ముందుమాట
15-02-2026
మహా శివరాత్రి
“అరుణాచల శివ” అని నామస్మరణ చేసినా ….అలాగే అరుణాచల క్షేత్రం దర్శనం చేసినా….అలాగే అరుణాచల అరుణగిరి ప్రదక్షిణము చేసినా….మరియు అరుణాచల అగ్ని లింగమైన అరుణేశ్వరుని దర్శించినా మరియు ఈ క్షేత్రంలో ఉన్న ఆది గురు దక్షిణామూర్తి, ఆదిపరాశక్తి ,అపితకుచాంబిక దేవిని,మహాగణపతి, కుమారస్వామి, మహా దుర్గాదేవి, పచ్చయాన్ అమ్మని, అర్ధనారీశ్వర తత్వ మూర్తిని, అలాగే జీవ సమాధి చెందిన వివిధ శివయోగుల గుహలు అలాగే శివ భక్తుల ఆశ్రమాలు దర్శించుకున్న నా మనసు అద్వితీయమైన అనిర్వచనీయమైన చెప్పటానికి రాయటానికి వీలులేని ప్రశాంత స్థితికి ,తన్మయత్వస్థితి, ఆనందస్థితి, మనసు పని చేయని స్థితి పొందుతుంది! ఈ దివ్య క్షేత్రమే ఒక ఆధ్యాత్మిక అయస్కాంత క్షేత్రము! ఈ విశ్వ క్షేత్రాలలో దైవాలు ఉన్నప్పటికీ ఈ క్షేత్రంలో మేము ఉన్నామని ఉనికి మనకి ప్రత్యక్ష అనుభవాలు ద్వారా, ధ్యానానుభవాలు ద్వారా,పరోక్ష అనుభవాలు చూపిస్తారు. ఈ క్షేత్రంలో మనకి ఏకకాలంలో మోక్ష కోరిక, శివానుగ్రహం, ఆది గురువు అనుగ్రహం కలుగుతాయి . ఈ క్షేత్ర దర్శనం చేతనే మనకి మోక్షం పొందాలనే మోక్ష కోరిక, అలాగే ఈ క్షేత్ర గిరి ప్రదక్షిణం చేత ఆది గురు దక్షిణామూర్తి అనుగ్రహము….అలాగే అరుణాచలేశ్వర అగ్ని లింగ దర్శనం చేత అరుణాచల శివానుగ్రహం కలిగి ఈ“అరుణాచల శివ” నిత్య నామస్మరణ చేతనే మనకి మోక్షజన్మ అయ్యి మోక్షం పొందడం జరుగుతుంది. ఒక మోక్ష కోరికయే కాదు…. భోగ కోరికలు మరియు యోగ కోరికలు ,ఇతర అవసర కోరికలు అన్నీ కూడా ఈ క్షేత్ర దర్శనం చేసుకున్న ఏడు రోజుల నుండి 7 నెలలలో నెరవేరుతాయని …..వివిధ భక్తుల మరియు శివయోగుల స్వానుభవాలు నిరూపించాయి! ఇంకా నిరూపించబడుతున్నాయి.
ఇకపోతే శ్రీ స్కాంద మహా పురాణములో ఉన్న మహేశ్వర ఖండంలో మనకి అరుణాచల మహత్యం అది కూడా రెండు భాగాలుగా చెప్పడం జరిగింది. మొదటి భాగములో బ్రహ్మదేవుడికి అలాగే సనక మహర్షికి మధ్య జరిగిన సంవాద రూపంలో 13 అధ్యాయాలుగా చెప్పగా …..ఆ తరువాత రెండవ భాగంలో నందీశ్వరుడికి అలాగే భక్త మార్కండేయుడికి మధ్య జరిగిన సంవాద రూపంలో 24 అధ్యాయాలుగా చెప్పగా…ఈ రెండు భాగాలు కలిపితే మొత్తం 37 అధ్యాయాలుగా చెప్పడం జరిగింది. ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ 37 అధ్యాయాల సంవాదాలలో మనకి చెప్పిన కథలు ఒకే విధంగా ఉండటం….. చెప్పిన వాటిని మళ్లీ చెప్పారు అని భావన కలగటం….. అలాగే సరి అయిన కూర్పు విధానం లేకపోవడం వలన ఏకాగ్రతగా, శ్రద్ధ భక్తితో చదివే వారికి… తన్మయత్వం పొందకుండా, ఇబ్బంది కలుగుతుందని నేను గ్రహించి…. అనుభవించిన ఈ సమస్యకి పరిష్కారముగా ఈ రెండు సంవాదాల కథలను ఏకీకృత కథలుగా…… చెప్పిన కథలు మళ్లీ రాకుండా రాయాలని…. ఒక వరుసక్రమముగా రావాలని…. ఈ గ్రంథ రచన చేయడం జరిగింది.
ఉదాహరణకు ఈ రెండు సంవాద కథలలో మనకి లింగోద్భవం గురించి కథ, ఒకే కథ రెండుసార్లుగా వస్తుంది . అలాగే ఈ లింగోద్భవ కథనం బ్రహ్మకి సనక మహర్షికి సంవాదంలో మొదటి కథగా వస్తే, రెండవ భాగంలో ఇదే కథ నందీశ్వరుడికి ,మార్కండేయునికి సంవాదముతో మధ్యలో రావడం……. చదివే వారికి ఇబ్బంది కలగటం…..
అప్పటిదాకా కథా పురాణంలో లీనమై ఉన్న మనసు కాస్త, తన్మయత్వ భావం నుంచి బయటికి రావటం నాకు ఎన్నోసార్లు జరిగింది. ఈ సమస్యని నాలాంటి శివ భక్తులు ఎంతోమంది ఎదురుకున్నారని….. ఎదురుకుంటున్నారని గ్రహించి , సౌలభ్యం కోసం ఈ గ్రంథ రచనను ఏకీకృతముగా శివమూర్తికి గౌతమ మహర్షి సంవాదముగా అరుణాచల శివానుగ్రహం చేత ఆయన ఆజ్ఞ పొంది …..అరుణాచల క్షేత్రంలో స్థిరనివాసి అయి…. ఆయన ఉన్న గిరి సన్నిధిలో రాయడం జరిగింది. రాసేది “నేను”అనే జీవ శివ అయినా……రాయించేది “నేను కానీ నేను” అయిన ఆ ఆది శివయ్య అని గ్రహించండి .
అలాగే ఈ గ్రంథమును సాధారణముగా ఎలాంటి కోరికలు పెట్టుకోకుండా అసలు స్ధలపురాణ విశేషాలు ఏమిటో తెలుసుకోవాలని చదవవచ్చును లేదా మీ మనస్సులో ఉన్న ఏదైన కోరిక తీరాలంటే దీనిని 41 రోజుల నిత్య పారాయణ గ్రంథముగా చదువుకోవచ్చును.మీరు అనుకున్న కోరిక తీరితే అరుణాచల క్షేత్ర దర్శనానికి వెళ్ళి గిరిప్రదక్షిణము,దర్శనము చేసుకోవచ్చును.
సర్వం శివమయం
సర్వం అరుణాచల శివార్పణమస్తు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి