ధ్యాన నిష్టలో ఉండే వారి మనో నేత్రమునందు అగుపించే ధ్యాన దృశ్యం నేను కాదు….. ఇలా ఎంతోమంది స్వానుభవాలు పొందడం జరిగింది. ఇలా వీరిద్దరూ కూడా ఎవరైతే ధ్యాన నిష్ట లేదా జప నిష్ట లేదా జ్ఞానం నిష్ఠ లేదా ధర్మ నిష్ఠ లేదా ఆత్మ నిష్ట యందు స్థిరమవ్వటానికి సిద్ధపడుతూ ఉంటారో వారి స్వప్నాలయందు లేదా ధ్యానము యందు కనిపించి గుప్తనిధులు నాగబంధనిధులు, యక్షిని బంధ నిధులు, పిశాచ బంధన సిద్దులు, వారసత్వపు నిధులు, ఎక్కడ ఎలా ఏ విధంగా ఉన్నాయో చూపించి….. వాటికున్న బంధమాయలను ఎలా బంధ విముక్తి చేయాలో మనకి ఆ జ్ఞానమును ఇస్తారు.  అంతెందుకు …….కుబేరుడు కూడా ఒక యక్షుడేనని చాలామందికి తెలియదు. ఈయన తన యక్షమాయతో మనకి ధనాకర్షణ, ఐశ్వర్యమును చేస్తాడు.   ఇలా ఎప్పుడైతే  ఈ ఇద్దరి యక్షులు చూపించే ధనమాయకీ  లొంగకపోతే….. అప్పుడు మనకి రసవిద్యలసిద్ధి ఇవ్వటానికి సిద్ధపడతారు…. తద్వారా ఈ రస సిద్ది వలన ఇనుము ద్వారా, పాదరసము ద్వారా అంతెందుకు….. ఇసుక రేణువు కూడా బంగారంగా మారుతుంది అన్నమాట!  ఈ సిద్ధిమాయలతో ఈ క్షేత్రగిరి మీద ఆవాసం చేస్తున్నారు.  అలాగే అష్టసిద్ధులలో ముఖ్యంగా ఈసత్వ, వసిత్వ, ప్రాప్తి మున్నగు సిద్ధులు కూడా ఈ యక్షులు అనుగ్రహిస్తారు . అంతెందుకు కేరళలోని మంత్రవాదులైన నంబుద్రీలు ఈ యక్షిణిలను తమ మంత్రసిద్దితో వశపరచుకొని…. ఎన్నో రకాల సిద్దులు పొందడం జరుగుతుంది. వాక్సిద్ధితో మొదలై పంచభూతాలను ఆజ్ఞాపించే సిద్ధి దాకా వస్తారు.  అలాగే గుప్తనిధులు చూసే సిద్ధి నుండి బంగారం తయారు చేసుకునే రస సిద్దిదాకా వస్తారు.  భుచర సిద్ధి నుండి ఆకాశ సిద్ధి పొందే దాకా వస్తారు.  అంటే…. యోగ శక్తులు, సిద్ధ శక్తులు, మూల కారణము ఈ యక్షిణిలు అనుగ్రహం వలనే పొందడం జరుగుతుందన్నమాట! ఇలా వీళ్ళు 64 యక్షులు 64 యక్షినీలుగా ఉండి 64 సిద్దయోగ శక్తులు మనకి యక్ష సిద్ధ మాయ అనుగ్రహించడానికి ఈ క్షేత్ర వాసులుగా ఆవాసం చేస్తూ ఉంటారు.  ఇలా ఎవరైతే ఈ యక్షులు సిద్దమాయలో పడతారో….. వారి సాధన అంతటితో ఆగిపోయి… పరిసమాప్తి కాకపోగా పునః కర్మ జన్మ చక్రంలో పడిపోవడం జరుగుతుంది. మోక్షగామీ కాస్త కామిగామిగా మారడం జరుగుతుంది అన్నమాట!  కాబట్టి ప్రతి సాధకుడు కూడా ఈ యక్షులు ఇచ్చే సిద్ధయోగ శక్తుల ,సిద్దుల మాయలో పడకుండా…. నిత్యం ఏమరపాటు లేకుండా.   బహు  జాగ్రత్తగా పులి మీద స్వారీ లాగా ప్రవర్తిస్తూ…. ఈ మాయలను దాటుకోవలసి ఉంటుంది.  నా స్వానుభవంలో ఈ యక్షమాయలు కాస్త గుప్త నిధులతో మొదలై రసవిద్య జ్ఞానం అందించే ప్రయత్నం ఎన్నోసార్లు స్వప్నము నందు, ధ్యానమునందు ఇద్దరు కూడా చూపింవారు.  వాటిని నేను కాస్త సాక్షి భూతంగా చూస్తూ పట్టించుకునే వాడిని కాదు.  ఎందుకంటే బంగారం అనేది మట్టి నుండే కదా వచ్చింది.  ఈ రసవిద్య వలన మట్టి కాస్త బంగారంగా మారుతుంది. అంతే కదా!  నా దృష్టిలో మట్టి మరియు బంగారం ఒక్కటే అనే భావంతో నిత్యము ఉండేవాడిని.  తద్వారా ఈ యక్షుల సిద్దుల మాయలలో దాటుకునే స్థితికి ఈ అరుణాచలేశ్వర స్వామి నిత్య నామస్మరణ చేస్తూ దాటుకోవడం జరిగింది.  ఎవరైతే ప్రస్తుత తమ జన్మను అంతిమ మోక్షజన్మగా చేసుకోవాలని అనుకుంటారో .,..వాళ్లు తప్పనిసరిగా ఈ యక్షసిద్ధ శక్తి మాయలు తప్పనిసరిగా దాటుకునే ప్రయత్నం చేయక తప్పదు.  చేసి జయం పొందితే మోక్ష ప్రాప్తి పొందడం జరుగుతుంది. లేదంటే ఆ యక్షమాయకు బలి అయ్యి ఈ యక్షుడికి సేవలు చేస్తూ లేదా సేవలు పొందుతూ పునః సృష్టి, జనన మరణ చక్రము నందు నిత్యం పరిభ్రమిస్తూనే ఉండాలి. మట్టి నుండి వచ్చే బంగారానికి ఆశపడితే బంగారం లాంటి మోక్ష ప్రాప్తి కాస్త మట్టిగా మారి ఆ మట్టిలో పుడుతూ, చస్తూ ఉండాల్సి వస్తుందని గ్రహించండి.  జాగ్రత్తగా మసులుకోండి…. సాధన అంటే కత్తి మీద సామూలాంటిది అని….. తేడా వస్తే కత్తి పోటుకి బలి కావలసి వస్తుందని గ్రహించండి. 

అలాగే యక్ష పిశాచ మాయలు లేదా మోహిని పిశాచ మాయల నివారణ కోసం ….పూర్వకాలంలో ఒక చిట్కా ఉపయోగించేవారు.  అది ఏమిటంటే కాళ్ళకి చిరుగంట కట్టుకునేవారు.  ఈ గంట శబ్దానికి ఇలాంటి భూత,ప్రేత, దయ్యం, పిశాచాలు మన దగ్గరికి దరి చేరవు. రాలేవు. ఎందుకంటే ఇవి అన్నీ కూడా శబ్దనాదానికి భయపడి పారిపోతాయి.  అందుకే దక్షిణామూర్తి విగ్రహ మూర్తి కుడి కాలికి…. ఒక చిన్న చిరుగంట కట్టినట్లుగా మనకి కనపడుతుంది చూడండి…. ఈ ఘంటానాదం వలన ఈయన కాస్త  భూతాల గణాధిపతి అయ్యాడన్నమాట!  అంతెందుకు…. శివాంశ రూపులైన జంగమ దేవర చేతిలో కూడా….ఒక పెద్ద గంట మరియు శంఖము ఉంటాయి కదా!  ఈ రెండు శబ్దాలతో ఆ ఊరిలో ఆవాసం చేస్తే,  అన్ని రకాల భూత, ప్రేత ,పిశాచాలు తనతోపాటుగా తీసుకొని…. స్మశానములో వదిలి పెడతాడన్నమాట!  అందుకే దేవాలయాలలో గంట అలాగే శంఖము ఆరాధనలో పెట్టింది.  ఎందుకంటే భక్తి ఉపాసన ప్రేతాత్మలు కూడా దేవాలయ పరిసరాలలో ఆవాసం చేసే అవకాశం ఉంది.  అవి మనల్ని ఆవహించకుండా ఉండటానికి….దేవాలయ దర్శన సమయానికి గంట కొట్టి ఆలయ ప్రవేశం చేయమని మన పెద్దలు చెప్పడం జరిగింది. అలాగే మన ఇంటిలో నిత్య పూజలో కర్పూర హారతి సమయంలో చిరుగంట నాదం చేస్తే మన ఇంటిలో ప్రవేశించిన భూత, ప్రేత,పిశాచాలు ఈ నాద శబ్దానికి భయపడి పారిపోతాయని…. ఈ విధి విధానం మన పూర్వీక మహర్షులు మనకి అందించడం జరిగింది. మన భారతీయ పూజా విధివిధానం మనకి తెలియని ఎన్నో రహస్యాలతో  నిగూఢ మర్మాలతో ఉంటాయని…. ఎప్పటికైనా తెలుసుకోండి.  మనస్ఫూర్తిగా తెలిసి లేదా తెలియక చెప్పిన పూజా విధివిధానాలు తూ. చా తప్పకుండా ఆచరిస్తే మనకి కావలసిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అంతెందుకు …..ఆడవాళ్ళకి గజ్జల శబ్దం వచ్చే విధంగా కాళ్ల పట్టిలు పెట్టుకునే ఆచారం పెట్టడం వెనక కూడా ఇదే కారణం ఉంది.  ఎందుకంటే నెలసరి ఐదు రోజులలో పాటు శస్త్రీ మూర్తులు కాస్త మానసికంగా అలాగే శారీరకంగా బాగా అలసిపోతారు. ఇలాంటి బలహీనక్షణాల కోసమే మన చుట్టూ ఉండే గాలిలో క్షుద్ర శక్తులు ఆవరించి ఉండి…… మన ఈ దేహాలను ఆక్రమించే  విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అప్పుడు వీళ్ళ కాళ్ళకి ఉన్న గజ్జల పట్టీల శబ్దానికి అవి వీరి దగ్గరికి రాలేవు…. పారిపోతాయి…. ఈ విషయం ఆనాటి మన పూర్వీక మహర్షులు గ్రహించి…. ఆడవాళ్ళకి ప్రేత బాధల నుంచి విముక్తి కలిగించడానికి  ఈ గజ్జల పట్టీలు వేసుకునే ఆచారం పెట్టడం జరిగింది అన్నమాట!  మన వాళ్ళు ఏదీ కూడా… ఏ ఆచారమైనా కూడా కారణం లేకుండా పెట్టలేదు అని తెలుసుకొని ఆచరించండి.  భావితరాలకు చెప్పి వారి చేత ఈ ఆచార వ్యవహారాలు కొనసాగేటట్లుగా చేయండి. 



అపస్మారక స్థితి మాయ


ఇకపోతే నాలుగవ మహామాయ అపస్మారక రాక్షసుడు ఇచ్చే అపస్మారక స్థితి మాయ అన్నమాట! అపస్మారకము అంటే తెలుసుకున్న జ్ఞానము మర్చిపోవడం అవుతుంది.  ఈ మాయ ఒక రకంగా మతిమరుపు లేదా అల్జీమర్ వ్యాధి లాంటిది అన్నమాట!  నేనే జ్ఞాని, నేనే దేవుడిని, నేనే గురువు అని జ్ఞాన మోహ మాయా అహంకారంతో సంచరించే వారికి ఈ మాయా పట్టుకుంటుంది.  అలాగే ఈ క్షేత్ర స్థిరవాసం చేయాలని అనుకునే వారికి అర్హత, యోగ్యత, యోగం ఉన్నదో లేదో తెలుసుకోవటానికి ఈ మాయవారిని ఆవరించి పట్టుకుంటుంది.  నా స్వానుభవాల ప్రకారం చూస్తే …..ఈ క్షేత్రంలో ఉండి సాధన చేసే ప్రతి సాధకుడి  వీపు మీద ఈ రాక్షసుడు కూర్చొని కనపడటం జరుగుతుంది . నన్నే 14 నెలల పాటు నా వీపు మీద కూర్చుని  మోసాను.  కారణం లేకుండా నా భుజాలు చాలా నొప్పులు వచ్చేవి.  ఏదో బియ్యపు మూట మోస్తున్న భావం నాకు కలిగేది. కారణం తెలిసేది కాదు…..కొన్ని నెలలు తర్వాత ధ్యానములో నా వీపు మీద ఒక రాక్షసుడు కూర్చొని ఉన్నట్లుగా గమనించాను.  ఆనాటి నుండి వీడు ఎవడో తెలుసుకోవాలని పరిశోధన చేస్తే, ఇతను అపస్మారక రాక్షసుడు అని…  ఇతని మాయవలన తెలిసిన జ్ఞానం మరిచిపోయేటట్లుగా చేస్తాడని గ్రహించాను.  నా వీపు మీదనే కాదు… ఇలా ఎందరో వీపుల మీద ఇతను ఆవాసం చేయడం చూసి ఆశ్చర్యం చెందాను.  కారణం లేకుండా కార్యము ఉండదు కదా!  అందుకే దక్షిణామూర్తి కాస్త తన పాదము కింద ఈ రాక్షసుడిని తొక్కి పెట్టి ఉంచినట్లుగా మనకి చూపించడం జరుగుతుంది. ఇతను ఉండడం నిజమేనని….. ఇక్కడి అనుభవాలు నిరూపించడంతో….. ఈ మాయను ఎలా దాటుకోవాలో ఆలోచించడం ఆరంభించి…. ఈ అపస్మారక మాయవలన తెలిసిన జ్ఞానమును మనం మర్చిపోతే….. అనగా “నేను” ఎవరో  అని తెలుసుకొని మరిచిపోతే … మళ్ళీ నేను ఎవరు అని తెలుసుకునే పునః ప్రయత్నం కోసం, పునః జన్మ  ఎత్తే పెను ప్రమాదం ఉంటుంది అన్నమాట!  ఈ మాయలో పడితే శూన్యంలో శూన్యం కావాల్సిన వాడు కాస్త శూన్యం అవ్వకుండా ఆదిపరాశక్తి చేతిలో పడి పునః సృష్టికి వెళతాడు అన్నమాట!  అప్పుడు ఈ మాయ నివారణ కోసం నాకు ఏమీ తెలియదు ,నాకు ఏమీ చేతకాదు, నేను లేను, ఉన్నదు నీవే శివ అని నిత్య భావముతో ఉంటే….. మనలో ఉన్న అహంకారమాయ మాయం అయితే కానీ…. అనగా సర్వస్య శరణాగతి భావముతో నిత్యం మనము ఉంటే ఈ రాక్షసమాయ మనల్ని ఆవరించదు.  ఒకవేళ ఆవరించినా ……అది వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. 


 ఒకటి గుర్తుంచుకోండి….. మీ జన్మ మోక్షజన్మ అదే అంతిమ జన్మ కావాలంటే… అరుణాచల క్షేత్రంలో ఆవాసం చేయాలి.  నిత్యం ఈయన నామస్మరణ చెయ్యాలి. గిరిప్రదక్షిణము, దర్శనము చేస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ క్షేత్రాన్ని వదిలి వెళ్ళరాదు.  చచ్చేదాకా ఆఖరి తుదిశ్వాస  వరకు ఈ క్షేత్ర వాసిగా ఉండాలి. ఆయన నామస్మరణే మీ శ్వాసగమనముగా సాగుతూ ఉండాలి. అప్పుడే ఈ రాక్షసమా అయిన అపస్మారక మాయను దాటడం జరుగుతుంది అన్నమాట!  ఎప్పుడైతే మీరు  18 రకాల అహంకార మాయలలో పడతారో….. తద్వారా ఈ రాక్షస అపస్వారక మాయకు బలి అయ్యి,  ఈ క్షేత్రమును వదిలిపెట్టే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇందుకు ఉదాహరణగా కావ్య కంఠగణపతి ముని అని చెప్పవచ్చును.. రమణ స్వామి శిష్యులకి అలాగే ఈయన శిష్యులకి మధ్య కలహాలు, గొడవలు, వాదోపవాదాలు జరిగి ఈ గణపతి మునికి ఎన్నో అవమానాలు జరగటంతో…..ఆయన ఈ క్షేత్రమును వదిలి వెళ్లిపోవడం జరిగింది.  నిజానికి రమణ స్వామికి అలాగే ఈ గణపతి మునికి ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేవు.  కానీ వీళ్ళని గురువులుగా…. దైవాలుగా ఆరాధించే వీరిద్దరి భక్తుల మధ్య గొడవలు రావడంతో…. మనస్పర్ధలు ఏర్పడి గణపతిముని ఈ క్షేత్రం వదిలి వెళ్ళక తప్పలేదు. అంటే ఈయన కాస్త ఈ అపస్మారక రాక్షసమాయకు బలి అయ్యాడని…. నా స్వానుభవ అభిప్రాయము ప్రకారముగా తెలిసింది. మహా తపస్వి, యోగ సామ్రాట్, మంత్రవాది, నిత్యం అబితకుచాంబికా దేవి భౌతిక దర్శనాలు పొందే ఈయన విషయంలోనే ఇలా జరిగింది అంటే….. మరి మనలాంటి వారి విషయంలో జరగకుండా ఉండాలంటే…. మనం ఎంత ఏమరపాటు లేకుండా బహు జాగ్రత్తగా మెలగాలో కదా ! 


కాబట్టి ఈ క్షేత్ర వాసిగా మోక్షజన్మ కావాలని అనుకునే వారికి తప్పనిసరిగా సన్యాస దీక్ష లేదా శివదీక్ష తీసుకోండి. ఈ క్షేత్ర వాసిగా స్థిరపడిపొండి. నిత్య నామస్మరణం వలన…. గిరి ప్రదక్షిణం వలన అరుణాచలేశ్వర శివలింగ దర్శనం వలన…. మీకు ఎలాంటి మాయలు ఆవరించవు.  ఆవరించ లేవు.  ఆవరించినా వదిలిపెడతాయి.  నా స్వానుభవం ప్రకారంగా శివ దీక్ష తీసుకున్నప్పుడు…. నాకు మోహిని మాయ, అపస్మారక మాయ, అహంకారమాయ నా వెంట పడ్డాయి. ఎప్పుడైతే శివ దీక్ష నుండి సన్యాస దీక్షకి వచ్చానో ఆనాటి నుండి అన్ని రకాల మాయలు దాటడం జరిగింది. నేను నిత్యం అరుణాచల శివనామస్మరణ వలన నా వీపు మీద ఉన్న అపస్మారక రాక్షసుడు కూడా నన్ను వదిలిపెట్టి వేరే వారిని పట్టుకునే దృశ్యం దాకా నా సాధనను కొనసాగించాను . ఎప్పుడైతే మనలో మనకి తెలియకుండా అహంకార మాయ ఆవరిస్తుందో….. ఆ క్షణమే మాయలు మన వెంట పడతాయి.  ఎప్పుడైతే మనము సర్వస్య శరణాగతి భావంతో ఉంటామో…. ఆ క్షణమే మనలో అహంకారమాయ పోతుంది. తద్వారా ఈ అపస్మారక రాక్షస మాయ కూడా పోతుంది. 


కీర్తిమాయ :


ఇకపోతే ఐదవ మహామాయ కీర్తిమాయ ఉంటుంది.  ఇది మనం చచ్చిన తరువాత ఈ మాయ వలన మన కీర్తి శరీరం ఇంకా బ్రతికే ఉంటుంది.  ఈ మాయ చాలా పెను ప్రమాదం అని తెలుసుకోండి.  ఎందుకంటే మన భౌతిక స్థూల శరీరం చనిపోయిన కూడా ……ఈ కీర్తి శరీరం బ్రతికే ఉంటుంది.  ఈ మాయలో నూటికి 99 శాతం మంది బలి అవ్వటం…. నా స్వానుభవంలో ఎందరో యోగులని చూశాను. తద్వారా ఒక అడుగు దూరంలోఉన్నా ….మోక్ష ప్రాప్తి పొందకుండా వెనుతిరిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అంతెందుకు ఏమీ వద్దు అని ఇల్లు వదిలిపెట్టి ఈ క్షేత్రానికి వచ్చి గోచి గుడ్డతో సాధన 12 లేదా 14 లేదా 16 లేదా  21 సంవత్సరాల పాటు ఏకాంతముగా ఒంటరిగా గుప్తముగా మౌనంగా సాధన చేసిన తరువాత వీరి దగ్గరికి శిష్య భక్తుల పేరుతో కొంతమంది రావడం జరుగుతుంది. వీరి పొగడ్తల మాయలో పడితే… అంతే సంగతులు అన్నమాట!  మీరు శివుడే, మీరే జ్ఞాని, మీరే దేవుడు, మీరే గురువు, మీరే అది, మీరే ఇది  అంటూ పొగడ్తల మాయలో ఉంచుతారు.  అప్పుడు ఈ సాధకుడు కూడా ఇది నిజమే కదా!  ఇది సత్యమే కదా!  అంటూ తన ఉనికిని లోకానికి తెలియజేయడం ప్రారంభిస్తాడు. ఇతని భక్తి కాస్త ఇతని శిష్య భక్తుల వలన భక్తి వ్యాపారంగా మారుతుంది.  ఇతనికి ఆశయం కాస్త ఆశ్రయమిచ్చే ఆశ్రమముగా మారుతుంది.  ఇతని అభిమతం కాస్త సరికొత్త మత విధివిధానముగా మతముగా  రూపాంతరం చెందుతుంది.  గోచి గుడ్డ కాస్త పట్టు వస్త్రంగా అవుతుంది. నేల మీద కూర్చునే స్థితి నుండి ఆశ్రమ అధిపతిగా సింహాసనం మీద కూర్చునే పరిస్థితి దాక ఎదుగుతుంది.  ఆనాటి నుండి మది సాధన కాస్త మంది సాధన అవుతుంది.  దేవుడి గురించి ఆలోచించేవాడు కాస్త దేవుడి భక్తుల రాక కోసం ఎదురుచూస్తూ…..వారు ఇచ్చే ధనము, స్థలాలు, బంగారపు ఆభరణాలు, చందాల కోసం పడిగాపులు పడే స్థితికి చేరుకుంటుంది. వ్యక్తిగత అనుభవాలు కాస్త వ్యక్తిగత గ్రంథాలుగా మారతాయి.  తద్వారా ఇతని సాధన ఉన్నత స్థితి నుండి సర్వసాధారణ ఉన్న స్థితికి తెలియకుండా చేరిపోతుంది.  ఇదే కీర్తి మాయ. దీని ప్రభావం పడితే ఇలాగే జరుగుతుంది అన్నమాట!  ఇతను చనిపోయిన తరువాత ఇతని దేహ సమాధి కాస్త పూజనీయ స్థలక్షేత్రంగా మారుతుంది. చెట్టు పేరు చెప్పుకొని ఈయన శిష్య భక్తులు కాస్త కాయలు అమ్ముతూ….. భక్తి వ్యాపారము ఒక వ్యాపార సంస్థ అయిన ఆశ్రమ సంస్థానముగా మారుస్తాడు.  ఇలాగే ఈ కీర్తి మాయలో పడి వారి ఆశయాలు కాస్త ఆశ్రమాలుగా పీఠాలుగా, మఠాలుగా మారడం జరిగింది….జరుగుతోంది…..ఏమీ వద్దు అనుకొని అన్ని వదిలేసి వచ్చిన వాడికి సాధన పరిసమాప్తి అయ్యే సమయానికి శిష్య భక్తుల కీర్తిమాయలో పడి ఎవరికో లోబడి….. వారు చెప్పినట్లుగా చేస్తూ అన్నీ కావాలి అని….. భక్తి వ్యాపారం కొనసాగించడం ఎంత విడ్డూరంగా ఉంటుందో మీరే ఆలోచించండి.  మీకే అర్థం అవుతుంది. గుప్త సాధనతో గుప్తయోగిగా మారి….. తన ఉనికి ఎవరికీ తెలియకుండా…. తెలిసినా కూడా ప్రాచుర్యం కానివ్వకుండా….. ఎవరైతే  గుప్తమవుతారో…. వారే ఈ కీర్తి మాయ దాటి కీర్తి శరీరం లేకుండా పూర్ణ శూన్యమునందు శూన్యం అవుతారు.  ఎప్పుడైతే తన మది గురించి కాకుండా లోక కళ్యాణార్థం అంటూ…. మంది గురించి ఆలోచనలు చేస్తారో వారికి కాస్త తెలిసి లేదా తెలియకుండానే కీర్తి శరీర మాయాకి బలి అయ్యి శూన్యము కావలసిన వాడు కాస్త….మోక్షము పొందవలసిన వాడు కాస్త…. ఒక అడుగు దూరంలో ఆగి… వెనుతిరిగి జనాల కోసం, శిక్ష భక్తుల కోసం వెనుతిరిగితే…. ఇక వాడి మోక్షం కూడా వెనుతిరిగి పునః కర్మ జన్మ పొందడం జరుగుతుంది. ఇది నూటికి 99.99 శాతం మంది ఈ కీర్తిమాయలో పడి ఆగిపోవడం మనము గమనించవచ్చును.  ఎవరి ఉనికి అయితే, లోకానికి తెలిసినదో ఇక వాడి సాధన ఈ కీర్తి మాయకి బలి అయ్యి ఆగిపోయినదని గ్రహించండి.  నిజమైన సాధకుడు లేదా యోగి కాస్త తన మది గురించి తప్ప మంది గురించి ఆలోచించడు. ఆలోచించలేడు …..ఎందుకంటే ఇలాంటి వారి దృష్టిలో మంది లేరు…. ఉండరు…. ఉన్నది ఏకత్వమే… శూన్యము అనుకుంటే సర్వము శూన్యము…. లేదంటే శివము అనుకుంటే సర్వం శివమయం అవుతుంది. వీళ్ళకి మంది కనిపించరు.  మది కనిపిస్తుంది.  అన్నింటా ఏకత్వ భావ రూపమే కనపడుతుంది.  ఈ భావాతీత స్థితి దాటనీయకుండా కీర్తి శరీర మాయ అడ్డుగా మారుతుంది అన్నమాట!  ఇలా మది ఏకత్వ స్థితి నుండి మంది భిన్న స్థితికి ఈ మాయలో పడేవారికి ఇస్తుంది.  తద్వారా వీడు కాస్త ఈ మాయలో పడి తనని అనుసరించే శిష్య భక్తులకి కూడా ఈ మాయలో పడేటట్లుగా చేస్తాడు.  ఎందుకంటే వీళ్ళ గురుదేవుడు ఏమాయ దగ్గర ఆగిపోయాడో …..వీరిని ఆరాధించే వాళ్ళు కూడా అమాయ దగ్గర ఆగిపోక తప్పదు కదా!  ఒక గుడ్డివాడు కాస్త పదిమంది గుడ్డివాళ్ళకి దారి చూపిస్తే ఎలా ఉంటుందో….. అలా ఈ కీర్తి మాయలో పడే సాధకుడు లేదా యోగి లేదా గురువు లేదా దేవుడు కూడా ఈ మాయలో పడి ఆగిపోతే…..వీరిని ఆరాధించే, పూజించే వాళ్లంతా కూడా ఇక్కడిదాకా వచ్చి ఆగిపోవాల్సిందే కదా!  వీళ్ళ గురుదేవుడే ఈ మాయను దాటలేక ఆగిపోతే…వీరిని పూజించే వాళ్ళు కూడా ఎలా దాటగలుగుతారో మీరే ఆలోచించండి.  ఒక మర్రిచెట్టు నీడ కింద ఉన్న మొక్కలు ఎదగలేవు కదా!  ఎప్పుడైతే ఈ చెట్టు నీడ దాటి మరొక చోటికి వెళితే మాత్రమే ఈ మొక్కలు ఎదిగే అవకాశం ఉంటుంది.  ఇలా కీర్తి శరీరం మాయలో పడిన గురువులు లేదా యోగులు లేదా దైవాలనుండి మీకు మీరే తెలుసుకొని గురుమాయల నుండి దైవమాయల నుండి యోగ మాయల నుండి దాటి మీ సాధనను వ్యక్తిగతంగా ఒంటరిగా ఏకాంతంగా మౌనంగా కొనసాగించండి.  మంది గురించి ఆలోచించడం మాని వేసి ……మీ మది గురించి ఆలోచన చేయండి.  మర్రిచెట్టు నీడ నుండి మీకు మీరే బయటకు వచ్చి…. కీర్తి ప్రతిష్టలు లేని స్థితికి….. శిష్య భక్తుల ప్రాచుర్యము, ప్రభావము లేని ఏకాంత ఒంటరి మౌనస్థితికి…. మీకు మీరు చేరుకొని…. మరో మర్రిచెట్టుగా  మౌనంగా ఎదగండి.  శూన్యంలో శూన్యం అవ్వండి… ఈ కీర్తి మాయ దాటాలంటే మీరు ఎవరో…. మీ సాధన ఏమిటో….. ఎవరికి కూడా తెలియకుండా…..జాగ్రత్తగా ఉండి…. గుప్త సాధనలో గుప్తయోగిగా లేదా గుప్త యోగినిగా మారి లుప్తమై పూర్ణ శూన్యములో పూర్ణ మోక్షముతో శూన్యం అవ్వండి.


ఇలా ఈ అరుణాచల క్షేత్రంలో అరుణగిరి కాస్త పంచ శిఖరాలతో పంచముఖ శివుడిగా ఈ పంచ మాయలుగా అనగా అహంకార మాయ ,మోహిని మాయ, యక్ష మాయ ,అపస్మారక మాయ, కీర్తి మాయలతో ఉన్నాడని తెలుసుకోండి.  ఈ పంచమాయలకి లోబడే పరమేశ్వరుడు కాస్త ఏకముఖము నుండి పంచముఖ శివుడు అయినాడు.  ఈ పంచమాయల వలన పంచ క్రియలు అనగా సృష్టి, స్థితి, లయ, తిరోగమనం, అనుగ్రహమును అఘోర ముఖముతో…. ఈశాన్య ముఖముతో….. తత్పురుషముఖముతో…. వామదేవ ముఖముతో….. సత్యోజాత ముఖముతో…. ఇలా పంచముఖాలతో చేస్తున్నాడని తెలుసుకోండి… గ్రహించండి…. ఇలా పంచమాయలు దాటితే కానీ, మీ సాధన పరిసమాప్తి అయ్యి… ఏ శూన్యంలో నుంచి మీరు వచ్చారో ……తిరిగి ఆ శూన్యంలో శూన్యం అవుతారు.  ఈ పంచమాయలు మీకు మాయం అయితే కానీ….. మీరు మాయం అవ్వలేదని గ్రహించండి మీ  ఆది రుద్రుడి నుండి ఈనాటి జీవుడి దాకా ఈ పంచమాయలలో ఏదో ఒక మాయకి బలి అవుతూ….. ఒక అడుగు దూరంలో మోక్షం పొందకుండా …..శూన్యంలో శూన్యం అవ్వకుండా…. ఇంకా ఏదో ఉంది.  ఇంకా ఏదో తెలుసుకోవాలని…. ఇంకా ఏదో చేయాలని…. ఇంకా ఏదో చెప్పాలని….ఇంకా ఏదో చూడాలని….ఈ పంచమాయలలో పడి నిర్జీవ శరీరం కాస్త సజీవ శరీరంగా మార్చుకొని మిగిలిపోతున్నారు. మోక్షం పొందకుండా ఆగిపోతున్నారు.  కాబట్టి ఇలా పంచమాయలు మీ సాధనతో దాటి మాయం అవ్వండి.  సాధన సాధ్యతే సర్వం సాధ్యం అని తెలుసుకోండి.  మాయా అని తెలిస్తే మాయ మాయం అవుతుంది అని గ్రహించి….. సాధనను ఆపకుండా మీ శూన్యములో శూన్యం అయ్యేదాకా…. మీ సాధనను కొనసాగిస్తూ, సాధన పరిసమాప్తి చేసుకొని…. మాయలు మాయం చేసుకొని…..మీరు శూన్యములో శూన్యమై మాయం అవ్వండి.. 



 శుభం భూయాత్

పంచదశ అధ్యాయం సమాప్తం 

సర్వం అరుణాచల శివార్పణమస్తు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి