అధ్యాయం - 9
కామాక్షి - కార్తీక దీపం
~~~~~~~~~~~~~~~
ఆది కామాక్షి
ఆది కామాక్షి కారణం వలన అరుణాచల క్షేత్రంలో కార్తీకదీపం నాడు వెలిగించే కార్తీక దీపం వెలుగుతోందని చాలామందికి తెలియదు. దీని వివరాలలోనికి వెళితే ….కైలాసంలో ఒకనాడు పార్వతీ కాస్త సరదాకి శివుడి కళ్ళు మూయడంతో …..అది కూడా కొన్ని క్షణాల పాటు మూసేసరికి , కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయి… చీకటి వెలుతురు కానీ గాఢాంధకార పరిస్థితిలో విశ్వ జగత్తు ఉండటం గమనించిన శివుడు కాస్త….. తన త్రినేత్రమైన అగ్ని నేత్రమును తెలిచేసరికి అప్పుడు కానీ తను చేసిన తప్పేమిటో పార్వతికి అర్థం కాలేదు. దీనిని ప్రాయశ్చిత్త కర్మగా శివుడు కాస్త నా విరహవేదనను అనుభవిస్తూ …..ధ్యాన తపస్సు చేస్తూ…… ఈ దోష నివారణ చేసుకుని నన్ను కలుసుకొని….. నాలో లీనమవ్వు అని ఆయన కాస్త అంతర్ధానం అవ్వడంతో….. చిన్నపిల్లలు అయిన కుమారస్వామి, గణపతికి చనుబాలు ఇవ్వకుండా….. స్థనాలు మీద గుడ్డ లేకుండా శివుడిని వెతకటానికి కంచి క్షేత్రానికి బయలుదేరింది. ఈ క్షేత్రంలో ఉన్న కాత్యాయన మునికి కామాక్షి పేరుతో కుమార్తెగా జన్మించి…. శివుడే తన భర్తయని మట్టితో చేసిన శివలింగమును ఆరాధన చేయటం…. ఆపై శివుడు పెట్టే పరీక్ష మాయలు తట్టుకొని నిలబడడంతో….తను అరుణాచల క్షేత్రంలో ఉన్నానని….శివుడు కాస్త ఆకాశవాణిగా అమ్మవారికి చెప్పడంతో…. ఈమె కాస్త ఈ క్షేత్రానికి చేరుకొని… ఈ క్షేత్ర వాసి అయిన గౌతమ మహర్షి ఆశ్రమానికి దగ్గరికి వెళ్లి…. ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకొని…. శివుడిలో శివైక్యం చెందేందుకు…. శివ ధ్యాన తపస్సు చేయడానికి….ఆభరణాలు వదిలిపెట్టి నార వస్త్రాలతో శివ సన్యాస దీక్షలో తపస్సు చేయడానికి…. ఒక కొండకి చేరుకోవడం జరిగింది. అప్పటిదాకా ఈ కొండ కాస్త కళాహీనమై ఎండిపోయిన చెట్లతో రాలిపోయిన ఆకులతో ఉన్న చెట్లు….. ఎండిపోయే స్థితిలో ఉన్న సెలయేరులు కాస్త ఈమె రాకతో పచ్చగా మారడం జరుగుతుంది. అందుకే ఈ కొండను పచ్చయ్ అని పిలవడం జరిగింది. ఇలా అమ్మవారు కాస్త పచ్చని అమ్మగా…పచ్చయ్యన్ అమ్మన్ గా ఈ ప్రాంతంలో శివయోగినిగా మారి ధ్యాన తపస్సు చేసుకోవడం….. ఈ ప్రాంతంలో రాక్షస రాజు అయిన మహిషాసురుడు దృష్టిలో పడి ఈమెను శతవిధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే….. తనకి రక్షణగా వచ్చిన వారిలో ఒకరైన దుర్గాదేవి కాస్త ఈ రాక్షస సంహారం చేయగానే…..ఇతని మెడలో ఉన్న అతి శక్తివంతమైన శివలింగము కాస్త ఈమె చేతికి అతుక్కుని ఎంతకీ రాకపోయేసరికి…. గౌతమ మహర్షి ఆజ్ఞ మేర, ఈమె కాస్త తన చేతిలో ఉన్న ఖడ్గముతో అక్కడే ఉన్న బండరాయిని కొట్టగానే…. అది ముక్కలై దాని నుంచి వచ్చిన తీర్థములో ఈ చేయి పెట్టగానే తన చేతిని అంటిన ఈ శివలింగం కాస్త ఊడి భూమి మీద పడబోతుంటే…. దానిని తన చేతిలోకి తీసుకొని పచ్చ అమ్మకు ఇచ్చి శివలింగారాధన చేసుకోమని చెప్పడం…. ఇవ్వడం…. జరిగింది. ఇలా వచ్చిన తీర్థమే ఖడ్గ తీర్థం అయ్యింది. ఇలా చాలా శక్తివంతమైనది. ఎందుకంటే దుర్గాదేవి యొక్క అపార శివ భక్తుడి పాప దోషమునే హరించింది… ఈ లెక్కన చూస్తే ఇది సర్వపాపహారిణి అని తెలుస్తోంది కదా! ఈ తీర్థములు సేవించినా కాశీ గంగా ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది . ఎందుకంటే కాశీగంగా అలాగే ఈ తీర్థ గంగ కూడా పాతాళ గంగయే అవుతాయి కాబట్టి….. ఈ తీర్థమును సేవించి తరించండి… ఈ రాక్షస సంహారం జరిగిన ప్రాంతమే దుర్గాదేవి ఆలయం గా మారింది అన్నమాట.
ఇకపోతే పచ్చ అమ్మవారు కాస్త ఈ రాక్షస భక్తుడి శివలింగమును తీసుకొని…. సూదిమొన లింగ ప్రాంతం దగ్గరకు వచ్చి….సూది మొన లాంటి రాతి మీద ఒంటి కాలు మీద నిలబడి తీవ్రమైన ధ్యాన తపస్సు చేసినప్పటికీ…. శివసాక్షాత్కారం అవ్వకపోయేసరికి…. ఇలా కాదని శరీర త్యాగమే దీనికి తగ్గ ప్రాయశ్చిత్తమని అనుకొని కామాక్షిగా మరో ప్రాంతానికి చేరుకోవటం జరిగింది. సూది మొన రాయి మీద అమ్మవారు చేసిన తపస్సుకు గుర్తుగా…. మనకి సూది మొన లింగ గుడి ఊసిలింగం దర్శనమిస్తుందన్నమాట! ఈ ప్రాంతం నుండి వెళ్లిన అమ్మవారు కాస్త మరో ప్రాంతానికి వెళ్లి గౌతమ మహర్షి సమక్షంలో ఒక హోమగుండం ఏర్పాటు చేసుకొని తన శివలింగమును పట్టుకొని ఈ హోమాగ్ని గుండంలోనికి దూకి…. ధ్యాన తపస్సు చేసేసరికి… ఈమె భక్తికి శివుడు కాస్త సాక్షాత్కరించి దేవి! ఆనాడు కైలాసంలో చేసిన తప్పిదానికి ప్రాయశ్చిత్తము ఈనాటితో తీరింది. కార్తీకమాస కృతిక నక్షత్రము నాడు భరణి యందు వచ్చిన రోజు నువ్వు కాస్త నా గిరిభాగమైన పావకొండ్రు పర్వతానికి చేరుకొని…. నాలో ఐక్యము చెంది…. నా అర్ధ శరీర భాగమును తిరిగి పొంది అర్ధనారీశ్వర తత్వంలో ఈ గిరి యందు అపితకుచాంబికా దేవిగా అనుగ్రహిస్తూ ఉంటావని వరం ఇచ్చి అంతర్దానం అవడం జరిగింది.
ఈ కారణం చేతనే ఇదే రోజున మన అరుణగిరి యందు కార్తీకమాస భరణి తిథియందు కృతిక నక్షత్రము నాడు అగ్నిహోత్ర సంబంధమైన కార్తీక దీపము అరుణ జ్యోతిగా ప్రజ్వలింప చేసే ఆనవాయితీ ఆచారంగా ఏర్పడింది. అంతెందుకు…. ఈ దీపం వెలిగించే అతిపెద్ద ఇనుప స్తంభం మీద మనకి అర్ధనారీశ్వర బొమ్మ గుర్తుగా ఉండటం జరుగుతుంది. అలాగే ఈ దీపారాధన సాయంత్రం 6 గంటలకి గిరి మీద వెలిగించే ముందు ఆరోజు ఉదయం అరుణాచలేశ్వర స్వామి గుడిలో ఉదయం ఆరు గంటలకి పంచ దీపాలతో భరణి దీపమును వెలిగించడం జరుగుతుంది. ఇలా పంచ దీపాలు అనేవి శివుడి పంచ శివమూర్తులైన అర్ధనారీశ్వర మూర్తికి ,లింగోద్భవ మూర్తికి, సదాశివమూర్తికి, గురుదక్షిణామూర్తికి, సోమస్కంధ మూర్తికి ప్రతీకలుగా…. చెబితే సృష్టి, స్థితి, లయ తిరోగమనం, అనుగ్రహం అనే పంచ ప్రక్రియలకి ప్రతీక అవుతాయి. ఎందుకంటే మూలస్థాన మూర్తి అయిన అర్ధనారీశ్వర దక్షిణామూర్తి ఎప్పుడు కూడా కదలక , మెదలక నిశ్చల స్థితిలో ఉంటాడు. ఈయన ధ్యాన సమాధి స్థితి నుండి సర్వసాధారణ స్థితి తీసుకుని రావడానికి…. ఈయనలో ఉండే పంచభూత శక్తులు జాగృతి చేయటానికి భరణి దీపముగా పంచ దీపాలు వెలిగిస్తారు. ఆ తరువాత సాయంత్రం వేళలో… గుడి ఆవరణలో… ఉన్న జ్యోతి దర్శన మండపం దగ్గరికి సోమస్కంధ మూర్తి, అబితకుచాంబికా దేవి మూర్తి, గణపతి, కుమారస్వామి, చండీశ్వర విగ్రహం మూర్తులను తీసుకొని వస్తారు. ఆ తరువాత అర్ధనారీశ్వర మూర్తిని గుడి లోపల నుండి ఈ మండపానికి ఆనందతాండవ నృత్యంలో బయటకు తీసుకుని వచ్చి రాగానే…..ఈయన సమక్షంలో…. ఈయన చూస్తూ ఉండగానే గిరి అగ్రభాగమున అరుణ జ్యోతిని సాయంత్రం ఆరు గంటలకి వెలిగిస్తారు. తనలోని అమ్మ శక్తి జాగృతి అవడంతో అప్పటిదాకా గాఢాంధకార స్థితిలో ఉన్న విశ్వ జగత్తు కాస్త…. ఈ అరుణ జ్యోతి దివ్య తేజస్సుతో పునః సృష్టి జరుగుతుందన్నమాట! ఇలా ఈ అమ్మవారు కాస్త కార్తీకదీపం నాడే పావకుండ్రు పర్వతం పైన శివుడిలో ఐక్యం చెంది…. అర్ధ శరీరం పొంది…..అర్ధనారీశ్వరాలయింది. దీనికి గుర్తుగా ఇప్పటికీ ఈ పర్వతము నందు వెయ్యి సంవత్సరాలుగా గౌతమ మహర్షి చేత ప్రతిష్టించబడి పూజించబడిన…..శివలింగమూర్తి గుడి ఉంది .అలాగే ఈ గుడిలో అర్ధనారీశ్వర విగ్రహ మూర్తి కూడా ఉండటం విశేషం అన్నమాట! ఇలా మనకి ఈ క్షేత్రంలో సహజంగా మూడు అర్ధనారీశ్వర మూర్తులు ఆరాధన కనపడతాయి. ఇందులో మొదటిది ఈ పావకొండ్రు పర్వతం మీద ఉన్న అర్ధనారీశ్వర గుడి అయితే….. రెండవది ఊసి లింగము గుడిలో కూడా మనకి అర్ధనారీశ్వర విగ్రహ మూర్తి దర్శనమిస్తుంది. మూడవది మనకి ఆది అన్నామలై గుడికి వెళ్లేటప్పుడు ఈ వీధి ఆరంభంలోనే అర్ధనారీశ్వర గుడి దర్శనమిస్తుంది. ఇలా ఈ మూడు అర్ధనారీశ్వర గుళ్ళు ఉన్నాయన్నమాట! మీరు అరుణాచలం వచ్చినప్పుడు ఈ మూడు గుళ్ళు తప్పక దర్శనం చేసుకోండి. అలాగే అమ్మవారు కాస్త జ్ఞాన తపస్సు చేసిన పచ్చయ్యన్ అమ్మన్ గుడి, దుర్గాదేవి గుడి, ఊసి లింగం గుడి, పావకొండ్రు గుడి దర్శనం చేసుకుని….. అమ్మ అనుగ్రహం పొంది తరించి ధన్యులు అవ్వండి .
నవమ అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం అరుణాచల శివార్పణమస్తు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి