అధ్యాయం - 34

 అధ్యాయం - 34

క్షేత్ర అన్నప్రసాద వితరణ మహిమ 

```````````````````````````````



స్వామి…!  మహాదేవా!  అరుణాచల శివా ! అరుణేశ్వర…. నాయందు దయవుంచి నీ ఈ  శోణ గిరి క్షేత్రమునందు అన్నదానం….. అదే అన్నప్రసాద వితరణ చేస్తే….  మీరు  ఏ విధంగా అనుగ్రహిస్తావో సెలవివ్వండి అనగానే …..


వత్సా ! గౌతమా! త్రిలోకములలో అన్నదానములకు మించిన దానము లేదు.  ఎందుకంటే అన్నము వలన ప్రాణము నిలుస్తుంది.  అన్నము వలనే సృష్టి నడుస్తుంది….. అన్నదో ప్రాణదో నిత్యమన్నే ప్రాణ  ప్రతిష్ఠాః అని నా వేదవాక్కు ఉండనే ఉంది కదా!  ఈ నా క్షేత్రమైన అరుణాచల క్షేత్రమునందు అన్నదానం అనగా అన్నప్రసాద వితరణ చేస్తే…. వారి సర్వకోరికలు తీరి…. మరణానంతరం సర్వభౌమ పదవి పొందటం జరుగుతుంది. ఇది నిశ్చయము.  ఇందులో ఎలాంటి అనుమాన సందేహా భయము ఉండరాదు.  ఇటువంటి అన్నప్రసాద వితరణ ఫలితము గురించి చెప్పడానికి…. బ్రహ్మ అలాగే విష్ణువు చివరికి నేను కూడా అసక్తులమేనని గ్రహించు.  అంతేందుకు….. అన్నదానం చేయకుండా సర్వదానాలు చేసిన ఒక మహారాజు దీనగాధను నేను నీకు చెబుతాను.  అప్పుడు గాని నీకు, అలాగే నీవల్ల ఇతరులకి అన్నదాన మహిమ విలువ ఏమిటో తెలిసి వచ్చి….. ఈ నా క్షేత్రంలో స్తోమతను బట్టి తప్పకుండా అన్నదానం…. అదే అన్నప్రసాద వితరణ తప్పకుండా చేస్తారు.  కాబట్టి ఈ కథను శ్రద్ధా భక్తితో వినుము అంటూ …..


పూర్వం ద్రవిడ దేశంలో సింహద్వజుడు అనే సూర్యవంశ రాజు ఉండేవాడు.  ఇతను ప్రతిరోజు బంగారము, వెండి, ముత్యాలు, పగడాలు, వైడూర్యాలు ,పుష్పరాగ, రత్నాలు, నీలమణులు ,పచ్చలు, గోమేదికాలు ఇలా నవరత్నాలు, నాగ పడగలు, స్థలాలు, భూములు, పొలాలు, ఆవులు, పశువులు, దేవతా వృక్షాలు, ఇల్లు ఇలా మున్నగున్నవి బ్రాహ్మణులకి దానం ఇచ్చేవాడు.  కానీ అన్నదానము తప్ప మిగిలిన అన్ని దానాలు చేసేవాడు. కాలక్రమేణా ఈ రాజు కాస్త వయోవృద్ధుడై… మరణమును పొంది…. ఇంద్రలోకానికి చేరుకోవటం జరిగింది. ఈ లోకంలో ఉన్నప్పటికీ అన్నదానం చేయకపోవడంతో సార్వభౌమ పదవి దక్కకపోవడంతో…. ఇతనికి తాగటానికి ఈ లోకవాసులు అమృతమును ఇచ్చేవారు కాదు.  దానితో అమృతమును త్రాగేందుకు అర్హత లేకపోవడంతో…. దేవతల కంటే తక్కువ స్థితిలో ఉండగా తప్పేది కాదు. కాకపోతే తనకి మాత్రమే ఈ లోకవాసులు అమృతం ఎందుకు ఇవ్వడం లేదో…. ఈ రాజుకి తెలిసేది కాదు!  కొన్ని రోజులు గడిచిన తరువాత,  అనుకోకుండా ఒక రోజు ఇంద్రసభకి నారద మహర్షి రావటంతో ఈ రాజు కాస్త తన మనోవేదన గురించి చెప్పగా….. అప్పుడు నారదడు కాస్త చిరునవ్వునవ్వి…. రాజా! నువ్వు భూలోకంలో అన్ని దానాలు చేశావు… కానీ అన్నదానం చేయలేదు. దానిని మరిచిపోయావు. పట్టించుకోలేదు.  సర్వ శ్రేష్టమైన ఈ అన్నదానం చేయకపోవడంతో…. నీకు ఈనాడు అమృతం లభించడం లేదు. కారణం ఏమిటంటే…. శివునికి ప్రీతికరమైన అన్నదానం తప్పక చేయాలి కదా!  కర్మభూమి అయిన భూలోకమునందు నువ్వు ఏమి దానం ఇస్తావో ….అదే స్వర్గ లోకంలో అనుభవమునకు వచ్చును కదా!  అమృతమును పొందాలంటే తప్పక అన్నదానం చేయాలి అనగానే….స్వామి ! మీరు చెప్పింది అక్షరసత్యమే… నిజమే… నేను బతికి ఉన్నప్పుడు భూలోకంలో సర్వదానాలు చేశాను. కానీ అన్నదానం ఏనాడు చేయలేదు. దానిమీద నిర్లక్ష్యం భావము యే మాత్రం కొరగానిది…. అనే యావగింపు భావం నాలో ఉండడం చేత ఆనాడు అన్నదానం చేయలేదు.  ఇప్పుడు దాని విలువ తెలిసినా ఏమి ప్రయోజనం.  నా గతి ఇంతేనా!  నాకు ఎప్పటికీ అమృతము దొరకదా!  అని ఆవేదన చెందుతూ ఉంటే….రాజా!  దిగులు చెందకు.  నీ ద్వారా లోకానికి అన్నదాన మహిమ తెలిసింది. ఇప్పుడు నేను కాస్త భూలోకానికి వెళ్లి నీ కుమారుడైన చిత్రకేతువుతో నీ పేరుమీద అన్నదానం చేయిస్తాను.  తద్వారా ఈ ఫలితం నీకు అంది…. త్వరలోనే అమృతమును సేవించే అర్హతను పొందడమే కాకుండా….. శివలోక సాయుజ్యం పొందే ఉన్నత స్థితికి చేరుకుంటావు. ఇది నా హామీ…. అంటూ నారద మహర్షి కాస్త భూలోకంలో ఉన్న చిత్రకేతువు దగ్గరికి వెళ్లడం జరుగుతుంది. 


నారదుడు కాస్త ఇతనితో ఓ రాజా!  నీ తండ్రి అయిన సింహద్వజుడు కాస్త స్వర్గలోకమునందు అమృతమును  సేవించలేక అవస్థలు, అవమానాలు పొందుతున్నాడు.  కారణం….. ఏనాడూ కూడా భూలోకంలో అన్నదానం చేయలేదు.  కాబట్టి నువ్వు మీ తండ్రి పేరు మీద అన్నదానాలు చేస్తే గాని …..స్వర్గంలో అతనికి అమృతం సేవించే అర్హత రాదు.  కనుక నీవు నీ తండ్రి కొరకు అన్నదానం చేసి సద్గతి కల్పించమని చెప్పగానే…. దానికి చిత్రకేతువు కాస్త ఓ దేవర్షి! మీరు చెప్పినట్లుగానే నా తండ్రి పేరు మీద అన్నదానం తప్పకుండా చేస్తాను.  అందులో ఎలాంటి సందేహము లేదు. కాకపోతే ఏ క్షేత్రంలో అన్నదానం చేస్తే కోటిరెట్లు ఫలితం కలిగి…. నా తండ్రికి సద్గతి కలుగుతుందో కాస్త నాయందు దయవుంచి చెప్పండి.  అనగానే… నారద మహర్షి కాస్త….దివ్య దృష్టితో చూసి ఓ రాజా! చిత్రకేత!  ఇతర ప్రదేశాలలో లేదా ఇతర క్షేత్రాలలో లక్షలాది బ్రాహ్మణులకు లేదా ఇతరులకి అన్నదానం చేస్తే వచ్చే ఫలితము…. కాశీ క్షేత్రంలో ఒక్కరికి అన్నదానం పెడితే వస్తుంది. అదే ఈ కాశీ క్షేత్రంలో కోటి మంది బ్రాహ్మణులకు లేదా ఇతరులకి అన్నదానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ……అరుణాచల క్షేత్రంలో ఒక బ్రాహ్మణునికి లేదా ఇతరులకి అన్నం పెడితే వస్తుంది. ఈ క్షేత్రమునందు ఒక్క ద్వాదశి తిధినాడు అన్న ప్రసాద వితరణ…. అంటే అన్నదానం చేస్తే ఆ సంవత్సరం అంతా అన్నదానం చేస్తే వచ్చే ఫలితం, ఈ తిధినాటి అన్నదాన ఫలితం ఇస్తుంది. అని చెప్పి నారదుడు కాస్త భూలోకం నుంచి దేవలోకమునకు బయలుదేరుతాడు.చిత్రకేతువు కాస్త అరుణాచల క్షేత్రానికి చేరుకొని…. మొదట ద్వాదశి నాడు ఈ క్షేత్ర నివాసులైన బ్రాహ్మణులతో పాటుగా అక్కడ ఉన్న స్థానికులకి,సాధువులకి, శివయోగులకి అన్నదానం చేయడంతో పాటుగా….. ప్రతిరోజు క్రమం తప్పకుండా, వేళ తప్పకుండా అన్నదానం చేయడం జరుగుతుంది. ఇలా పుత్రుడు చేసే అన్నదాన ఫలితం కాస్త స్వర్గలోక వాసిగా ఉన్న సింహద్వజుడికి చేరడంతో….స్వయంగా ఇంద్రుడే రాజు దగ్గరికి వచ్చి అమృతమును ఒక బంగారు పాత్రలో తీసుకొని వచ్చి…. త్రాగటానికి ఇవ్వటం జరుగుతుంది. ఇక ఆనాటి నుండి ఈ రాజుకి సార్వభౌమ పదవితో పాటుగా…. అమృత సేవనమునకు అర్హత పొందడం జరుగుతుంది. ఇలా కొన్ని యుగాలపాటు ఈ స్వర్గసుఖాలు అనుభవించిన ఈ రాజు కాస్త….. క్రమంగా బ్రహ్మలోకం, ఆపై విష్ణు లోకం వరకు శివలోక ప్రాప్తి పొందడం జరిగిందని చెబుతూ….. ఇలా ఎవరైనా నా ఈ క్షేత్రమైన అరుణాచల క్షేత్రమునందు వారి సర్వ అభీష్ట సిద్ధి కొరకు అన్నదానం చేస్తే…. తిరుగు ఉండదని చెప్పడం జరిగింది.


సూచన:-

ప్రతిరోజు కూడా నిత్య అన్నదాన కార్యక్రమం అనేది…. ఇప్పుడు కూడా  అరుణాచలేశ్వర స్వామి ఆలయము అలాగే ఆది అన్నామలై ఆలయము మరియు ఇక్కడ ఉన్న ఆశ్రమాలలో నిత్యం జరుగుతూనే ఉంది.  పేదవారికి, స్థానిక సాధువులకి, ఆహారం అవసరమున్న ప్రయాణికులకి, ఈ ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకి, ప్రతిరోజు కూడా అల్పాహారం, భోజనం నీళ్లు, కాఫీ లేదా టీలు అందిస్తూనే ఉన్నారు. ఇది చాలా బృహత్తరమైన కార్యక్రమం కాబట్టి….. మీరు ఎప్పుడైనా ఈ అరుణాచల క్షేత్ర దర్శనానికి వచ్చినప్పుడు…. మీకు తోచిన ధనమును ఈ అన్నదాన కార్యక్రమాలు జరిపే వారికి విరాళాలుగా అందించి…..మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే, ఆ అరుణాచలేశ్వరుడు మీరు చేసిన ఈ అన్నదాన కార్యక్రమానికి సంతృప్తి చెంది…. మీరు అనుకున్న కోరికలు లేదా రాబోవు ఏడు నెలలలో మీకు జరగబోయే అనర్ధాలు తొలగిస్తారని…. ఇక్కడే స్థానిక భక్తుల స్వానుభవాలు చెబుతున్నాయి.  తద్వారా నీకు స్వర్గములో అమృతం కూడా లభిస్తుంది.  అన్ని దానాలలో కన్నా అన్నదానం చాలా శ్రేష్టమైనదని శాస్త్ర వచనం ఉంది కదా!  అలాగే అవయవదానం, వస్త్రదానం, ధన దానం, గొడుగు దానం, పాదరక్షల దానం, దీపదానం, వికలాంగులకు కావలసినవి ఇవ్వటం…. ఇలా మనకు దానాలు ఈ క్షేత్రంలో చేస్తే దాని ఫలితము 16 రెట్లు ఉంటుందని గ్రహించండి. అలాగే మీకు ఏమీ దానం చేయాలని అనిపించకపోతే మంచిది. కానీ మీ దగ్గరికి వచ్చేవారిని అసహ్యించుకోవడం , కోప్పడడం, తిట్టడం, అరవటం, కసరటం, కొట్టడం,  బతిమాలించుకోవడం లాంటివి చేయకండి. ఎందుకంటే…. ఈ క్షేత్రమంతా కూడా సజీవ మూర్తి శివ స్వరూపమై ఉంటుంది అని గ్రహించండి.  ఇక్కడి పుట్ట, చెట్టు, మట్టి, కంకర, బిక్షగాడు, సాధువు, బీదవాడు, బికారి ,ఉన్మాది, పిచ్చివాడు, మతిస్థిమితం లేనివాడు, అంగాలు లేనివాడు, పేదవాడు ఇలా…. ఏ రూప ధారి అయినా కూడా సాక్షాత్తు అరుణాచలేశ్వర స్వామి ఈ శివరూప ధారి అని తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోండి.  ఆయన అనుగ్రహం పొందండి కానీ….ఆగ్రహం పొందకండి. ఇక్కడ పుణ్యం చేసినా లేదా పాపం చేసినా కూడా 16 రెట్లు కర్మ ఫలితం అనుభవించక తప్పదని గ్రహించండి.  మీ దగ్గరికి వచ్చేవారికి వీలుంటే సహాయం చేయండి. లేదా మర్యాదగా గౌరవప్రదంగా మీ అసమర్ధతను వారికి తెలియజేయండి.  అర్హత ఉన్నవారికి అలాగే సంస్థలకి మీ దానాలు ఇవ్వండి.  అంతేగాని భక్తి వ్యాపారాలు చేసేవారికి మరియు ఈ సంస్థలకి మీరు మొహమాటం లేకుండా మీ దానం ఇవ్వకండి.  అన్ని చూసి పరిశీలించి…. పరిశోధించి… వివరాలు తెలుసుకొని…. మీ మనసుకి నచ్చిన వ్యక్తులకి లేదా సంస్థలకి మీ దానమును విరాళాలుగా ఇవ్వండి. మీ సర్వ అభీష్టాలు నెరవేర్చుకోండి. 


చతుస్త్రింశత్(34వ) అధ్యాయం సమాప్తం 

శుభం భూయాత్ 

సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి