అధ్యాయం 26
క్షేత్ర తీర్థ మహత్యం
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
ఓ గౌతమా! నీవు అడిగిన నా గిరి యందు ఉన్న సర్వతీర్థ మహత్యము గురించి సావధానముగా చెబుతాను విను అంటూ…… అగ్ని రూపంలో ఉండే నా నుండియే నీరు ఏర్పడింది. దీని నుండి సచిత్ర విచిత్ర గుణాలతో ఈ విశ్వ జగత్తు ఉద్భవించిందని నీకు తెలుసు కదా!
ఈ గిరికి నాలుగు వైపుల మాత్రమే కాకుండా అన్ని దిక్కుల యందు అంతర్జాలముగా …అంతర్వాహినులై అనగా భూమి లోపల ప్రవహిస్తూ గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి, శోనానది, మహారధి దేవతలు కాస్త నదిగా ప్రవహిస్తూ నా భక్తుల పాపాలను పోగొడుతూ….. తమ భక్తితో నిత్యం నన్ను సేవిస్తున్నారు.ఈ పర్వతం మీద దేవతలు అలాగే మహర్షుల ప్రార్థన చేత …..ఈ స్త్రీ మూర్తి దేవతలు కాస్త నదులుగాను…. గిరి యందు సెలయేళ్లుగా… బుగ్గలాగా మారి నీటి అవసరాలు తీరుస్తూ….వాటియందు స్నానం చేసిన వారికి లేదా ఈ తీర్థమును సేవించిన వారికి జన్మాంతర పాపాలను నాశనం చేస్తున్నారు. ఇక ఎల్లప్పుడూ వర్షముతో నిమిత్తం లేకుండా నిత్యం నిండి ఉండి ప్రవహిస్తూ ఉంటాయి. ఉదయిస్తున్న సూర్యకాంతితో అలాగే ఈ గిరి మీద ఉన్న వివిధ రకాల ఔషధ మొక్కల యొక్క గుణాలను ఇవి సేకరించి…. తమయందు ఔషధ గుణాలను అంతర్గతంగా భద్రపరుచుకుంటున్నాయి. దానితో ఈ నదీ జలాలు కాస్త ఔషధ తీర్థ జలమయింది. ఈ నీటిని సేవించిన వారికి లేదా స్నానమాచరించిన వారికి కూడా వారి దేహమునందు ఉన్న వ్యాధులు నయం అవడమే కాకుండా…. మానసిక, శారీరక ఉత్తేజ ఉత్సాహాలు కలుగుతాయి.
ఇంద్రుడు అధిపతి అయిన తూర్పు దిక్కు యందు ఇంద్రుని చేత ఇంద్ర తీర్థం ఏర్పడింది. దీని యందు స్నానం చేసిన వారికి బ్రహ్మా హత్యాదోషము నశించును. ఎందుకంటే ఇంద్రుడు కాస్త ఈ తీర్థము నందు స్నానం ఆచరించి బ్రహ్మహాత్యా దోషమును పోగొట్టుకున్నాడు. పడమర దిక్కు అధిపతి అయిన వరుణుడు కాస్త వరుణ తీర్థములో స్నానమాచరించి తాను పోగొట్టుకున్న అస్థిపంజరమును తిరిగి పొందడం జరిగింది. అలాగే ఉత్తర దిక్కునందు అధిపతి అయిన కుబేరుడు కాస్త ఈ దిక్కునందు ఉన్న సోమతీర్థము నందు చంద్రుడు కాస్త స్నానమాచరించి తనకి ఉన్న క్షయరోగమును పోగొట్టుకున్నాడు. దక్షిణ దిక్కుకి అధిపతి అయిన యముడు కాస్త ఈ దిక్కు యందు ఉన్న యమ తీర్థము నందు స్నానమాచరించి బ్రహ్మాస్త్రం వలన కలిగే భయమును పోగొట్టుకున్నాడు. ఇక అగ్నిదేవుడు కాస్త ఆగ్నేయము నందు ఉన్న అగ్ని తీర్థము నందు స్నాన ఆచరించి పరస్త్రీ సంగమ దోషము నుండి విముక్తి పొందాడు. ఈ తీర్థము నందు ఋషులు అలాగే మహర్షులు స్నానమాచరించి భూత,ప్రేత పిశాచ, బేతాళ మున్నగు క్షుద్ర శక్తుల బారిన పడకుండా జయం పొందడం జరిగింది. వాయువ్య తీర్థంలో ఉన్న వాయుదేవుడు కాస్త ఈ తీర్థంలో స్నానమాచరించి… అందరికీ ప్రాణధారగా మారాడు. ఇక ఆఖరిదైన ఈశాన్య దిశయందు ఉన్న విష్ణుతీర్థము నందు విష్ణువు స్నానమాచరించి తనకి ఉన్న మోహ నిద్ర నుండి విముక్తి పొంది స్థితి కారకుడిగా…. విశ్వరక్షకుడిగా తిరిగి విష్ణు పదవిని పొందటం జరిగింది. అలాగే దీనియందు స్నానమాచరించిన వారికి నవగ్రహాల యొక్క అనుకూల శక్తి కలుగుతుంది. ఈ తీర్థ రక్షకులుగా దుర్గాదేవి, వినాయకుడు, కుమారస్వామి, సరస్వతి, భైరవుడు ఈ తీర్థాలను రక్షిస్తూ ఉంటారు.
ఇలా నా గిరి యందు…. ఇలా అష్టదిక్పాలకుల దేవతల తీర్థాలే కాకుండా మహర్షుల తీర్థాలు ఆవాసముగా ఉన్నాయి. వాటిలో నా గిరికి దక్షిణ దిక్కులో అగస్త్యుని యొక్క అగస్త్య తీర్థం ఉన్నది. ఇది ఎంతో మహిమ గలది. ఇప్పటికీ ఈ తీర్థరాజము నందు అగస్త్య ముని కాస్త సూక్ష్మధారిగా ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో తన శిష్యుల పరివారంతో…..ఈ తీర్థం నందు స్నానం ఆచరించి… నన్ను అర్చన చేసి వెళ్తాడు. ఈ తీర్థం నందు స్నానమాచరించిన వారు బహు భాషా కోవిదులు అవుతారు. అంతెందుకు…. నా గిరికి పడమర దిక్కుగా కుంభా నది ప్రవహిస్తూ ఉంటుంది. కుండలోంచి పుట్టిన అగస్త్యుడు కాస్త ఈ నది పరిసరము నందు సదా నివసిస్తూ… భాద్రపద మాసం నందు తన తీర్థము నందు స్నానమాచరించి నన్ను సేవిస్తాడు. నా గిరికి ఉత్తర దిశలో వశిష్ట మహర్షి యొక్క వశిష్ట తీర్థము ఉన్నది. దానియందు ఎవరైతే స్నానం చేస్తారో…. వారికి సర్వ వేదాల జ్ఞానము లభిస్తుంది.ప్రతి ఆశ్వీయుజ మాసము నందు…. మేరు పర్వతం మీద ఆవాసం ఉండే వశిష్ట మహర్షి తన శిష్య పరివారంతో…. ఈ సమయం నందు నా ఈ క్షేత్రానికి వచ్చి….. ఈ తీర్థం నందు స్నానమాచరించి నన్ను సేవించుకుని వెళతాడు. ఉత్తర దిక్కులో ఉన్న సూర్య తీర్థం నందు సూర్యుడు కాస్త వైశాఖమాసం నందు ఈ క్షేత్రానికి వచ్చి….. ఈ తీర్థం నందు స్నానమాచరించి నన్ను సేవించుకుంటాడు. పైగా ఈ తీర్థము సర్వరోగ నివారిణిగా ఖ్యాతి చెందింది. సర్వవ్యాధులు నివారించబడతాయి. అనారోగ్య సమస్యలు పోయి…. ఆరోగ్యవంతులు అవుతారు. నా దేవాలయ సన్నిధిలో ఉన్న బ్రహ్మ తీర్థము నందు….. మార్గశిర మాసం నందు….సత్యలోకము నుండి బ్రహ్మ వచ్చి ఈ తీర్థం నందు స్నానమాచరించి నన్ను కొలుస్తారు. ఈ తీర్థము నందు స్నానం ఆచరించే వారికి బ్రహ్మహత్య దోషాలు….. అలాగే బ్రాహ్మణ హత్య దోషాలు మరియు…. పంచమహాపాతక దోషాలు తొలగించబడతాయి. అలాగే నా దేవాలయ సన్నిధిలో ఉన్న శివగంగా తీర్థంలో నేను కాస్త బ్రహ్మ కపాలాలు చేతబట్టి భైరవమూర్తిగా స్నానం ఆచరించడం జరిగింది. అలాగే ఈ తీర్థము నందు కార్తీకమాసంలో గంగాదేవి ,యమునా, సరస్వతీ నది దేవతలు ఈ తీర్థము నందు స్నానం ఆచరించి భక్తుల వలన వాళ్ళకి అంటిన వివిధ మహాపాతక పాపాలను భస్మం చేసుకుని ….పరిశుద్ధులై వచ్చి…. నన్ను ఆరాధించి తిరిగి వాళ్ళ క్షేత్రాలకు వెళతారు. అలాగే మాఘమాసం నందు నేను కాస్త నా రుద్ర గణాలతో ఆవాసం చేసి మానవులకు ప్రాయశ్చిత్త ఫలితాలను ఇస్తూ ఉంటాను.
ఆగ్నేయము నందు ఉన్న అగ్ని తీర్థము నందు ఫాల్గుణమాసము నందు మన్మధుడు కాస్త స్నానమాచరించి సర్వలోకవాసులకి కామకోరిక సుఖం అందించే యోగ్యత పొందడం జరిగింది. ఈశాన్య దిశలో ఉన్న అశ్వినీతీర్థం నందు అశ్వినిదేవతలు స్నానమాచరించి…. ఈ అశ్విని దేవతలు కాస్త దేవత వైద్యులైనారు. నా గిరికి దక్షిణ దిశలో పాండవ తీర్థము ఉన్నది. ఇందులో అజ్ఞాతవాసము సమయంలో పంచ పాండవుల స్నానమాచరించి ద్రౌపదీ చేతుల మీద పాండవ శివలింగమూర్తి ప్రతిష్టించి… నన్ను పూజించి….రాజ్యం పొందడం జరిగింది. నా గిరికి తూర్పు దిశలో ఉన్న ఇంద్ర తీర్థంలో…. మహాలక్ష్మి దేవి స్నానమాచరించి హరిని భర్తగా పొందడం జరిగింది. ఇంద్రుడు కాస్త తన పరివార దేవతలతో ఈ క్షేత్రానికి వచ్చి ఈ తీర్థం నందు స్నానమాచరించి నన్ను ఆరాధించి తన ఇంద్రలోకానికి తిరిగి వెళ్తాడు. చైత్రమాసంలో విష్ణువు కాస్త వైకుంఠం నుండి వచ్చి విష్ణు తీర్థం నందు తన సర్వ ఋషుల చేత స్నానమాచరించి ….నన్ను సేవించి…. తన లోకానికి తిరిగి వెళ్తాడు. ఈశాన్యము నందు ఈశాన్యతీర్థంలో నవ గ్రహాలు స్నానమాచరించి నవగ్రహ పదవులు పొందడం జరిగింది. అలాగే ఈ తీర్థము నందు స్నానం చేసే వారికి ప్రతికూలమైన నవగ్రహ శక్తులు కాస్త అనుకూలమవుతాయి. అలాగే నవగ్రహ దోషాల నుండి ఎలాంటి పరిహారాలు చేయకుండా విముక్తి పొందడం జరుగుతుంది. అలాగే బ్రహ్మపుత్రుడైన శోణనదము…. ఇక్కడ నా గిరి యందు అతి ఘోరమైన తపస్సు చేసి నన్ను పొంది …. నా వరం చేత గంగకు ఎదురుగా…. అనగా ఉత్తర వాహినిగా ప్రవహించే శోణ నదిగా మారాడు. అలాగే ఈ నా గిరి యందు పాద భాగంలో గంగానది అలాగే…. నా మధ్య భాగంలో యమునానది…. అలాగే నా శిరస్సు భాగం నందు నర్మదానది…. ప్రతినిత్యం ప్రవహిస్తూ….నా గిరి చుట్టూ వేణునది ప్రవహిస్తోంది. అలాగే శుభములు ప్రసాదించే కుంభా నది నా గిరికి పడమర దిశలో ప్రవహిస్తోంది. అలాగే నా గిరికి ఉత్తర దిశయందు స్కందా నది ప్రవహిస్తోంది. ఈ స్కంద తీర్థము నందు నా కుమారుడైన స్కందుడు స్నానమాచరించి….. రాక్షస సంహారమునకు కావలసిన శక్తి అలాగే బలమును మరియు యుక్త జ్ఞానమును పొంది సర్వదేవతలకి…. సర్వదేవ సైన్యాధ్యక్షుడు అయ్యాడు. అలాగే నా గిరికి వాయువ్య దిశలో గల దేవతీర్థములో విశ్వదేవతలు స్నానమాచరించి నన్ను సేవించి దేవతలు అలాగే మహర్షులు మరియు మానవులు చేసే యజ్ఞ భాగాల యందు యజ్ఞ ఫలాలు అందుకొనుటకు యోగ్యత పొందడం జరిగింది. అంతేకాకుండా ఈ తీర్థమునందు ఎవరైతే స్నానం చేస్తారో…… వారికి ఇంద్ర పదవి లేదా బ్రహ్మ పదవి లేదా విశ్వాధిపత్య పదవులు లభిస్తాయి. అలాగే జ్యేష్ట మాసం నందు భూదేవి సర్వదేవతలు, సర్వ ఔషధ వృక్ష దేవతలు, నన్ను సేవించి…. వారు కోల్పోయిన గుణాలను తిరిగి పొందడం జరుగుతుంది.
ఇదే కాకుండా నా గిరి చుట్టూ ఆవిర్భవించిన నా అష్టనందుల పక్కనే నా అష్ట తీర్థాలు ఉన్నాయి. వాటిలో సింహం నంది పక్కనే ఉన్న సింహతీర్థం . దీనిని ఎవరైతే సేవిస్తారో…. వారికున్న వ్యసనాల నుండి విముక్తి పొందడం జరుగుతుంది. అలాగే నందితీర్థం సేవిస్తే నంది అంతటి భక్తి విశ్వాసాలు నాయందు కలుగుతాయి. ఇవే కాకుండా ఖడ్గ తీర్థము…. గురుముహూర్త తీర్థము…. పాండవ తీర్థము…. నందిముఖ తీర్థము ….పచ్చయాన్ అమ్మన్ గుడి వద్ద ఉన్న చనుపాల తీర్థము (ముడిపాల్ )తీర్థము ఇలా ఎన్నో తీర్థాలు ఉన్నాయి. వీటిలో స్నానాలు లేదా తీర్థ సేవన చేసినా కూడా అనగా పాండవ తీర్థమునందు సేవనం వలన మీ ఇష్ట కోరిక తీరుతుంది. అది మోక్షం అయినా కూడా ఇస్తుంది. అలాగే గురు ముహూర్త తీర్థం వలన బ్రహ్మజ్ఞాన తత్వము అలాగే గురుతత్వ పదవీ లభిస్తుంది. అలాగే ఖడ్గతీర్థం సర్వపాపహారిణి ….. జన్మాంతర పాపాలను హరించి వేస్తుంది.
ఇకపోతే చనుపాల తీర్థం వలన బాలింతల సమస్యలు తీరతాయి. సంతాన దోషాలు తొలగుతాయి. సంతాన అవాంతరాలు సమస్యలు పోతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక నంది ముఖ తీర్థం మానసిక, శారీరక దోషాలు, గ్రహ దోషాలు తొలగి ప్రశాంత స్థితి పొందుతుంది. కాకపోతే అగ్ని లింగం దగ్గర ఉన్న అగ్ని తీర్థం వలన ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు, తప్పులు, దోషాలు అన్నీ కూడా హరించబడతాయి.
ఇలా నా గిరి చుట్టు అనేక దేవత, మహర్షుల తీర్థాలు ఉద్భవించాయి. వాటిని లెక్కపెట్టుట మానవుడి వీలు కాదు అనగానే….. గౌతమ మహర్షి కాస్త ……స్వామి! మీరు చెప్పింది నిజమే. ఎన్నో తీర్థాలు ఉన్నాయి…. వాటిలో ఏ మాసమునందు స్థానమాచరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో నేను అడగకుండానే నాకు చెప్పారు. అందుకు సదా కృతజ్ఞుడిని.. కానీ కొద్దిపాటి జ్ఞానం కలవారు తెలుసుకోలేని ఎన్నో తీర్థాలు…. ఇక్కడ ఉన్నాయని నాకు అర్థం అయింది. ప్రత్యేకంగా ఒక్కొక్క తీర్థం నందు స్నానం చేయుట అసాధ్యమే కదా! కాబట్టి నాయందు దయవుంచి ఈ క్షేత్రంలో ఉన్న సర్వ తీర్థాలలో స్నానమాచరిస్తే వచ్చే స్నాన ఫలితం సులువుగా ఎలా పొందవచ్చునో సెలవివ్వండి అనగానే….. అరుణాచలేశ్వర స్వామి చిరునవ్వు నవ్వి …. ఓ గౌతమా! వత్సా ! నేను ఆహారం తీసుకునే సమయం నందు… నా యందు ఈ సర్వ తీర్థములు రహస్యంగా ఆవాసం చేస్తాయి. ఈ సమయంలో నైవేద్యం పెట్టడం పూర్తి అయిన తర్వాత నన్ను ఎవరైతే దర్శనం చేస్తారో…. వారికి సర్వదేవతల అనుగ్రహం అలాగే సర్వ మహర్షుల అనుగ్రహం మరియు సర్వ తీర్థాలయందు సేవించిన ఫలితము కలుగుతుంది. ఇక అప్పుడు తీర్థముల స్నానాలతో పని ఉండదు అని… ఇలా గౌతమ మహర్షికి అరుణాచలేశ్వరుడు సర్వ తీర్థాల స్నానఫలం గురించి చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడైనా అరుణాచల క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ క్షేత్రంలో ఉన్న సర్వ తీర్థాల స్నాన ఫలితం మీరు పొందాలనుకుంటే మధ్యాహ్నం మహా నైవేద్యం అనంతరం స్వామివారిని దర్శించుకోండి . మీరు ఈ స్నాన ఫలితం అందుకొని తరించి ధన్యులవ్వండి.
ఇలా ఈ స్కాంద పురాణంలో చెప్పబడిన ఈ తీర్థాల గురించి నేను కాస్త గిరి మీద లేదా గిరి చుట్టూ ఎక్కడ ఉన్నాయో పరిశోధించాను. అప్పుడు విష్ణుమూర్తి ప్రతిష్టించిన అరుణగిరి నాధర్ శివాలయంలోని అయ్యంగారి కొలను ఇంద్రతీర్థం అంటారని తెలిసింది. ఎందుకంటే ఈ కోనేరు లోని నీటితోనే ఇంద్ర లింగానికి నిత్యం స్నాన అభిషేకం చేస్తారు. అలాగే గిరి పైన నాకు ఆగస్త్య గుహ దగ్గర అగస్త్య తీర్థము కనిపించింది. ప్రస్తుతానికి ఈ గుహను అమ్మన్ అమ్మ గుహగా పిలవబడటం జరుగుతుంది. ఈమె తను సేకరించిన ధనముతో పే గాలి గోపురం కట్టించింది. ఈ అగస్త్య గుహలో ఈమె సాధన చేసింది. ఈమె సమాధి కాస్త ఈశాన్య లింగం దగ్గర ఉంది. అలాగే గుహై నమఃశివాయ గుహ దగ్గర సాధువులు అలాగే సిద్ధులు స్నానం చేసే కోనేరు తీర్థం కనిపిస్తుంది. అలాగే కాళీమాత ఆలయం దగ్గర ఉన్న కోనేరు తీర్థమును ముడిపాల్ అనగా చనుపాల తీర్థం ఉంటుంది. ఈ తీర్థ జలం ఎప్పటికీ ఎండిపోదు. ఇదే గిరి పైన ఉన్న ఆశ్రమాలలో ఈ జలమే ఆధారం అవుతుంది. ఈ గిరి పైన ఉన్న ఇతర తీర్థాలు ఎండిపోయి వర్షాకాలంలో నిండుకుంటాయి. పచ్చయ్యన్ అమ్మన్ అమ్మవారి గుడి పక్కగా గిరి మీదకు వెళితే నంది ముఖం నుండి జాలువారే జలపాతం కనపడుతుంది. ఇది కూడా సహజంగా ఎండిపోదు. జలపాత ధార తగ్గుతుంది. అదే వర్షాకాలంలో అయితే అధిక వేగముతో నీటి ప్రవాహంతో గిరి పై నుండి పెద్ద జలపాత ధారగా వస్తుంది. అలాగే గిరి చుట్టూ మనకి సింహతీర్థం, నంది తీర్థము, పేరు తెలియని కలువ పూలు ఉన్న తీర్థము ఇలా కనపడతాయి . గుడి ప్రాకారంలో అన్నదాన సత్రం దగ్గర శివగంగా తీర్థము కనిపిస్తే…. రెండవ ప్రాకారములో బ్రహ్మ తీర్థము కనబడుతుంది . ఇకపోతే గుడి ఆవరణ బయటవైపు చక్రతీర్థం కనపడుతుంది.
ఇకపోతే గురు ముహూర్తము అనే ప్రాంతంలో మనకి 18 సిద్దగురువులలో ఒకరైన సిద్ధుడు జీవ సమాధి ఇక్కడ ఉంటుంది. ఈ గుడి ఆవరణలో మనకి ఒక కొలను కనపడుతుంది. ఇందులో స్నానము లేదా తీర్థము సేవించిన వారికి… బ్రహ్మ జ్ఞానం వస్తుందని గురువు కోసం తపన పడే వారికి గురువు దొరుకుతాడని…. సాధన సందేహాలకు సమాధానాలు దొరుకుతాయని చెప్పడం జరుగుతుంది. ఇక గిరి ప్రదక్షిణములో వచ్చే అష్ట లింగాలలో ఒకటైన అగ్ని లింగమునకు ముందు మనకి అగ్నితీర్థం దర్శనం ఇస్తుంది. ఈ తీర్థజలముతోనే అగ్ని లింగానికి ప్రతినిత్యం అభిషేకము చేస్తారు. ఈ తీర్థ స్నానము లేదా తీర్థసేవనము వలన ఈ జన్మలో తెలిసో తెలియక చేసిన తప్పులు, దోషాలు, పాపాలు అన్నీ కూడా సర్వనాశనం అవుతాయి. ఇక ఆఖరిది అతిశక్తివంతమైన తీర్థమే ఖడ్గ తీర్థం. ఇది దుర్గాదేవి అమ్మవారి గుడిలో ఉంటుంది. ఈ తీర్థం సర్వపాపహరిణి. ఖడ్గ తీర్థం అనే అధ్యాయంలో ప్రత్యేకంగా దీని గురించి చెప్పడం జరిగింది.చదివి తెలుసుకోండి. ఇలా ఈ తీర్థాలలో సాధువులు లేదా భక్తులు స్నానాలు చేయడానికి వీలుగా పచ్చయాన్ అమ్మన్ దగ్గర ఉన్న కొలను తీర్థం… అలాగే గిరి పైన సిద్దుల కొలను… అలాగే ముడిపాల్ తీర్థము మాత్రమే ఉంటాయి. మిగతా అన్నిచోట్ల ఈ తీర్థాలు చుట్టూ కంచవేసి తాళాలు వేసి ఉంటాయి. మీరు చూసే సమయానికి వీటికి గేటు తాళాలు తీసి ఉంటే కేవలం ఈ తీర్థం సేవించడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అంటే ఈ లెక్కన చూస్తే ఇక్కడ మనకి కనిపించే తీర్థాలు అన్నీ కూడా దర్శనానికి పరిమితం అవుతాయి. భక్తులు చేసే తప్పుడు పనుల ఈ తీర్థాలు చూడటానికి కూడా పనికిరావేమోనని ఆలయ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకొని ఉండి ఉండాలి. ఇప్పుడిప్పుడే ఈ గిరి చుట్టూ ఉన్న పాడుపడిపోయిన తీర్థాలను బాగు చేసి పూడికలు తీసి….దర్శనానికి వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక రాబోవు కాలంలో మరికొన్ని కొత్త తీర్థాలు చూసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే దుర్గాదేవి గుడిలోని కనక తీర్థ సేవనము చేసే అవకాశం దొరికితే చేయండి…. లేదా బాటిల్ లో ఈ జలం తీసుకొని ఇంటికి వెళ్లి…. స్నానం చేసేటప్పుడు ఈ తీర్థం కలుపుకొని చేయండి. నేను చూసిన తీర్థాలలో ఈ తీర్థమే కాశీగంగతో సమానమని గ్రహించాను. అలాగే పాండవుల తీర్థం అనేది పాండవుల గుడి దగ్గర ఉంటుంది. ఈ తీర్థము సేవానానికి ఇస్తారు. అలాగే ఇందులో ఉండే చేపలకి ఆహారం పెట్టడానికి అవకాశం ఇస్తారు. ఈ పాండవ తీర్థం గురించి మోక్షానుభవం చూపించే పాండవ తీర్థం అనే అధ్యాయముగా చెప్పడం జరిగింది.
అలాగే స్కాంద పురాణంలో చెప్పబడిన దశదిక్కుల తీర్థాలలో రెండు లేదా మూడు వాటి పేర్లు ఉన్న తీర్థాలు మనకి అగుపడతాయి. కాకపోతే నేను చూసిన తీర్థాలను మీరు ఒక వరుసగా క్రమంగా చూడాలంటే మొదట అరుణాచలేశ్వర స్వామి గుడిలోని మొదటి ప్రకారంలో ఉన్న 1. శివగంగా తీర్థము ఉంటే రెండవ ప్రకారంలో 2. బ్రహ్మ తీర్థము ఉంటుంది. ఆ తరువాత ఈ గుడి బయట ఆవరణలో 3. చక్రతీర్థం ఉంటుంది. దీనికి ఒక కిలోమీటర్ దూరంలో అరుణగిరి నాధర్ గుడి దగ్గర అయ్యంగారి కొలను దర్శనమిస్తుంది. దీనిని 4. ఇంద్రతీర్థం అంటారు. ఇకపోతే దీనికి సుమారుగా 800 మీటర్ల దూరంలో మనకి గురు ముహూర్త గుడి దగ్గర ఉన్న 5. ఒక తీర్థము దర్శనమిస్తుంది.గిరి ప్రదక్షిణంతో వచ్చే అగ్ని లింగానికి ముందుగా మనకి 6. అగ్నితీర్థ కొలను దర్శనమిస్తుంది. అలాగే ఈ అగ్ని లింగం ఉన్న గుడికి చివరిదాకా అనగా ఒక కిలోమీటర్ దూరంగా లోపలికి వెళితే ….వచ్చే పాండవుల గుడిలో ఉన్న 7.పాండవ తీర్థము అలాగే గుడి బయట మనకి 8. భీముడు తీర్థము దర్శనం ఇస్తాయి. ఆ తర్వాత రమణ స్వామి ఆశ్రమం దాటిన తర్వాత సింహం బొమ్మ 9. సింహతీర్థము దర్శనమిస్తుంది. ఇలా కొంత దూరం గిరిప్రదక్షిణం చేసిన తర్వాత జ్యోతి వినాయకుడి దగ్గర మనకి నందిబొమ్మతో ఉన్న 10. నంది తీర్థము దర్శనమిస్తుంది. అలాగే సింహనందిని దగ్గర మనకి 11. సింహ తీర్థము దర్శనమిస్తుంది. ఇలా ఆది అన్నామలై గుడి దాటిన తర్వాత మనకి కలువ పూలతో ఉన్న 12. కలువ తీర్థము దర్శనమిస్తుంది . ఆ తర్వాత ఈశాన్య లింగానికి వెళ్తున్నప్పుడు వచ్చే పచ్చయ్యన్ అమ్మన్ గుడిలో మనకి 13. ఒక తీర్థము దర్శనమిస్తుంది. అలాగే ఈ గుడి పక్కనే గిరి మీదకు వెళ్లేదారిలో మనకి 14. నంది ముఖం నుండి జాలువారే జలధార ఉన్న తీర్థము దర్శనమిస్తుంది. ఆ తర్వాత గిరి ప్రదక్షిణముగా వచ్చే దుర్గాదేవి గుడి ఆవరణంలో మనకి 15. ఖడ్గ తీర్థము దర్శనమిస్తుంది. ఇవే కాకుండా గిరి పైకి ఎక్కితే మనకి గుహై నమఃశివాయ గుహ దాటిన తర్వాత సాధువులు స్నానం చేసే 16. సిద్దుల కొలను… అలాగే చూత గుహకి వెళ్లేదారిలో వచ్చే కాళీమాత గుడి దగ్గరలో ఉన్న 17. ముడై పాల్ అనగా చనుపాల తీర్థము దర్శనమిస్తాయి. ఆ తరువాత అగస్త్య ముని గుహ లేదా అమ్మన్ అమ్మ గుహ దగ్గర 18. ఒక తీర్థం కనపడుతుంది. అలాగే మనకి సప్తర్షుల గుడి అయిన అగస్త్యముని ఆశ్రమము దగ్గర… ఒక కోనేరు ఉంటుంది. దీనిని సప్తర్షి తీర్థం అంటారు. సప్తర్షులకి ఉన్న జ్ఞాన అహంకార మాయలు నిర్మూలనం చేసుకోవడానికి ఈ క్షేత్రానికి వచ్చి…. ధ్యాన తపస్సు చేసుకుని…. తమకు వచ్చిన ఈ అహంకారమాయను అరుణాచలేశ్వర స్వామికి దానముగా ఇచ్చి…. అహంకార రహితులై…. ఈయనకి సర్వస్య శరణాగతి భావంతో….ఆరాధన చేసిన దానికి గుర్తుగా ఈ తీర్థము ఏర్పాటు చేశారని….ఎవరికైతే అహంకార మాయ ఉన్నదో వాళ్లు కాస్త ఈ తీర్థం నందు స్నానం చేసినా లేదా ఈ తీర్థం సేవించినా వారి అహం పోయి…. శరణాగతి భావం పొందడం జరుగుతుందని… ఇక్కడ స్థానిక సాధువులు అభిప్రాయముగా చెప్పడం జరిగింది. అలాగే ఈశాన్య లింగం దగ్గర ఉన్న టైగర్ స్వామి ఆశ్రమం నందు అదే ఈశాన్య జ్ఞాన దేశికర్ అనే యోగిఆశ్రమము నందు మనకి ఒక కోనేరు కనబడుతుంది. పూర్వం దీనిని ఈశాన్య తీర్థం అని ఆ తర్వాత దీనిని మరొక పేరు ఉన్న తీర్థముగా పిలవడం జరిగింది. ఈ తీర్థం సేవనం వలన సంతాన దోషాలు, అకాల మృత్యుభయాలు, జంతువుల వల్ల ప్రాణభయాలు పోతాయని స్థానిక సాధువుల అభిప్రాయంగా చెప్పడం జరిగింది. ఇలా మనకి సుమారుగా 18 తీర్థాలు దర్శనం ఇస్తాయి.
ఇలా ఈ తీర్థాలు మనకి ప్రత్యక్షంగా కనపడతాయి. వీటిలో 80% స్నానానికి పనికిరావు. కేవలం తీర్థం సేవించడమే చేయాలి. నిజానికి ఇక్కడ ఉన్న స్థానిక సాధువుల అభిప్రాయం ప్రకారం చూస్తే…. ఈ గిరి చుట్టూ మనకి 108 లేదా 366 తీర్థాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇది నిజమో కాదో నాకు ఇదిమితంగా తెలియదు.చూడాలని ప్రయత్నం కూడా చేయలేదు…కాకపోతే గిరి చుట్టూ ఒకప్పుడు శివసముద్రం అని 600 ఎకరాలలో ఒక పెద్ద చెరువు తీర్థం ఉండేది. కాల క్రమేణ ప్రస్తుతం ఇది 10 ఎకరాలలోనికి వచ్చింది. ఈ శివసముద్ర చెరువును చూస్తే గిరి ముందు ప్రవహిస్తూ…. తిరిగి దక్షిణ దిశ వైపుకు మనకి కనపడుతుంది. ఇలా గిరి ముందు నది ప్రవహిస్తుందా! అన్నట్లుగా అనిపించే అద్భుత దృశ్యమును చూస్తే తప్ప మాటలలో వర్ణించలేము. ఎవరైనా ఈ తీర్థం చూడాలని అనుకుంటే….. శివసముద్రం ఎక్కడ అని ఎవరినైనా అడిగితే చెబుతారు. అప్పుడు అక్కడికి వెళ్లి చూస్తే గిరిపాదాల దగ్గర నది ప్రవహిస్తున్నట్లుగా శివసముద్ర చెరువు కనబడుతుంది. ఇది తప్పక చూడండి. అద్వితీయమైన అనుభవ అనుభూతిని మీ సొంతం చేసుకోండి. మరీ కొన్ని రోజులలో ఈ చెరువు అదృశ్యమయ్యే పెను ప్రమాదం లేకపోలేదు. మనుష్య స్వార్థానికి 600 ఎకరాలు కాస్త పది ఎకరాలు అయింది. కాకపోతే గుప్తంగా ఎన్నో తీర్థాలు ఈ గిరి చుట్టూ… అలాగే గిరి పైన ఉన్నాయని నాకు అర్థం అయింది. కాబట్టి మీరు కూడా ఈ గిరి ప్రదక్షిణ సమయంలో కనిపించే తీర్థాలను చూసి…..అవకాశం ఉంటే వాటి తీర్ధమును సేవించండి. తరించి ధన్యులవండి.
షడ్విశతిః (26వ)అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి