అధ్యాయం 21
కొత్త బ్రహ్మ - విష్ణు ఆవిర్భావం
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
కొత్త బ్రహ్మ ఆవిర్భావం
అనంత జ్యోతిస్తంభము కాస్త అరుణ జ్యోతిర్లింగముగా మారి…. 16000 సంవత్సరాలు పూర్తి అయిన తరువాత, ఆది బ్రహ్మ మరియు ఆది విష్ణువు తరాలు పూర్తి అయ్యి…. తర్వాత 96 కల్పాలు పూర్తి అవడంతో…. కొత్త బ్రహ్మ ,కొత్త విష్ణువు అవతారాలు అవతరించడం జరిగింది. 96 కల్పాలు అంటే…. ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క కొత్త బ్రహ్మ అలాగే… కొత్త విష్ణువు అవతరించి 96 బ్రహ్మలు, 96 విష్ణువు అవతారాలు సంపూర్తి అయ్యాయి అన్నమాట! కానీ వీళ్లు అవతారాలు అవతరించినట్లుగా…. ఆది రుద్రుడు అవతరించలేదు. వీళ్ళు రూపాంతర జన్మలు ఎత్తినట్లుగా… ఆది రుద్రుడు రూపాంతర జన్మ ఎత్తలేదు. ఆయన కాస్త మూలస్థాన మూర్తిగా నిశ్చల స్థితిలో ….శాశ్వతముగా ….మార్పులేని స్థితిలో ఉండిపోయాడు. కారణం ఈయన కాస్త అన్నిటికి అతీతస్థితి అనగా శూన్యాతీత స్థితి అయిన పూర్ణ శూన్య స్థితికి చేరుకోవటం జరిగింది. మిగిలిన వీరిద్దరూ అనగా… ఆది బ్రహ్మ అలాగే ఆది విష్ణువు కాస్త ఇలాంటి అతీత స్థితి అనగా భావాలకు అతీతమైన స్థితిని పొందకుండా, భావాల స్థితిలో శాశ్వతంగా…. నిత్యముగా… సత్యముగా… ఉండిపోవడంతో…. వీరి భావాలకి తగ్గట్టుగా సరికొత్త భావరూప శరీరాలతో… రూపాంతరం చెందడం జరుగుతుందన్నమాట! ఇలా వచ్చిన ఆది బ్రహ్మ నుండి సరికొత్త బ్రహ్మ రూపాంతర సాధనాస్థితి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త బ్రహ్మ కాస్తా… బ్రహ్మ పదవి అలంకరించి, సృష్టి బ్రహ్మగా మారి, విశ్వసృష్టి చేయడం ఆరంభించాడు. ఒకానొక సమయంలో ఈయన దగ్గరికి ఇంద్రుడు వచ్చి తపో నిష్ఠలకి ధ్యాన భంగము చేసే మోహిని మాయతో ఉన్న ఒక స్త్రీ మూర్తిని సృష్టించమని కోరడం జరిగింది. దానితో ఇంద్రుడి కోరిక మేరా తన సంకల్ప సిద్దితో మోహిని మాయ అంశతో ఉన్న ముగ్ధమనోహర రూప అతిలోక సుందరిని సృష్టించడం జరిగింది. ఈమె అందచందాలకి ఈమెకి ఉన్న మోహిని మోహనాంగ మాయ ఆకర్షణ శక్తికి ఈ బ్రహ్మదేవుడే ఈమె మోహమాయలో పడిపోయి….తను ఈమెకి తండ్రి అవుతాడు అనే జ్ఞానమును మరిచిపోయి…. తదేకముగా ఈమెను కామ దృష్టితో చూడసాగాడు. ఈ విషయం ఈమె గ్రహించి…. తన తండ్రియగు ఈ బ్రహ్మకు నమస్కారం చేసి ప్రదక్షణ చేస్తూ ఉండగా…. మోహమాయాపూరితుడైన బ్రహ్మదేవుడు కాస్త నాలుగు ముఖాలతో ఈమె చేసే ప్రదక్షిణము కామ దృష్టితో చూడటం ఈమె గమనించి…. ఇబ్బంది పడుతూ ప్రదక్షిణం ఎలాగో పూర్తి చేసుకుని ఆకాశంలోనికి పరిగెత్తింది. ఈ విషయం గమనించిన బ్రహ్మ కాస్త చిలుక రూపంలో ఈమెను వెంబడించాడు. పక్షి రూప బ్రహ్మని చూసిన ఈమె కాస్త భయముతో అరుణాచలేశ్వర స్వామిని ప్రార్థించడానికి అరుణాచల క్షేత్రమునకు చేరుకుంది. ఈ విషయమును గమనించని బ్రహ్మ కాస్త ఈ చిలుక రూపంతో తనకి తెలియకుండానే ఈ క్షేత్రానికి చేరుకోవటం జరిగింది. ఈమె ఈ క్షేత్రానికి చేరుకొని స్వామి! అరుణాచలేశ్వర బ్రహ్మ విష్ణువు కూడా తెలుసుకోలేని మహాదేవా ! నిన్నే శరణు వేడుతున్నాను… నా తండ్రియగు బ్రహ్మ నుండి నన్ను రక్షించుమని వేడుకొంది. ఈమె మొర విన్న అరుణాచలేశ్వర స్వామి వారు …. ఈ పర్వత లింగము నుండి ఒక నల్లటి బోయవాడిగా వచ్చి…. పక్షి రూపంలో ఉన్న బ్రహ్మకేసి ధనస్సును ఎక్కుపెట్టగా …ప్రాణభయంతో పక్షి రూపంలో ఉన్న బ్రహ్మ కాస్త… బ్రహ్మ నిజరూపంలో అవతరించి… వచ్చింది బోయవాడు కాదని… సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపమైన ఆది రుద్ర అంశ అయిన అరుణాచలేశ్వర స్వామి అని గ్రహించడంతో….. అప్పటిదాకా ఇతనిని ఆవరించి ఉన్న మోహమాయ నశించడంతో…. తను చేసిన తప్పు ఏమిటో అప్పుడు తెలిసి రావడంతో…. స్వామి! నన్ను క్షమించండి. నేను సృష్టించిన మోహిని మాయకి నేనే బలి అయ్యాను అని నాకు తెలియ రాలేదు. నేను చేసిన ఈ పాపపు కర్మ నుండి నీవు తప్ప ఎవరూ కూడా నన్ను రక్షించలేరు. పాపపూరితమైన ఈ దేహమును నీ ధనస్సుతో సంహరించి…. మరొక సృష్టికర్తను సృష్టించుము అని వేడుకునే సరికి…. స్వామి వారు కాస్త ఓ చతుర్ముఖ! బ్రహ్మ పదవిలో ఉన్న వారికి రాగ ద్వేషాలు వదలవు కదా! నీవు చేసిన ఈ పాప కర్మ నివారణ కోసం నీవు నా నుండి కొన్నాళ్లపాటు దూరమవుతావు. నా ఎడబాటే నీకు శిక్షగా మారి…. ఆవేదన అయ్యి…. కన్నీరు అవుతుంది. తద్వారా నీ దోష పరిహారం అవుతుంది. అందుచేత దూరంగా ఉన్నా కూడా నీవు నా తేజోలింగమైన అరుణాచలమును ఎప్పుడూ స్మరించుకో! ఎవరైతే ఈ అరుణాచలమునందు నిత్య నామస్మరణ ,గిరిప్రదక్షిణ ,తేజోలింగ దర్శనాలు, పూజలు, స్తోత్రాలు, గిరి నమస్కారాలు చేస్తూ ఉంటారో ..వారు తెలిసో లేదా తెలియకో వారి శరీరముతో… మనసుతో….మాటలతో… చేసిన ఇలాంటి సర్వపాపాలు కూడా హరించి వేయబడుతాయని తెలుసుకో! కైలాసం, మేరు పర్వతం, కుల పర్వతం నా స్వస్థానము యందు నా శరీర రూప దర్శనాలు కలుగుతాయి.. కానీ, ఈ అరుణాచలం నందు స్వయంగా పర్వతలింగము లాగా నేనే ఉంటాను అని గ్రహించు. కనుక నేనే ఈ పర్వత లింగమును కాబట్టి…. దీనిని దూరం నుండి దర్శించుకున్న వారి పాపాలు కూడా పోయి… నన్ను పొందుతారని తెలుసుకో! వారు తద్వారా నా శివ మోక్ష జ్ఞానమును పొందుతారని గ్రహించు అని చెప్పి అంతర్దానం అవ్వడంతో…. నవీన బ్రహ్మ కాస్త అరుణాచల క్షేత్రం మహిమ తెలుసుకొని…. అరుణాచలేశ్వర అంశ అయిన ఆది బ్రహ్మ నిత్యము స్నానం చేసిన బ్రహ్మ పుష్కరిణిలో …. ఈయన స్నానం చేసి…. మోహిని మోహ బంధము నుండి బంధ విముక్తి పొందడం జరిగింది. ఏ ప్రాంతంలో అయితే తనకి అరుణాచలేశ్వర స్వామి కాస్త బోయవాడిగా అగుపించి… తన మోహమాయను విముక్తి కలిగించారో అక్కడ ఈయన చేతుల మీద శివలింగమును ప్రతిష్టించి…. తనకి వచ్చిన మోహమాయ నుంచి విముక్తి పొందుటకు సాధన చేసి… విముక్తి పొంది… అక్కడి నుండి తన బ్రహ్మలోకమునకు తిరిగి వెళ్ళటం జరిగింది. ఇలా ఈయన ప్రతిష్టించి ఆరాధన చేసిన శివాలయమే ఆది అన్నామలై గుడి అయింది. అలాగే బ్రహ్మకి బోయవాడిగా కనపడిన అరుణాచలేశ్వర స్వామి ప్రాంతము కూడా మనకి గిరి ప్రదక్షిణంలో వచ్చే రాజరాజేశ్వరి దేవాలయమునకు ముందువైపు ఎదురుగా…. బోయవాడి రూపంలో ఉన్న స్వామివారి గుడి, కొంచెం అడవి లోపల ఉన్నట్లుగా కనపడుతుంది. బోయవాడి రూప గేటు చూస్తే ….లోపలికి 100 మీటర్లు వెళితే….ఆరు బయట వరండాలో బోయవాడి రూపం ఉన్న అరుణాచలేశ్వర స్వామి…. అలాగే ఈయన వాడే తెల్లని గుర్రాల ప్రతిమలు కనపడతాయి. ఈ మహత్తర సంఘటన జరిగినదని అనటానికి ఈ రెండు దేవాలయాలు…. ఈ ఆధునిక కాలంలో కూడా ఉండి సాక్ష్యముగా నిలుస్తున్నాయి.
కొత్త విష్ణువు ఆవిర్భావం
దేవతలకి అలాగే రాక్షసుల మధ్య ఆధిపత్య పోరు యుద్ధం మొదలైంది. కొన్ని లక్షల సంవత్సరాల తరువాత ఈ దేవతలకి యుద్ధంలో ఓడిపోయే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు ఆది విష్ణుమూర్తి కాస్త ఈ దేవతలకి రాజైన దేవేంద్రుడికి… ఉపేంద్రుడు పేరుతో తమ్ముడిగా పుట్టి… ఈ యుద్ధ రంగంలో దేవతలకి సహాయం చేసి…. దేవతలకి అపజయం బదులుగా రాక్షసులు పొందేటట్లుగా చేయడం జరిగింది. దానితో ఈ భీకర పోరులో ఉపేంద్ర విష్ణుమూర్తి అయిన కొత్త విష్ణువు కాస్త విపరీతంగా అలసి సొలసి పోవడంతో…. ఈయన శరీరానికి విపరీతమైన యోగమత్తు ఆవరించడంతో… ఈయన కాస్త యోగ నిద్రలోకి జారుకోవడం జరిగింది. ఎంతగా అంటే ఒక కల్ప కాలం గడిచిపోయినా కూడా…. ఈయన ఈ నిద్ర నుండి మేలుకోలేదు. దానితో ఈ విశ్వ జగత్తులో స్థితి కార్యక్రమం ఆగిపోయింది. తద్వారా స్థితి కార్యం ఆగిపోవడంతో… కాలస్వరూపం ఆగిపోయింది. అజ్ఞాన గాఢాంధకార చీకటి ఈ విశ్వమును నెమ్మది నెమ్మదిగా ఆక్రమించసాగింది. కల్పాంతము అయ్యిందా..! అన్నట్లుగా ఈ విశ్వలోకవాసులు భయపడసాగారు. అప్పుడు మహర్షులు కాస్త పరమేశ్వరుడి దగ్గరికి వెళ్లి స్వామి! కొత్త విష్ణువు కాస్త మోహ నిద్రలోకి వెళ్లి కల్ప కాలం అయ్యింది …విశ్వ స్థితిగతులు మారుతున్నాయి. కాబట్టి ఈ విశ్వరక్షణా బాధ్యతను మీరే తీసుకోండి అని ప్రార్థించగానే…. వీరి యందు ప్రసన్నుడైన పరమేశ్వరుడు కాస్త…తన దివ్య తేజస్సు నుండి 33 నిప్పురవ్వలు ఉద్భవింపచేశాడు. ఇవి కాస్త 11 ఏకాదశ రుద్రులుగా…. 12 ఆదిత్యులుగా …..8 వసువులుగా….ఇద్దరు అశ్విని దేవతలుగా… ఇలా 33 మంది దేవతలుగా మారి వీరు కాస్త ఒక్కొక్కరు ఒక్కొ కోటి రూపాలుగా విభజన చెంది… 33 మంది దేవతలు కాస్త 33 కోట్ల దైవాలుగా మారి…. యోగ నిద్రలో ఉన్న నవీన ఉపేంద్ర విష్ణుమూర్తిని నిద్ర లేపటం జరిగింది.
అప్పుడు ఈ విష్ణుమూర్తి కాస్త మోహ నిద్ర నుండి మేల్కొని…. అసలు విషయం గ్రహించి…. తను ఒక కల్ప కాలం పాటు నిద్రపోయానని తెలుసుకొని అందుకు బాధపడుతూ…. అయ్యా! నాకు తమోగుణం ఆవరించడం వలననే ….కల్పాంతం వరకు నిద్రలో ఉండటం జరిగింది. నన్ను మేలుకొల్పడానికి స్వయంగా సదాశివుడే…. తానే పూనుకునే స్థితి తన వలనే జరిగింది కదా! నిద్ర చేతనే ఆత్మ జ్ఞానము నశించింది. ఈ విశ్వ జగత్తుని పాలించే తనే….నిద్రపోతే ఎలాగా! ఇంకా ఇలాంటి వాడికి ఏమి పని ఉంటుంది… మాయ ఆవరించి, మాయలో పడి, అజ్ఞానంలో పడి, నిద్ర మాయలో పడటం ఏమిటి? ఇప్పుడు సర్వకర్త అయిన శంభు శంకరుడిని వేడుకోవడం తప్ప వేరే మార్గము లేదు. ఈయన దర్శనం చేతనే సర్వపాపాలు పోయి… కోరిన కోరికలు తీరతాయి కదా ! అల్ప పుణ్యం చేసిన వారికి కూడా అది పవిత్రులని చేస్తుంది కదా అనుకుంటూ…. తన హృదయంలో సదా ఉండే సదాశివుని వేడుకోవడం ఆరంభించేసరికి…. శంభు రుద్రుడు అయిన సదాశివుడు కాస్త ….ఈయన యందు ప్రత్యక్షమయ్యే సరికి….విష్ణుమూర్తి కాస్త ఈయనకి సాష్టాంగ నమస్కారం చేయగానే…. పరమేశ్వరుడు… శరణు వేడిన విష్ణువును చూస్తూ లెమ్ము వత్సా ! అనగానే విష్ణుమూర్తి కాస్త స్వామి వారితో…. హే శంకర..! త్రిభువన పాలక… త్రిమూర్తి స్వరూప… త్రినేత్రుడా… త్రిగుణాతీత… త్రిపుర హర…. నీ అంశ చేత జన్మించిన దేవత అంశలైన మేమంతా కూడా జగత్తు నడిపిస్తున్నాము… కానీ నన్ను ఈ జగత్తుని రక్షించే బాధ్యత నాకు అప్పగించావు ….కానీ నాకు మోహ నిద్ర వలన ఒక కల్పాంతం వరకు నిద్రలో గడిపి…. ఈ బాధ్యత నిర్వహించలేకపోయాను. ఈ మోహ నిద్ర మాయ నన్ను వదలటం లేదు. అకాలములో నిద్రించిన నన్ను….. నీవు తప్పు పట్టడం లేదు. నన్ను ఏమీ అనటం లేదు. నేనేం చేయాలో చెప్పు. నా గతి ఏమిటి . ఈ దోషపరిహారం కోసం నేను ఏమి చేయాలో నా యందు అనుగ్రహించి సెలవియ్యండి స్వామి..! అని పదేపదే వేడుకోవడం చూసిన పరమేశ్వరుడు కాస్త …..ఓ మాధవ! నీ పూర్వపు ఆది విష్ణు మూర్తికి నేను ఒక వరమును ఇచ్చాను. అదేమిటంటే….. నా మహా తేజోమయ అగ్నిలింగముగా పర్వతలింగమై …స్థావర లింగముగా భూమి మీద అరుణాచల క్షేత్రమునందు నిలిచి ఉన్నాను. ఈ జ్యోతిర్లింగ దర్శనము చేతనే నీ తమో గుణము నశించి…. ఈ గుణము వలన ఏర్పడిన…. మోహనిద్ర మాయ నుండి విముక్తి పొంది…. ఆరు నెలల పాటు యోగనిద్ర పొంది ….సృష్టి యొక్క తక్షణ బాధ్యతను నిర్వహిస్తారు. ఈ యోగనిద్ర విరమణ సమయంలో నిన్ను ఎవరైతే వైకుంఠ ద్వార దర్శనం చేస్తారో…. వాళ్ళు నిన్ను పొందుతారు. నీ భక్తులు కాస్త నీలోక వాసులుగా చేరతారు అని వరం ఇచ్చి…. అదృశ్యం అవటంతో ఈ క్షేత్ర మహిమ తెలుసుకోవాలని ఈ కొత్త విష్ణుమూర్తి కాస్త ఈ క్షేత్రానికి చేరుకోవడం జరిగింది.ఈ శోణ గిరి యందు ఈయన చేరుకొని తపస్సు చేయడం ఆరంభించారు. ఒకవైపు కొత్త బ్రహ్మ అప్పటికే ఈ గిరి యందు ధ్యాన తపస్సు చేసుకొని…. బ్రహ్మలోకానికి వెళ్లారని ఈయన తెలుసుకొని…. అమిత శ్రద్ధ భక్తితో తనకి తమోగుణము వలన ఆవరించిన మోహమాయ నిద్ర నుండి విముక్తి పొందడం కోసం మోహనిద్ర కాస్త యోగనిద్రగా మారడం కోసం…. ఈ నవీన విష్ణువు కాస్త అతి తీవ్రమైన ధ్యాన సమాధి స్థితి పొందడం జరిగింది. తద్వారా తను సర్వపాపాల నుండి విముక్తి పొంది…. తిరిగి తన లోకమైన వైకుంఠమునకు వెళ్లబోతూ…. ఈ గిరి యందు సర్వదేవతలకి, సర్వ మహర్షులకి, సర్వయోగులకి, సర్వజ్ఞాన గురువులకి, యోగ్యమైన పవిత్రమైన స్థలముగా గుర్తించడంతో…. వివిధ లోకవాసులుగా ఉన్న వీరందరినీ తమ అనుకూలమైన రూపాలు ఎత్తి …..ఈ గిరి మీద ఆవాసం చేయమని ఆజ్ఞాపించి ….తను బ్రహ్మ సరస్సులో స్నానం చేసి… అరుణగిరికి ప్రదక్షిణం పాదుకలు లేకుండా కాలినడకతో పూర్తిచేసి…. అరుణాచలేశ్వర జ్ఞాన లింగమును దర్శించి… పూజించి… సర్వపాప విముక్తుడై…. తిరిగి సర్వలోకాలను పరిపాలించే స్థితికారక పదవిని …అధికారమును… పొంది తన లోకానికి తిరిగి వెళ్ళడం జరిగింది . ఇలా 96 కల్పాలలో ఆది విష్ణువు నుండి ఎన్నో విష్ణు అవతారాలు వచ్చాయి . వాటిలో రాక్షసుల సంహారం కోసం కొన్ని ఉగ్రరూపాలతో విష్ణు అవతరించడం జరిగింది. కానీ ఇవి ఉగ్రరూపం నుంచి శాంతమూర్తిగా మారకుండా ఉగ్ర ఉన్మాద స్థితిలో ఉండి విశ్వరక్షణ కాస్త విశ్వ భక్షణ చేస్తూ ఉంటే ….పరమేశ్వరుడు కాస్తా విశ్వరక్షణా బాధ్యతను తనే తీసుకొని ఈ ఉగ్ర మూర్తి విష్ణు స్వరూప అవతారాలను సంహరించక తప్పలేదు. అంతెందుకు హిరణ్యకశిపుని సంహరించడానికి విష్ణుమూర్తి కాస్త ఉగ్రమూర్తి అయిన నరసింహ స్వామి అవతారము ఎత్తి…. ఈ రాక్షస సంహారం చేసినా కూడా…. శాంతమూర్తిగా కాకుండా… ఉగ్ర మూర్తిగానే ఉండి లోకాలన్నీ భయపెడుతుంటే ….అప్పుడు పరమేశ్వరుడు కాస్త విచిత్రమైన జంతువుగా శరభ అవతారముగా అనగా సింహం శరీరంతో ….పక్షితలతో….పక్షి రెక్కలతో అవతరించి ఈ నరసింహ స్వామిని సంహరించారని శివపురాణంలో మనకి చెప్పడం జరిగింది.దీనికి నిదర్శనముగా ఈ శంభు అవతార విగ్రహ మూర్తి మనకి అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో కనబడుతుంది. అలాగే తమిళనాడు ప్రాంతంలో శంభు విగ్రహారాధన విధివిధానము ఉంది. అదే విష్ణు పురాణం ప్రకారం అయితే… ఈ ఉగ్ర నరసింహ స్వామి కాస్త మహాలక్ష్మి దేవి కాస్త చెంచులక్ష్మి రూపంలో వచ్చి…. మేడి ఆకులతో శాంత పరిచి… ఉగ్ర మూర్తిని కాస్త శాంతమూర్తిగా మార్చడంతో లక్ష్మీనరసింహస్వామిగా అవతార పరిసమాప్తి అయ్యిందని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఏది సత్యాసత్యాలు నాకైతే తెలియదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే నా వంతుగా భావించాను. ఇలా ఉగ్ర మూర్తి రూపాలలో విష్ణుమూర్తి అవతరించడం జరిగింది. హిరణ్యాక్ష సంహారం కోసం ఆది వరాహ… ఇలా విష్ణు అవతారాలు ఉద్భవించాయని లోకవిదతమే కదా !
ఏక వింశతిః (21వ) అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి