అధ్యాయం -24

 అధ్యాయం -24

గౌతమ మహర్షి అరుణాచల క్షేత్ర దర్శనం 

………………………………………………..




మహాశివుడి ఆజ్ఞ మేరా …గౌతమ మహర్షి కాస్త కైలాసమునకు చేరుకొని …ఈయన అతిథులుగా కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు. ఆ తర్వాత పరమేశ్వరుడు కాస్త ఈ గౌతమ మహర్షిని పిలిచి భూమి మీద మీరిద్దరూ తిరిగి వెళ్లి తీర్థయాత్ర చేయమని అనుజ్ఞ ఇవ్వడంతో.. ఇలా ఈ దంపతులు తిరిగి భూమి మీదకి వచ్చి తీర్థయాత్రలు చేయడం ప్రారంభించారు.  రుద్ర క్షేత్రమైన కేదార్నాథ్ క్షేత్రము…. నారాయణ క్షేత్రం అయిన బదరీనాథ్ క్షేత్రము….. కాశీ క్షేత్రము ఇలా ఉత్తర భారత దేశంలో ఉన్న పరమ పవిత్రమైన స్వయంభు క్షేత్ర లింగాలు ఉన్న క్షేత్రాలు దర్శించుకున్న తరువాత దక్షిణ భారతదేశంలో ఉన్న శ్రీశైలం, కంచి, రామేశ్వరం, కన్యాకుమారి ఇలా మున్నగు క్షేత్ర లింగాలు దర్శించుకున్నారు.  ఇలా శివుడి స్వయంభూ శివలింగ  క్షేత్రాలే కాకుండా…. ఋషులు, మహర్షులు, దేవతలు, యోగులు, భక్తులు మొదలైన వారు ప్రతిష్టించిన శివలింగాలను కూడా ఈయన తన శిష్యులతో కలిసి దర్శించుకోవడం జరిగింది. ఇలా తన శిష్య పరివారంతో అనేక శివ, దేవి క్షేత్రాలు…. అక్కడ తీర్దాలు సేవించుకుంటూ… శివనామస్మరణ చేస్తూ వీలున్నప్పుడల్లా యాగాలు, యజ్ఞలు, హోమ క్రతువులు నిర్వహిస్తూ…. ఇలా భూమండలం అంతా పర్యటిస్తూ…. చివరికి వీరందరూ కూడా స్వయంభుగా వెలసిన పర్వతలింగమైన అరుణగిరి ఉన్న అరుణాచల క్షేత్రమునకు చేరుకోవడం జరిగింది. 

ఈ పర్వతలింగమును తొలిసారి చూడగానే….. గౌతమ మహర్షికి అలౌకిక ఆనంద స్థితి పొందడం జరిగింది. ఈ గిరి మీద అప్పటికే ఎంతోమంది శివయోగులు, మహర్షులు, సిద్దులు, దేవతలు ఆవాసం చేస్తూ ఉండటం గమనించారు. అప్పుడు అమిత  శ్రద్ధా భక్తితో పర్వతలింగమును చూస్తూ…. ఓ దేవా!  మహాదేవ!  పరమేశ్వర!  అరుణాచల…!  నిన్ను ప్రథమంగా బ్రహ్మ తన దివ్యమైన కన్నులతో దర్శించాడు కదా!  లింగాలలో భూమి మీద మొట్టమొదటగా శివలింగం అని ఈ పర్వతలింగముగా ఆవిర్భవించావు కదా!  సాటిలేని మహిమ కలవాడివి.  అందుకే నిన్ను వేదాలు కాస్త అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగళః అని  కీర్తిస్తున్నాయి.  ఓ దేవేశా ! నీ దర్శనమే సర్వ ఫలప్రదము.  నిన్ను దర్శించిన వారికి ఇతర తపస్సులతో పని లేదు కదా ! ఈ విధంగా ఒక  పర్వతలింగముగా నిలిచిన నీ శివలింగము  మరెక్కడా లేదు కదా!  అష్టదిక్పాలకులతో ….సూర్యచంద్రుడితో…. దివ్య తేజోలింగముగా…. త్రికోణముతో…. త్రిమూర్తి స్వరూపమై… త్రిశక్తితో ….త్రికాల విదాయకమై …..త్రిదేహాత్మకమైన రూపము ధరించి….. భూమండలంలో అరుణాద్రిగా వెలిశావు.  తద్వారా నీ చేత ఈ కర్మభూమి కాస్త పవిత్రముగా భావించబడినది కదా!  పూజలు  జరపని శివలింగములే… శూన్య లింగాలు అంటారు . కానీ నీ పర్వతలింగమును ప్రతినిత్యం, అనునిత్యం దేవతలు, మహర్షులు, యోగులు, భక్తుల చేత పూజింపబడుతుంది కదా!  ఓ కరుణాపూర్ణ… శోణాద్రిశ్వర… మహాదేవ….!  సంసార సాగరంలో మునిగి ఉన్న ఈ  ధీనుని కటాక్షించి…. నేను చేసిన తపస్సులన్నీ ఫలించి….నీ పర్వతం లింగం దర్శన భాగ్యం కలిగింది. కానీ నిజరూప దర్శనం కోసం ఎదురుచూస్తున్నాను.  నీవు భక్తవత్సలుడు కదా ! అని ప్రార్థిస్తున్న గౌతమ మహర్షికి 

అరుణాచలేశ్వరుడు కాస్తా ప్రత్యక్షమై…. వత్సా ! నీ భక్తికి మెచ్చాను.  నీవు నిత్యం నా సన్నిధానంలో ఉండి నన్ను సర్వోపచారములతో అర్చన చేస్తూ తపస్సు చేయి.  నా మహత్యమును సర్వజీవులకి తెలియజేస్తూ…. సప్తర్షులు కాస్త నన్ను కైలాసములో నిత్యం అర్చన చేస్తున్నారు.  వారిలో ఒకడు అయిన నీవు…. ఈ భూమి మీద ఉన్న నన్ను …..నీవు ఈ భూలోకము వాసులందరి శుభము కొరకు… ఇక్కడ ఆగమ శాస్త్రం ప్రకారం నన్ను పూజించుము… అర్చింపుము….ఈ భూమి మీద ఉన్నవాళ్లలో నువు నాకు అత్యంత ప్రీతిపాత్రుడవైన వాడవు… ఇందు నివసించి నా మహిమను కీర్తించుము. ఇంతకుముందు నన్ను పూజించిన వారిలో నీవే ఉన్నత భక్తుడివి అయి ఉన్నావు. దేవతల చేత ఆకాశంలో నన్ను పూజిస్తే…. నువ్వు భూమి మీద ఈ క్షేత్రమునందు ఉండి అరుణాచల పూజను నిత్యం జరిపించు అనగానే…

గౌతమ మహర్షి కాస్త వినయంతో ….స్వామి! నీ  అనుగ్రహమునకు సంతోషించాను.  నేను ఎట్టి ఆగమ విధివిధానం ప్రకారం నిన్ను పూజించకుండానే…. నీవు ప్రత్యక్షమైనావు.  స్వామి ! నాకు ఈ గిరి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసు. కానీ దీనిని మీరు ఎలా ఏర్పరచుకున్నారో తెలియదు.  కాబట్టి వీటి నిదర్శనాలు…. వీటి వివరాలు నాకు  తెలియజేయగలరు. అరుణగిరి ఔన్నత్యము గురించి నాకు కొంచెం వివరించండి… నాయందు కృప ఉంచి మీరు నాకు అన్ని తెలియజేయండి అనగానే…. 

స్వామివారు కాస్త… ఓ గౌతమా ! ఈ ముల్లోకాలలో నీకు తెలియనిది లేదు.  వేదాలలో…. పురాణాలలో…. ఆగమములలోని సర్వ విషయములలో సర్వము నీకు తెలుసు కదా ! స్వర్గమును అలాగే నరకమును అలాగే మోక్షమును వాటి గురించి ఈ భూమి మీద మానవ జన్మ ఎత్తక తప్పదు అని నీకు తెలుసు కదా!  అలాగే ఈ మూడింటిని పొందుటకు భూమియే ప్రధానము కదా.. అందులో మానవులకు మూడు రకాలైన కర్మఫలములు ఉంటాయి కదా!  అవే నరకలోక, స్వర్గలోక ,కైవల్య సుఖములని నీకు తెలుసు కదా!  ఇందులో పాపములు బట్టి నరకలోక ప్రాప్తి అలాగే పుణ్యఫలమును బట్టి స్వర్గలోక ప్రాప్తి కలుగుతాయని.. ఇవి కూడా పోగు చేసుకున్న పాపపుణ్యాలు అంతరించేదాకా…. ఈ లోకాల ప్రాప్తి ఉంటుందని…. ఎప్పుడైతే ఈ రెండు అంతరిస్తాయో వాళ్ళు తిరిగి భూలోక ప్రాప్తి పొంది పాపపుణ్యాల ప్రాప్తి కోసం తపన తాపత్రయాలు పడుతూ ఉంటారు కదా!  ఇక మూడవది అయిన కైవల్య ప్రాప్తి అనేది పొందితే ఎన్నటికీ నశించనిది కదా!  ఈ ప్రాప్తి అనేది జ్ఞానం వలన మాత్రమే లభించుచున్నదని ఘంటా పథముగా చెప్పవచ్చును. ఆ విషయం నీకు తెలియనిది కాదు. కానీ ఈ శుద్ధ పూర్ణజ్ఞానం పొందడం అంత తేలికైనా విషయం కాదు కదా!  చాలా కష్టము కదా!  అందువలన ఈ క్షేత్రము ఎలాంటి జ్ఞానంతో సంబంధం లేకుండా…. శాస్త్రములను అభ్యసించకపోయినా లేదా సాధన అభ్యాసాలు చేయకపోయినా…. అనగా ఎలాంటి శబ్ద పాండిత్యము లేదా అనుభవ పాండిత్యము లేకపోయినా…. కేవలం నాకు ఏమీ రాదు…. నాకు ఏమీ తెలియదు… నాకు ఏమీ చేతకాదు….అని అహంకార రహిత భావంతో సర్వస్య శరణాగతితో నా నామస్మరణ చేస్తూ…. ఈ క్షేత్ర వాసులుగా చచ్చేదాకా ఉండగలిగితే…. వారికి కైవల్య ప్రాప్తి కలుగుతుందని అనడంలో…. ఎలాంటి అనుమాన భయం లేదు. ఇది అక్షర సత్యం అని ఘంటా పథముగా నేను నీకు చెబుతున్నాను. 


ఇలాంటి కైవల్య ప్రాప్తి కోసమే… ఈ క్షేత్ర అరుణపురమును విశ్వకర్మ చేత నిర్మించాను. ఇందు మూడు యోజనముల వరకు శివ దీక్షతో శివయోగులు ఆవాసం చేస్తూ ఉంటారు. అలాగే ఇది నా హృదయ స్థానం అని గ్రహించు. ఇక్కడ నేను కాస్త పర్వతలింగమై అరుణాచలేశ్వర స్వామిగా కొలువై ఉన్నాను.  పంచ శిఖరాలతో… పంచముఖాలతో.. పంచ ప్రక్రియలు చేస్తూ ఆవాసం చేస్తున్నాను.  ఈ పంచ శిఖరాలలో నా అరుణగిరికి తూర్పు దిక్కులో ఉన్న భాస్కర పర్వతము మీద ఇంద్రుడు ఆవాసం చేస్తున్నాడు.  అలాగే పడమర దిక్కులో ఉన్న పర్వతమునందు దండాద్రిలో వరుణుడు ఆవాసం చేస్తున్నాడు. దక్షిణమున ఉన్న అమరాద్రి పైన యముడు కాస్త ఆవాసం చేసుకుని ఉన్నాడు. ఇక మిగిలిన ఉత్తర దిక్కు యందు ఉన్న త్రిశూలాద్రి పైన విష్ణువు కాస్త ఆవాసం చేస్తూ నివసిస్తున్నాడు.  ఈ గుహ యందు అనేక సిద్ధులు.. శివయోగులు ఆవాసం చేస్తూ… ఇలా వీరందరూ నన్ను నిత్యం సేవిస్తున్నారు. అలాగే ఈ గిరికి ఉన్న నాలుగు దిక్కులలో అనగా తూర్పు దిక్కు యందు సూర్యుడు… దక్షిణమున విశ్వామిత్రుడు… పడమర వరుణుడు…ఉత్తరమున త్రిశూలేశ్వరుడు..పరివేక్షిస్తూ నన్నే నిత్యం ఆరాధన చేస్తున్నారు.  అష్ట దిక్కులకు కాస్త అష్ట శివలింగ మూర్తులు… నా చుట్టూ ఉండి.. నన్నే నిత్యం ఆరాధన చేస్తున్నారు.  అలాగే ఈ గిరి యొక్క ఉత్తర భాగంలో ఉన్న శిఖరం యొక్క అంతర్గత గుహయందు నేను కాస్త సిద్ధపురుషుడిగా శిరో ముండనం చేసుకొని కౌపీనం మాత్రమే ధరించి… మండాకృతి ఆకారంతో ఉన్న మహావట వృక్షమైన మర్రిచెట్టు కింద గురుదక్షిణామూర్తిగా ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నాను. భక్తులకి నా అవసరం కలిగినప్పుడల్లా…. బోయవాడిగా మారి వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాను. దానితో ఇక్కడి బోయలు కాస్త నా బోయ రూపమునే శివుడిగా నన్ను భావించి ….ఆరాధన చేస్తూ ఉంటారు.  అందుకే వీరు వృత్తి రీత్యా జంతు హింస చేసినా కూడా…. నాకు వీళ్ళు  శివ ప్రియులే అన్న మాట!  ఈ పర్వతలింగమును చూసిన నా అత్త, మామ అయిన మేనక హిమంతుడు కాస్త తమ అల్లుడు కూడా తమ వంటి పర్వతమేనని నన్ను చూస్తూ మురిసిపోతూ ఉంటారు.  ఈ అరుణగిరియే నా సాక్షాత్తు శివ స్వరూపం అని గ్రహించు.  నేను కాస్త కదలని, మెదలని స్థితిలో నిలిచి ఉన్నాను.  గిరి అగ్ర భాగం నందు నా అనంత జ్యోతి తేజస్సు కాస్త అరుణకాంతితో అరుణ జ్యోతిగా వెలుగుతున్నాను. అందుకే ఈ గిరికి  అరుణగిరిగా నామము స్థిరమైనది.  ఈ క్షేత్రమును అరుణాచలం గా అనగా అరుణ అనగా ఎర్రని కాంతితో అచలము అనగా కదలనిది మెదలని స్థితిలో ఉన్న కొండగా… ఎర్రటి కొండగా అరుణాచలం అయింది.


ఈ పర్వతము మీద పెరిగే వృక్షాలు… అలాగే తిరిగే జంతువులు…. అన్నీ కూడా నన్నే నిత్య ఆరాధన చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వీటి రూపాలలో దేవతలు, యోగులు, మహర్షులు కాస్త నా గిరియందు కనీసం జంతువుగా లేదా వృక్షముగా పుట్టిన ఈ జన్మ చరితం అవుతుందని భావిస్తారు.  కాబట్టి ఇక్కడ ఉండే ప్రతి వృక్షము అలాగే తిరిగే ప్రతి జంతువు కూడా ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే ముక్తిని  పొందుతాయి.  ఎందుకంటే ఈ గిరి మీద ఇవి ఆవాసం ఉండి… ఆగమశాస్త్ర విధానముగా పూజ చేసే మానవుల కన్నా అధికముగా గౌరవించబడి గుర్తించబడతాయి.  ఈ గిరి మీద ఉండే వృక్షాలు మరియు చెట్లు తోటలో చూస్తే…. నేను కాస్త జటాధారి అని తెలుపుతాయి.  ఇక్కడ ఉన్న సెలయేర్లు…. అలాగే పిల్లకాలువల ప్రవాహమును చూస్తే….. నామీద గంగా ఎలా ఉన్నదో …చూసే వాళ్ళకి అర్థం అవుతుంది. నాకు గిరి పక్కన ఉన్న ఇతర శిఖరాలు చూస్తే …నేను ఎలా త్రినేత్రుడిని అని అర్థమవుతుంది.  అలాగే ఇక్కడ రాత్రిపూట సంచరించే మిణుగురు పురుగుల కాంతి వలన….నాకు రాత్రిపూట హారతి ఇస్తున్నట్లుగా ఉంటుంది. శిఖరాల మీద, నక్షత్రాల కాంతికి నా నెత్తిమీద నిత్యము ఉండే చంద్రుడిని చూస్తూ హేళన చేస్తున్నట్లుగా ఉంటాయి. వర్షాకాలంలో ఈ గిరిని స్పర్శిస్తూ తాకే మేఘాలు నీలికంఠమును గుర్తుచేస్తాయి.  ఈ పర్వతం మీద సంచరించే జింకల వలన నా చేతిలో మనస్సుకి ప్రతీకగా ఉండే జింకను పరిహాసం చేస్తున్నట్లుగా ఉంటుంది.  వర్షాకాలంలో తెల్లని మేఘములు నా గిరి మీద నిలిస్తే, నేను కాస్త తెల్లని నంది వాహనుడై దర్శనమిస్తున్నానని అనిపించక మానదు. గిరి ప్రాంతంలో సంచరించే అతి భయంకరమైన పాములు, పులులు, సింహాలను చూసి నా కుమారులైన గణపతి అలాగే కుమారస్వామి కాస్త ఈర్ష్య,అసూయలు పడుతూ ఉంటారు.  అలాగే ఇక్కడ ఆవాసం చేసే జంతువులు, వృక్షాలు మానవులు అందరూ కూడా మరణించిన తర్వాత కూడా…తామంతా కూడా…. అరుణాచల వాసులే అని… నా చేత ఆదరించబడుతూ ఉంటారు.  నేను కాస్త సహస్రపాదుడు మరియు సహస్ర శీర్షుడు అని వేదాలచే కొలిచినట్టుగా….ఈ గిరి మీద నన్ను చూసినవారికి ఇది అక్షర సత్యం అని అర్థమవుతుంది.  ఇక యోగ నాడులైన ఇడా పింగళ సుషుమ్న నాడులు కూడా నా గిరి అరణ్యంలో ప్రవహించే చెరో  పక్క నదులను చూస్తే…. మరియు ఈ గిరి మధ్య నుండి ప్రవహించే నదిని చూస్తే ఈ మూడు నదులు గుర్తుకు తెస్తాయి. అలాగే ఈ శోణ శైలము కన్నా గొప్ప క్షేత్రము లేదు.  నా పంచాక్షరిని మించిన మంత్రము లేదు. నా శివ ధర్మం కన్నా గొప్పదైన ధర్మము లేదు.  నా శివదీక్షకు మించిన దీక్ష మరొకటి లేదు.  నన్ను మించిన దైవము లేదు.  దేవత లేదు.. నా శివ జ్ఞానము మించిన మరో జ్ఞానము మరొకటి లేదు. నా రుద్రము కన్నా వేదము లేదు. నా విభూది మించిన రక్ష లేదు.  నా శివ భక్తిని మించిన సదాచారము లేదు.  నా రుద్రాక్షల కంటే మేలైన ఆభరణాలు లేవు. నా శైవాగమం  మించిన శాస్త్రము లేదు.  నా బిల్వ దళమునకు మించిన పత్రము లేదు.  నన్ను మించిన గురువు లేడు.  దేవతలలో విష్ణుమూర్తిని మించిన శివ భక్తుడు లేడు.  రాక్షసులలో రావణ బ్రహ్మణను మించిన శివ భక్తుడు లేడు.  వైరాగ్యమును మించిన సుఖము లేదు.  ముక్తిని మించిన పరమపదము లేదు.  అంతెందుకు….. కైలాస, మందర , మేరు పర్వతాలు ఏవి కూడా ఈ అరుణాచల క్షేత్రమునకు సాటి రావు.  ఎందుకంటే ఇవి అన్నీ కూడా నా నివాస స్థానాలే.  అయితే ఈ అరుణగిరి మాత్రం స్వయంగా నేనై ఉన్నాను అనగానే….. 

స్వామి!  అరుణాచలేశ్వర…! అరుణాచల శివ..!  నీ అనుగ్రహ భాషణము వలన అరుణగిరి ఔన్నత్యం తెలుసుకున్నాను.  కానీ ఇంకా నాకు తనివి తీరడం లేదు.  నీ గురించి…. నీ గిరి గురించి తెలుసుకోవాలని తపన , తాపత్రము కుతూహలము పెరుగుతూనే ఉన్నాయి.  కాబట్టి నాయందు దయ ఉంచి నీ గిరి యందు ఎన్నో తీర్థాలు ఉండటం గమనించాను.  కానీ వీటి విశిష్టత ఏమిటో నాకు అర్థం కావడం లేదు.  కాబట్టి వీటి విశిష్టతలను నీ నోటి ద్వారా విని తెలుసుకోవాలని ఉంది.  ఇది చెప్పి నన్ను అనుగ్రహించండి అనగానే….. వీటి గురించి అరుణాచలేశ్వరుడు చెప్పడం ఆరంభించాడు. 


చతుర్వింశతిః (24వ) అధ్యాయం సమాప్తం 

శుభం భూయాత్ 

సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి