అధ్యాయం - 38

 అధ్యాయం - 38

అమ్మవారి అరుణాచల ఆగమనం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~




కైలాసము నుండి పార్వతీదేవి కాస్త ఐదు సంవత్సరాల వయసున్న బాలాదేవిగా రూపాంతరం చెంది…. భూలోకంలో ఉన్న కాత్యాయన మహర్షి ఆశ్రమానికి చేరుకుంటుంది. అక్కడ ఈ మహర్షి కాస్త తీవ్రమైన ధ్యానతపస్సులో ఉండగా.. బాలాదేవి కాస్త ఈయన తొడ మీదకి చేరి ఆటలు ఆడతూ ఉండేసరికి…. ఈ మహర్షికి ధ్యాన భంగమై కళ్ళు తెరిచి చూస్తే…. తన ఒడిలో ఉన్న బాలాదేవిని చూస్తూ…. ఓ..!  శివుడి వర ప్రభావం చేత ఆదిపరాశక్తియే బాలా త్రిపుర సుందరి అంశగా ఈ భూలోకంలో నాకోసం అవతరించి… తన ధ్యాన  తపస్సుతో పరమేశ్వరుని చెంతకి చేరుతుందని గ్రహించి…. ఆనందభరితుడై… బాలను కాస్త కాత్యాయనిగా అల్లారముద్దుగా పెంచుకోసాగాడు. ఈమె  కాస్త యుక్త వయసుకి రావడం జరిగింది.  ఈమెకి భర్త శివుడు మాత్రమే అవుతాడని గ్రహించి…..శివకంచిలో ఉన్న ఏకాంబరేశ్వరుని ఆరాధించి…. ఆయన అనుగ్రహం పొంది భర్తగా పొందమని చెప్పగా…. అప్పుడు అమ్మవారైనా కాత్యాయనీ కాస్త నాయనా!  నేను ఇంతవరకు ఏ క్షేత్రం చూడలేదు.  నువ్వు చెప్పే శివకంచి క్షేత్రానికి నేను చేరుకున్నానని నాకు ఎలా తెలుస్తుంది?  అనగానే…


అమ్మాయి! కాత్యాయని!  ఈ విషయంలో ఎలాంటి దిగులు, భయము లేదు.  నేను నీకు కొన్ని దైవిక వస్తువులు అనగా….. పులి చర్మం, పూర్ణకుంభం, సింహాసనం, గంగ, ఇసుక, రుద్రాక్ష మాల ,పరిచారికలు, శివలింగం, నాగ పడగ, విసనకర్ర, యోగదండం, రామచిలుకని ఇస్తాను.  ఇవి ఏ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి…. ఈ దైవిక వస్తువులు కాస్త దేవతావృక్షాలుగా మారతాయో….. ఆ ప్రాంతమునందే శివుడిని నీ భర్తగా పొందుతావు అని చెప్పి….ఈ వస్తువులతో పాటుగా పరిచారికలు దుర్గను, కాళికను పంపించడం జరుగుతుంది. ఆనాటి నుండి తన భర్తను కామముతో అనగా కోరిక కళ్ళతో వెతకడం వలన….. అమ్మ కాస్త కాత్యాయనీ నామము లోంచి కామాక్షిగా ప్రసిద్ధి చెందింది. 


ఇలా అమ్మవారు కాస్త కాశీ క్షేత్రానికి చేరుకొని అక్కడున్న కాశీనాధుడు శివలింగ ఆరాధన చేసి విశాలాక్షి నామమును పొంది…..ఆపై తొండముండా క్షేత్రానికి చేరుకొని…. అక్కడ ఉన్న శివలింగ మూర్తిని ఆరాధన చేసి… ఈయన అనుగ్రహం పొంది…. తన పరిచారికలతో అలాగే కాత్యాయని మహర్షి ఇచ్చిన దైవీక వస్తువులను తీసుకుని శివకంచి క్షేత్ర పరిసరాలకు రాగానే…. ఈ దైవీక వస్తువులు కాస్త దేవతా వృక్షాలుగా మారేసరికి…. తన భర్త శివుడు ఆవాస క్షేత్రానికి వచ్చానని… కామాక్షి దేవి గ్రహించి….అమిత ఆనంద భరితురాలై ఇసుకతో ఒక శివలింగమూర్తిని తయారు చేసుకుని….. దానికి నిత్యం అభిషేకం చేస్తూ… ఆ ప్రాంతంలో ఉన్న చూత చెట్టు అనగా నాలుగు రకాల రుచుల పళ్ళను ఇచ్చే మామిడి చెట్టు కింద ధ్యాన తపస్సు చేసుకోవడం…. ఈమె దినచర్యగా మారిపోయింది. 


ఈ శివకంచిలోని శివమూర్తి అయిన ఏకాంబరేశ్వరుడు కాస్త…. ఈమె భక్తిని  పరీక్షించ తలచి…. పక్కనే ప్రవహించే కంపానదికి వరదలు తెప్పించగా…. ఈ వరదల ధాటికి తను చేసిన మట్టి లింగం ఎక్కడ కొట్టుకొని పోతుందోనని అనుమాన భయంతో అమ్మవారు కాస్త తన మునివేళ్లతో ఈ శివలింగమూర్తిని పట్టుకొని…… తన పరిచారిక అయిన కాళికను పిలిచి….. వరద ప్రవాహం కాస్త మట్టి శివలింగం మూర్తి దగ్గరికి రాకుండా తన చేతులతో ఆపమని ఆజ్ఞ ఇవ్వగానే…. కాళికా కాస్త తన పది చేతులతో ఈ వరద ప్రవాహమును ఆపినప్పటికీ…. ఆగకపోయేసరికి, కామాక్షి కాస్త విష్ణుమూర్తి అయిన…. ఈ క్షేత్ర వరదరాజ స్వామిని ప్రార్థించగా ఆయన వచ్చి తన సుదర్శన చక్ర ఆయుధంతో…. ఈ వరద ప్రవాహమును ఆపడంతో ……అప్పటిదాకా ఈ మట్టి శివలింగం గట్టిగా కౌగిలించుకొని ఉన్న కామాక్షి కాస్త వరద ప్రవాహం తగ్గడంతో నెమ్మదించి శాంతించగానే….. ఈ శివలింగమూర్తి నుండి శివుడు ప్రత్యక్షమై దేవి!  నీ భక్తికి సంతోషించాను.  నా భక్తి పరీక్ష మాయలో జయం పొందావు.  ఇక నీకు ఏమి వరం కావాలో కోరుకో …..అనగానే స్వామి!  అంతా నీ అనుగ్రహం వలన జరిగింది. ఇక మీ ఎడబాటు నేను సహించలేను.  నా యందు దయవుంచి మీ శరీరమునందు అర్థభాగం నాకు వరంగా అనుగ్రహించు… తద్వారా నాకు శాశ్వత ఎడబాటు నుండి విముక్తి  కలిగించు అనగానే….. 


దేవి ! ఈ కంచి క్షేత్రం నందు నువ్వు చేసిన ధ్యాన తపస్సు  ఫలితంగా ఆనాడు కైలాసంలో నువ్వు చేసిన అపరాధం అనగా నా కళ్ళు మూయడం అనే దోష నివారణ పూర్తి అయింది.  ఇకపోతే నా అర్ధనారీ తత్వం నువ్వు పొందాలంటే …..నా క్షేత్రమైన అరుణాచల క్షేత్రానికి చేరుకొని అక్కడ ధ్యాన తపస్సు చేస్తే నా అనుగ్రహం వలన…. ఈ క్షేత్రం నందు…. నా శరీరమునందు అర్థ శరీరమును పొంది ….అర్ధనారీశ్వర తత్వమును పొందుతావు అనగానే …..స్వామి!  ఇది ఏమిటి కొత్తగా..!  ఇప్పటిదాకా భూమండలంలో ఉన్నతమైన క్షేత్రముగా మహా కాశీ క్షేత్రమని నాకు చెప్పి అక్కడికి పంపించారు.  ఆ తర్వాత ఈ క్షేత్రానికన్నా మహోన్నతమైన క్షేత్రముగా కంచి క్షేత్రం అని చెప్పి ఇక్కడికి పంపించారు.  ఇప్పుడేమో ఏదో అరుణాచల క్షేత్రం అని మరొక క్షేత్రమునకు పంపిస్తున్నారు.  ఇంతటితో ఆగుతుందా!  తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఏదైనా మరో క్షేత్రానికి నన్ను పంపిస్తారా!  అనగానే…..


దేవి శంఖవాణి!  అనుమానము ముందు పుట్టి ఆ తర్వాత ఆడది పుట్టింది అని లోకోత్తర నానుడి మళ్లీ మరొకసారి నిజం చేశావు.  నీ అనుమానాలు తీరుస్తాను.  నేను పడుకుని ఉంటే….. నా పాద భాగంలో కాశి క్షేత్రంగా మద్య నాభియందు కంచి క్షేత్రంగా అదే శిరోభాగముగా నా హృదయ భాగమైన అరుణాచల క్షేత్రం వస్తుంది. అన్ని క్షేత్రాలలో “నేను” గా ఉంటే….. అంతిమయాత్ర క్షేత్రమైన అరుణాచల క్షేత్రము నేనై ఉన్నాను.  ఈ క్షేత్రమును  మించిన క్షేత్రం కానీ….. అలాగే ఈ క్షేత్ర దేవాదిదేవుడైన అరుణాచలేశ్వరుకి మించిన దైవము గాని….. ఈ క్షేత్ర నామస్మరణ స్మరణ అయిన అరుణాచల శివ  మించిన మంత్రము గాని….ఈ విశ్వ జగత్తు నందు మరొకటి లేదని….. సాటి రాదని ఈపాటికైనా గ్రహించు …..అనగానే 


స్వామి!  నా యందు దయవుంచి శాంతమూర్తివై నా అనుమానాలు తీర్చావు. ఇప్పుడు ఈ కంచి క్షేత్రానికి రావడానికి….. కాత్యాయనీ మహర్షి సహాయ సహకారాలు అందించాడు కదా!  మరి నాకు అరుణాచల క్షేత్రంలో సహాయం చేయడానికి…. అక్కడ ఎవరు ఉంటారు! అనగానే …..ఈ విషయంలో భయం, దిగులు చెందకు.  నీకు ఈ అరుణాచల క్షేత్రం నందు నా అంశ రూపమైన నా కుమారుడైన గౌతమ మహర్షి ఆవాసం చేస్తున్నాడు.  ఈయన నీకు ధ్యాన తపస్సుకి కావలసిన ఏర్పాట్లు సహాయ సహకారాలు అందిస్తాడు. పైగా ఈ క్షేత్రమునందు ఉన్న అనేక ఆశ్రమాలలో గౌతమ మహర్షి ఆశ్రమం గుర్తించాలంటే పరస్పర విరుద్ధ స్వభావముగా ఉన్న జంతువులు కలిసిపోయి…. అన్యోన్యంగా అనురాగంగా ఏ ఆశ్రమానికి సేవలు చేస్తూ కనిపిస్తాయో…. అదే ప్రేమకి ప్రతిరూపమైన గౌతమ మహర్షి ఆశ్రమముగా గుర్తించు…. అనగానే ధన్యోస్సి స్వామి అనగానే…పరమేశ్వరుడు కాస్త అంతర్దానం అయ్యేసరికి…. పార్వతీదేవి తన చెలికత్తెలను తీసుకొని…. అరుణాచల క్షేత్రం వైపుకు బయలుదేరడం జరిగింది.


అప్పుడు ఈమెకి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన దేవతలను, మహర్షులను, మునులను చూస్తూ….. మీరందరూ ఈ క్షేత్ర వాసం చేస్తూ  నియమాలను శ్రద్ధా భక్తితో పాటిస్తూ….. శివానుగ్రహం  నాకు లాగా పొందండి.  ఈ మట్టి లింగం నందు నా కుచములు నా చేతికి కంకణము నొక్కులు పడి ఉండడం చేత…. దీనికి అభిషేకాలు పాలతో, నీటితో కాకుండా సుగంధ నూనెతో చేయండి.  అలాగే నేను పూజించిన ఈ సైకత లింగమును దర్శనం చేతనే మానవుల సమస్త కోరికలు తీర్చడానికి కామాక్షి రూపంతో నా అంశా రూపముగా ఇక్కడ దేవి కంచి క్షేత్రంలో  ఆవాసం చేస్తాను.  నేను కాస్త శివ ఆజ్ఞ మేర అరుణాచల క్షేత్రానికి వెళ్లి…. ధ్యాన తపస్సు చేసి తిరిగి ఆయన అనుగ్రహం పొందిన పిమ్మట మీరు అందరూ అక్కడికి వచ్చి…. నన్ను దర్శించుకోండి.  అప్పటిదాకా ఈ కంచీ క్షేత్రంలో ఆవాసం చేస్తూ ఉండండి అని చెప్పి…. తన చెలికత్తెలతో…. పరిచారికలతో కామాక్షి కాస్త కంచి క్షేత్రం వదిలి అరుణాచల క్షేత్రానికి బయలుదేరింది. 


ఇలా వీరంతా కూడా ఎన్నో అరణ్యాలు, నదులు సరస్సులు, కొండలు, నగరాలు దాటుకుంటూ సహ్య పర్వత పాద సమీపంలోని ద్రవిడ దేశంలోని శక్తి నదిని దాటుతూ ఉండగా…. వీరందరికీ   ఎరుపు రంగు శిలలతో ఉండి…. 8 పర్వత శిఖరాల మధ్య పర్వతలింగ రూపముగా దర్శనమిస్తూ…. ఉండేసరికి …..కామాక్షి దేవి కాస్త తన చెలికత్తెలలో ఒకరైన విజయను ఉద్దేశిస్తూ…. విజయ! చూశావా..!  ఇక్కడ 8 పర్వత శిఖరాల మధ్య మరొక పర్వతం కాస్త…. నా పతి దేవుడైన పరమేశ్వరుడు…. రూప శివలింగంగా భావరూప ఆలోచన కలిగిస్తుంది. అయితే ఇదే ఖచ్చితంగా మనం వెతికే శోనాద్రి అయిన అరుణాచల క్షేత్రమై ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే దేవర్షియైన గౌతమ మహర్షి ఆశ్రమం ఉండి ఉండాలి . చుట్టుపక్కలకు వెళ్లి శోధించి రండి అనగానే….. ఇంతలో అమ్మవారిని చూడటానికి ఈమె దగ్గరికి భరద్వాజ,కశ్యప, అంగీరస,  ఇతర మహర్షులు, సిద్ధులు ,శివయోగులు ఇతర దేవతలు రావడం జరిగింది. వీరందరూ కలిసి….. అమ్మకి ఆతిథ్యం ఇవ్వాలని ప్రయత్నించగా …..అమ్మ కాస్త నాయనలారా!  మీ భక్తికి సంతతించాను.  శివాజ్ఞ మీద నేను కాస్త గౌతమ మహర్షికి అతిథి గా ఉండాలని నాకు చెప్పడం జరిగింది.  కాబట్టి మీరందరూ కలిసి నన్ను అలాగే నా పరివారమును ఆయన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళితే….మీరు నాకు ఆతిథ్యం ఇచ్చి  గౌరవించిన దానితో సమానం అవుతుంది అనగానే….. వీరందరూ ఇందుకు సంతోషించి …..గౌతమ మహర్షి ఆశ్రమం వైపుకి వీరందరినీ తీసుకుని వెళ్లడం జరిగింది. 


గౌతమ ఆశ్రమానికి చేరుకోగానే అమ్మ కాస్త ఈ ఆశ్రమ పరిసరాలను శ్రద్ధగా చూడటం ప్రారంభించింది.  ఎందుకంటే ఈ ఆశ్రమానికి గుర్తుగా పరస్పర విరుద్ధ స్వభావముగా ఉన్న శత్రుజాతి జంతువులు కూడా కలిసిపోయి అన్యోన్యంగా ఉంటాయని….. తన పతి దేవుడైన పరమేశ్వరుడు చెప్పినది ఎలా సత్యమో చూడాలని చూస్తూ ఉంది.  ఆమెకి సాలె పురుగులు తమ గూడులను అల్లుతూ వస్త్రాలుగా మారుస్తున్నాయి.  గుంట నక్కలు కాస్త జలాశయాలలో తిరిగే చేపలను వేటాడకుండా ఆహారంగా వీటికి వడ్ల గింజలు ఇస్తున్నాయి.  మొసళ్ళు ఈ సెలయేర్లలో స్వేచ్ఛగా సంచరిస్తూ…. తామర పువ్వుల తోళ్లను ఆశ్రమవాసులకు ఇస్తున్నాయి.  అడవి దున్నలు కాస్త తన పదునైన కొమ్ములతో పొలాలను చదును  చేసి పంటకి సిద్ధం చేస్తున్నాయి. కోతులు కాస్తా చెట్ల మీద ఉండే ఫలాలు, పుష్పాలు తీసుకొని వస్తున్నాయి.  వరాహములు కాస్త సెలయేర్లలో చెరువులలో మట్టిని బయటకు తీసి….. వాటిని పూడికలు చేసి  ఆ మట్టిని ఆశ్రమానికి తెస్తున్నాయి.  ఏనుగులు తమ తొండాలతో నీటిని తెచ్చి ఆశ్రమ మొక్కలకి అలాగే వృక్షాల పొదలలో పోస్తున్నాయి.  చమరీ మృగాలు కాస్త తోకల రోమాలతోనూ ఆడిస్తూ…. ఆశ్రమ భూమి మీద ఉన్న ధూళిని తీసి వేస్తూ శుభ్రపరుస్తున్నాయి. ఎలుగు బంట్లు కాస్త తేనె తుట్టెలను తీసుకొని వస్తున్నాయి.  పులులు కాస్త ఆశ్రమానికి వెలుపల విశ్రాంతిగా పడుకుని….కాపలా కాస్తున్నాయి.   గోవులు  కాస్త ఆశ్రమ వాసులకి కావలసిన పాలు అందిస్తున్నాయి.  మిగిలిన జంతువుల పిల్లలు ఇవన్నీ కూడా…. జాతి బేధం లేకుండా….. వైర భావం లేకుండా…. ఒకదానితో మరొకటి జతకూడి సంతోషముగా గంతులు వేస్తూ ఆశ్రమమంతా సందడి వాతావరణం కలిగిస్తున్నాయి. రామచిలుకలు, గోరింకలు కాస్త సామగాము చేస్తూ ఉంటే… కాకులు కాస్తా స్తోత్రాలు పఠిస్తున్నాయి.  ఇలా పరస్పర విరోధం ఉన్న జంతువులైన…..పులి-గోవు, అలాగే ఎలుక-పిల్లి పులి-సింహం ,పులి-జింకలు, గ్రద్దలు-పక్షులు, సింహము-ఏనుగు ఈ ఆశ్రమంలో ఎలాంటి విరోధ భావం లేకుండా…. కలిసిమెలిసి సంచరిస్తుంటే అమ్మవారికి ఆశ్చర్య ఆనందాలు వేస్తూ…. చూస్తూ ఉండగా…. ఈ ఆశ్రమ లోపల నుంచి గౌతమ మహర్షి భార్య అయిన అహల్య అలాగే ఈయన పెద్ద కుమారుడైన  శతాధనుడు కాస్త బయటకు వచ్చి…. అమ్మవారిని అలాగే ఈమె  పరివారమును చూసి….. వచ్చింది సాక్షాత్ ఆదిపరాశక్తి  అంశ అయిన ఆది కామాక్షి అని గ్రహించి…. అమ్మకి పాదాలు కడుక్కోవడానికి జలమును అందించి తినటానికి ఫలహారాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు అమ్మ కాస్త అహల్య!  మీ పతి దేవుడైన దేవర్షి గౌతముడు ఎక్కడ…? ఇక్కడ లేరా!  అనగానే …..శతాధనుడు కాస్త…. అమ్మ!  మా నాయన ధ్యాన తపస్సు చేసుకోవడానికి ఇక్కడికి దగ్గరలో ఉన్న పవకొండ్రు పర్వతం మీదకి ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి మునుపే వెళ్లి సాయంత్రం సంధ్యాకాలం దాటిన తరువాతనే ఇక్కడికి వస్తారు.  శివాజ్ఞమేరా నాయనా అక్కడికి వెళ్లి ధ్యానం చేసుకుని వస్తూ ఉంటారు.   మీరు వచ్చారని చెప్పి తోడుకొని వస్తాను అనగానే…. అమ్మ కాస్త బిడ్డ!  అంత పని చేయకు…. ధ్యాన నిష్ఠులకి తపోభంగము ఎలాంటి పరిస్థితుల్లో చేయరాదు.  చేస్తే…. వారికి  ధ్యాన భంగమై లోకానికి ఎన్నో అనర్ధాలు వస్తాయి.  అలాగే మనకి శాపాలు కలుగుతాయి.  వాటి నివారణ కోసం ప్రాయశ్చితాలు చేసుకోవలసి ఉంటుంది.  కాబట్టి తపోమూర్తులను శాంతమూర్తిగానే చూడాలి. అంతేగాని వారికి మన చేష్టల వలన… ఉగ్ర మూర్తిగా మార్చరాదు.  చూడరాదు.  కావున నువ్వే దగ్గర ఉండి…. మా అందరినీ ఆయన తపస్సు చేసుకునే చోటికి తీసుకువెళ్లాలి అనగానే…. సరే అంటూ ఉండగా అమ్మ కాస్త తన చెలికత్తెలలో ఇద్దరికీ  మాత్రమే తోడుకొని…. మిగిలినవారికి అలాగే తన  వెంట వచ్చిన వారందరినీ ఆశ్రమంలోనే ఉండమని చెప్పి….  కలిసి శతాధనుడుతో గౌతమ మహర్షిని చూడడానికి బయలుదేరారు.  పవకొండ్రు పర్వతం మీదకి అమ్మవారు కాస్త తన చెలికత్తెల పరివారంతో వెళ్లేసరికి…. అక్కడ కొండమీద ఏడు ఆకులు ఉన్న బిల్వ వృక్షం కింద… కాషాయ వస్త్రధారిగా…. మెడలో రుద్రాక్ష మాలతో….  పులి చర్మం మీద దర్భాసనం వేసుకొని…. వీరాసన భంగిమలో కూర్చున్న…. తెల్లని చర్మంతో జడలు కట్టిన జుట్టుతో దృష్టిని నాసికాగ్రం నందు పెట్టి….. పెదవుల కదలికతో మంత్ర ఉచ్చారణ చేస్తూ… కుడి చేతిలో రుద్రాక్ష మాలను తిప్పుతున్న దేవర్షియైన గౌతమ మహర్షిని చూడగానే…  అమ్మవారు కాస్త పుత్రవాత్సల్యముతో…. నాయన దేవర్షి! వత్సా ! కుమార గౌతమా! అనగానే ఈ మహర్షి కాస్త కళ్ళు తెరవకుండానే …. మాత!  ఇన్నాళ్ళకి వచ్చావా? నీ రాక కోసం 1000 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాను.  ఇన్నాళ్ళకి నా దరికి చేరావా ?అంటూ ఉండగానే….. నాయనా!  నువ్వు వెళ్ళు కళ్ళు తెరవకుండానే నేనే వచ్చానని నీకు ఎలా తెలిసింది….. అంటే అమ్మ!  నేను గుర్తు పట్టడానికి నీ మనోహర రూపంలో చూడాలా? నీ గొంతు….. నీ పలకరింప చాలు కదా! అంటూ చమర్చిన కళ్ళు తెరిచి అమ్మకి పాదాభివందనం చేసి….. జలముతో పాదాలను కడిగి….. ఆ నీటిని తన తలమీద చల్లుకొని….. కొంత తీర్థముగా స్వీకరించి…. అమ్మవారికి తగిన శిలా ఆసనము మీద కూర్చుండ పెట్టి….. క్షేమమాచారాలు అడిగి తెలుసుకున్నాడు.  అమ్మ!  నిన్ను కైలాసంలో చూసిన తర్వాతనే మళ్లీ ఇన్నాళ్ళకి నీ దర్శన భాగ్యం కలిగింది…..అనగానే నాయనా!  గౌతమా ! నీకు తెలియంది కాదు…. నా పతి దేవుడి విరహవేదనకి ….నేను చేసిన అపరాధమే…ఇక్కడిదాకా తీసుకొని వచ్చింది.  అవును….. నీ భక్తితో నా పతి దేవుడిని అనుగ్రహం పొందిన మహాత్ములలో నువ్వే అగృడవని ఆయన చెప్పడం జరిగింది. ఇంతమంది మునులు మహర్షులు ఇక్కడ ఉండగా…. నిన్ను మాత్రమే నాకు సహాయం చేయటానికి స్వయంగా నా పతి దేవుడైన శంకరుడు…. నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను చూసిన తర్వాత…..నా పతి దేవుడైన నా అరుణగిరి మహత్యము స్వయంగా నీ నోటితో వినాలని నా మనసు తపన, తాపత్రయం పడుతుంది.  జగత్తులో దేహ దారులైన శివ భక్తులను దర్శించడం…. నమస్కరించడం… మాట్లాడటం….. వారితో సాంగత్యం చేసినంతనే పరిపూర్ణ మోక్ష ప్రాప్తి పొందడం జరుగుతుంది కదా! కాబట్టి….. భూలోకమునందు నిన్ను మించిన శివ భక్తుడు మరొకడు లేడు. కేవలం నిన్ను దర్శిస్తేనే శివునికి ప్రీతి కలుగుతుందని నాకు అర్థమై…. నీ ఉపదేశముతో నాకు పుత్రస్థానం నుండి పితృస్థానమును పొందుతావు.  బిడ్డ కోరికను తండ్రి తీర్చుట తప్పనిసరి కదా!  అనగానే అమ్మ!  నీకు తెలియనిది ఏమీ లేదని నాకు తెలుసు. నీకు అన్నీ తెలిసినా ఏమీ తెలియని దానిలా…. నన్ను అడుగుతున్నావని నాకు అర్థం అయింది. ఎందుకంటే శివ భక్తులు నోటి వెంట నీ పతి దేవుడైన శివ సంకీర్తన లేదా శివమహత్యములు వినాలని నీవు ఇష్టపడి నన్ను అడుగుతున్నావు.  నేను చేసిన పుణ్యకార్యాల వలన…. తపస్సు వలన…. సాక్షాత్తు నాకు అరుణాచలేశ్వరుడు సాక్షాత్కారమై….. వారు అనుగ్రహించిన అనుగ్రహ భాషణము అయిన అరుణాచల మహత్యమును నీకు యథాతథంగా చెబుతాను.  శ్రద్ధ భక్తితో ఆలకించు అంటూ……అమ్మ!  ఈ క్షేత్ర మహత్యమును పూర్తిగా వర్ణించాలంటే…. త్రిమూర్తుల వలన, అలాగే త్రిమాతల వలన, అలాగే సూర్య ,చంద్ర మరియు అష్టదిక్పాలకుల వలన ఇతర దేవతలు, మునులు ,మహర్షులు, సిద్దులు శివయోగులు,జంతువులు, పక్షులు సమస్త గణాలకి సాధ్యపడదని గ్రహించు. ఈ క్షేత్ర దర్శనము స్మరణ చేతను, గిరిప్రదక్షణం చేత, సమస్త కోరికలు తీరి అలాగే సర్వపాపాలు నివృత్తి అయ్యి…. మోక్ష ప్రాప్తి పొందడం జరుగుతుంది. ఈ అరుణాచల క్షేత్రంలో అనంత జ్యోతియే జ్యోతి స్తంభ రూపముగా…. పర్వత లింగముగా మారి…. సర్వజనులకి దర్శనమిస్తోంది.  దీనిని ధ్యానించు శివయోగులకి… శివ సన్యాసులకి… శివ సాధువులకి…. శివ సాన్నిధ్యం ,ముక్తిని పొందుతున్నారు.  ఈ గిరి సన్నిధిలో చేసే యజ్ఞాలు, యాగాలు, హోమాలు, జపాలు, ధ్యానాలు, దానాలు సల్పమైనను అనంతకోటి అక్షయ ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇక్కడ నామస్మరణ చేతనే పాపరహితుడై… కర్మ రహితుడై… జన్మ రహతుడై…. ఋణ బంధరహితుడై… పూర్ణ మోక్ష ప్రాప్తిని పొందడం జరుగుతుంది అంటూ…. అరుణగిరి దర్శన మహత్యము, తీర్థ మహత్యము, కర్మ ఫలిత వివరణ, విశిష్ట పూజా మహిమ, గిరి ప్రదక్షిణ మహత్యము, ఉపచార ఫలితములు, దీపోత్సవ మహిమ, అన్నదాన మహిమ, పండుగలు మున్నగు విశేషాలు అన్నీ కూడా….. సవివరంగా అమ్మవారికి చెప్పడం జరిగింది. ఇది అంతా విన్న అమ్మ కాస్త ఆనందభరితురాలై….. గౌతమా ! స్వయంగా నా పతి దేవుడైన శంకరుడే స్వయంగా ఎన్ని విశేషాలు చెప్పడం…… వాటిని తిరిగి వినడం……నాకు ఎంతో ప్రీతి దాయకంగా ఉంది.  నా మనసు ఆనంద డోలికలలో తేలి ఆడుతోంది… చెప్పడానికి వీలులేని బ్రహ్మానంద స్థితిలోనికి నా మనసు వెళ్ళిపోతుంది.  పట్టుకోవడం నాకు వీలు కావటం లేదు. అదుపు చేయడం నావల్ల కావడం లేదు.  మీ దర్శనం, అరుణగిరి సన్నిధి, నీ నోట ఈ క్షేత్ర మహత్యం వినడంతో ప్రాప్తించిన ఫలము కన్నా నాకు వేరే తపస్సు అవసరమా!  అనగానే….. మాత!  లోకమాత!  తల్లి…!  నువ్వు చేయబోయే తపస్సు…నీవు కోరుకున్న శివ సాన్నిధ్యం పొందడమే కాకుండా…. లోకానికి మేలు కూడా జరుగుతుంది.  నీ భక్తితో అరుణాద్రీశుని అర్చించుము. ఋషి తపస్సు అనేది… వారికి ప్రార్థనలు తీరిస్తే…. దేవతలు తపస్సు అనేది ఒక మహా కారణా కారకం వలన జరుగుతుంది. దీనివలన విశ్వలోక కళ్యాణార్థ మహోన్నత మహాతరమైన కార్యం నెరవేరుతుంది.  ఇలాంటి దేవతా తపస్సు నువ్వు ఇక్కడ ఈ క్షేత్రంలో చేస్తే దానికి అమిత ఫలితమును అందరూ తప్పక పొందడం జరుగుతుంది.  కాబట్టి మేమందరము కూడా నీ తపస్సుకి కావలసిన ఏర్పాట్లు….సహాయ సహకారాలు అన్ని వేళలో అందిస్తూ ఉంటాము అనగానే ….


గౌతమా! దేవతలకి సైతం వరాలు, అలాగే కోరికలు తీర్చి అనుగ్రహించే  తేజో లింగ రూపమైన పర్వతలింగ సమక్షంలో….. నేను తపస్సు చేయుట అనేది…. ఒక కారణమే అవుతుంది.  ఇక్కడ నేను తపస్సు చేసి నా పతి దేవుడైన పరమేశ్వరుడిలో శివైక్యం చెందుతాను.  అందుకు తగ్గ ఏర్పాట్లు చేయండి…. అనగానే 


అమ్మ! నీ రాక వలన ఈ అరుణగిరి అరణ్యమంతా కూడా పచ్చగా కళకళలాడుతూ మారింది.  కావున నువ్వు ఈరోజు నుంచి పచ్చయ్యన్ అమ్మ అనే  నామంతో ప్రసిద్ధి పొందుతావు. కాబట్టి నీ తపస్సు ప్రశాంతంగా జరిగే విధంగా….. అనుకూలమైన వాతావరణం ఉండే విధంగా….ఇక్కడి దగ్గరిలో ఉన్న పర్వతము పైన పర్ణశాల ఏర్పాటు చేస్తాను. అంతదాకా నువ్వు అలాగే నీ పరివారము అంతా కూడా నా ఆశ్రమంలో నిరభ్యంతరంగా ఎంత కాలం ఉండాలో…. అంతకాలం ఉండవచ్చును….అంటూ అందరినీ తీసుకొని గిరి కింద భాగంలో ఉన్న తన పర్ణశాలకి గౌతమ మహర్షి  వెళ్లడం జరిగింది. 


అష్టత్రింశత్(38వ )అధ్యాయం సమాప్తం 

శుభం భూయాత్ 

సర్వం అరుణాచల శివార్పణమస్తు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి