అధ్యాయం 8
అరుణ జ్యోతి దర్శనం
•••••••••••••••••••••••••
కృతయుగంలో స్వయంభుగా ఉద్భవించిన అనంత జ్యోతి కాస్త, జ్యోతి ప్రకాశముగా….స్వయంభు అరుణ జ్యోతిగా రూపాంతరం చెందితే ….ఈ అనంత జ్యోతి యొక్క బడవాగ్ని కాస్త అరుణగిరిగా రూపాంతరం చెందడం జరిగితే…. ఈ బడవాగ్ని యొక్క అగ్నిహోత్రుడిగా జ్ఞానాగ్ని లింగమూర్తిగా…. అరుణాచలేశ్వర లింగమూర్తి రూపాంతరం చెందడం జరిగింది. ఇలా త్రివిధ రూపాలలో ఆనాడు అందరి భౌతిక నేత్రాలకి దైవాలకి, యోగులకి, మహర్షులకి, నిత్య దర్శనాలు ఇచ్చి…. నిత్య బ్రహ్మానందము పొందేవారు. కానీ రాను రాను దైవాలకి అలాగే మానవులకి మధ్య అనగా దైవజాతికి అలాగే మానవజాతికి అనగా మాధవుడికి మరియు మానవుడికి మధ్య ఆధిపత్య అహంకార విభేదాలు రావడంతో….. అనగా ఇది ప్రధమ పునాదిగా దక్షయజ్ఞమే నిలుస్తుంది. తద్వారా దైవజాతికి అలాగే మానవజాతికి విభేదాలు రావడం ఆరంభమైంది. అరుణ జ్యోతి కాస్త మానవ భౌతిక నేత్రాలకి కనిపించకుండా పోయి…. కేవలం సాధన చేసే యోగుల మనోనేత్రానికి మాత్రమే నిత్యం దర్శనమిచ్చే పరిస్థితి పొందటం జరిగింది. స్థానిక అరుణగిరి యోగుల సాధన అనుభవాల ప్రకారం చూస్తే….. ఇప్పటికీ అరుణగిరి మీద నిత్యం ప్రజ్వలించే అరుణ జ్యోతి, స్వయం ప్రకాశముతో వెలుగుతూ….. అలరారుతూ ఉంటుందని చెబుతారు. ఈ జ్యోతి యొక్క దివ్య ప్రకాశమే కాశీ క్షేత్రానికి చేరుతుందని….అందుకే కాశీ అంటే జ్యోతి ప్రకాశం అని చెబుతారని…. వీళ్లు చెప్పటం జరిగింది.
అలాగే కాశీ క్షేత్రంలో మరణం పొందిన జీవుడికి స్వయంగా కాశీ విశ్వనాథుడే మంత్ర గురువై జీవుడి కుడి చెవిలో శివతారక మంత్రమును ఉపదేశం చేస్తే ఆ జీవుడు కాస్త ఆత్మ శరీరానికి…ఈ క్షేత్రంలో ఆత్మ శరీరానికి మోక్షం కలిగి ఆపై ద్వారకా క్షేత్రానికి వెళ్లి తన సంకల్ప శరీరానికి మోక్షం పొంది ఆపై శివతారక మంత్రసాధన కోసం జ్యోతి శరీరంతో అరుణాచల క్షేత్రానికి రావడం జరుగుతుంది అని అందుకే అరుణాచల క్షేత్రంలో శివతారక మంత్రమైన అరుణాచల శివ నామస్మరణ చేస్తే మోక్షం పొందడం జరుగుతుంది అని…. అంతెందుకు ఓం నమశ్శివాయ అను శివ మంత్రమును మూడు కోట్ల సార్లు చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఒక మారు శివతారక మంత్రమైన అరుణాచల శివ అని స్మరణ చేస్తే అంత ఫలితం వస్తుందని సాక్షాత్తు స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది.
ఆ తర్వాత కృతయుగం తర్వాత నుండి అనగా త్రేతా యుగానికి వచ్చేసరికి….. స్వయంభు అరుణ జ్యోతి దర్శనం కాస్త మనోనేత్రమునకు మాత్రమే దర్శనం ఇవ్వడంతో…..ఈ క్షేత్ర రాజులు కాస్త ఒక పెద్ద మట్టి ప్రమిదలతో తమిళ కార్తీక మాసంలో వచ్చే కృతిక నక్షత్ర సమయంలో కొండమీద ప్రమిద దీపారాధన చేయటం ఆనవాయితీ ఆచారం అయ్యింది. స్వయంభు అరుణ జ్యోతి కాస్త మానవ నిర్మిత ప్రమిద జ్యోతిగా దర్శనమయింది. స్కాంద పురాణంలో కార్తీకమాస కృతికా నక్షత్ర సమయములో దీపం వెలిగిస్తే….వచ్చే పుణ్యఫలం ఏమిటో చెప్పడం జరిగింది. ఇలాంటి పర్వదినమున పార్వతీ పరమేశ్వరులు కాస్త కొండ అగ్రభాగమున ఉండి మాట్లాడుకుంటారు. వీరికి దగ్గరలో ప్రమిద దీపం వెలుగుతోంది. అది కూడా ఆవు నెయ్యితో వెలుగుతోంది. ఈ నెయ్యిని ఆహారంగా తీసుకోవాలని ఒక ఎలుక భావించి ఈ ప్రమిద దగ్గరికి రావడం జరిగింది. ఈ సమయములో దీపము కాస్త ఆరిపోవటానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఈ ఎలుక కాస్త నెయ్యి కోసం మూతిని పెట్టగానే…. ఒక ఒత్తి కాస్త పైకి కొంచెం జరిగింది. దానితో ఆరిపోయే దీపం కాస్త మరింత కాంతివంతంగా వెలగడం గమనించిన పరమేశ్వరుడు కాస్త…. ఇదంతా ఒక ఎలుక చేసింది అని గ్రహించి….దానికి మరుజన్మలో ఉత్తమ రాజుగా జన్మ ఎత్తమని వరం ఇవ్వటం జరిగింది. కాబట్టి తెలిసో తెలియకో ఎలుక చేసిన పనికి అంత పెద్ద మొత్తంలో ఫలితం వచ్చింది అంటే…..తెలిసి చేస్తే దాని ఫలితము అనంతమని తెలుస్తోంది కదా!. ఇందుకే ఆనాటి త్రేతాయుగం నుండి ఈనాటి కలి యుగము దాకా స్వయంభు అనంత జ్యోతిగా…..జ్యోతికి ప్రతీకగా మానవ నిర్మిత అరుణ జ్యోతి వెలిగించడం ఆనవాయితీగా…. ఆచారముగా… పెట్టుకోవడం జరిగింది అన్న మాట!
కలియుగంలో….ఈ ఆధునిక ప్రస్తుతకాలంలో అరుణ జ్యోతి వెలిగించడం….ఈ అరుణాచల క్షేత్రంలో తమిళ కార్తీక మాసంలో 16 రోజుల పాటు కార్తీక దీపోత్సవము బ్రహ్మోత్సవం చేస్తారు. అరుణాచలేశ్వర ఆలయంలోని ఉత్సవమూర్తులను గుడి ఆవరణలో ఉన్న దీపోత్సవ మండపము నందు ఉంచి పూజలు చేస్తారు. ప్రతిరోజు ఉత్సవ మూర్తులను ఆ రోజుకు తగ్గ వాహనం మీద ఎక్కించి మాడవీధులలో ఊరేగింపు చేస్తారు. ఐదవ రోజు మాత్రం వెండినంది మీద శివశక్తి మూర్తులను ఎక్కించి…. మాడవీధులలో ఊరేగింపుకి తీసుకొని వస్తుంటే…. అలా కైలాసంలో నంది సమేత శివశక్తి కాస్త ఇల కైలాసమైన భూలోక అరుణాచల క్షేత్రం నందు సంచారం చేస్తున్నారా? అని భావం కలుగక తప్పదు…. ఇంతటి ముగ్దమనోహర దృశ్యం చూడటానికి….. మానవ నేత్రాలు సరిపోవు. వర్ణించడానికి నాలుక సరిపోదు…. రాసి చూపించటానికి చెయ్యి సరిపోదు….. ఏమని వర్ణించగలము…. ఏమని చెప్పగలము…. చూడటమే తప్ప ఏమీ చేయలేము, మాటలకి అందని ఆనందాన్ని పరాకాష్ట అయిన పరమానందానికి లోనై అద్వితీయమైన తన్మయత్వ స్థితి పొందడం జరుగుతుంది. ఈ రోజున కార్తీకదీపం ఎందుకు వెలిగిస్తారు అంటే….. స్కాంద పురాణం ప్రకారం చూస్తే కార్తీక మాస కృత్రికా నక్షత్రము నాడే త్రిమూర్తులు కాస్త అనగా పరమేశ్వరుడు, విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు కాస్త తేజో అగ్నిస్తంభముగా అనగా జ్యోతిర్లింగ లింగోద్భవ మూర్తిగా దర్శనమిచ్చినారని పురాణ ఉవాచ . అందుకే ఈరోజున కార్తీకదీపం అరుణగిరి మీద అరుణ జ్యోతి వెలిగించడం ఆనవాయితీ అయ్యింది. ఈరోజు ఉదయం భరణి నక్షత్రం సమయంలో అరుణాచలేశ్వర దేవాలయంలో 5 దీపాలను భరణి దీపంగా వెలిగిస్తారు. ఈ దీపాలను అరుణేశ్వర స్వామి సన్నిధిలో ఉంచుతారు. ఆ తర్వాత భరద్వాజ మహర్షి వంశానికి సంబంధించిన జాలర్లని పిలిచి…. వారిని ఆలయ అధికారులు సత్కరించి…. అరుణగిరి మీద మహాదీపం వెలిగించడానికి ఉపయోగించే పది అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పున ప్రమిద దీపమును…. అలాగే 360 మీటర్ల బట్టతో చేసిన వత్తి మరియు 3600 కేజీల ఆవు నెయ్యి డబ్బాలను ఇలా….. మొదలగు సామాగ్రిని ఇచ్చి వీళ్ళని కొండపైకి పంపుతారు.
ఇలా వీళ్లు సుమారుగా 2000 మంది కలిసి ఉదయం కొండెక్కి సాయంత్రం నాలుగు గంటలకల్లా కొండ అగ్రభాగమునకు చేరుకోవడం జరుగుతుంది. ఆ తరువాత ఈ మహా దీపం వెలిగించడానికి కావలసిన ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రపు వేళ ప్రదోషవేళ సమయం దగ్గర పడుతూ ఉండగా…. ఆలయంలో కూడా పంచమూర్తులు అలాగే పంచ దీపాలను ఆలయ ధ్వజస్తంభం దగ్గర ఉంచుతారు. సరిగ్గా ప్రదోష సమయం అవుతున్న …సాయంత్రం 6:00 అవుతూ ఉండగా….అర్ధనారీశ్వర మూర్తిని ఆలయం నుండి మహా దీపం కనిపించే జ్యోతి మండపం దగ్గరికి తీసుకొని రావటం…… ఈయన సమక్షంలో, ఈయన ముందు అఖండ దీపం వెలిగించటం…. ఇది చూసిన ఆలయ భక్తులు కాస్త టపాసులు వెలిగించడంతో….. కొండ కింద జరిగే పూజా తంతు పూర్తి అఖండ దీపం వెలిగించారని…. కొండమీద ఉన్న జాలర భక్తులకి అర్థమై….. సరిగ్గా ఆరు గంటలకి కొండపై భాగంలో మహా ద్వీపమును వెలిగించడం చేస్తారు. ఏకకాలంలో…. అర్ధనారీశ్వర మూర్తి సమక్షంలో… కొండ దిగువలో…. అఖండ జ్యోతి వెలిగిస్తే, ఇదే సమయానికి కొండ ఎగువలో అరుణ జ్యోతి వెలిగించడం జరుగుతుంది. ఏకకాలంలో ఈ దివ్యజ్యోతుల దర్శనం ప్రత్యక్షంగా ఎన్నో లక్షలాది మంది భక్తులు చూస్తూ తన్మయత్వ స్థితులు పొందుతారు. అదే విధంగా కొండ అగ్రభాగంలో వెలిగించే అరుణ జ్యోతి కాస్త దాదాపుగా 30 కిలోమీటర్ల దూరం ప్రాంతాల్లో ఉండే భక్తులకి అగుపించి….తన్వయత్వం పొందడం జరిగింది. ఈ జ్యోతి దర్శనం కోసం ఆరోజు ఈ క్షేత్రానికి దాదాపుగా 50 నుంచి 80 లక్షల భక్తులు….. ఇసుకవేస్తే రాలనంతగా ఈ గిరి చుట్టూ గిరి ప్రదక్షిణం చేస్తూ…. మానవ శరీర పువ్వులుగా ఒక మానవ మాలగా మారి అరుణాచలేశ్వరుడి కంఠ హారముగా మారినదా? అన్నట్లుగా కనపడుతుంది. హర ఓం….. అని శివశక్తి నామస్మరణతో ఈ క్షేత్రం ఆరోజు దద్దరిల్లిపోతుంది. అఖండ భక్తి ముందు అఖండ జ్యోతి అలాగే అరుణ జ్యోతి కాస్త అఖండముగా 11 రోజులపాటు వెలుగుతూనే ఉంటుంది. ఇలా ప్రతిరోజు సాయంత్రం వేళ ఆ కొండమీద ఉన్న అరుణ జ్యోతి కాస్త ప్రమిద జ్యోతిగా కనపడుతూ అలరించి అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ జ్యోతి వెలిగించిన తెల్లవారుజామున స్వామివారి మూర్తులకు అయ్యంగారి కొలను యందు తెప్పోత్సవం చేస్తారు. ఇది చూడటానికి కనువిందు చేస్తుంది. 12వ రోజు నుంచి 16వ రోజు దాకా రోజుకొక మూర్తి చొప్పున గిరిప్రదక్షిణం చేయటం జరుగుతుంది. లేదంటే 12వ రోజున పంచమూర్తులు కాస్త ఉదయకాలపు గిరిప్రదక్షిణం చేస్తారు .
ఇలాంటి మహత్తరమైన అరుణ జ్యోతిని వెలిగించే సమయానికి ప్రతి భక్తుడు కూడా మూడు పనులు తప్పకుండా చేయాలి… అదేమిటంటే ఎవరికి వారే వారి ఇంటి యందు లేదా గుడియందు లేదా అరుణ క్షేత్రంలో ఉంటే ఎక్కడ వీలుంటే అక్కడ తప్పనిసరిగా ఆవు నెయ్యితో 365 ఒత్తులు ఉన్న దీపం వెలిగించాలి. అలాగే క్షేత్రంలో ఉండే కొండ పరిసర ప్రాంతానికి వెళ్లి అరుణ జ్యోతి దర్శనం తప్పక చేసుకోవాలి. లేని వాళ్ళు అయితే మీడియా మాధ్యమాలలో ప్రత్యక్ష దర్శనమైనా చేసుకోవాలి.. అలాగే ఆరోజు రాత్రి తప్పకుండా గిరి ప్రదక్షిణం చేయాలి. ఇది వీలు లేని వాళ్ళు అర్థరాత్రి 12 గంటల దాకా అరుణాచల శివనామస్మరణ తమ ఇంటి వద్ద ఉండి చేసుకోవాలి. ఇలా మూడు పనులు చేయడం వలన…. ఈ రోజున దీపారాధన చేయడం వలన….. 21 తరాలు పాటు తెలిసో తెలియకో చేసిన పాపాలు పోతాయి. అదేవిధంగా అరుణ జ్యోతి దర్శనం చేసుకుంటే….వేల జన్మల పరంపర తగ్గిపోతుంది. అదే ఈరోజు గిరిప్రదక్షిణం చేస్తే నూరు అశ్వమేధ యాగాలు చేస్తే వచ్చే ఫలితం వస్తుందని…..స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. పిండి కొద్ది రొట్టె అన్నమాట!
యద్భావం తద్భవతి.
ఈ అరుణ జ్యోతిని అర్ధనారీశ్వర మూర్తి సమక్షంలో వెలిగించడానికి దాని వెనుక ఒక పరమార్ధం ఉంది. అదేమిటంటే జ్యోతి నుండే సృష్టి జరుగుతుంది. అలాగే వినాశనం కూడా జరుగుతుందని అందరికీ తెలుసు కదా! ఎందుకంటే తొలిగా వచ్చిన అనంత జ్యోతి నుండి ఈ విశ్వసృష్టి ఆరంభమయ్యింది…. అలాగే అంతిమముగా వచ్చిన అరుణ జ్యోతి నుండే ఈ విశ్వ సృష్టి అంతమవుతుంది… అదేవిధంగా అర్ధనారీశ్వర తత్వంలో అమ్మదయ వలన సృష్టి జరుగుతూ ఉంటే…. అయ్య అనుగ్రహం వలన సృష్టి వినాశనం జరుగుతుంది. అనగా ఒకే మూర్తిలో జనన మరణాలు జరుగుతున్నాయని… ఈ అర్ధనారీశ్వర తత్వ అంతరార్థం ఇదే అన్నమాట! అందుకే అరుణ జ్యోతి ఈ అర్ధనారీశ్వర తత్వమూర్తి సమక్షంలో వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది.
ఎవరికి తెలియని రహస్యం ఏమిటంటే ప్రతి శివరాత్రికి అర్ధరాత్రి సమయమున అనగా లింగోద్భవ సమయంలో…. మనకి అరుణగిరి అగ్రభాగం మీద స్వయంభుగా కొన్ని క్షణాల పాటు శివజ్యోతి దర్శనం ఇస్తుంది. ఈ దర్శనం కోసం చాలామంది యోగులు, సాధువులు, సన్యాసులు కాస్త రాత్రి 11:30 నుండి ఎదురుచూస్తూ గిరి అగ్రభాగమును స్పష్టంగా కనిపించే ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది. సరిగా అర్ధరాత్రి 12 గంటల నుండి 12:48 స్వయంభుగా జ్యోతి దర్శనం తప్పకుండా అవుతుంది. నాకైతే ఈ శివ జ్యోతి దర్శనం ఆది అన్నామలై గుడి బయట నుండి కనిపించే….. గిరి అగ్రభాగమునందు ఒక శివరాత్రి నాడు ఇలా శివ జ్యోతి దర్శనం చూడటం జరిగింది. కాకపోతే ఈ దర్శనానికి వాతావరణం అనుకూలించాలి. ఇదే సమయానికి మేఘాలు అడ్డుగా వచ్చి….. ఈ దర్శనం మనకి అవ్వదు. అదృష్టం ఉంటే తప్ప ఆయన ఈ జ్యోతి రూపంలో మనల్ని చూడాలి అనుకుంటే తప్ప…. మనకి ఈ జ్యోతి దర్శనం అవ్వదు. అవ్వలేదు… ఎవరికైతే ఈ శివ జ్యోతి దర్శనం అయ్యిందో…. వారు శివ భక్తులు లేదా శివయోగులు లేదా శివ గురువులు అవ్వక తప్పదు. ఇది అక్షర సత్యం అని ఇక్కడి స్థానిక అరుణగిరి భక్తులు కాస్త అరుణగిరి యోగులుగా మారడం…. నా స్వానుభవంలో చాలామందిని చూడటం జరిగింది. ఈ జ్యోతి దర్శనం అనంతరం వీరి సాధనాస్థాయి కాస్త ఉన్నత స్థితి… అనగా శివోహం స్థితి పొందటం అనగా …..ఉంది శివుడే… నేను లేను, జీవుడు కాస్త శివుడయ్యాడు అనే అనుభవ అనుభూతి పొందడం జరుగుతుంది. ఎందుకంటే శివుడిని శివుడే చూస్తాడు కదా! ఆ శివజ్యోతిని ఈ జీవ జ్యోతి చూసి…. ఉంది జీవుడు కాదు శివుడే అని అనుభవ అనుభూతి పొందటం జరుగుతుంది. సర్వం శివమయం అవుతుంది. శివుడు కానిది లేదు…. శివుడు లేనిది లేదు….అనే అనుభూతిలోనికి వెళ్లడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా శివరాత్రి నాడు ఈ క్షేత్రానికి వచ్చి గిరిప్రదక్షిణం చేస్తూ లింగోద్భవ కాల సమయం అనగా 11:30 నుండి 12:48 నిమిషాల దాకా శిఖర అగ్ర భాగం చాలా స్పష్టంగా కనిపించే ప్రాంతంలో …..ప్రదక్షిణం ఆపి, అరుణాచల శివనామస్మరణ చేస్తూ ఉండండి… చూస్తూ ఉండండి… ఈ సమయంలో ఎప్పుడైనా కొన్ని క్షణాల పాటు స్వయంభుగా శివ జ్యోతి దర్శనం ఇస్తుంది. అది కూడా వాతావరణం అనుకూలించాలి….అలాగే మీకు యోగం ఉండాలి. ఈ రెండు లేకపోతే ఈ స్వయంభూ శివ జ్యోతి దర్శనం అవ్వడం దుర్లభమే అవుతుంది. ఈ శివ జ్యోతి దర్శనం అనేది ఇక్కడ స్థానిక శివయోగులకు చాలా గోప్యంగా రహస్యంగా ఉంచడం జరిగింది. ఈ విషయం నాకు తెలిసి నిజమా అవునా కాదా అని మూడు శివరాత్రులు వీక్షిస్తే ఒక శివరాత్రి నాడు శివ జ్యోతి దర్శనం అయ్యింది. ఆనాటి నుండి నా శివ భక్తి కాస్త శివోహం స్థితి పొందింది. ఇది నా స్వానుభవంలో యదార్థ సంఘటనగా జరగటంతో…. దీనిని రాస్తున్నాను. ఇది సత్యం అని నమ్మితే బాగుపడతారు…. లేదంటే బాధపడతారు.
అంతెందుకు….. కామాక్షి అనుగ్రహంతో జన్మించి , అరుణాచల యోగి అయిన శేషాద్రి స్వామి వారు కూడా…. తను జీవ సమాధి చెందిన తరువాత అరుణగిరి పాద భాగమునందు అరుణ జ్యోతిగా మారి…..ఇప్పటికీ ధ్యానమునందు, అలాగే స్వప్నమునందు ఎందరికో దర్శనమిస్తున్నారు. ఇది నిజమా కాదా? అని నేను కాస్త ఈయన ఆశ్రమానికి వెళ్లి…. అక్కడ ఉన్న మేధా దక్షిణామూర్తి విగ్రహం వద్ద కూర్చొని ధ్యాన నిష్టలో మూడు నెలల పాటు ఉంటే….. అప్పుడు నాకు ధ్యానమునందు ఒకసారి ఈ అరుణగిరి పాదభాగంలో జ్యోతి శరీరంతో ఈయన కాస్త అరుణ జ్యోతి స్వరూపంగా ఉన్నట్లుగా కనిపించేసరికి….ఈయన అంతిమరూపం అరుణ జ్యోతి అని రూఢీ అయింది. కాబట్టి మన సాధన స్థితి గతిని బట్టి అరుణాచల శివ అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మనకి 12 దేహాలలో దేహ మోక్ష ప్రాప్తి కలుగుతుంది అన్నమాట! అనగా స్థూల, సూక్ష్మ, కారణ, వాయు, ఆకాశ, ఆత్మ, సంకల్ప, జ్యోతి, మనో, పిండ, లింగదేహ, కీర్తి శరీరాలు శరీరాలకి…. ఇలా 12 దేహాలకి… మోక్ష ప్రాప్తి మన సాధనతో పొందాల్సి ఉంటుంది. ఇందులో స్థూల శరీరం నుంచి సంకల్ప శరీరం దాకా మనకి సప్తమోక్షపురాలలో మోక్ష ప్రాప్తి కలిగితే….. మిగిలిన ఐదు శరీరాలు అయిన జ్యోతి, మనో, పిండ, లింగదేహ, కీర్తి శరీరాలు మోక్ష ప్రాప్తి…. మన పంచముఖమైన, అరుణగిరి పర్వత లింగ దారి అయిన, పంచముఖ శివుడు అయిన, అరుణాచల శివ అనుగ్రహం బట్టి….. ఈ పంచదేహాల మోక్ష ప్రాప్తి ఉంటుందని గ్రహించండి. ఇలా మన శేషాద్రి స్వామి వారు కాస్త ఈ క్షేత్రం నందు జ్యోతిశరీర మోక్ష ప్రాప్తి పొంది…. అరుణ జ్యోతిగా….. ఈ గిరి పాద భాగము నందు ఆవాసం చేస్తూ….. మిగిలిన దేహాల మోక్ష ప్రాప్తి కోసం మనో శరీరంతో ధ్యాన తపస్సు చేస్తున్నారని…. ధ్యాన యోగుల స్వానుభవాలు చెబుతున్నాయి.
ఇకపోతే మీరు ఎప్పుడైనా…అరుణాచల క్షేత్రానికి తమిళ కార్తీక మాసం అనగా డిసెంబర్ నెలలో వెళితే 1. అరుణ జ్యోతి దర్శనం…. 2. అలాగే 365 ఒత్తుల దీపారాధన…. మరియు 3. ఆరోజు గిరిప్రదక్షిణం తప్పకుండా... ఈ మూడు పనులు చేసి అపారమైన పుణ్యఫలం పొంది…. మీ వంశ 21 తరాల వారిని ఉద్ధరింప చేసి…. అధోగతి ఉన్న వీళ్ళని ఉత్తమ గతుల ప్రాప్తిని కలిగించండి… మీరు తరించండి… మీ వాళ్ళని తరింప చేయండి.
అష్టమ అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం అరుణాచల శివార్పణమస్తు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి