అధ్యాయం 22
అష్టలింగాల ఆవిర్భావం
^^^^^^^^^^^^^^^^^^
దేవతలకి….అలాగే రాక్షసులకి మధ్య ఆధిపత్య పోరు యుద్ధం జరిగింది అని తెలుసు కదా! ఈ యుద్ధంలో నిజానికి దేవతలు ఓడిపోయే ప్రమాదము నుండి ఉపేంద్ర విష్ణుమూర్తి రక్షించి, రాక్షసులను ఓడించి, దేవతల విజయానికి మూలకారకుడు అయిన విషయాన్ని దేవేంద్రుడు అలాగే మిగిలిన దేవతలు మరిచిపోయారు. ఈయనని గుర్తించలేదు. ఈ విషయం గ్రహించిన పరమేశ్వరుడు కాస్త… వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలని నిశ్చయించుకొని…. వీళ్ళు కాస్త విజయోత్సవము చేసుకుంటున్న సమయంలో… వీళ్ళ మధ్యలో ఒక అగ్నిస్తంభలింగాకారముగా పరమేశ్వరుడు కాస్త ఉద్భవించడం జరిగింది. విజయానందంలో ఉన్న దేవేంద్రుడి ముందు…. ఈ ఆది అంతము లేని అగ్నిస్తంభ ఉజ్వల దివ్య తేజస్సు కాంతిని చూసి ఈయన దిగ్భ్రాంతి చెందుతూ….. అగ్ని దేవుడిని పిలిచి ఈ దివ్య తేజస్సు వివరాలు…. అలాగే దీని శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలుసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు. దానితో అగ్నిదేవుడు కాస్త ఈ దివ్య తేజో అగ్ని మూర్తి దగ్గరికి వెళ్లి…. నీవు ఎవరు? అని ప్రశ్నిస్తే…. దానికి అగ్ని తేజోమూర్తి కాస్త నేనెవరో నీకు ముందు ముందు తెలుస్తుంది కానీ…. ఇంతకీ నువ్వు ఎవరు? మీ శక్తి సామర్థ్యాలు ఏమిటి? అని అడిగేసరికి దానికి నేను అగ్నిదేవుడిని … దేనినైనా దహించే సామర్థ్యం నాకుంది. అనగానే అవునా! అయితే నీ ముందు ఉన్న ఈ గడ్డి పరికను దహించు చూద్దాం ..! నీ శక్తి సామర్థ్యాలు ఏమిటో నేను చూస్తాను. అనగానే దానికి అగ్నిదేవుడు కాస్త పగలబడి నవ్వుతూ….. ఏమిటి? ఈ గడ్డిపరకను దహించాలా! నేను క్షణాలలో పెద్ద కొండనే దహనం చేయగలను… ఈ గడ్డిపరక ఒక లెక్క! అంటూ…. దహనం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దహనం కాకపోయేసరికి…. తన అసమర్ధతను ఈ అగ్ని మూర్తి ముందు ఒప్పుకొని ….ఇంద్రుని దగ్గరికి వెళ్లి ఇదే విషయం చెప్పడం జరిగింది. దానితో ఇంద్రుడు కాస్త వాయుదేవుడిని ఈ అగ్ని మూర్తి దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞాపించడం జరిగేసరికి… ఇతను కాస్త ఈయన దగ్గరికి వెళ్ళి తన గురించి చెప్పగానే …..అయితే నీ శక్తి సామర్థ్యంతో… నీ వాయు బలముతో నా ముందు ఉన్న ఈ గడ్డి పరికను కదిలించు! అనగానే దానికి వాయుదేవుడు ఈ గడ్డిపరికని కదిలించలేకపోవటంతో ….తన ఓటమిని అంగీకరించి తన అసమర్ధతను ఇంద్రుడి దగ్గర చెప్పడంతో…. ఇలా తన దగ్గర ఉన్న అష్టదిక్పాలకులు ఒక్కొక్కరు వెళ్లి గడ్డిపరక విషయంలో అవమానాలు పొంది వెనుతిరిగి రావడంతో…ఇంద్రుడు కాస్త దేవ గురువైన బృహస్పతిని వెంటబెట్టుకొని…. ఈ అగ్నిమూర్తి దగ్గరికి రావడం జరిగింది. తన అష్టదిక్పాలకులు అవమాన భారం తన అవమానంగా భావించుకొని…. ఈ అగ్ని మూర్తి మీద తన ఆయుధమైన వజ్రాయుధమును ప్రయోగించేసరికి…. అప్పుడు పరమేశ్వరుడు కాస్త తన శక్తితో ఆ వజ్రాయుధముతో కూడిన ఇంద్రుడి భుజమును స్తంభింపచేసేసరికి అప్పుడు కానీ ఇంద్రుడికి అహంకారం తగ్గలేదు. అప్పుడు తేజోమూర్తి అదృశ్యం అయింది. అప్పుడు అశరీరవాణి వినిపించి…. ఓ ఇంద్ర దేవా! ఆది బ్రహ్మ అలాగే ఆదివిష్ణువు ఇలాగే అహంకారాలకు పోయి ఆదిఅంతాలు చూడాలని విశ్వ ప్రయత్నాలు చేసి… విఫలమై… శరణాగతులైన ఆదితేజో మూర్తియే ఈ అగ్నిస్తంభ మూర్తి అని అదృశ్యం అయింది. అప్పటికే మోహ నిద్ర నుంచి లేచిన ఉపేంద్ర విష్ణుమూర్తి కాస్త ఇంద్రుడికి ప్రత్యక్షమై…. ఓ దేవేంద్ర! మా ఆది దైవాల వల్ల కానీ పని…. నీవల్ల ఎలా అవుతుంది? అహంకారము వీడి దీనికి శరణాగతుడివి అయ్యి… నీ వలన ఉద్భవించిన ఈ అగ్నితేజోలింగం యొక్క తేజస్సుని…. నీ అష్టదిక్పాలకులు కాస్త అష్ట లింగ మూర్తులై ఈ దివ్య తేజస్సుని మీలో ఇముడ్చుకుని దానిని శాంతింప చేసే బాధ్యత నీమీద ఉన్నదని చెప్పి అదృశ్యమైనాడు.
దానితో ఇంద్రుడు అలాగే బృహస్పతి అక్కడ నుండి వెళ్లిపోయారు. ఇలా ఇంద్రుడికి గర్వభంగమయ్యి ….అహంకార రహితుడై…. ఈ శివలింగమును పూజించిన రాత్రియే శివరాత్రి అయ్యింది. ఇంద్రుడి గర్వం అణిగిన చోటే తేజో లింగం ఉద్భవించిన రాత్రి శివరాత్రి అన్నమాట. ఆ తర్వాత కొన్ని రోజులకి శివ భక్తులైన బలుడు, పాకుడు ,సమూచి అనే రాక్షసుల సంహారం కాస్త…. ఇంద్రుడి తన మాయోపాయంతో సంహరించడం…. అందునా అతిరథ మహాశివ భక్తుడైన ఈ రాక్షసుల సంహారం గావించడంతో…. ఈయన శక్తి సన్నగిల్లి ఇంద్ర పదవి పోవడం జరిగింది. దానితో దీనికి పరిష్కారం మార్గం కోసం బ్రహ్మ దేవుడి దగ్గరకు వెళితే… ఈయన కాస్త ఆనాడు నీకు అగ్ని తేజోమూర్తి రూపముతో పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు కదా! ఆ తేజో లింగమే భూమి మీద అరుణాచల క్షేత్రమునందు పర్వత లింగముగా మారి….జనులు అందరి చేత పూజలు అందుకుంటుంది. కాబట్టి నువ్వు ఈ క్షేత్రానికి వెళ్లి… ఈ పర్వతలింగాన్ని నీ భక్తితో ఆరాధించి…. ఆయన అనుగ్రహం పొందితే… పోయిన నీ దైవశక్తి అలాగే నీ ఇంద్రపదవి తిరిగి వస్తాయని చెప్పడంతో ….తక్షణమే ఇతను కాస్త ఈ అరుణాచల క్షేత్రానికి చేరుకొని ….అరుణగిరి అయిన పర్వతలింగమును ఆరాధించడం… ప్రదక్షిణ చేయడం ఆరంభించాడు. కొన్ని నెలల తర్వాత, తనలో సన్నగిల్లిపోయిన దైవీక శక్తి కాస్త అమితమైన శక్తిగా పునరుత్పత్తి జరగటంతో…. ఈ క్షేత్రం నందు దిగ్విజయముగా అశ్వమేధ యాగాన్ని నిర్వహించి …..పోయిన తన ఇంద్ర పదవిని తిరిగి పొందడం జరిగింది. దానితో ఈ దేవేంద్రుడు అమిత సంతోషము చెంది…. అరుణాచలేశ్వరుని సేవ కోసం వందమంది అప్సరసల్ని కానుకగా సమర్పించి ….నియమించి…. తన కోరికను నెరవేర్చినందుకు గుర్తుగా…. తన శక్తితో తన ఒక ఇంద్ర శివలింగముగా మారి పుష్ప మేఘాలని పిలిచి…. అరుణగిరి పర్వత లింగము మీద పూల వాన కురిపించి…. తన ఇంద్రలోకానికి ఇంద్ర పదవితో వెళ్లడం జరిగింది. ఈ విధంగా అరుణాచల క్షేత్రం లో తొలి అష్టదిక్పాలక శివలింగముగా…. ఇంద్ర లింగము ఆవిర్భావం జరిగింది. ఇలా ఇంద్రుడిచేత పూజించబడిన రాత్రియే శివరాత్రి అయ్యింది. ఆ తర్వాత దక్షయజ్ఞ విధ్వంసం జరిగే సమయంలో…. ఉగ్రరూపుడైన పరమేశ్వరుడి అంశ అయిన వీరభద్రుడి క్రోధాగ్నికి…. అష్టదిక్పాల దేవతలైన అగ్నిదేవుడికి చేతులు పోయాయి… అలాగే వాయుదేవుడికి కాళ్లు పోయాయి… ఇలా మిగిలిన వారికి కళ్ళు ,ముక్కు, చెవులు, నోరు ,కాళ్లు, చేతులు,దంతాలు ఊడిపోవడంతో…. వీరంతా బ్రహ్మదేవుడు ద్వారా అరుణాచల క్షేత్ర మహత్యమును తెలుసుకొని…. ఈ క్షేత్రానికి వచ్చి…. అరుణాచలేశ్వర పర్వతలింగం ఆరాధించి…. పూజించి… సేవలు చేస్తూ, ప్రతినిత్యం గిరి ప్రదక్షిణం చేస్తూ… తాము కోల్పోయిన అంగాలు తిరిగి పొందడంతో…. విష్ణుమూర్తి ఆజ్ఞ మేర అష్టదిక్కుల అధిపతులు కాస్త అష్ట శివలింగ మూర్తులుగా మారి పర్వతలింగ దివ్య కాంతిని తమలో ఈ లింగాల రూపంలో ఇముడుచుకొని అసాధారణ దివ్య తేజస్సును సాధారణ శక్తిగా మార్చడం జరిగింది. ఈ విధంగా అష్టదిక్కులలో తూర్పున ఇంద్ర లింగముగాను, పడమర వరుణ లింగముగాను, ఉత్తరమునకు కుబేర లింగముగాను, దక్షిణము యమ లింగముగాను…. ఉంటే ఈశాన్యం ఉన్న ఈశ్వర లింగము లేదా ఈశాన్య లింగము, ఆగ్నేయమున ఉన్న అగ్ని లింగము ,వాయువ్యము ఉన్న వాయు లింగము, నైరుతిలో ఉన్న నైరుతి లింగము…. ఇలా అష్టదిక్కులలో అష్ట లింగాల ఆవిర్భావం జరిగింది.
ఇది ఇలా ఉండగా ….సూర్యుడు కాస్త రాక్షసుల బారిన పడి తన అగ్నితేజస్సు శక్తిని కోల్పోతే…. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి అడిగితే…. అరుణాచల క్షేత్రానికి వెళ్లి అక్కడ ఉన్న పర్వతలింగమును అలాగే అరుణాచలేశ్వర స్వామిని సేవించమని చెప్పడంతో….. ఈయన కాస్త ఈ క్షేత్రానికి వచ్చి పర్వతలింగమును దర్శించి….గిరి ప్రదక్షిణం చేసి… అరుణాచలేశ్వర స్వామిని సేవించి… కోల్పోయిన తన అగ్ని శక్తిని తిరిగి పొంది….తను సూర్యలోకానికి వెళుతూ…. తన శక్తితో సూర్య లింగముగా ఆవిర్భవించి వెళ్లిపోవడం జరిగింది. అలాగే చంద్రుడు కూడా తన మామగారైన దక్షుడు ఇచ్చిన శాపం కారణంగా… ప్రతిరోజు క్షీణించసాగాడు . దీనికి కారణం దక్షుడు కాస్త తన 27 మంది కుమార్తెలను ఈ చంద్రునికి ఇచ్చి వివాహం చేస్తే…. ఇతను రోహిణి యందు అమిత ప్రేమను చూపిస్తూ ….మిగిలిన 26 మందినీ నిర్లక్ష్యము చేయడంతో…. వీరంతా కలిసి తన తండ్రి అయిన దక్షునికి ఈ విషయం చెప్పడంతో…. ఇది విన్న దక్షుడు కాస్త కోపోద్రిక్తుడై చంద్రుడిని రోజు రోజుకి క్షీణించమని శాపం ఇవ్వడం జరిగింది. ఈ శాపం కారణంగా ఆనాటి నుంచి చంద్రుడు కాస్త క్షీణించడం ఆరంభమయ్యింది. ఈ శాప విముక్తి కోసం చంద్రుడు కాస్త బ్రహ్మ దేవుని దగ్గరికి వెళ్లి అడిగితే…. భూమి మీద ఉన్న అరుణాచల క్షేత్రంలోని అరుణాచలేశ్వర స్వామిని పూజించమని చెప్పడంతో….చంద్రుడు కాస్త ఈ క్షేత్రానికి చేరుకొని… పరమేశ్వర అంశ అయిన పర్వతలింగమును దర్శించి… దానికి గిరి ప్రదక్షిణం గావించి…. తేజో లింగమైన అరుణాచలేశ్వరుని సేవించిన తరువాత…. చంద్రుడిలో క్షీణత తగ్గింది… అనగా 15 రోజుల పాటు అమావాస్య రోజులకు క్షీణత పొందటం…. తిరిగి పౌర్ణమి 15 రోజులలో పూర్ణచంద్రుడుగా వెలుగుతూ ఉండటం అనేది తనకి అరుణాచలేశ్వర స్వామి అనుగ్రహ ఫలితం అని చంద్రుడు గ్రహించి…. తన శక్తితో ఈ క్షేత్రం నందు చంద్ర లింగముగా ఆవిర్భవించి… తన చంద్రలోకానికి తిరిగి వెళ్లడం జరిగింది. ఈ చంద్రలింగం నుండి పౌర్ణమి చంద్రుడిని చూస్తుంటే ….మన చేతికి అందుతాడు అన్నట్లుగా… చాలా దగ్గరగా స్పష్టంగా కనబడుతూ ఉండటం జరుగుతుంది. ఇలా ఈ క్షేత్రమునందు అష్ట లింగాలతో పాటుగా సూర్య చంద్ర శివలింగాలు కూడా ఇలా ఆవిర్భవించాయి.అలా ఈ అరుణగిరి నాలుగు వైపులా తూర్పున సూర్యుడు, దక్షిణమున విశ్వామిత్రుడు, పడమర వరుణుడు, అలాగే ఉత్తరమున త్రిశూలము ఉన్నాయి. ఈ రాతి త్రిశూలమును…. రాతి నంది ముఖము అరుణగిరి మీద ఉండి చూస్తూ ఉంటుంది. ఇలా ఈ నలుగురు దేవతలు … రెండు యోజనాల పరిధి వరకు అరుణాచలేశ్వర స్వామి నిత్యం సేవిస్తూ ఉంటారు. ఇలా అష్టదిక్కుల యందు గాక అంతరిక్ష దిక్కుయందు సూర్యచంద్రులు కూడా ఉండి… అష్టదిక్పాలకుల చేత కాకుండా సూర్యచంద్రుల చేత కూడా…. ఇలా దశ లింగాలతో పర్వతలింగమైన పరమేశ్వరుడు ప్రతినిత్యం పూజించబడుతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా అరుణాచల క్షేత్రానికి వచ్చినప్పుడు ….గిరిప్రదక్షిణ సమయంలో ఆగుపించే… ఈ దశ శివలింగాలను ఒక్కొక్కటిగా గుడిలోపలికి వెళ్లి దర్శించుకుని….వారి ఆశీస్సులు పొంది… తరించి …ధన్యులు అవ్వండి.
ద్వా వింశతిః (22వ)అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి