అధ్యాయం 18

 అధ్యాయం 18 

నామస్మరణే జీవన్ముక్తి 

***************************



మోక్షము అంటే సర్వ కర్మ , ఋణ ,జన్మల బంధాల నుండి శేషము లేకుండా విముక్తి పొందడం అన్నమాట!  అనగా ఈ బంధాలకి మూల కారణమైన మోహము క్షయము అయితే…. వచ్చేది మోక్షం అవుతుంది. దీనినే జీవన్ముక్తి అంటారు. ఇక్కడ ముక్తికి అలాగే మోక్షానికి తేడా ఉందని చాలామందికి తెలియదు…ముక్తులలో సప్త ముక్తులు ఉంటాయి. ఇందులో  సూక్ష్మాతి సూక్ష్మముగా కర్మ, జన్మ, ఋణ ,కారణ శేషము మనకి మిగిలే ఉంటుంది. దీనికోసం కారణ లేదా అకారణజన్మలు పొందవలసి ఉంటుంది.. అదే మోక్షంలో ఈ స్థితి ఉండదు అన్నమాట!  అంటే ముక్తిలో సశేషము ఉంటే మోక్షములో అశేషం ఉంటుంది.  ముక్తులలో సప్త ముక్తులు ఉన్నట్లుగా మోక్షములో కూడా సప్త మోక్షములు ఉన్నాయి. ముక్తులలో సప్తముక్తి పురాలు అనగా ఉడుపి,కొల్లూరు సుబ్రహ్మణ్యస్వామి గుడి, కుంభాసి కోటేశ్వర స్వామి, శంకరనారాయణ స్వామి గుడి, మరియు గోకర్ణ క్షేత్రాలు అన్న మాట!  ఇవి అన్నియు కూడా కర్ణాటక రాష్ట్రం నందు ఉంటాయి. వీటిని పరశురాముడు కాస్త సముద్రం నుంచి తిరిగి పొందిన భూమిపై సృష్టించడం జరిగింది. ఇకపోతే సప్తమోక్షపురాలు అనగా అయోధ్య, మధుర , హరిద్వార్, ఉజ్జయిని, కంచి, కాశీ ,ద్వారక క్షేత్రాలు అవుతాయి. ఇవే కాకుండా కర్మరాహిత్యం కోసం అలాగే పంచ మహా పాతక పాపాలు…. దోష నివారణ కోసము పంచ క్షేత్రాలు అనగా శిఖర దర్శనం శ్రీశైలంలో…. కేదారేశ్వర క్షేత్రం తీర్థసేవనం….. పట్టిసీమ క్షేత్రంలో జటారి కొప్పు స్వామి లింగ దర్శనం….. శ్రీకాళహస్తిలోని యమలింగ దర్శనం….. అలాగే కాశీ క్షేత్రంలో  మరణం ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇలా ఈ క్షేత్రం మరణాలు అనేవి మన జన్మల పరంపరము యొక్క మన కర్మలలో వాటి కర్మఫలాలు ఆధారంగా ముక్తి లేదా  మోక్ష లేదా కర్మరాహిత్య స్థితిగతులు పొందడం జరుగుతుంది.  అంటే ఈ క్షేత్ర మరణము అనేది మనం చేసుకున్న కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది అని మహర్షులు గ్రహించి…… సూక్ష్మములో మోక్షం పొందే మోక్షమార్గం కోసం వీరంతా ఒకసారి పరమేశ్వరుడు దగ్గరికి వెళ్లి…. ఇదే విషయాన్ని అడిగితే…. ఆయన కాస్త అయితే మీరు కాస్త తిరువాయురు క్షేత్రంలో పుట్టండి.  ఇక్కడ నేను కాస్త సర్వత్యాగిగా మారి త్యాగస్వామిగా వెలిశాను. అలాగే అమ్మవారు కమలాలయ దేవి కాస్త ఏ క్షేత్రంలో లేని విధంగా కాళ్ళ మీద కాళ్లు వేసుకొని కూర్చుని ఉండే భంగిమలో ఉండి ….నా మీద ఉన్న కామ భావం త్యజించి కామరహిత స్థితి పొంది…. మోక్షం పొందడం జరిగింది. ఈ క్షేత్ర పరిధిలో స్వయంగా శ్రీరాముడు కాస్త తన తండ్రి అయిన దశరధుడి పిండ ప్రదానం చేయడం జరిగింది… అనగానే మహర్షులు వెనుతిరిగి ఈ క్షేత్ర జననం కోసం సాధన కొనసాగించారు. కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి వచ్చి స్వామి! జననం అనేది మా చేతులలో లేదు…. అది బ్రహ్మదేవుడి చేతిలో ఉంది కదా! ఆయనేమో ఈ జన్మల పరంపర యొక్క పాప ఫలాలను బట్టి ఈ క్షేత్ర జననం నిర్ణయిస్తున్నాడు…. అనగానే ఈసారి పరమేశ్వరుడు కాస్త అయితే మీరంతా కూడా కాశీ క్షేత్రంలో మరణం పొందేందుకు సాధన చేయండి. ఎందుకంటే ఈ క్షేత్రంలో మేమంతా కాశీ విశ్వనాథుడిగా, కాశీ విశాలాక్షిగా ఉండి పూజలు అందుకుంటున్నాము. అలాగే ఈ క్షేత్రంలో జీవుడి మరణ అంతిమ ఘడియలలో వాడి కుడి చెవిలో మా చేతుల మీదుగా శివతారక మంత్రోపదేశం చేయటం జరుగుతుంది. అది కూడా విశాలాక్షి దేవి, గంగాదేవి, డూండీ గణపతి, బృంగి, కాలభైరవుడు సమక్షంలో జరిగే మీ జన్మాంతర పాపారాశిని దగ్ధం అవుతుంది. తద్వారా మీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడంతో…. ఈ మహర్షులు కాస్త ఈ కాశీ క్షేత్ర మరణం కోసం సాధన చేసుకోవడానికి వెళ్లడం జరిగింది. కొన్ని సంవత్సరాల తరువాత వీరంతా మళ్లీ పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి స్వామి! ఈ కాశీ క్షేత్ర మరణం కూడా మా చేతులలో లేదు. ఇది కూడా మా జన్మాంతర జన్మలలో చేసిన పుణ్య ఫలమును బట్టి ఈ క్షేత్ర మరణము యముడి చేతుల మీద ఆధారపడి పనిచేస్తుంది.  కాబట్టి మా చావు పుట్టుకలు మా చేతులలో లేవు కదా!  అంతా కూడా మేము చేసుకున్న పాప పుణ్యాల కర్మ ఫలమును నిర్దేశించే కర్మ సిద్ధాంతం మీద ఉంది.  ఇది మా చేతులలో లేదు.  కాబట్టి ఇక ఏమైనా మోక్ష విధానము ఉంటే చెప్పండి అనగానే…. అయితే మీరు పూర్ణజ్ఞానమును పొంది చిదంబర క్షేత్రంలోని జ్ఞానలింగ ప్రతీక అయిన ఆకాశలింగ దర్శనం చేసుకుంటే…. మీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది.  ఈ క్షేత్రంలో నేను కాస్త చిదంబర నటరాజ మూర్తి గాను ఉంటే.కామ సుందరి దేవిగా అమ్మవారు ఉంది. ఈమెకి ఈ క్షేత్రంలో నామీద విపరీతమైన కామ భావంతో ఉంటుంది.  ఈ మాయాభావం దాటితే కానీ యదార్థ పూర్ణజ్ఞానం అందదు అని తెలుసుకోండి. జ్ఞాన ప్రాప్తి వలన మీ మాయ కాస్త మాయం అవుతుంది . అప్పుడే ఈ క్షేత్రంలో మీకు తక్షణ మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం జరిగింది.  దానితో పూర్ణజ్ఞాన ప్రాప్తి కోసం ఈ క్షేత్ర మోక్ష ప్రాప్తి కోసం సాధన చేయటానికి మహర్షులు వెనక్కి తిరిగి వెళ్ళటం జరిగింది. మళ్లీ కొన్ని సంవత్సరాలు తర్వాత వీరంతా తిరిగి వచ్చి స్వామి పూర్ణజ్ఞానం పొందటం మా వల్ల కావడం లేదు… ఏదో ఒక రకంగా మాయ మా వెంట నీడలాగా వెంట ఉంటుంది. మాయ మాయమైతే కానీ మాకు జ్ఞాన ప్రాప్తి పూర్ణముగా అందదని మాకు అర్థమయింది.  కానీ ఇది కూడా మావల్ల అవటం లేదు… ఎందుకంటే మా సాధన పరిసమాప్తి వలన చిదంబర క్షేత్రం ఆకాశంలో ఆకాశంగా దర్శనమే అవుతుంది…. అనగా ఆకాశంలో ఒక ఆకాశ లింగం కనబడుతుంది కానీ ఇది పూర్ణజ్ఞాన ప్రాప్తి కాదు కదా!  ఆకాశంలో ఆకాశంగా దర్శనం అవడం అనేది

మా భావ  రూప సాధన అవుతుంది. నిజానికి ఆకాశమే ఆకాశ లింగముగా దర్శనం అవ్వాలి.  ఇది పూర్ణజ్ఞాన ప్రాప్తి అయినప్పుడే సాధ్యపడుతుంది అని….. మాకు అర్ధమయ్యి….ఇది సాధన చేస్తే వచ్చేది కాదని…. యోగం ఉంటే వచ్చేదని అర్థమైంది. అందుకే మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగింది అనగానే…. అప్పుడు కాస్త పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఇక ఆఖరి మోక్ష ప్రయత్నంగా అరుణాచల క్షేత్రమునకు చేరుకొని…. అక్కడ స్థిరనివాసం చేసి…. నిత్యం నా నామస్మరణ అనగా “అరుణాచల శివ” అని చేస్తూ ప్రాణాలు విడవండి. మీకు నా చేతుల మీద పూర్ణ శూన్యమునందు  పూర్ణ మోక్ష ప్రాప్తి పొందడం జరుగుతుంది. ఎందుకంటే ఈ క్షేత్రములో జ్ఞానాగ్నియుతమైన అరుణగిరి గాను, అగ్నిహోత్రుడిగా అరుణాచలేశ్వర అగ్ని లింగముగాను మీ పాప కర్మలు, ఋణాలను హరించే అరుణ జ్యోతి గాను మీకున్న మోహమాయ విముక్తి కోసం….. శివశక్తి అర్ధనారీశ్వర తత్వముగా మీకు పూర్ణ మోక్ష జ్ఞానమూర్తిగాను… సజీవ దక్షిణామూర్తిగా ఇలా పంచరూపాలతో ఈ క్షేత్ర వాసిగా ఆవాసం చేసి ఉన్నాను….. అనగానే స్వామి! నామస్మరణ చేతనే జీవన్ముక్తి ప్రాప్తి అంటే, ఇంతకంటే సూక్ష్మమైన మోక్షమార్గం ఉండదని మహర్షులు కాస్త అమిత ఆనంద భరితులై ఈ క్షేత్రానికి చేరుకొని….. మోక్ష సాధన ప్రాప్తి కోసం అరుణాచల నామస్మరణ చేస్తూ ఏ శూన్యము నుండి వచ్చారో… ఆ శూన్యంలో పూర్ణ శూన్య మోక్ష ప్రాప్తి పొంది….. వెను తిరిగి రాని స్థితి పొంది శూన్యమైపోయారు. ఈ కథనం మనకి కాశీఖండంలోని ఈ శ్లోకం అనగా


 శ్లో: "దర్శనాత్ అబ్రసదసి 

జననాత్ కమలాలయే 

స్మరణాత్ అరుణాచలే 

కాశ్యాంతు మరణాన్ ముక్తిః"


భావం: చిదంబరం లో శివదర్శనం, తిరువాయూర్ లో జననం, అరుణాచలేశ్వరుని స్మరణం, లేదా కాశీలో మరణం ముక్తి కారకములు ద్వారా తెలుస్తుంది.  


కాశీలో మరణం అనేది , శరీరం వినాశనం అయితే…. అరుణాచలంలో మరణం అనేది మనోవినాశనం అవుతుంది. అందుకే కాశీలో మరణిస్తే మోక్షం అదే అరుణాచలంలో నామస్మరణ చేస్తే మోక్షం వస్తుంది. 


కాబట్టి ఈ లెక్కన చూస్తే, ఈ అరుణాచల క్షేత్రంలో కేవలం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణ శివ అని నామస్మరణ ప్రతినిత్యము చేస్తే ఖచ్చితంగా మీకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని…. ఈ క్షేత్ర స్థానికుల భౌతిక మరణాలు అలాగే… ఈ క్షేత్ర అరుణగిరి యోగుల జీవసమాధి మరణాలు కాస్త మోక్షమరణాలు అయ్యి… శూన్యములో శూన్యం అవడం సర్వసాధారణంగా ఈ క్షేత్రంలో జరిగే విషయం అన్నమాట! ఈ విశ్వంలో ఉన్న వివిధ క్షేత్రాలలో ఉన్న దైవాలు, దేవతలు కాస్త తమలో ఐక్యం చేసుకుంటే…. అదే ఈ అరుణాచల క్షేత్రంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా అరుణాచల శివుడు కాస్త క్షేత్ర మరణం పొందిన జీవులను తనలో ఐక్యం చేసుకోకుండా…..తన చేతుల మీదుగా మన పిండదేహానికి అగ్ని సంస్కార దహనం చేసి…. ఆ తరువాత ఏర్పడే లింగ దేహాన్ని… ఆదిలో ఆదిజన్మగా ఏ శూన్యంలో నుంచి వచ్చామో ….ఆ శూన్యంలో ఐక్యం అయ్యేటట్లుగా అనుగ్రహిస్తాడు. శూన్యములో శూన్యం చేస్తాడు.  తద్వారా కర్మజన్మ ఋణ మాయ భావరహిత స్థితి పొంది… వెనక్కి తిరిగిరాని పునః జన్మలేని , భగవద్గీతలో చెప్పబడిన పరమపదమును పొందడం జరుగుతుంది. ఇది ఈ అరుణాచల క్షేత్రంలో తప్ప ….ఈ విశ్వంలో ఉన్న ఏ క్షేత్రాలలో కూడా ఇలాంటి క్షేత్ర మరణం జరగదని తెలుసుకోండి. కేవలం నామస్మరణ చేతనే ఇంతటి మహత్తర మహోన్నతమైన అంతిమ పూర్ణ శూన్య మోక్ష ప్రాప్తి…..ఈ క్షేత్ర భౌతిక లేదా  యోగ మరణమే మోక్షమరణం అవుతుంది. అంతెందుకు ఈ నామస్మరణము అనేది మీరు ఎక్కడ ఉండి చేసినా…… అరుణాచల శివరూపమైన ఆధ్యాత్మిక అయస్కాంతమైన అరుణగిరి మీకు స్వప్నంలో లేదా ధ్యానములో ప్రతినిత్యం కనిపించి అనుసంధానమై అనుగ్రహిస్తుంది. అప్పుడు మీ అంతిమ ఘడియదాకా ఈయన నిత్య నామస్మరణ చేస్తూ ఉంటే….. మీ భౌతిక లేదా యోగ మరణము కూడా మోక్షమరణము అవుతుంది.  ఈ మోక్ష ప్రాప్తి కోసం నిత్యం…… ఈయన నిత్య నామస్మరణ అయిన అరుణాచల శివ లేదా అరుణ శివ చేస్తూ….. ఆయనను దాటి ఈ అంతిమరూపమైన ఉన్నదో లేదో తెలియని పూర్ణ శూన్యము నందు శూన్యం అవ్వండి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ అరుణాచల క్షేత్ర దర్శనానికి వచ్చినప్పుడు మానసికంగా  ……మనసులో మౌనముగా మారి…. మనసులో అరుణాచల శివ నామస్మరణ చేస్తూ ఉండండి . ఇక్కడ ఒకరోజు చేసే ఈ మంత్రసాధన అనేది…..భౌతిక ప్రపంచంలో మీరు ఉన్నచోటలో 41 రోజులపాటు చేస్తే వచ్చే ఫలితమును వస్తుంది.  అదే ఈ క్షేత్రంలో ఈ నామస్మరణము 41 రోజుల పాటు చేస్తే….. అది మీరు ఉన్న చోటులో  16 నెలల పాటు చేస్తే వచ్చే ఫలితముతో సమానమని గ్రహించండి. అరుణాచల శివనామ స్మరణయే సకల మాయల నుండి….. సర్వకర్మ బంధాలనుండి…. సర్వ ఋణాలు బంధాల నుండి…. సర్వ పాప పుణ్యాల కర్మల ఫలాల నుండి.. సర్వజన్మల ప్రాప్తి నుండి….. కర్మఫల జన్మ శేషము లేకుండా జ్వాలాగ్నితో దగ్ధము చేసి….. మనకి కర్మజన్మ రాహిత్య స్థితిని ఇచ్చి….. పూర్ణ శూన్యంలో శూన్యము చేస్తుంది. “నేను” అలాగే “నేను కానీ నేను” సశేషంగా లేకుండా శూన్యము చేస్తుంది. పూర్ణ శూన్యప్రాప్తి కలిగిస్తుంది. 


గణపతి ముని కపాల మోక్ష అనుభవం:-  


అరుణాచల శివ అని నిత్య నామస్మరణ చేస్తూ …..ఉంటే బ్రతికి ఉండగానే కపాల మోక్షం పొందిన కావ్యకంఠ గణపతి ముని యోగి స్వానుభవాలు మనకి చెబుతున్నాయి. ఈయన గిరి మీద ఉన్న చూత  గుహ యందు తన కుటుంబ సభ్యులతో ఆవాసం చేస్తూ ఉండేవాడు.  అపితకుచాంబికా దేవి దర్శనం ప్రత్యక్షంగా పొందడంతో…. ఈవిడ మీద ఉమా సహస్రమని గ్రంథం రచించడం జరిగింది. అలాగే గణపతి, కుమారస్వామి నిజరూప దర్శనాలు పొందటము జరిగింది. ఒకరోజు రాత్రి ఈయన గుహయందు రాత్రి 8 గంటల సమయంలో తీవ్రమైన ధ్యాన నిష్టలో ఉన్నప్పుడు…  కుండలిని శక్తి ప్రవాహం కాస్త మూలాధార చక్రం నుండి బయలుదేరి సశరవేగంగా సహస్ర చక్రానికి…. ఆపై బ్రహ్మా  రంధ్రమునకు చేరుకుంటున్న సమయంలో…. ఈ వేగదాటికి శరీరం  నిలబడడం లేదని …..మాట్లాడే శక్తి లేకపోవడం ఈయన గ్రహించాడు. కొద్ది క్షణాల తర్వాత బ్రహ్మ రంధ్రం వద్ద కపాలం కాస్త రెండుగా చీలిపోయి విడిపోతున్నట్లుగా అనిపించ సాగింది. ఆ తర్వాత మూడు నిమిషాల పాటు ఏకధాటిగా తల అగ్రభాగమున నీలివర్ణ చంద్ర కాంతి పైకి తన్నుకొని రావటం…. చీకటిగా ఉన్న ఈ గుహ కాస్త ఈ కాంతితో  వెలుగులు  విరజిమ్ముతూ వెలుతురు పొందటముతో ……


ఇదంతా ప్రత్యక్షంగా చూసినా కుటుంబ సభ్యులు భయంతో ఆ పక్కనే ఉన్న విరూపాక్ష గుహ దగ్గరికి వెళ్లి అందులో ఆవాసం చేస్తున్న రమణ స్వామిని తీసుకొని రావటంతో ఈయనకి విషయం అర్థమైతనం జరిగినది అని గ్రహించి తలపై నుండి వస్తున్న కాంతిని చూస్తూ ఉండేసరికి కొన్ని క్షణాల తర్వాత ధ్యాన సమాధి నుండి గణపతి ముని బయటకు రావటం తనకి కలిగిన కపాల మోక్ష అనుభవం గురించి ఈయనకి చెప్పడము జరిగింది కొన్ని రోజులు బాగానే ఉంది ఆ తరువాత ఈ ముని ఎప్పుడు ధ్యానం నిష్ఠలోకి వెళ్లిన ప్రతీసారి ఈ నిలిరంగు కాంతి తన తల మీద వస్తూ ఉండేది. దీని నివారణ కోసం రమణ స్వామి కాస్త ఈయనకి చెక్కపాదుకలు ఇచ్చి ధరించమని చెప్పడంతో ఆనాటి నుండి వీటిని ధరించడంతో తల మీద నీలి కాంతి రావడం తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత ఈయనకి రససిద్ధి వచ్చింది. అబ్బింది ఈయన ఏదైనా ఇనుప వస్తువును ముట్టుకుంటే అధికాస్తా క్షణాలలో శుద్ధమైన బంగారముగా మారిపోయేది. ఈ సిద్ధి మాయను కూడా ఈయన దాటుకోవడం జరిగింది ఆ తర్వాత అష్టసిద్ధుల ప్రాప్తి కలిగింది.


ఎంతోమంది స్వానుభవాలలో గణపతి మునికి అష్టసిద్ధులు ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. ఇలా ఈయన తను బ్రతికి ఉండగానే… కపాల మోక్ష ప్రాప్తి పొందడం జరిగింది. ఇలా పురాణ కాలంలో పరశురాముడికి ఈ కపాలసిద్ధి ఈయన బ్రతికి ఉండగానే పొందడం జరిగిందని చెబుతారు. అది ఎలా అంటే…. తన తండ్రి ఆజ్ఞతో తన తల్లి యొక్క తలను నరకడం జరిగింది కదా! నిజానికి ఇదియే కపాలసిద్ధి విభేదం అని… అనగా తన కపాలములోని బ్రహ్మ రంధ్రం వద్ద ఈ భేదనము  జరుగుతుంది అని…. తన ఆత్మ కాస్త పురుష స్త్రీ ప్రకృతులను దాటి మూల ప్రకృతికి చేరడమే ఈ కపాల సిద్ధి విభేదన అవుతుంది అని…. శాస్త్రవచనముగా చెప్పడం జరిగింది.  ఆ తర్వాత కాలంలో ప్రస్తుత ఆధునిక కాలంలో బ్రతికి ఉండగానే ఇలాంటి కపాల విభేదన శక్తి కలగడం అనేది…. ఈ గణపతి ముని విషయంలో జరగటం జరిగింది. అందుకే అరుణాచల క్షేత్రంలోని అరుణగిరి మీద ఉన్న చూత గుహయందు 20-08-1922 సంవత్సరంలో ఈయనకి జరిగినట్లుగా ఈయన జీవిత చరిత్రలో చెప్పడం జరిగింది. ఈ అరుణాచల శివుడి సమక్షంలో ఈయన బ్రతికి ఉండగానే కపాల మోక్షమును పొందడం జరిగింది అన్నమాట ! ఆయనని నమ్ముకుని…. నిత్య నామస్మరణ చేస్తూ ఉంటే…. సాధ్యం కానిది ఏమీ లేదని…. సాధనా సాధ్యతే సర్వం సాధ్యమని ఈ గణపతి ముని యొక్క ఈ కపాల మోక్ష అనుభవం అందుకు నిదర్శనంగా సజీవ సాక్ష్యముగా నిలుస్తుంది అని తెలుస్తోంది కదా!  కాబట్టి ఈ క్షణం నుండి అరుణాచల శివ నామస్మరణయే నిత్య నామస్మరణముగా చేసుకోండి. మోక్ష ప్రాప్తి పొంది తరించి ధన్యులు అవ్వండి…


చాలామందికి ఇక్కడ రెండు ధర్మసందేహాలు సర్వసాధారణంగా వస్తాయి.  అది ఏమిటంటే….సప్త మోక్షపురాలలో పొందే మోక్షము కన్నా అరుణాచల క్షేత్ర మోక్షము ఎలా ఉన్నతమైనది… అన్నప్పుడు దీనికి సమాధానము స్కాంద పురాణంలోనే ఉంది. అది ఏమిటంటే…. ఒక త్రాసు తీసుకొని ఒకవైపు సప్తమోక్ష పురాలు….అనగా అయోధ్య, మధుర, హరిద్వార్, ఉజ్జయిని, కంచి, కాశీ ,ద్వారక పెడితే…. దీనికి సరి సమానముగా అరుణాచల క్షేత్రం అనేది మరొకవైపు పెడితే త్రాసు బరువు ఈ క్షేత్రం వైపుకి కిందకి వంగుతుంది అని చెప్పటం జరిగింది.  అంటే ఈ లెక్కన చూస్తే… ఈ సప్త మోక్ష పురాలు మోక్షమునకు సరి సమాన  మోక్షము ఈ ఒక్క అరుణాచల క్షేత్రం అని చెప్పడం జరిగింది కదా ! అలాగే నామస్మరణ అంటే శివ పంచాక్షరి అయిన ఓం నమశ్శివాయ చేయాలా? లేదా అరుణాచల శివ చేయాలా? అన్నప్పుడు దీనికి కూడా సమాధానం మనకి స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. అది ఏమిటంటే…… శివ పంచాక్షరి మంత్రం అనేది యోగ పంచాక్షరి మంత్రమని…. అదే అరుణాచల అనే నామస్మరణ అనేది జ్ఞాన పంచాక్షరిగా చెప్పడం జరిగింది. పైగా శివ పంచాక్షరిని మూడు కోట్ల సార్లు స్మరణ చేస్తే ఎంత ఫలితం వస్తుందో….. ఒక్కసారి అరుణాచల అని స్మరణ చేస్తే అంత ఫలితము వస్తుందని చెప్పడం జరిగింది. దీనిని బట్టి ఓం నమశ్శివాయ కన్నా అరుణాచల లేదా అరుణాచల శివ లేదా అరుణ శివ లేదా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని నిత్య నామస్మరణ చేసి పూర్ణజ్ఞానము పొందండి.  తద్వారా మీకున్న మాయ మాయమవుతుంది.  అప్పుడు జన్మాంతర పాపాలు…. రాబోవు జన్మల కర్మలు, కర్మ బంధాలు, ఋణాలు , ఋణ బంధాలు అన్నీ కూడా ఈ జ్ఞాన మంత్రస్మరణ వలన మీలో జ్ఞానాగ్ని మొదలై  భస్మి పటలం చేస్తుంది.


రాను రాను ఈ జ్ఞానాగ్ని మీ అంతిమ మరణ క్షణములో యోగాగ్ని అయ్యి…. మీ భౌతిక దేహ మరణము కాస్త పూర్ణ మోక్షం మరణం  అవుతుంది.  విశ్వ పూర్ణమునందు శూన్యం అవుతారు.. ఏ శూన్యం నుంచి ఆదిలో వచ్చారో తిరిగి అంతములో అదే పూర్ణ శూన్యములో అంతమై… శూన్యం అవుతారు.  అప్పటితో మీ సాధన పరిసమాప్తి అవుతుంది. మీ ఈ జన్మ కాస్త మోక్షజన్మ అయ్యి పూర్ణ మోక్షం పొందడం జరుగుతుంది. ఇది ఒక్క ఈ అరుణాచల క్షేత్ర దర్శనము, గిరి ప్రదక్షిణం , నామస్మరణ వలన ఇది సాధ్యపడుతుందని గ్రహించండి.  కాకపోతే ఈ మూడు ప్రక్రియలు చేయడం అనుకున్నంత తేలిక అయిన విషయం కాదు. అసాధ్యము అయినా కూడా సాధనా సాధ్యతే సర్వం సాధ్యం అనగా నాకు ఏమీ తెలియదు…. నాకు ఏమీ చేతకాదు అనే అహంకార రహిత భావంతో…. సర్వస్య శరణాగతితో… వినయముతో ….భక్తి శ్రద్ధ విశ్వాసముతో….ఎవరైతే ఉంటారో…. వారికి మాత్రమే అరుణాచల క్షేత్ర ప్రవేశానికి సాధ్యపడుతుంది.  అంతేకానీ అహంకారంతో అన్నీ నాకు తెలుసు… నేను దేవుడిని…. నేను జ్ఞానిని… నేను అది ….నేను ఇది… అంటూ అహంకరిస్తే ఈ జన్మ కాదు, ఇక ఏ జన్మలోను అరుణాచల క్షేత్ర ప్రవేశం సాధ్యపడదు… అని స్కాంద పురాణములో  చెప్పడం జరిగింది. అందుకే అరుణాచల ప్రవేశానికి అధికారం కోసం “స్వామి!  అరుణాచల శివ… నాకు ఏమీ తెలియదు ,నాకున్నవన్నీ కూడా పాపాలే , నాకు ఏమీ చేతకాదు , నిన్ను నమ్ముకుని వస్తున్నాను. నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు…” అని ప్రాధేయ పడేవాడికి మాత్రమే అరుణాచల క్షేత్ర ప్రవేశం జరుగుతుంది.  ఇలా ఎప్పుడైతే ఈ క్షేత్ర ప్రవేశం చేస్తారో ….వారి జీవిత యాత్రలో ఒక ఎర్రటి గీత పెడతారు.  అదే అరుణ గీత అన్నమాట!  ఈ గీత వలన అరుణాచల ప్రవేశ అర్హత,యోగ్యత, యోగము, వస్తుంది . తద్వారా వీరి భోగ జీవితం ముగింపు పలికి…. అనగా కోటానుకోట్ల పునః కర్మల జన్మలు పరంపరమునకు స్వస్తిపలికి…. ఈ జన్మయే అంతిమ యాత్రమైన ఆరంభ యోగ జన్మ లేదా మోక్ష జన్మ  చేసుకునే అర్హత ఈ అరుణ గీత ఇస్తుంది అన్నమాట!  అనగా భోగ జన్మల పరంపర ఆగిపోయి…. యోగి జన్మల పరంపర మొదలవుతుంది. ఎవరైతే నిత్య అరుణాచల శివనామస్మరణ చేస్తారో వీలున్నప్పుడల్లా అరుణగిరి దర్శనం,  అలాగే గిరి ప్రదక్షిణం చేస్తారో…. తెలిసో తెలియక చేసిన కోటానుకోట్ల జన్మల పాప పుణ్యాల కర్మ ఫలాలు సర్వనాశనం అయిపోయి… భోగ యోగ జన్మల పరంపరకి స్వస్తి పలికి….. ఏ జన్మ ఏ అంతిమ మోక్షజన్మగా మార్చుకునే అవకాశం అర్హత, యోగ్యత ,యోగము సిద్ధిస్తుంది . 


ఇంతటి మహోన్నత మహత్తరమైన ఈ అరుణాచల క్షేత్ర పూర్వ వివరాలు అనగా ….ఈ క్షేత్రము ఎలా , ఎందుకు ఆవిర్భవించింది….అలాగే ఈ క్షేత్ర వివరాలు…. ఈ క్షేత్ర గిరి ప్రదక్షిణ ఫలితాలు… ఈ క్షేత్ర తీర్థాలు…. ఈ క్షేత్ర దేవాలయాలు…. ఇలా వివరాలు మనకు స్కాంద పురాణంలోని మహేశ్వర ఖండంలోని అరుణాచల మహత్యము నందు గ్రాంథిక భాషలో కనబడతాయి.  వీటిని సరళమైన వాడుక భాషలోకి అనువదించి కూర్చి…. మీకు మేము అందించడం జరుగుతుంది. నవవిధ భక్తులలో శ్రవణ భక్తి అలాగే స్మరణ భక్తితో అరుణాచల క్షేత్ర విశేషాలు ఈ గ్రంథ పారాయణం చేస్తూ….. అరుణాచల శివ నామస్మరణ చేస్తూ…. ఈ గ్రంథ పారాయణం శ్రద్ధ భక్తితో…. విశ్వాసంతో పూర్తిచేసి….. అరుణాచల శివ అనుగ్రహం పొంది….మీ ఇష్ట కామ్య ఫల సిద్ధిని పొందండి…. ధన్యులై తరించండి …


శుభం భూయాత్

అష్టాదశ అధ్యాయం సమాప్తం 

సర్వం అరుణాచల శివార్పణమస్తు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి