అధ్యాయం -28
అరుణాచల శివ పూజా మహిమ
•••••••••••••••••••••••••••••••••••••••••
ఇకపోతే నాకు ఈ క్షేత్రమునందు విశేష పూజ ….విశేష తిధులలో చేస్తే….ఏ పూజ ఫలితం కలుగుతుందో కూడా నీకు వివరంగా చెబుతాను శ్రద్ధగా విను….
ఈ నా అరుణాచల క్షేత్రమునందు ఒకరోజు ఉపవాసం చేస్తే….నూరు చంద్రయానములు అలాగే వెయ్యి సాంతపానములు చేస్తే వచ్చే ఫలితం కలుగుతుంది. సాంత పానము అనగా గోపంచకం… గోమూత్రమును సేవించడం అన్నమాట! అనగా వారం రోజులలో ఐదు రోజులు గోపంచకం భక్షించడం అనగా గోపంచకంతో వస్తువును ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చొప్పున తింటూ…. ఐదు రోజులు తిని ఆరవ రోజు గోమూత్రం సేవించి…. నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరించి…. ఏడవ రోజు ఉపవాసం చేసే వ్రతమును సాంత పనం అందురు.
ఆదివారం నాడు నన్ను ఎర్రని కలువులతో పూజిస్తే సార్వభౌమత్వం లభిస్తుంది. అదే సోమవారం నాడు కరవీర కస్తూరి పుష్పాలతో నన్ను ఆరాధన చేస్తే బ్రహ్మ ఆవాసం ఉండే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. అదే మంగళవారం నాడు ఎర్రని పుష్పాలు సమర్పిస్తే సకల సర్ప దోషాలు తొలగి…. అనుకున్న కార్యసిద్ధి కలుగుతుంది. అదే బుధవారం నాడు నాకు పచ్చని పుష్పాలను సమర్పిస్తే…. జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. వివేక బుద్ధి కలుగుతుంది. అదే గురువారం నాడు తెల్ల తామరలతో పూజిస్తే…. సిద్దులతో కూడిన జనలోక ప్రాప్తి కలుగుతుంది. అదే శుక్రవారం నాడు నన్ను చంపక పుష్పాలతో ఆరాధన చేస్తే….. బ్రహ్మర్షులు ఆవాసం చేసే తపోలోక ప్రాప్తి కలుగుతుంది. అదే శనివారం నాడు నన్ను జాతి మల్లికా పుష్పాలతో ఆరాధన చేస్తే మహా పాపాలు చేసినను వారికి యమలోక ప్రాప్తి బాధలు ఉండవు . అదే పాడ్యమినాడు నాకు పాయసం నివేదిస్తే…… సదా ధనధాన్యానికి అభివృద్ధి ఉంటుంది. అదే విదియ నాడు నాకు పెరుగన్నం సమర్పిస్తే…. భాగ్యవంతులై సోమపానం చేస్తూ ఆనంద డోలికల్లో ఉంటారు. తదియనాడు నాకు అపూపములను సమర్పిస్తే…. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని ఆరోగ్య శరీరంతో ఉంటారు. అలాగే చతుర్థి నాడు నాకు పూర్ణకుంభం సమర్పిస్తే… వారి సకల కోరికలు తీరతాయి. అదే పంచమినాడు నాకు పులగం నైవేద్యంగా సమర్పిస్తే…. అక్షయ వైభవం అనగా తరగని సుఖ భోగాలు కలుగుతాయి. షష్టి నాడు నాకు చక్కెర పొంగలి సమర్పిస్తే… వంశాభివృద్ధి కలుగును. అదే సప్తమి తిథి నాడు నాకు నువ్వుల అన్నమును నైవేద్యంగా సమర్పిస్తే….సమస్త ఋణ బాధల నుండి విముక్తి పొందుతారు. అష్టమి నాడు నాకు రాజనాల బియ్యముతో వండిన అన్నం సమర్పిస్తే రాజ్యాధికారాలు లభిస్తాయి. నవమి తిధినాడు నాకు గోధుమ అన్నం సమర్పిస్తే… దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి పొందడం జరుగుతుంది. అదే దశమి తిధినాడు నాకు కదంబం అనగా సర్వకూరలతో కూడిన అన్నమును నైవేద్యంగా సమర్పిస్తే…. భాగ్యవంతులై సర్వలోక ప్రియులు అవుతారు. అదే ఏకాదశి తిథి నాడు నాకు అటుకులు సమర్పిస్తే సర్వ విషయముల యందు భయం లేని అభయం లభిస్తుంది. అలాగే ద్వాదశి తిథి నాడు నాకు పప్పు అన్నం సమర్పిస్తే కోరిన కోరికలు తీరతాయి. ఇక త్రయోదశి నాడు సత్తుపిండిని నైవేద్యంగా పెడితే ఎల్లప్పుడూ శాంతిగా ప్రశాంత జీవితమును పొందుతాడు. అదే చతుర్దశి నాడు నాకు వివిధ ఫలములు సమర్పిస్తే అజ్ఞాని అయిన వాడు కూడా మహా జ్ఞానియై మహా పండితుడవుతాడు. అదే పౌర్ణమి నాడు నాకు పనస పండును సమర్పిస్తే కంటి జబ్బులు తగ్గుముఖం పడతాయి. అదే అమావాస్య తిధినాడు నాకు కందమూలములను సమర్పిస్తే….. వారి పితృదేవతలు సంతృప్తి చెంది ఉన్నతలోక ప్రాప్తి పొందడం జరుగుతుంది. వారికున్న పితృదేవతల దోషాలు అలాగే శాపాలు తొలగుతాయి.
ఇక నాకు నక్షత్రముల ప్రకారంగా నైవేద్యాలు సమర్పిస్తే…. ఏ ఏ పూజ ఫలితాలు కలుగుతాయో నీకు వివరిస్తాను. విను…. అశ్విని నక్షత్రం నాడు నాకు వస్త్రాలు సమర్పించాలి. భరణి నక్షత్రం నందు నాకు బంగారం లేదా వెండి లేదా ఇత్తడి లేదా పంచలోహయుత ఆభరణాలు సమర్పించాలి. కృత్తికా నక్షత్రమునందు నాకు దీపాలు వెలిగించాలి . రోహిణి యందు విభూతి…. మృగశిర యందు చందనము….. అర్త్రా నక్షత్రం యందు హరిచందనము…. పునర్వసు నందు పునుగు అనే సుగంధ ద్రవ్యమును నాకు సమర్పించాలి. అలాగే పుష్య నందు కర్పూరము… ఆశ్లేష యందు కుంకుమ పువ్వు… పూర్వ ఫాల్గుణ యందు తాంబూలం…. ఉత్తర ఫాల్గుణ యందు అగరు దీపము…. హస్తా నక్షత్రము నందు కాలాగరు ద్రవ్యమును …..స్వాతి నందు తులసి పుష్పాలు ….విశాఖయందు చామరాలు… అనురాధ నందు గొడుగులు…. జేష్ఠము నందు గోవులు… మూలా నక్షత్రం నందు ముఖ్యముగా హారాలు…. పూర్వాషాడ యందు కిరీటము…. ఉత్తరాషాడ యందు రత్నాభరణములు…. ధనిష్ట నక్షత్రం యందు బంగారమును….శతభిషాలు యందు వస్త్రాలు…. పూర్వభాద్ర యందు భోగ్య వస్తువులు…. ఉత్తరాభాద్ర యందు గుర్రాలు…. రేవతి యందు బంగారు రధము…. ఇలా నాకు సమర్పిస్తూ మహా పూజ చేయవలెను.
ఇక నన్ను మాసముల ప్రకారం ఏ విధంగా పూజించాలో వివరిస్తాను శ్రద్ధగా వినుము . పుష్యమాసము నందు నన్ను హోమాగ్ని మంత్రము పలుకుతూ ఆగ్నేయ ఉత్సవము జరిపించాలి. వైశాఖమాసము నందు విశాఖ నక్షత్రము నాటి నాకు కాస్త శివ తంత్రానుసారముగా దమనకోత్సవం జరిపించాలి. అదే మార్గశిరము నందు తెల్లవారుజామున నన్ను సామవేదం పఠిస్తూ మహా పూజ చేయాలి.
సూర్యుడు మేష రాశి యందు ప్రవేశిస్తే… నన్ను సింధూర, మల్లికా ,పద్మ, నందివర్ధన ,కలువ, మరవక, పాటలీ ,కుటజా ,నీప, జీవంతిక ,ధమనక వంటి పుష్పాలతో అర్చిస్తూ ….నామస్మరణ చేయాలి. నన్ను అలాగే అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించాలి. అలాగే రెండు సంక్రమణా కాలమునందు నా మంత్రాలు జపిస్తూ…. నన్ను పంచగవ్యములతో అభిషేకించాలి . తరువాత ఓంకార నాదము జపిస్తూ నన్ను పాలతో అభిషేకం చేసి శుద్ధి చేయాలి. ఉదయకాలమునందు తులసితో… మధ్యాహ్నం యందు బిల్వాలతోను…. సాయంకాలమునందు మల్లెలతోనూ…. నన్ను ఆరాధన చేయాలి. శని ప్రదోషమునందు ఆరుద్ర నక్షత్రమునందు వ్యతిపాత పర్వదినమునందు ఆది, సోమ వారాల యందు నన్ను ఆగమ పద్ధతిలో పూజించాలి. నీ ఇంటి అందు జరిగే శుభకార్యాలైన ఒకరైన కార్యక్రమం సమయమునందు… దీక్ష తీసుకునే సమయం నందు…. పుత్రోత్సవా లేదా వివాహ శుభకార్య సమయాలయందు….. జన్మ నక్షత్ర తిధియందు ఆపదలు వచ్చినా….. లేదా సంపదలు వచ్చిన రోజుల యందు….. యుద్ధమునకు వెళ్లే ముందు…. ఇలా ఈ సమయాల యందు నాకు విశేష పూజలు చేయాలి.
ఇక మోక్షమును పొందాలని అనుకునేవారు ఈ నా అరుణాచల క్షేత్రం నందు స్థిర ఆవాసం చేస్తూ……అరుణాచల మంత్రమును నిరంతరంగా జపిస్తూ…..నన్ను నిత్యం పూజించాలి. అలాగే చెప్పులు లేకుండా కాలినడకతో నా గిరిప్రదక్షిణం రోజుకి ఒకసారైనా చేయాలి. సర్వదా శుభాలు కలుగుతాయి. ఈ సమయంలో కాళ్లు తడబడిన…. తుమ్ము వచ్చినా…. లేదా దుస్వప్నము వచ్చినా …ఆలోచనలు వచ్చునా …..ఎక్కువ బాధ లేదా ఎక్కువ ఆనందం కలిగినను నా నామస్మరణ చేయాలి.
దూరప్రాంతాలలో ఉండేవాళ్ళు నా నామస్మరణ చేస్తూంటే వారి మరణానంతరం….ఈ క్షేత్రం నందు శ్రాద్ధ కర్మ చేయబడిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది.
అయోధ్య, మధుర, హరిద్వార్, అవంతిక, కంచి, కాశి, ద్వారకలకన్నా అరుణగిరి అత్యంత విశిష్టమైనదని గ్రహించు. ఎందుకంటే ఈ గిరి ఆవాసమే భూకైలాసము. అది భూమిపై గల శివలోకం అని తెలుసుకో! ఇతర క్షేత్రాలలో మానవులు కాస్త తపస్సు చేస్తే సిద్దులు పొందుతారు లేదా మోక్ష ప్రాప్తి పొందుతారు. అదే ఈ నా అరుణాచల క్షేత్రం నందు స్మరించినంత మాత్రము చేతనే సిద్ధులు అలాగే మోక్ష ప్రాప్తి పొంది ముక్తులవుతారు. ఇలా నా అరుణాచల స్మరణ శ్రవణ, దర్శన మాత్రము చేత….మానవుడు పునీతుడగుట నిశ్చయమని తెలుసుకో! ఈ క్షేత్రంలో జన్మించిన వారికి ఈ జన్మ యందు సమస్త భోగాలు అలాగే మరణానంతరం ముక్తి లభిస్తుంది. ఎవరైతే ఈ క్షేత్రమునందు నా జ్ఞానమును పొందుతారో ….వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఇతర ప్రాంతాలలో జన్మించి మహా పాపాలు చేసినవారైనా….ఈ క్షేత్రమునందు శ్రాద్ధకర్మ చేయబడితే…. మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఇది నిశ్చయము. అలాగే గంగా, ప్రయాగ, కాశీ, బ్రహ్మ పుష్కర, రామేశ్వర క్షేత్ర పరిసరాలలో చేసిన కర్మ ఫలితములు కంటే…. అధిక రెట్ల ఫలితము ఈ నా అరుణాచలంలో చేసిన కర్మకు ఫలితం కలుగుతుంది. అది పాపమయినా… పుణ్యమైనా…. ఇదే ఫలితం పొందాల్సి ఉంటుంది. అదే ఈ నా క్షేత్రమునందు మహాదానాలు చేసినా లేదా ఇతర దానాలు చేస్తే 16 రెట్లు అధిక ఫలితం కలుగుతుంది. కల్పములలో చేసిన పుణ్యకార్యాలకి ఇంకా రెట్టింపు ఫలితాలు పొందడం జరుగుతుంది. కాబట్టి ఈ క్షేత్రమునందు అగ్నిష్టోమా ,వజపేయా, వైరాజా, సర్వతో ముఖ ,రాజసూయ, అశ్వమేధాది యాగాలు విరివిగా చేసి…. నన్ను సంతృప్తిపరిచి రెట్టింపు ఫలితాలను పొందడం జరుగుతుంది. ఇలా అరుణాచలంలో ఉండే త్రికాలాలలో అనగా నా అరుణగిరిని సేవించాలి అంటూ శివమూర్తి చెప్పడం జరిగింది.
అష్ట వింశతిః (28వ) అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి