జ్ఞానాగ్ని శివలింగమూర్తి దర్శనం
అరుణాచల శివ యోగ ప్రార్థన
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణశివ..అరుణగిరి శివ
ఓ సర్వాంతర్యా మి..అరుణాచల శివ
సర్వకాల సర్వావస్థలయందు
నా మనసు ప్రాపంచిక విషయాల నుంచి మరలించి
నీ మీద లగ్నం అయ్యేలాగా చెయ్యి అరుణాచల శివ ….. (1)
నిద్ర లేచింది మొదలు నిద్ర పోయే లాగా
స్వార్థం తో కూడిన చర్యలు మాటలు ఆలోచనలు
నాలో రాకుండా కాపాడు అరుణాచల శివ….. (2)
ఈరోజు అలా వచ్చిన వాటికి
నాలో ప్రతాపం వచ్చిన వాటికి
నాలో పశ్చాతాపం కలిగించి
ఇక మీద దుష్ట సంకల్పాలు
నాలో కలగకుండా చూడు అరుణాచల శివ …..(3)
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణశివ..అరుణగిరి శివ....
నన్ను అసత్యం నుంచి సత్యం వైపుకి
…. చీకటి నుంచి వెలుగులోకి
మృత్యువు నుంచి అమరత్వం వైపుకి
… ప్రయాణింప చెయ్యి అరుణాచల శివ….. (4)
నాలోని చెడువాసనలను
… సంస్కారాలను ప్రక్షాళన చేసి మాయ నుంచి
నన్ను విడుదల చేసి నీ దరి చేర్చుకో అరుణాచల శివ….(5)
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణశివ..అరుణగిరి శివ....
నేను అనేక జన్మల గా చేస్తున్న
అన్ని పాపపు కర్మలకి నాలో పశ్చాతాపం కలిగించి
వాటి ఫలితాలను అనుభవించే సమయంలో
వాటిని సహనముతో, ధైర్యంతో
అనుభవించే శారీరక మానసిక స్థైర్యాన్ని,
మనో ధైర్యాన్ని ఇవ్వు అరుణాచల శివ…. (6)
నాలోని కామపూరిత కోరికలని..
ద్వేషాన్ని, అసూయని, పగని, అహంకారాన్ని,
అరిషడ్వర్గాలను ,సప్త వ్యసనాలను, ఇతర వ్యతిరేక భావాలను
దహించివేసే స్వచ్ఛమైన వివేక జ్ఞాన బుద్ధిని నాకు ప్రసాదించి
నాకు ఆధ్యాత్మిక మార్గమును చూపించే గురువులను నాకు పంపు అరుణాచల శివ….(7)
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణశివ..అరుణగిరి శివ....
నా వలన ఎవరికీ అపకారం కలగని బుద్ధిని
… ఇతరులకి ఇతర ప్రాణులకీ ప్రతిఫలం ఆశించకుండా
ఉపకారం చేసే మంచి బుద్ధిని ప్రసాదించు అరుణాచల శివ… (8)
నాలో కర్మ భక్తి జ్ఞాన ధ్యాన వైరాగ్య బీజాలు అంకురించి
జ్ఞాన యానము వేగంగా పూర్తి అయ్యేలాగా ఆశీర్వదించు అరుణాచల శివ……(9)
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణశివ..అరుణగిరి శివ....
స్వచ్ఛము, సత్యము, ధర్మము,
కరుణ, ప్రేమ ల నుంచి వేరు చేయకు అరుణాచల శివ ….(10)
నువ్వు ఎల్లప్పుడు నాతో ఉండు… నాలో ఉండు..
నేను సదా నీతో ఉండేలా అనుగ్రహించు అరుణాచల శివ ….
ప్రతినిత్యం నీ నామస్మరణ చేసే విధంగా అనుగ్రహించు అరుణాచల శివ...(11)
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణశివ..అరుణగిరి శివ....
పాహిమాం పాహిమాం పాహిమాం
ఓం సర్వేజన సుఖినోభవంతు
ఓం శాంతి
సర్వం శ్రీ అరుణాచల శివార్పణామస్తు
*******************************************
అరుణాచల క్షేత్రంలో అనంత జ్యోతి స్వరూపం కాస్త జ్ఞానాగ్ని అరుణగిరిగా వెలసింది కదా! ఈ క్షేత్రంలో మనకి శివస్వరూపాలుగా 1) శివుడే అరుణగిరి కొండగాను…. 2) దేవాలయంలో అరుణాచలేశ్వర అగ్ని లింగమూర్తిగాను…. 3) సజీవ దక్షిణామూర్తిగా… ఈ కొండమీద ఉన్న మర్రిచెట్టు కింద ధ్యాననిష్టలో నిశ్చలమూర్తిగా గురు దక్షిణామూర్తిగాను… 4) ఏకత్వ అర్ధనారీశ్వర తత్వ ఆదిరుద్రమూర్తి, ఆదిపరాశక్తి స్వరూపంగా…. 5) అరుణగిరి మీద నిత్య అరుణ జ్యోతి రూపముగా….
ఇలా పంచరూపమూర్తులుగా పంచముఖ శిఖరాలుగా మారి అరుణగిరి యందు ఆవాసం చేస్తున్నారు. భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ పంచముఖ రూపాలతో సృష్టి, స్థితి, లయ, తిరోగమన, అనుగ్రహం అనే విశ్వ జగత్తు యొక్క పంచక్రియలు నిరంతరంగా చేస్తున్నారు. భక్తుల మనోభావాల ఆరాధన బట్టి శివధారిగా ఆరాధన చేస్తే, నల్ల శివుడిగా….. తెల్లశివుడిగా…. నీలి శివుడిగా…. పచ్చ శివుడిగా….. అర్ధనారీశ్వర శివుడిగా…. పూజలు అందుకుంటూ ఉంటే, అదే తనని లింగధారిగా ఆరాధన చేస్తే, నల్ల శివలింగముగా…. తెల్ల శివలింగముగా…. పాదరస శివలింగముగా…. స్పటిక శివలింగముగా… అర్ధనారీశ్వర శివలింగంగా…. మారి పూజలు అందుకోవటం జరుగుతుంది.
ఈ పంచ శివలింగ మూర్తుల స్వరూపాలే మనం పంచముఖ శిఖర దర్శనం ఉన్నచోట ఉన్న పద్మకార శివలింగమూర్తి కింద మనకి ఈ పంచలింగ మూర్తులు చూడవచ్చును. ఇవి చూడటానికి ఒకే విధంగా ఉన్న పంచ నల్లరాతి శివలింగాలుగా కనబడతాయి. అదే యోగ సాధన చేసే వారికి ఈ పంచలింగ మూర్తులు కాస్త ధ్యానానుభవంగా పంచరకాల శివలింగమూర్తులు దర్శనం పొందడం జరుగుతుందని… ఇక్కడ స్థానిక అరుణాచల యోగుల స్వానుభవాలు చెబుతున్నాయి.
సర్వసాధారణంగా అన్నీ దేవాలయాలలో మనకి అష్టదిగ్బంధన చేస్తారు. కానీ ఈ అరుణాచలేశ్వర లింగానికి బంగారపు శివలింగమూర్తితో నవబంధనముగా స్వర్ణబంధనం చేయడం గమనించవచ్చును. అలాగే అరుణాచలేశ్వర శివలింగమూర్తికి నుదుటిపైన వజ్రపు త్రిపుండ్రంతో బంగారుకవచం కలిగిన నాగాభరణాన్ని ధరించి మనకి దర్శనం ఇస్తారు. అలాగే ఈయనకి అభిషేకం చేస్తే నీటి బిందువులు మనకి ఆలయానికి పడమటి దిక్కులో ఉన్న గాలిగోపురం దగ్గర ఉన్న స్థూల సూక్ష్మ లింగం మీద కనబడటం జరుగుతుంది. విచిత్రం ఏమిటంటే… ఈ స్థూల సూక్ష్మ లింగానికి 14 సార్లు ప్రదక్షిణ చేస్తే…. అరుణగిరి చుట్టూ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణం పూర్తి చేస్తే వచ్చే ఫలితం వస్తుందని ఈ స్థల పురాణం చెపుతుంది. కాకపోతే వయోవృద్ధుల కోసం, నడవలేని వారి కోసం, తీవ్రమైన నయం కానీ రోగపీడితుల కోసం ఈ స్థూల సూక్ష్మలింగ ప్రదక్షిణ ఏర్పాటు చేసి ఉండి ఉండాలి.
ఈ అగ్ని శివలింగమూర్తి సజీవ మూర్తి లింగమని అనటానికి నిదర్శనంగా పూర్వకాలంలో ఈ గుడిలో ఒక యదార్థ సంఘటన ఆలయ అధికారుల సమక్షంలోనే జరిగింది. అది ఏమిటంటే…. పూర్వకాలములో ఈ క్షేత్ర దర్శనానికి భక్తుల తాకిడి అంతగా ఉండేది కాదు. రోజు మొత్తం మీద 100 మందికి మించి ఉండేది కాదు. దానితో ఆలయ అర్చకులు వేళప్రకారం ఉదయం, సాయంత్రం గుడి తలుపులు తెరిచి…. ధూపదీప నైవేద్యాలు పెట్టి…. యధావిధిగా భక్తుల సౌకర్యార్థముగా గుడి తలుపులు మూయకుండా శివలింగమూర్తి కనిపించే విధంగా ఆలయ కటకటాలు మూసివేసేవారు. వీటినుంచి లోపలికి చూస్తే అరుణాచలేశ్వర శివలింగమూర్తి దర్శనం ఇచ్చేది. వారు ఇలా దర్శనం చేసుకొని ధన్యులై ఆనంద పరవశముతో వెళ్ళిపోయేవారు. మధ్యాహ్నం వేళల యందు స్థానికులు కొంతమంది తమ పశువులను ఈ గుడి పరిసరాల చుట్టూ ఉన్న అడవిలో మేతకి వదిలిపెట్టి ఈ ఆలయంలో విశ్రాంతి తీసుకునేవారు. ఇలా ఒక రోజు ఇలాంటి పశువుల కాపరిగా ఇద్దరు పిల్లలు వచ్చి, యధావిధిగా పశువులను మేతకు వదిలిపెట్టి, ఈ ఆలయంలో ఆటలు ఆడుకో సాగారు. ఇంతలో వీరికి ఈ అగ్ని శివలింగం ముందు బెల్లం ముక్క ప్రసాదంగా కనపడింది. దీనిని తినాలనే ప్రభలమైన కోరిక కలిగి …ఎవరూ చూడడం లేదని దొంగతనంగా ఈ ప్రసాదం తీసుకుని తినబోతుండగా…. వారిలో ఒకడికి “ఆగురా! మనల్ని ఎవరూ చూడటం లేదని ఈ ప్రసాదం దొంగతనం చేసి తింటున్నాం కదా! కానీ అరుణాచలేశ్వర స్వామి చూస్తూనే ఉన్నాడు కదా!” అనగానే, అవును !చూస్తున్నాడు…. ఇప్పుడు మరి ఏం చేద్దాం! అనగానే ఆయనకి కూడా మన దొంగ ప్రసాదంలో వాటా ఇస్తే సరిపోతుంది…. అనగానే, “అయితే ఆ వాటా నాకు ఇవ్వు! నాకు ఇస్తే ఆయనకి ఇచ్చినట్లే… ఆయన ఏమీ అనడు..” అని ఒక దివ్య తేజస్సు ఉన్న పిల్లవాడు వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ ప్రసాదం తీసుకున్నాడు. దానితో ఈ ముగ్గురు కలిసి ఆలయ ప్రాంగణంలో ఆటల ధ్యాసలో పడిపోయి సమయం మర్చిపోయారు. సాయంత్రం వేళ అవ్వడంతో ఆలయం తెరవటానికి ఆలయ అర్చకులతో పాటుగా ఆలయ అధికారులు వచ్చారు. ఆటలాడుకుంటున్న ఈ ముగ్గురి పిల్లలని చూసి…. స్వామివారి ప్రసాదం దొంగతనం చేసి తిన్నారని గ్రహించి…. ఇద్దరిని స్తంభానికి కట్టి వేస్తూ ఉంటే వీళ్ళల్లో ఒకడు కాస్త “అదేమిటి!మేము ముగ్గురం కలిసి దొంగతనం చేసి ప్రసాదం తిన్నాం కదా! మా ఇద్దరిని కట్టి, మూడో వాడిని ఎలా వదిలిపెడతారు?” అనగానే….అవును కదా! ఇందాక ముగ్గురు ఉన్నారు.. ఇప్పుడు చూస్తే ఇద్దరే ఉన్నారు… అనుకోని ఈ ఆలయంలో వాడు ఎక్కడో దాక్కొని ఉంటాడని ఆలయమంతా వెతికారు. ఎక్కడా కనిపించలేదు. దానితో వీళ్లంతా అలసి సొలసి ఈ ఆలయం దగ్గరికి వచ్చి చూస్తే….. మూడవ పిల్లవాడు కాస్త ఈ అరుణాచలేశ్వర లింగంలోనికి బాలుడి రూపంలో వెళ్లడం గమనించి ….బాల రూపంలో వచ్చింది సాక్షాత్తు ఆ అరుణాచలేశ్వర స్వామి అని గ్రహించి…. ప్రసాద దొంగతనములో తన వాటా ఉన్నదని చూపించి అదృశ్యం అయ్యేసరికి…. ఆలయ అధికారులు కాస్త ఈ ఇద్దరి పిల్లల్ని మందలించి వదిలిపెట్టారు. ఆనాటి నుంచి “దొంగ శివ” పేరుతో ఈయనని పిలవడం ఆచారమైంది. ఇలా రాతి శివ లింగమూర్తి కాస్త సజీవమూర్తి అని నిరూపణ అయింది .
ఇకపోతే…..అగ్ని లింగ అరుణాచలేశ్వర లింగమూర్తి దర్శనం చేసుకుంటే, మనకి ఇది అగ్ని లింగమైతే అగ్ని కనిపించాలి కదా! కనిపించదు. కానీ ఇక్కడ కూర్చుని ఉంటే మనకి ఉక్కపోసేసి…. చెమటలు పట్టేసి…. ఏదో కొంచెంగా మనసులో వెలితి భావం కలుగుతుంది. మనసంతా అయోమయంగా సతమతం అవుతున్నట్లుగా…. అయోమయస్థితి పొందడం జరుగుతుంది. దీనికి కారణం చూస్తే…. ఈ అగ్నిలింగం యొక్క బయటకి కనిపించని అగ్ని యొక్క ఙ్ఞానాగ్ని యొక్క సెగ మనకి చేరి… మన శరీరానికి, అలాగే మనసుకి అనుభవ అనుభూతి కలిగిస్తోందన్నమాట ! అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మనం తట్టుకోలేమని ఆ పరమేశ్వరుడు కాస్త జ్ఞానాగ్నిగా మారి…అగ్నిహోత్రుడై మనం భరించే ఙ్ఞానాగ్ని యొక్క సెగను మనకి అందేటట్లుగా అనుగ్రహిస్తున్నాడు. అంటే మనం చూస్తున్న అగ్నిలింగం అనేది… రాశీభూతమైన జ్ఞానాగ్ని లింగమూర్తి అని గ్రహించండి. ఈ లింగమూర్తికి స్వర్ణ బంధనం వేయడంతో ఈయన దగ్గర మనకి చితాగ్ని ఉంటే…..ఈ బంధనం ఇవతల జ్ఞానాన్ని ఉంటుంది. ఈ స్వర్ణబంధనమునే అరుణగీతగా పిలవడం జరుగుతుంది. ఈ గీత దాటి లోపలికి ఆత్మ శరీరధారిగా వెళితే…. అగ్ని లింగం లోని అగ్నికాస్తా చితాగ్నిగా మారి… మనకి మోక్ష ప్రాప్తి కలిగిస్తుంది. అదే గీత ఇవతల వైపు ఉంటే, మన కోరికలు తీర్చే జ్ఞానాగ్నిగా మారి ఇష్టకామ్యములు తీరుస్తుంది. అందుకే స్కాంద పురాణంలో జీవుడు ఎప్పుడైతే అరుణాచల అగ్ని లింగ అరుణాచలేశ్వరుని దర్శనం చేస్తారో….. వాడి గీత మారుతోందని చెప్పడం జరిగింది. జీవుడి మరణ సమయంలో ఈ జీవుడు కాస్త అరుణాచల క్షేత్ర ప్రవేశం చేశాడా? లేదా? అని ఈ అరుణ గీత ద్వారా చూస్తారు. చేశారు అంటే… వాడి గీతను మార్చి విధిరాత కాస్త శివ గీతగా మారి శివయోగి అవుతాడు. చెయ్యలేదు అంటే… వాడి రాత అధోగతిగా మారి మాయా భోగ జన్మలు పాప పుణ్యాల కర్మానుసారముగా విధిరాత ప్రకారం నడిచేటట్లుగా చేయటం జరుగుతుంది.
కాబట్టి “అరుణాచల శివ” నామస్మరణ చేతనే మన తలరాత మారి….మన జన్మాంతర పాపాలు రాశి కాస్త ధ్వంసం అవుతుంది. ఈయన అనుగ్రహం పొందితే… ఎన్నో కోటానుకోట్ల జన్మల పరంపర కొనసాగే కారణ, కర్మ, పాప పుణ్యాల కర్మలు, కర్మ బంధాలు, ఋణాలు, ఋణాలు బంధాలు అన్నీ కూడా ఈ చితాగ్ని మరియు జ్ఞానాగ్ని వేడిమికి భస్మమై కర్మ, ఋణ జన్మ కారణ పాపాలు ఇసుమంత కూడా లేకుండా చేసి… పూర్ణ శూన్యంలో శూన్యం అయ్యే పూర్ణ మోక్ష ప్రాప్తి “క్షిప్ర మోక్షం” అంటే… తక్షణ మోక్షం అనుగ్రహించే మోక్ష గురుదేవుడు… మన అరుణాచలేశ్వర శివలింగమూర్తి అని సజీవ గురుదక్షిణామూర్తి అలాగే మోక్షమరణ క్షేత్రం అరుణాచల క్షేత్రం అని ఎందరో యోగుల స్వానుభవాలలో తెలుసుకొని అనుభవ అనుభూతి పొందడం జరిగింది.
కాబట్టి అందరూ కూడా అరుణాచలంలోనికి ప్రవేశించలేరు. ప్రవేశించినా తమకి ఉన్న అహంకారమాయను దాటలేరు. దీనికి జ్ఞానాగ్ని అరుణాచలేశ్వరుని అనుగ్రహం పొందక తప్పదు. పొందితే సాధ్యం కానిది ఏమీ ఉండదు. “నేను” ఉండదు… శూన్యములో శూన్యం అవుతుంది. ఈ అనుగ్రహప్రాప్తి కోసం నిత్యం “అరుణాచల శివ” లేదా “అరుణాచలా” అనే నామ స్మరణ మరియు ఈయన చరితమైన “అరుణాచల శివ మహత్యం” గ్రంథ పారాయణం చేసుకుంటే ఆయన అనుగ్రహం కలిగి అరుణాచల క్షేత్ర దర్శనానికి…. గిరి ప్రదక్షిణానికి…. ఆది దంపతుల దర్శన అనుగ్రహ ప్రాప్తి పొందటానికి అర్హత, యోగ్యత, యోగం పొందటం జరుగుతుంది.
ద్వితీయ అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్









ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏
రిప్లయితొలగించండి