అధ్యాయం 16

 అధ్యాయం 16 

మోక్ష అనుభవం చూపించే పాండవ తీర్థం 

`````````````````````````````````````````````````````



మనము శ్రీశైల క్షేత్రానికి వెళితే… అక్కడ శిఖర దర్శనం అయితే… ఆరు నెలలలో  మోక్షము లభిస్తుందని లోక విధితమే కదా!  అలా ఈ అరుణాచల క్షేత్రంలో ఇలా ఏమైనా ఉందా? అని నాకు వచ్చిన సందేహానికి సమాధానముగా…. స్థానిక వయో వృద్ధ సాధువు చెప్పిన సమాధానం వినగానే….. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇది వింటుంటే…. సినిమా కథలాగా అనిపించింది.  ఈయన మాటలను బట్టి చూస్తే, ఈ క్షేత్రంలో పాండవుల తీర్థం  ఉన్నది అని…..ఇందులో సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో వెళ్లి…. ఈ గుడి ఆవరణములో ఉన్న మర్రిచెట్టు కింద కూర్చొని…..జపము లేదా ధ్యానము చేస్తే… మన ఒడిలో మర్రిఆకు పడుతుంది .ఈ ఆకును తీసుకొని….గుడి లోపల ఆవరణలో ఉన్న పంచ పాండవ కొలను తీర్థములో ఈ ఆకుని వేస్తే…. కొన్ని చేపలు పైకి వస్తాయి.  అందులో ఏదో ఒక చేప కాస్త ఈ ఆకును తాకుతుంది.  అప్పుడు మనకి ఒక పెద్ద పాము కనబడుతుంది. ఆ తర్వాత గుడి బయట ఉన్న  భీముని కొలను తీర్థానికి వెళితే…. మన ఆకుని పట్టుకున్న చేపను ఒక పాము పట్టుకొని మింగితే అదియే అంతిమ మోక్ష అనుభవం అవుతుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన అంతిమ దేహమైన కీర్తి దేహము కాస్త…. చచ్చిన చేప ఆకార దేహముగా ఉంటుంది.  విష్ణుమూర్తి యొక్క మొదటి అవతారం కూడా చేపనుండే వచ్చింది కదా!  అలాగే నవనాధులలో మొదటివాడైన మచ్చింద్ర నాధుడు కూడా శివాంశతో చేపనుండి జన్మించాడు కదా! అంతెందుకు ……గృహ వాస్తు దోషాల నివారణ కోసం చేప యంత్రం ప్రతిష్ట చేయడం జరుగుతుంది కదా!  కావాలంటే గుడి దగ్గరికి వెళ్లి గుడి లోపల నేల మీద చూస్తే రెండు చేపల బొమ్మలు…. అలాగే గుడి గోడమీద సూర్యచంద్రులని తింటున్న రెండు పాముల బొమ్మలు…. అలాగే గోడమీద సింహం తల, మరియు స్తంభం మీద రెండు తలలో ఉన్న గండబేరుండ పక్షి మరియు శ్రీకృష్ణుడి కనబడతారు.ఇలా ఈ గుడిలో మనకి 4 జంటలతో ఉన్న చేపలు అలాగే విడిగా ఉన్న 4 చేపలు కనపడతాయి.అనగా ఈ 12 చేపలు కాస్తా మన భౌతిక దేహములో ఉండే 12 శరీరాలు అనగా స్ధూల,సూక్ష్మ,కారణ,వాయు,ఆకాశ,ఆత్మ,సంకల్ప,జ్యోతి, మనో,పిండ,లింగదేహ,కీర్తి శరీరాలకి ప్రతీకలని గ్రహించాను.అలాగే మూడు సర్పాలు అనేవి ఇడ,పింగళ,సుషుమనాడులకి ప్రతికలని తెలిసింది. గుడి బయట ఉన్న తీర్థము దగ్గర చేపని తింటున్న పాము బొమ్మ కనపడితే…..గుడి ఆవరణలో బతికి ఉన్న ఒక చేప బొమ్మ శిల కనపడుతుంది.  అలాగే గుడి బయట ఉన్న తీర్థములో చేప ఆకార శిల మరియు చేప మణి ఆకార శిల కనపడతాయి. ఇలా నీకు ఈ క్షేత్ర మోక్ష అనుభవం పొందాలంటే…. చేప మణి నీకు అందాలి….అని ఆ సాధువు చెప్పగానే ……నా మెడలో ఉన్న చేప మణిని అతనికి చూపించగానే….. సంబరపడిపోతూ అయితే ఈరోజే చంద్రగ్రహణం కదా!  వెళ్లి మోక్ష పరీక్ష చేసుకో ! జయం పొందితే అదృష్టవంతుడివి అవుతావు….. నాకు ఇంతవరకు ఈ చేప మణి దొరకలేదు.  దానితో ఈ గ్రహణ సమయాలలో గుడి దగ్గరికి వెళ్లి…. మర్రి చెట్టు కింద కూర్చుని…. ధ్యానం చేసినా కూడా మర్రి ఆకు నా మీద ఇంతవరకు పడలేదు. నీకు చేపమణి వచ్చింది కదా! బహుశా ఈ మోక్ష అనుభవం చూసే యోగం నీకు ఉందేమో పరీక్షించుకో అన్నాడు. నాకు ఇదంతా నమ్మబుద్ధి కాలేదు.  కానీ మన అంతిమదేహమైన కీర్తి దేహం అనేది చచ్చిన చేప దేహం లాంటిది అని…. నా స్వానుభవంతో ధ్యాన అనుభవాలలో ధ్యాన దృశ్యాలను చూసి గ్రహించాను.  ఎవరైతే కీర్తి శరీరం, కీర్తి ప్రతిష్ట మాయలో పడకుండా ఉండాలని గుప్త సాధనలో గుప్తయోగిగా మారి లుప్తం అవ్వాలని అనుకుంటారో….. వారు చేప మణి ధరించాలని నాకు జ్ఞాన స్ఫురణ అందడంతో ఈ మణిని ధరించడం జరిగింది. ఎందుకంటే కొన్ని రకాలైన పెద్ద చేపలు చనిపోయే కొన్ని రోజుల ముందు వాటి తలలో వాటి వీర్యం కాస్త చేరి చిక్కబడి ఒక తెల్లటి ముద్దగా మారుతుంది.  దీనినే చేప మణి అంటారు. ఇది ఏర్పడిన మూడు రోజులకి చేప చనిపోయి నీటి మీద తేలుతుంది.  ఇలాంటి చేప దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఇలాంటి చేప వయస్సు 12 లేదా 14 సంవత్సరాలు ఉంటేనే ….ఈ మణి ఏర్పడుతుంది.  పైగా ఈ మణి అనేది …..జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహు గ్రహానికి అనుకూల శక్తిగా మారుతుంది. అలాగే యోగ శాస్త్రం ప్రకారం చూస్తే, మన బ్రహ్మ రంధ్రం నందు అంతిమదేహమైన కీర్తి దేహము అనేది….. బ్రతికి ఉన్న చేప ఆకారముగా ఉంటుంది.  ఎప్పుడైతే సాధకుడు కాస్త  తన ఉనికిని లోకానికి తెలియనివ్వకుండా…. తన కీర్తి ప్రతిష్టల మాయలో పడకుండా….. ఉండటానికి ఈ అరుదైన చేప మణి దైవిక వస్తువుగా ధరించాలని….. అనుభవ జ్ఞాన గురువులు నాకు చెప్పడంతో….. ఈ మణిని సేకరించి ధరించి….నాకైతే శరీరం మాయను  దాటి నిశ్చల ధ్యాన సమాధి స్థితి పొందటం జరిగింది. కాకపోతే ఈ దేహము నిర్జీవమైనప్పటికీ…. అది ఆకారముతో ధ్యాన సమాధిలో కనపడుతూనే ఉంటుందని…..నాకు అర్థం అయింది.  ఈ కీర్తి దేహం కాస్త శూన్యములో శూన్యం అయ్యే మార్గం కోసం నా స్థూల దేహం బ్రతికి ఉండగానే….. నా అంతిమ కీర్తి దేహం కాస్త చచ్చి శూన్యం అయ్యే విధానము తెలుసుకోవాలని….. అదే అంతిమ మోక్ష అనుభవం అవుతుందని….. దీనిని ప్రత్యక్షముగా చూడాలని అనుకొని….. ఇలా ఈ అనుభవం చూపించే నిదర్శనం కోసం పరిశోధన చేస్తుంటే,  ఇలా ఈ సాధువు చెప్పిన పంచ తీర్థ కథనం గురించి తెలిసింది.  ఈయన చెప్పినది ఎంతవరకు నిజమో కాదో తెలుసుకోవాలని ఈ గుడి తీర్థానికి వెళ్లడం జరిగింది.  గుడి లోపల అలాగే  గుడి బయట సాధువు చెప్పిన అన్ని గుర్తులు ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. గుడి లోపల తీర్థంలో చేపలు కనిపించాయి. గుడి బయట తీర్థములో చేపలు కనిపించలేదు. కానీ పాము పిల్లలు కనిపించాయి… కప్పలు కనిపించాయి…. వీటిని బట్టి చూస్తే,  సాధువు చెప్పిన విషయంలో నిజం లేకపోతే లేదు…. అని అనిపించడంతో


 అక్కడ ఉన్న మర్రి చెట్టు కింద కూర్చుని 48 నిమిషాల పాటు ధ్యానంలో ఉన్నాను.  ఈరోజు చంద్ర గ్రహణం అయింది.  గుడిలో భక్తుల తాకిడి లేదు.  ప్రశాంతంగా నా ధ్యానము కొనసాగుతున్న సమయంలో అనుకోకుండా నా ఒడిలో మర్రి ఆకుపడింది.  దానిని తీసుకొని గుడి ఆవరణలో ఉన్న తీర్థములో వేశాను.  ఇలా కొన్ని చేపలు దీని దగ్గరికి వస్తే, ఒక చేప మాత్రం దీనిని నోటితో పట్టుకొని వదిలేసింది. అప్పుడు గుడి బయట ఉన్న తీర్థానికి వెళితే….. నా ఆకు పట్టుకున్న చేప ఈ తీర్థంలో కనిపించింది. అంటే గుడి లోపల తీర్థానికి అలాగే గుడి బయట తీర్థానికి ఏదైనా అంతర్గత సొరంగా మార్గం ఉండటం వలన ఈ చేప అక్కడి నుండి ఇక్కడికి వచ్చి ఉంటుందని అనిపించింది…. అప్పుడు ఒక పాము పిల్ల కాస్త   ఈ తీర్థములో ఉన్న చేప మణి పోలిన  ఆకారము ఉన్న శిల దగ్గరి నుండి బయటకు వచ్చి…. ఈ చేపను పట్టుకొని మింగే దృశ్యం చూస్తున్న సమయానికి అనుకోకుండా ఇదంతా ఇలా జరుగుతుందని చెప్పిన సాధువు నా దగ్గరికి వచ్చి….. నాయన!  జయం పొందావు, నేను ఇంతవరకు ఈ స్థితికి రాలేదు. నాకు చేప మణి దొరకలేదు.  అలాగే నాకు మర్రి ఆకు పడలేదు.  రుద్ర మంత్రములో చెప్పినట్లుగా దోస పండు ఎప్పుడైతే పండుతుందో…. అది కాస్త దానంతట అదే చెట్టు నుండి విడిపోయి…..రాలి పడిపోయినట్లుగా….. జీవుడు కాస్త శివుడైతే వాడు కూడా కర్మ,జన్మ చక్ర వృక్షము నుండి మర్రి ఆకు రాలినట్లుగా రాలిపోతాడని మరొకసారి నీ విషయంలో కూడా జరిగి సత్యమని నిరూపణమయింది. ఇలా ఇప్పటికీ నేను ఇలా జయం పొందిన మోక్ష అనుభవం పొందిన వాళ్లలో..  నేను చూసిన వాళ్ళలో నువ్వు 108వ వాడివి. అదృష్టవంతుడివి. బ్రతికి ఉండగానే జీవన్ముక్తుడివి అయ్యావు. సర్వకర్మ, జన్మ, ఋణ కారణల నుండి విముక్తుడవి అయ్యావు .ఇది అందరికీ సాధ్యపడదు… నీలాంటి వారికి సాధన చేస్తే సాధ్యమని నిరూపించావు. జయమస్తు…. విజయమస్తు…. శుభమస్తు… శుభం భూయాత్ అంటూ నన్ను దీవిస్తూ గిరి అగ్రభాగానికి వెళుతూ ఈసాధువు కాస్త క్షణాలలో అదృశ్యమైనాడు.  సిద్ధ సాధువులకి సాధ్యం కానిది ఏముంటుందని నాకు అనిపించి….. అంతిమ మోక్ష అనుభవం నాకు చూపించిన పాండవ తీర్థానికి నమస్కారం చేస్తూ…. ఉండగా 14 చేతులున్న విలోహిత రుద్ర మూర్తిని ఆరాధన చేస్తూ….. పంచముఖ శివుడి ప్రత్యక్ష దర్శనం అయ్యేసరికి….. నిజానికి ఇది పాండవ తీర్థం కాదని….పంచముఖ శివ తీర్థమని…. కాల క్రమంలో ఇది కాస్త పాండవ తీర్థమై ఉండవచ్చును.  అలాగే ద్రౌపది స్వయంవరం పరీక్షగా పెట్టిన మత్స్య యంత్ర చేధన పరీక్ష లాంటిదే….. చేపను పాము తినడం అని…. అలాగే కీర్తి దేహ చేపను ఎప్పుడైతే మనలోని  కుండలినీ శక్తి సర్పము మింగితే…. ఇది ఆకార స్వరూపం కాస్త నిరాకారమవుతుందని ఏ శూన్యంలో నుంచి వచ్చామో ….తిరిగి అదే పూర్ణ శూన్యమునందు ఎలాంటి ఆకార స్వరూపాలు లేకుండా….. నిరాకారమై శూన్యం అవుతుంది అని ……బ్రతికి ఉండగానే ఈ మోక్ష అనుభవం ఈ తీర్థ రాజం దగ్గర ప్రత్యక్షంగా చూడవచ్చును అని….. నాకు అర్థమై నాకు కన్నీటి ద్వారా రావడం జరిగింది. ఈ మోక్ష అనుభవం కోసం నా ఈ దేహం కాస్త ఎన్నో కోటానుకోట్ల జన్మలు ఎత్తి అంతులేని కథగా తిరుగుతున్న పునః సృష్టి కర్మ చక్రం యొక్క  బంధనము నుండి అంతమయ్యే కథగా మార్చుకొని బంధ విముక్తి పొంది నిరాకారం అయ్యాను కదా ! మనిషి జన్మకి ఇంతకంటే ఇంక ఏమి కావాలి….వాడి జన్మని మోక్షజన్మగా చేసుకోవడమే కదా! శూన్యములో శూన్యం అవ్వడమే కదా! మోక్ష అనుభవం  పొందుతాము గానీ…. మోక్షానుభూతిని పొందాము అని చెప్పలేము కదా! చెబితే అది పొందినట్లు కాదు కదా! చెప్పకపోతే పొందలేదు అనుకోలేము కదా! మన మరణం ఎప్పుడో మనకి ముందుగానే  తెలిసే అవకాశం…. మనము మోక్ష అనుభవం పొందడం లాంటిది అన్నమాట!  కానీ మనం మరణించిన విషయము మనకి తెలియదు కదా! తెలిస్తే మరణించినట్లే కాదు కదా ! ఇది మోక్ష అనుభవ….. మోక్ష అనుభూతి అన్న మాట!  మోక్ష అనుభవం మనకి బతికుండగానే పొందాలి . అప్పుడే మన మనసు, బుద్ధి , ఆత్మగా  కాస్తా నమ్ముతాము.  చచ్చినట్లుగా శూన్యం అవుతాము.ఇక మోక్ష అనుభూతి పొందడం అనేది సహజసిద్ధంగా మనకి తెలియకుండానే జరిగిపోతుంది.  మన భౌతిక మరణం మోక్షమరణం అవుతుంది . 


 ఇది ఇలా జరగాలంటే….. తప్పనిసరిగా సాధకులు అంతా కూడా…. ఈ క్షేత్రమునందు ఈ పాండవ తీర్థం దగ్గర అంతిమ మోక్ష అనుభవం పొందక తప్పదు.  పొందితే ఇక వాడికి తన మోక్షం మీద ఎలాంటి అనుమాన భయాలు ఉండవు.  నిస్సందేహముగా వాడి భౌతిక మరణమే మోక్షమరణము అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా అరుణాచల క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ మోక్ష అనుభవం ఇచ్చే పాండవ తీర్థమును దర్శనం చేసుకోండి . మీ మోక్ష సాధన స్థితి కోసం ఈ విధివిధానమును మోక్ష పరీక్షగా చేసుకోండి.  నాకులాగా మీకు కూడా ఇలాగే జరిగితే ఈ దేహజన్మ మోక్షజన్మ అయినట్లే అన్నమాట!  జయం పొందండి …..అంతిమ మోక్ష జన్మ చేసుకోండి.



షోడశ అధ్యాయము సమాప్తము 

శుభం భూయాత్ 

సర్వం అరుణాచల శివార్పణమస్తు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి