అధ్యాయం 12
త్రిలింగాల దర్శనం
°°°°°°°°°°°°°°°°°°
అరుణాచల క్షేత్రములో ఉన్న మూడు శివాలయాలు అనగా శివుడు కాస్త నిద్ర భంగిమలో పడుకుని ఉంటే….. ఈయన తల భాగంలో మనకి బ్రహ్మ ప్రతిష్ట చేసిన ఆది అన్నామలై దేవాలయం వస్తుంది. దీనిని తనకి మోహిని వలన ఏర్పడిన మోహిని బంధ విముక్తి కోసం ఈ ఆది అన్నామలై స్వామి శివలింగమూర్తి ఆరాధన చేసి విముక్తి పొందటం జరిగింది. ఇకపోతే శివుడు మధ్య భాగంలో అంటే వక్షస్థానములో మనకి భక్త మార్కండేయ మహర్షి ప్రతిష్ట చేసిన అరుణాచలేశ్వర స్వామి శివలింగమూర్తి ఆలయం వస్తుంది . దీనిని తనకి ఉన్న అప మృత్యు దోష నివారణ కోసము మార్కండేయ మహర్షి కాస్త ఈ లింగమూర్తి ఆరాధన చేసి శాశ్వత చిరంజీవితత్వము పొందడం జరిగింది. ఇక శివుడి పాద భాగంలో మనకి విష్ణుమూర్తి ప్రతిష్ట చేసిన అరుణగిరి నాధర్ శివలింగమూర్తి ఆలయం వస్తుంది. తనకి మోహ నిద్ర నుండి విముక్తి పొందుటకు ఈ శివలింగ ఆరాధన చేసి మోహ నిద్ర నుండి యోగనిద్ర ప్రాప్తి పొందడం జరిగింది. ఇలా ఈ మూడు శివాలయాలు అనగా ఆది అన్నామలై, అరుణాచలేశ్వర స్వామి, అరుణగిరి నాధర్ ఆలయాలను ఉదయం సూర్యోదయం మొదలై సాయంత్రం సాయం సంధ్యాకాలం పూర్తి అయ్యే లోపల…. ఒకేరోజులో ఈ మూడు ఆలయాలు దర్శనం చేసుకుంటే… సంపూర్ణ అరుణగిరి క్షేత్ర దర్శన, గిరి ప్రదక్షిణ, నామస్మరణ ఫలితం లభిస్తుందని… స్కాంద పురాణంలోని అరుణగిరి మహత్యములో చెప్పడం జరిగింది. అదే శివరాత్రి నాడు ఈ మూడు ఆలయాలు దర్శిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందని…. అదే పౌర్ణమి తిథి నాడు ఈ మూడు ఆలయాలు దర్శిస్తే….. అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుందని స్థల పురాణం చెప్పడం జరుగుతుంది. ఇది అక్షర సత్యమేనని నా స్వానుభవంలో ఒకేరోజు అలాగే మహాశివరాత్రి నాడు మరియు పౌర్ణమి తిథి నాడు ఈ మూడు ఆలయాలు ఒకే రోజులో ఉదయం నుంచి సాయంత్రం లోపు దర్శనం చేసుకున్నాను… అనుకున్న కోరికలు తీరడంతో పాటుగా మోక్ష అనుభవ ప్రాప్తి కూడా పొందడం జరిగింది.
ఈ మూడు ఆలయాలకి…ఒకదానికి మరొకటి సుమారుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి…. ఈ మూడు ఆలయాలకు సుమారుగా ఐదు గంటల దర్శనానికి పడుతుంది. మొట్టమొదటగా శిరోభాగానికి సంబంధించిన ఆది అన్నామలై ఆలయ విశేషాలు ఏమిటో తెలుసుకుందాము…. ఈ ఆలయంలో మనకి గాలిగోపురమును లోపలి వైపు చూస్తే యక్షరాజు అలాగే యక్ష రాణి మోస్తున్నట్లుగా కనపడతారు. ఎందుకంటే ఈ ఆలయ గాలిగోపురమును ఎన్నిసార్లు కట్టినప్పటికీ, అకారణంగా పడిపోయేది. గాలిగోపురం లేని గుడి దర్శనానికి పనికిరాదని ఆగమ శాస్త్ర వచనము కదా. అందుకే ఈ ఆలయ అధికారులు ఎన్నిసార్లు గాలిగోపురం కట్టినా కూడా పడిపోయేది… అప్పుడు ఒక సిద్దుడు ఈ ఆలయ దర్శనానికి వచ్చి తన మంత్రసిద్దితో యక్షుడు యక్షిని…. రాజు, రాణిని బంధనం చేసి ఈ గాలిగోపురం మోసే విధంగా ఏర్పాట్లు చేసి వెళ్లిన తరువాత …..మళ్లీ ఇంతవరకు ఈ గాలిగోపురం పడలేదు. ఆ సిద్దుడు అరుణాచల శివుడేనని స్థానిక సాధువులు అలాగే స్థానిక భక్తుల విశ్వాసం అన్నమాట! అలాగే ఈ ఆలయంలో మనకి లోపల వైపు ఒక బావి కనపడుతుంది. దీని లోపల నుండి అరుణగిరి లోపల ఉన్న అంతర గుహకి సోరంగ మార్గం ఉన్నదని…..అలాగే ఈ గుడి లోపల ముఖమండపం కింద కూడా ఒక బావి ఉండి, అది కూడా అంతర్ గుహలోనికి వెళ్లే మరొక సొరంగ మార్గం ఉన్నదని….. గుడి స్థల పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ ఆలయంలో అర్ధరాత్రి పూట దేవతలు సంచారం చేస్తూ ఉంటారని…. అలాగే వేదగానము వినిపిస్తూ ఉంటుందని …..రమణ స్వామి స్వానుభవంగా స్వయంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకరోజు ఈయనకి రాత్రిపూట ఈ గుడిలో నిద్రిస్తే, వారికి వివిధ రకాల దేవతల దర్శనాలతో పాటుగా సామవేద గానం వినిపించడంతో….మానవుల వలన దేవతలకి అంతరాయం కలగకూడదని…. ఈ గుడియందు రాత్రులు ఉండరాదని నిద్రపోరాదని చెప్పడం జరిగింది. ఈ ఆలయంలోపల అమ్మవారి గుడి బయట మనకి 3, 5, 9, 11 దళాలతో ఉన్న బిల్వ వృక్షం దర్శనమిస్తుంది. అలాగే ఆలయ గర్భాలయంలో లోపల ఏకశిలతో నిర్మితమైన సింహ శిలకి , శిలలతో చేసిన గొలుసు ఉంటుంది. అలాగే ఈ ఆలయం బయట వైపున అనగా ఆలయ గాలిగోపురం ప్రవేశద్వారానికి బయట వైపున మనకి ఒక పెద్ద చెట్టు కింద గణపతి శిలతో ఉన్న గణపతి ఆలయం దర్శనమిస్తుంది. ఈయనని పిల్లల గణపతి అంటారు. ఎందుకంటే పిల్లలకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఈయనకి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడితే పిల్లలకి ఉన్న దోషాలు తొలగి….. ఆరోగ్యవంతులు అవుతారని ఇక్కడ స్థానిక భక్తుల యొక్క స్వానుభవాలు అందుకు ఎన్నో నిదర్శనాలుగా ఉన్నాయి.అలాగే ఈ ఆలయం నుండి గిరి అగ్రభాగమును చూస్తే మనకి గజముఖ గణపతి దర్శనం అవుతుంది.ఈ గుడికి బయటవైపు ఎడమ మార్గం ఉంది . అటువైపు వెళితే అనగా మణి వాచక గుడి దగ్గరలో మనకి కాశీ నందులు కనపడతాయి. ఇందులో ఉన్న పెద్ద కాశీ నందికి వివాహం కాని స్త్రీలు అలాగే చిన్న కాశీ నందికి వివాహం కాని పురుషులు పూజలు చేస్తే వారికున్న వివాహ దోషాలు లేదా అవాంతరాలు తొలగిపోయి…. ఎన్నో వివాహాలు జరిగినట్లుగా మనకి స్థానిక భక్తుల అనుభవాలు చెబుతాయి. అలాగే ఈ గుడి లోపల వైపున గుడి వెనక భాగంలో ఎన్నో దేవతా శిల్పాలు ఉంటాయి. ఇందులో చతుర్ముఖ బ్రహ్మ శివలింగం దర్శనమిస్తుంది. ఇలా సుమారుగా 15 కి పైన దేవత మూర్తుల శిల్పాలు దర్శనమిస్తూ ఉంటాయి. వీటిని కూడా దర్శించుకుని తరించండి.
ఇకపోతే….. శివుడు వక్షస్థలములో మనకి మనం నిత్యం చూసే అరుణాచలేశ్వర స్వామి శివలింగము మూర్తి ఆలయం వస్తుంది. ఈ ఆలయం లోపల మనకి సుమారుగా 80 దాకా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రధాన ఆలయం 9 గాలిగోపురాలతో….. మూడు ప్రాకారాలతో….. మూడు శివలింగాలతో…. రెండు తీర్థాలతో ఉంటుంది. ఈ ఆలయం ఉన్న వీధిని రథాల వీధి అంటారు. ఎందుకంటే ఈ వీధిలో మనకి ఈ ఆలయ పంచ విగ్రహమూర్తులైన సోమ స్కందమూర్తి , ఆదిపరాశక్తి, కామాక్షి, గణపతి, కుమారస్వామి, చండీశ్వరుడు ఊరేగింపు కోసం వాడే పంచరధాలు ఈ వీధిలోనే ఉంటాయి. అలాగే ఈ ప్రధాన ఆలయంలో నాలుగు వైపులా….. నాలుగు దిశలలో రెండు చొప్పున గాలిగోపురాలు ఉండి మధ్యలో నవ గాలిగోపురాలు ఉంటాయి. అలాగే ఈ ఆలయ మూడు ప్రాకారాలలో మనకి మొదటి ప్రాకారములో పాతాళ శివలింగమూర్తి, పెద్దనంది, గణపతి, కుమారస్వామి, శివగంగ తీర్థము దర్శనమిస్తే….. రెండవ ప్రకారములో సుందరేశ్వర స్వామి, శివలింగమూర్తి, చిననంది, గణపతి, స్తంభ కుమారస్వామి, బ్రహ్మ తీర్థము, చతుర్ముఖ బ్రహ్మ లింగము దర్శనం ఇస్తే…. ఇక ఆఖరి మూడవ ప్రకారములో అగ్ని లింగమైన అరుణాచలేశ్వర స్వామి, అపితకుచాంబికా దేవి, మహాగణపతి ,సన్యాసి కుమారస్వామి, ఆలయాలు దర్శనమిస్తాయి.
ఇప్పుడు ఇలా ఉన్న ఈ ప్రధాన ఆలయంలోని సచిత్ర విషయాలను ఒక వరుస క్రమంగా చూస్తే…. అది అర్థమై అత్యంత అద్భుత అనుభవ అనుభూతిని కలిగిస్తాయి. మొట్టమొదట ఈ ఆలయం బయట కనిపించే తీర్థమును చక్ర తీర్థము అంటారు… ఈ ఆలయానికి ముందు వైపు కనిపించే మండపమును ఆధునిక కళ్యాణ మండపము అంటారు. ఇందులో గుడికి సంబంధించిన మేళ గాళ్లు సంగీతం చేస్తారు. వీరు చేసే వివిధ వాయిద్య పరికరాల సంగీతమును వింటే….. మన మనసులు కాస్త మైమరచిపోయి అత్యున్నత ఆనంద స్థితికి తీసుకుని వెళ్తాయి…. ఆ తర్వాత వచ్చే మండపమును పురాతన కళ్యాణ మండపము అంటారు . ఇందులో ఉత్సవ మూర్తులకి కళ్యాణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు… ఆ తర్వాత వచ్చే గాలిగోపురమును రాజగోపురము అందురు. దీనికి రెండు వైపులలో ఎడమవైపు ఉండే మండపమును అనగా వెండి రేకుతో ఉన్న దీనిని చిత్రగుప్తుడి మండపము అంటారు. ఇందులో ఈయన….. మనము ఈ గుడి దర్శనం చేసామా లేదా రాస్తాడని….. గుడి స్థల పురాణము చెబుతుంది. అలాగే కుడి వైపున మండపంలో ఉత్సవ మూర్తులకి వస్త్రాలు, ఆభరణాలు, పూలతో అలంకారాలు చేసి…. బయటకు తీసుకుని వస్తారు. అంటే ఇది ఒక రకంగా ఉత్సవ మూర్తుల అలంకారం మండపం అన్నమాట! దీనికి కొద్దిగ దూరంలో మనకి తల వెంట్రుకలు తీసే కళ్యాణకట్ట కనపడుతుంది… ఇక రాజగోపురానికి ద్వారాలు లోపలికి వెళ్తుంటే ఈ గాలిగోపురం కింద మనకి గ్రిల్స్ తో ఉన్న మహాగణపతి విగ్రహం మూర్తి దర్శనం ఇస్తాడు. ఈయనని దర్శించుకొని లోపలికి వెళితే ఎడమవైపు మనకి అన్నదాన సత్రము కనపడుతుంది…. దీని ముందర శివగంగా తీర్థము దర్శనమిస్తుంది. ఇక్కడి నుంచి గిరిని చూస్తే దేవాలయం అలాగే గిరి అగ్రభాగము చాలా స్పష్టంగా కనపడుతుంది…. ఇలా చూడడం అనగా తీర్థము, గుడి, గిరిని ఏకకాలంలో దర్శన అనుభవ అనుభూతి గురించి చెప్పడం ఎవరి తరము కాదు… చూసి అనుభవించక తప్పదు… ఇక గాలిగోపురానికి లోపల వైపు ఈ గోపురానికి దుర్గాదేవి మహిషాసుర మర్దిని రూప విగ్రహ మూర్తిగా దర్శనమిస్తుంది ..
అరుణాచల ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ముందుగా రాజగోపురం ముందు ఉన్న రథాల వీధి దగ్గరికి రావడం జరుగుతుంది. స్వామివారి ఊరేగింపు రథాలను ఈ వీధిలో ఉంచడం వలన దీనిని రథాల వీధి అన్నారు. ఈ రథాల వీధి వద్దకు వచ్చినప్పుడు రాజగోపురానికి ఎదురుగా దీపపు జ్యోతులను వెలిగిస్తారు. ఇక్కడి నుంచి అరుణగిరి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ 365 ఒత్తుల దీప జ్యోతిని వెలిగించి….. ఆ దీప జ్యోతికి మరియు స్వయంభు శివలింగంగా కనిపించే అరుణగిరికి నమస్కారం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ అరుణాచలంలో స్వామివారికి మనకి అరుణ మూడు రకాలుగా దర్శనమిస్తారు. ఒకటి సాక్షాత్ అరుణగిరియే అరుణాచల శివుడిగా…. స్వయంభూ శివలింగంగా మనకి దర్శనం ఇస్తారు. అలాగే ఇక్కడ స్వామి వారు అగ్ని లింగంగా…అరుణ జ్యోతిగా..జ్యోతి ప్రకాశంతో దర్శనమిస్తారు. కాబట్టి దీపం వెలిగించి జ్యోతి దర్శనం చేసుకుని…. మూడవ రూపమైన అరుణాచల ఆలయంలో ఉన్న అరుణాచలేశ్వరుని దర్శనానికి బయలుదేరుతాము.
మొదటగా రాజగోపురం ద్వారం లోపలికి ప్రవేశించే ముందు…. కుడివైపున ఒక మండపం కనిపిస్తుంది. ఈ మండపమును “తిట్టి ప్రవేశద్వారం” అని పిలుస్తారు. స్వామివారి ఆరుబయట చేసే ఉత్సవాల సమయంలో…. ఇక్కడికి తీసుకువచ్చి అలంకరించడం వంటివి చేస్తారు. ఇక్కడ మనం దీనిని దర్శించవచ్చు. ఈ కుడి వైపు ఉన్న వీధిలో చివరికి వెళితే స్వామివారికి తల నీలాలు ఇచ్చే కళ్యాణకట్ట కనపడుతుంది.
అలాగే మనకి రాజగోపురం బయట ఎడమవైపున వెండితో చేసినట్టుగా ఒక మండపం కనిపిస్తుంది.. దీనిని “చిత్ర మండపం” అంటారు. ఇక్కడ చిత్రగుప్తుల వారు ఈ అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనార్థం వచ్చిన జీవుడు యొక్క ఖాతాలను లెక్కగడతారు అని స్థల పురాణం చెబుతోంది.
రాజగోపురానికి ఇరువైపులా ఉన్న ఈ మండపాలను దర్శనం చేసుకున్న తరువాత తిరిగి రాజగోపురం(తూర్పు గోపురం)వద్దకు రావాలి. ప్రపంచంలోనే ఎత్తయిన రాజగోపురాలలో అరుణాచలేశ్వర ఆలయ తూర్పు రాజగోపురం కూడా ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించారు. ఈ రాజగోపురం సుమారుగా 66 మీటర్లు లేదా 216.5 లేదా 217 అడుగుల ఎత్తువరకు ఉంటుంది. అంటే సుమారుగా ఇది 11 అంతస్తుల ఎత్తు ఉంటుంది. ఈ రాజగోపురం పై ఎన్నో రకాల శిల్పాలు చెక్కబడి కనిపిస్తాయి.
ఈ రాజగోపురం లోకి ప్రవేశించగానే ఈ గోపురానికి కింద ఉన్న ప్రాకారంలో ఎడమవైపు నడిచి వెళ్లేటప్పుడు ఆలయంలో మొదటి దర్శనంగా మనకి శక్తి గణపతి దర్శనం ఇస్తారు. ఈ స్వామివారి ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి వారిని చూడటానికి అవసరమైన ఆత్మశక్తిని ప్రసాదిస్తారు. ఎందుకంటే ఈ అరుణాచల క్షేత్రంలో శివుడు అగ్ని లింగంగా ….జ్యోతి రూపంలో అలరారుతూ ఉంటారు. ఈ ధర్మజ్యోతి ప్రకాశాన్ని దర్శించినంత మాత్రము చేత కొన్ని కోట్ల జన్మలలో చేసిన పాపారాశి దహించుకు పోతుంది.. అంతటి శక్తి కలిగిన క్షేత్రం మరియు అంతటి మహిమాన్వితమైన శివలింగ స్వరూపమును దర్శించడానికి…. అంతేకాక అన్ని క్షేత్రాలకు మనం అనుకొని వెళ్లవచ్చు కానీ…. ఈ అరుణాచల క్షేత్రానికి రావాలంటే ఆయన అనుగ్రహించాలి….. ఆయన చూడాలని అనుకుంటేనే మనం వెళ్లగలం…..మరి అంతటి మహిమాన్వితమైన ఈశ్వర దర్శనానికి కావలసిన ఆత్మ శక్తిని మొదటి దర్శనంలోనే మనకి ఈ శక్తి గణపతి అందించడం జరుగుతుంది.
ఈ శక్తి గణపతి పక్కనే వల్లాల మహారాజు విగ్రహ మూర్తి దర్శనమిస్తుంది. ఈయన గురించి మనం “శ్రాద్ధకర్మ చేసే అరుణాచలశివుడు” అనే అధ్యాయంలో చెప్పుకోవడం జరిగింది కదా! ఈయన విగ్రహ మూర్తియే ఇక్కడ మనం దర్శనం చేసుకోవడం జరుగుతుంది.
ఇలా రాజగోపురం నుంచి లోపలికి రాగానే కుడివైపున.. దుర్గాదేవి శిలా విగ్రహ మూర్తి దర్శనమిస్తుంది. తూర్పు రాజ గోపురం యొక్క ప్రాకారంలో దుర్గాదేవి శక్తిని నిక్షిప్తం చేసిన విషయం మనకి స్థల పురాణంలో కనిపిస్తుంది.
ఈ అమ్మవారికి కాస్త పక్కగా వెళితే…. మనం రాజగోపురం బయట….కుడివైపున దర్శనం చేసుకున్న “తిట్టి ప్రవేశద్వారం” అని పిలవబడే మండపానికి ఆలయం లోపల నుంచి వెళ్లే దారి కనిపిస్తుంది.
రాజగోపురానికి లోపలికి ప్రవేశించిన తరువాత ఎడమవైపున మనకి నిత్య అన్నదానం చేసే ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడ నిత్యం భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు.
ఆ తర్వాత రాజగోపురం లోపలికి ప్రవేశించిన తరువాత…. కుడి, ఎడమ ప్రదేశాలు చూసిన తరువాత…. ఇక ఎదురుగా మనకి స్తంభం నుంచి ఉద్భవించిన స్తంభ కుమారస్వామి ఆలయం దర్శనమిస్తుంది. తమిళంలో ఈయనని కంబత్తు ఇలయనార్ అని పిలుస్తారు. మహాకవి సంబంధర్ కు, మరియు భక్తకవి అరుణగిరి నాధర్ కు మధ్య జరిగిన భక్తి పరీక్షలో భాగంగా….కుమారస్వామి స్తంభం నుంచి రావడం జరిగింది. ఈ విశేషాలు అన్నీ కూడా మనం ఈ గ్రంథంలోని “కుమారస్వామి నిజరూప దర్శనం” అనే అధ్యాయంలో చూడవచ్చును. ఈ ఆలయంలోనే మనకి ఒక స్తంభం కూడా దర్శనమిస్తుంది. ఈ స్తంభం వద్ద కూర్చుని అరుణగిరి నాధర్ ఎన్నో కీర్తనలు, భక్తి గీతాలు సుబ్రమణ్య స్వామి మీద చేసేవారని….. ఆ తర్వాత ఇదే స్తంభం వద్ద కూర్చుని శేషాద్రి స్వామి వారు కూడా చాలాకాలం తపస్సు చేశారని…. స్థానిక భక్తుల అనుభవాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ స్తంభం వద్ద ఉప్పు ఉంచి నమస్కారం చేయడం మనం గమనించవచ్చు. దీనిని ఉప్పు స్తంభం అని పిలుస్తారు అని….ఇక్కడ ఉప్పు ఉంచి ఈ స్తంభానికి నమస్కారం చేసుకుంటే… నయంకాని రోగాలు, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. కావున ఇలా ఇక్కడ ఉప్పు ఉంచి నమస్కారం చేసుకుని వారి అనారోగ్య బాధల నుంచి విముక్తి పొందడం జరుగుతుందని స్థానిక భక్తులు చెప్పడం జరుగుతుంది.
స్తంభ కుమారస్వామి ఆలయం దాటి ముందుకు రాగానే కుడి వైపున వలై కాపు మండపం ఆ పక్కనే వేయి స్తంభాల మండపం దర్శనం ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో…అమ్మవారికి గాజుల ఉత్సవం చేస్తారు. 15 రోజులపాటు అమ్మవారిని ఈ మండపంలోనికి తీసుకువచ్చి…. అంగరంగ వైభవంగా ఈ గాజుల ఉత్సవం జరిపిస్తారు. ఆ సమయంలో భక్తులందరూ ఈ గాజులు అమ్మవారి ప్రసాదంగా తీసుకోవడం జరుగుతుంది.
అలాగే ఈ స్తంభ కుమారస్వామి ఆలయం దాటి ముందుకు వచ్చిన తరువాత ఎడమవైపున ఒక తీర్థ రాజ్యం దర్శనమిస్తుంది. దీనిని శివగంగా తీర్థమని పిలుస్తారు. ఈ తీర్థంలో సకల దేవతా స్వరూపాలు అందరూ కూడా స్నానమాచరించడం దీని యొక్క ప్రత్యేకత.
ఇక స్తంభ కుమారస్వామి ఆలయం దాటిన తర్వాత ఎదురుగా మనకి సర్వసిద్ధి వినాయక స్వామి ఆలయం దర్శనమిస్తుంది. కాశీలో, శ్రీశైలంలో ఎలా అయితే సాక్షి గణపతి మన క్షేత్ర దర్శనానికి సాక్షిగా ఉంటారని చెబుతారో….. అలాగే ఇక్కడ ఈ సర్వసిద్ధి వినాయక స్వామి వారు కూడా కలము తో రాస్తున్నట్టుగా… అలాగే మన ఆలయ దర్శనానికి, క్షేత్ర దర్శనానికి సాక్షిగా ఉంటారని చెబుతారు. ఈ ఆలయంలో ఉన్న వినాయకుని వద్ద మన గోత్రనామాలు చెప్పుకొని….. ఈ వినాయకుని అనుగ్రహ ఆశీస్సులు పొందవచ్చును.
ఈ వినాయక ఆలయం నుంచి ఇంకాస్త ముందుకు వెళితే…. అక్కడ మనకి ఒక మండపం దర్శనమిస్తుంది. దీనిని రుద్రాక్ష మండపం అని పిలుస్తారు. పూర్వకాలంలో స్వామివారి దర్శనం చేసుకుని వచ్చే వారికి…. ఇక్కడ రుద్రాక్షలు ఇచ్చేవారని చెబుతారు. ఇప్పుడు దీనిని దీప మండపంగా ఉపయోగిస్తున్నారు. ఈ మండపం యొక్క నాలుగు స్తంభాలలో చండీ, వీరభద్ర, యోగ నరసింహా, వరాహ స్వామి శిలామూర్తులను మనం దర్శనం చేసుకోవచ్చు.
ఇలా దీని దర్శనం చేసుకున్న తరువాత కుడివైపు కనిపించే వెయ్యి కాళ్ళ మండపం లోపలికి వెళ్తే… అక్కడ స్తంభాల మీద దక్షిణామూర్తి, నటరాజ విగ్రహమూర్తులతో పాటుగా మరెన్నో శిల్పాకృతులను ఇక్కడ దర్శనం చేయవచ్చు. ఇక్కడే మనకి అరుళ్మిగు పాతాళ లింగం అని… పాతాళ లింగం దర్శనమిస్తుంది. చిన్నవయసులో ఉన్నప్పుడు రమణ మహర్షి ఇక్కడే కూర్చుని ధ్యానం చేసుకునేవారని చెపుతారు. వాస్తవానికి ఈ లింగం కింది భాగంలో ఒక సిద్ధుడి సమాధి ఉన్నట్టుగా స్థానిక శివయోగుల అనుభవాలు చెబుతాయి.
ఈ పాతాళ లింగం దర్శనం తర్వాత బయటకు వచ్చి కాస్త లోపలికి వెళితే….. అరుళ్మిగు పెద్ద నంది అని పెద్ద నంది విగ్రహం దర్శనమిస్తుంది. ఇది ఈ ఆలయ పెద్దనంది అని కూడా పిలుస్తారు. దీనిని వల్లాల నంది అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనం ఈ నందికి నమస్కారం చేసుకొని…..
ఇంకాస్త ముందుకు రాగానే ఎదురుగా ఒక చిన్న దేవాలయం కనిపిస్తుంది. దీనిని గోపుర సుబ్రహ్మణ్యస్వామి ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయం పైన అరుణగిరి నాథర్ యొక్క జీవితంలోని ముఖ్య ఘట్టాలు ఇక్కడ శిల్పాల రూపంలో మనకు దర్శనం ఇస్తాయి.
ఇక్కడ నుండి బయటకు రాగానే…. మనకి కుడివైపున ఒక సందు వంటి దారి కనిపిస్తుంది. ఈ దారి కుండా వెళ్తున్నప్పుడు దారిలో మనకి కుడివైపున చిన్న వినాయక విగ్రహ మూర్తి దర్శనమిస్తుంది. ఇలా దర్శనం చేసుకుని లోపలికి వెళితే అక్కడ ఆలయ పూతోట కనిపిస్తుంది. ఈ పూ తోటలోనే స్వామివారి అర్చనకి సేవకి పూజారి కార్యక్రమాలకి కావలసిన పుష్పములను ఇతర దేవత వృక్షాలను పెంచడం జరుగుతుంది. స్వామివారి సేవకి వీటిని మాత్రమే నివేదించే వారిని స్థల పురాణంలో చెప్పడం జరిగింది. దీన్ని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. స్వామివారి ఆలయ పూతోట.
దీనిని దాటుకొని మరి కొంచెం ముందుకు వెళితే …ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టుకు ఇరువైపులా రెండు గణపతి ఆలయాలు దర్శనమిస్తాయి. ఇందులో ఒక ఆలయంలో ద్వంద గణపతిగా దర్శనమిస్తే…. మరొక ఆలయంలో గణపతి ముందు నిత్య ప్రకాశంగా జ్యోతి దర్శనం జరుగుతుంది. వాస్తవానికి ఈ ప్రదేశంలో నించొని అరుణ జ్యోతిని దర్శనం చేసుకోవచ్చు అని…ఇక్కడి నుంచి చాలా స్పష్టంగా అరుణ జ్యోతి దర్శనం జరుగుతుంది అని…. ఇక్కడ స్థానిక భక్తులు చెప్పడం జరిగింది.
ఇలా ఈ ఇద్దరి గణపతులను దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి మనం బయటకి అదే….పెద్ద నంది వద్దకు రావడం జరుగుతుంది. తిరిగి మళ్లీ ఈ పెదనంది ఎదురుగా ఒక పెద్ద ప్రాంగణం కనబడుతుంది. దీనిని మెట్లు ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ శివుడు కల్యాణ సుందరేశ్వరుడిగా శివలింగ రూపంలో ఉన్న ఒక శివాలయం దర్శనం ఇస్తుంది. ఇక్కడ కూర్చుని ఎంతోమంది సాధు పుంగవులు ధ్యానం, తపము, జపము చేసుకుంటూ మనకి కనిపిస్తారు. ఇక్కడే మనకి ఇనుప గ్రిల్స్ తో కప్పి పెట్టిన ఒక చిన్న బావి లేదా ఊట వంటి నిర్మాణం కనబడుతుంది. దీనిని శివబుగ్గ అని పిలుస్తారు. మొట్టమొదటి శివగంగా తీర్థం కనిపించిన ప్రదేశం ఇదే అని స్థానిక భక్తులు చెప్పడం జరిగింది.
ఇక ఇక్కడి నుంచి కుడి వైపుకు వెళ్ళినట్లయితే….. ఆలయ స్థలవృక్షాలు అయిన వకుళ వృక్షము, రావి వంటి దేవత వృక్షాలు దర్శనం ఇస్తాయి. ఈ పక్కనే మరెన్నో రాజ తీర్థ మండపాలు…. ఆ పక్కనే ఒక హోమశాల వంటివి దర్శనం ఇస్తాయి.
ఇక ఇక్కడి నుంచి మనం వల్లాల గోపురం వైపుకు రావడం జరుగుతుంది. ఈవల్లాల గోపురం కిందనే మనకి రెండవసారి వల్లాల మహారాజు యొక్క శిలా విగ్రహ మూర్తి దర్శనమిస్తుంది. ఇతను మనకి రాజగోపురం లోకి అడుగుపెట్టగానే శక్తి గణపతి తర్వాత మనకి దర్శనం ఇస్తారు. మళ్లీ ఇక్కడ కనబడతారు.
ఇలా ఈవల్లాల గోపురం లో ఉన్న వల్లాల మహారాజును దర్శనం చేసుకుని కొంచెం ముందుకు రాగానే…. ఎడమవైపున శక్తివంతమైన కాలభైరవ ఆలయం మనకి దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో పైకి చూసినట్టయితే ఒక పెద్ద శివలింగము చిత్రీకరించి కనపడుతుంది. ఇది త్రీడీ పెయింటింగ్. మనం ఎటువైపు నుంచి చూసినా … మనవైపే పాన మట్టం ఉన్నట్టుగా కనబడుతుంది.
ఇక ఇక్కడి నుంచి బయటకు రాగానే ఎదురుగా ఉన్న చిన్న మండపం వంటి ప్రాకారంలో మనకి ఈ అరుణాచల ఆలయం 3డి నమునా …. ఒక టేబుల్ మీద పెట్టి చూపించడం జరుగుతుంది.
దీనిని దర్శనం చేసుకుని కాస్త ముందుకు వెళ్లి ఎడమవైపుకు తిరిగితే….. బ్రహ్మ తీర్థం మనకి కనపడుతుంది. ఇక్కడే మనకి ఒక యోగి విగ్రహం కూడా దర్శనమిస్తుంది. ఈ విగ్రహం అరుణగిరి నాధర్ అని చెప్పడం జరుగుతుంది. ఈ బ్రహ్మ తీర్థమునకు ఎడమవైపు బ్రహ్మచే ప్రతిష్టించబడిన బ్రహ్మశివలింగం దర్శనం ఇస్తుంది. దీప జ్యోతి వెలిగించినప్పుడు ఈ బ్రహ్మ తీర్థానికి ఎదురుగా నిలబడి జ్యోతిని వెలిగించి ఇక్కడ నుంచి గిరిప్రదక్షిణం మొదలుపెడతారు.
ఆ తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్ళగానే ఒక గోశాల కనిపిస్తుంది.
ఈ బ్రహ్మ తీర్థానికి మరియు గోశాలకి మధ్యలో ఉన్న ప్రాకారాలను దక్షిణ గోపురం లేదా తిరు మంజిన గోపురం అని పిలుస్తారు.
ఇక్కడ 18 మంది సిద్దులలో ఒకరైన ఇడైకాటు సిద్దర్ యొక్క జీవ సమాధి కనిపిస్తుంది. మోక్షమార్గంలో ఇతను ఒక సిద్ధంత్రమును ప్రతిష్టించడం జరిగింది. ఈ గోసాల పక్కనే మరొక గణపతి ఆలయం దర్శనమిస్తుంది. ఈ గణపతిని వన తీర్థ వినాయకుడు అని పిలుస్తారు. ఈ ఆలయం వెనక భాగంలోనే ఒక పెద్ద బిల్వ వృక్షం దర్శనమిస్తుంది. ఈ మహా బిల్వ వృక్షము మూడు నుంచి 12 ఆకులు కలిగిన మహా బిల్వ వృక్షం అన్నమాట. ఈ బిల్వ వృక్షం దర్శనం చేసుకుని తిరిగి మరల ఈ తీర్థం వద్దకు వచ్చి ఇక్కడి నుంచి….ఇంకాస్త నడుచుకుంటూ ముందుకు వెళితే… నాట్య గణపతి మరియు అమ్మవారితో కలిసి ఉన్న మరొక గణపతి ఆలయాలు దర్శనం ఇస్తాయి.
ఈ రెండు గణపతి ఆలయాలు దర్శనం చేసుకుని ముందుకు నడుస్తూ వెళితే అక్కడ మనకి చిన్న నంది దర్శనం జరుగుతుంది. దీనికి పక్కనే ఒక పెద్ద మండపం కనిపిస్తుంది ఇక్కడ నాద సంకీర్తనలు చేస్తూ ఉంటారు కాబట్టి దీనిని నాద మండపము అని పిలుస్తారు. దీని సమీపంలోనే కుమారస్వామి ఆలయం దర్శనమిస్తుంది.
ఇక్కడి నుంచి మరి కొంచెం ముందుకు వెళితే… కిలిగోపురం దర్శనం జరుగుతుంది. ఈ కిలిగోపురం చిలక బొమ్మలతో ఉండి, ఈ గోపురం ప్రాకారము కింద మనకి ద్వారములు దాటిన వెంటనే కుడివైపున మోహిని విగ్రహ మూర్తి కనిపిస్తుంది. ఈ మోహిని విగ్రహ మూర్తిని ఒక నియమంతో దర్శించాలని… దీనిని గుడిలోకి వెళ్ళేటప్పుడు దర్శించవచ్చు కానీ…. తిరిగి వచ్చేటప్పుడు దర్శించరాదని అరుణగిరి నాధర్ ఒక నియమంతో ఈ మోహిని మూర్తిని నాట్య కత్తే రూపంలో…. ఈ కిలిగోపురం వద్ద బంధనం చేసిన కథనం…మనకి క్షేత్ర మాయలు అనే అధ్యాయంలో రావడం జరుగుతుంది.
ఇక ఈ కిలిగోపురం దగ్గర నుంచి మరి కొంచెం ముందుకు వెళితే ఒక పెద్ద మండపం కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు …స్వామివారిపై గానాలు, సంకీర్తనలు, చేస్తూ ఉంటారు దీనిని చూడడానికి సాక్షాత్తు ఆ శివుడే తన గణాలతో వచ్చి ఈ గానామృతాన్ని వింటారని స్థానిక భక్తులు నమ్ముతారు. ఈ మండపాన్ని ఉపదర్శన మండపం అని పిలుస్తారు.
ఇక ఇక్కడి నుంచి మనం కాస్త కుడివైపుకు రాగానే ఒక పెద్ద బదరికా వృక్షము మరియు దానితో పాటుగా బిల్వ వృక్షము కలిసిపోయి ఒకే చెట్టుగా మనకి దర్శనం ఇస్తాయి. ఈ చెట్టు పైన వివిధ రూపాలలో సిద్ధులు యోగులు దర్శనం ఇస్తారని అరుణాచల మహత్యంలో చెప్పడం జరిగింది. దీనికి ఎదురుగా ఒక రాతి త్రిశూలం మనకి దర్శనమిస్తుంది. ఈ రాతి త్రిశూలం గురించి మనం నంది ముఖ దర్శనం అనే అధ్యాయంలో చూడవచ్చును.
ఈ పరిసర ప్రాంతంలోనే మనకి జంబుకేశ్వర అనగా పంచభూత లింగాలలో ఒకటైన జల లింగం దర్శనం ఇస్తుంది దీని పక్కనే మరొక నటరాజస్వామి ఆలయం కూడా దర్శనమిస్తుంది.మనకి ఇక్కడ పంచభూతాలయాలు కనిపిస్తాయి.
ఈ త్రిశూలానికి ఎదురుగా మనకి ఒక అమ్మవారి ఆలయం దర్శనమిస్తుంది. ఈ అమ్మవారిని పిడారి అమ్మన్ అని పిలుస్తారు. రాత్రి వేళలో ఈ ఆలయంలో ఈ అమ్మవారు నిజరూపంతో తిరుగుతూ ఉంటారని…. ఈ అమ్మవారు ఈ ఆలయంలో పాలకురాలిగా ఉంటారు…ఈ ఆలయంలో మనకి అష్ట మాతృకుల దర్శనం కూడా జరుగుతుంది.
ఇక్కడి నుంచి మరి కొంచెం ముందుకు వెళితే మనకి బంగారు రథం కనిపిస్తుంది.
దీనికి సమీపంలోనే మనకి కంచిలో ఉన్న పృద్వి లింగం దర్శనమిస్తుంది.
ఇక్కడ నుంచి మనం ధ్వజస్తంభ దర్శనం చేసుకోవచ్చును.
దర్శనం చేసుకున్న తరువాత దీనికి సమీపంలోనే జ్ఞాన సంబంధర్ వినాయకుని ఆలయము మరియు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పక్కపక్కనే కనబడడం జరుగుతుంది.
ఇక్కడి నుంచి మరి కొంచెం ముందుకు వెళితే ఒక తెల్లటి వృత్తం ఆకారంలో నేలపై కనబడుతుంది. ఈ వృత్తంలో కనుక మనం నించుని చూస్తే 9 గోపురాలు మనకి దర్శనం ఇస్తాయి.
ఈ ఆలయంలో ఉన్న వృక్షాలన్నీ కూడా స్థలవృక్షాలుగా చెప్పడం జరిగింది. ఈ వృత్తం చుట్టుపక్కల చాలావరకు ఆలయ స్థలవృక్షాలు దర్శనం ఇస్తాయి. ఈ స్థల వృక్షాలకు ఇనుప గేట్లతో ప్రాకారం నిర్మించి… దక్షిణామూర్తి విగ్రహాలను పెట్టడం జరిగింది.
ఇక ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తే….దక్షిణ రాజగోపురం…. దాని పక్కనే ఒక పెద్ద మండపము…దీనికి ఎదురుగా…. ఒక ఆలయ కళ్యాణ మండపము కనిపిస్తుంది. స్వామివారి కల్యాణములు అవి ఇక్కడ జరిపించడం జరుగుతుంది. ఈ మండపానికి ఉన్న ఒక స్తంభము మీద మనకి టేస్లా టవర్ గూర్చిన శిలమూర్తి కనపడుతుంది.
ఈ కళ్యాణ మండపం వెనకవైపు స్వామివారి వస్తు భాండాగారం…ఉంచే ప్రదేశం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి అనుమతించరు.
ఇక ఈ దీనికి దగ్గరలోనే మనకి అరుణగిరి యోగి మండపం దర్శనమిస్తుంది. ఇక్కడ ఆలయంలోనే సొరంగ మార్గాలు దర్శనమిస్తాయి. ఈ అరుణగిరి యోగి విగ్రహ మూర్తి వద్ద నుండి ఆది అన్నామలై గుడికి వెళ్లడానికి సొరంగమార్గం ఉన్నదని స్థానిక భక్తుల ద్వారా తెలుసుకొని చెప్పడం జరుగుతుంది.
ఇక ఇక్కడి నుంచి పై గోపురానికి వెళ్లిన తరువాత ఇక్కడ మనం ఒక పెద్ద మట్టి రోడ్డు ద్వారా నడిచి వెళితే అరుణాచలేశ్వర స్వామి వారి పాద మండపం లేదా రుద్ర పాదాలు దర్శనం ఇస్తాయి. మనం ఇక్కడ స్వామి వారి పాదాలను దర్శనం చేసుకోవొచ్చును..
ఇక్కడే దగ్గరిలో స్థూల సూక్ష్మరూపం అరుణాచల శివలింగం దర్శనమిస్తుంది. స్వామివారి దర్బాలయంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తే ఈ ఆలయంలో ఉన్న శివలింగం మీద నీటి బిందువులు కనిపిస్తాయని స్థల పురాణం చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శివలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చును.
దీనికి పక్కనే మనకి బాలమురు వినాయకుడు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళితే…. పక్కనే అమావాస్య మండపము కనిపిస్తాయి. ఒకానొక సమయంలో పౌర్ణమికి ఎలా అయితే స్వామివారికి పూజలు నిర్వహించేవారో ….అలాగే అమావాస్యకి కూడా నిర్వహించే వాళ్ళని…. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇలాంటివేవీ ఇక్కడ జరగడం లేదని తెలుసుకోవడం జరిగింది . గోశాల మరియు ఈ అమావాస్య మండపం అనేది రెండు కలిసిపోయి ఉన్నట్టుగా కనిపిస్తుంది.
ఇక్కడి నుంచి మనం కుడివైపుకు వెళితే సుబ్రహ్మణ్యస్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఈ స్వామిని పౌర్ణమి కుమారస్వామి స్వామి అంటారు . దీని ప్రక్కనే కృతిక మండపం లేదా కార్తీక మండపం దర్శనమిస్తుంది. కార్తికేయుని అలంకరణ వంటి కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తారు.
ఇక్కడి నుంచి అటు ఇటు చెట్లు నాటినట్టుగా …గుబురు గా …..పచ్చదనం నిండిన దారిలో నుంచి మనం వెళ్లినట్టు అయితే… అమ్మని అమ్మన్ గోపురం (ఉత్తర గోపురం) వద్దకు రావడం జరుగుతుంది.
ఇక్కడికి సమీపంలో మనకి ఒక యాగశాల కనబడుతుంది. ఈ యాగశాలకు ఎదురుగా అమ్మవారి ఆలయము దర్శనమిస్తుంది.
ఈ యాగశాల పక్కన ….మనకి అమ్మవారికి ఎదురుగా శ్రీకాళహస్తి లింగం అనగా వాయు లింగం దర్శనం ఉంటుంది.
ఇక స్వామివారి గర్భాలయములో అరుణాచలేశ్వర శివలింగమూర్తిని దర్శనం చేసుకుని…. బయటకు రాగానే…. మనకి నటరాజ మూర్తి విగ్రహము, దాని పక్కనే ఒక సొరంగ మార్గము… అలా నడుస్తూ వెళ్తే….. స్వర్ణాకర్షణ భైరవమూర్తి మరియు నటరాజమూర్తి, సోమస్కంద మూర్తి విగ్రహాలు, వీటితో పాటుగా…. లింగోద్భావ మూర్తి దర్శనము, ఆ పక్కనే శ్రీకృష్ణ ఆలయము, గజలక్ష్మి అమ్మవారు, పక్కనే కుమారస్వామి ఆలయ దర్శనం చేసుకోవడం జరుగుతుంది.
ఇక్కడ నుంచి మనం అమ్మవారి ఆలయంలోకి వెళితే…. అపితకుచాంబిక దేవి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత…..ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవలసిన విగ్రహ మూర్తి ఒకటి ఉంటుంది.
ఈ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మనకి నవగ్రహ మండపం దర్శనం ఇస్తుంది.
సాధారణంగా ఈ స్వామివారిని దర్శనం కోసం కాస్త కష్టపడాల్సి వస్తుంది. రెండు స్తంభాల మధ్యలో చిన్న ఇరుకు సందులో వినాయకుడి విగ్రహం మనకి దర్శనమిస్తుంది. ఈయనే బిందు గణపతి అని పిలుస్తారు. ఈయన అమ్మవారి ఆలయంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఎదురుగా ఉన్న స్తంభాలలో మనకి దర్శనం ఇస్తారు. కాకపోతే వెతికి కాస్త కష్టపడి చూడవలసిన గణపతి దర్శనం అన్నమాట.
ఇకపోతే అమ్మవారి ఆలయంలోపల దర్శనం చేసుకుని…. తిరిగి వచ్చేటప్పుడు మనకి ఎడమవైపున చిత్రగుప్తుని ఆలయం దర్శనమిస్తుంది. ఈ చిత్రగుప్తునినీ ఎదురుగా నిలబడి దర్శనం చేయకూడదు అని స్థల పురాణంలో చెప్పడం వలన …..స్వామివారిని పక్క నుంచి దర్శనం చేసుకుని బయటకు రావడం జరుగుతుంది.
అలాగే గర్భాలయాలకి వెనకవైపు ఉండే రాజగోపురాన్ని పేయ్ గోపురం అని పిలవడం జరుగుతుంది.
ఇక మూడవదైన పాద భాగంలో కనిపించే ఆలయమే…. అరుణగిరి నాథర్ గుడి అన్నమాట! దీనినే విష్ణుమూర్తి కాస్త ప్రతిష్ట చేయడం జరిగింది. ఈ దేవాలయంలో మనకి అరుణగిరి నాధర్ శివలింగము, అపీత కుచాంబికాదేవి, స్వర్ణ ఆకర్షణ భైరవుడు, సతులతో ఉన్న నవగ్రహ దేవాలయాలు, గణపతి, కుమారస్వామి, దుర్గాదేవి, చండీశ్వర, వేణుగోపాలస్వామి ఉప ఆలయాలుగా దర్శనమిస్తాయి. విచిత్రం ఏమిటంటే… ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే… దీని నివారణ కోసం ఈ గుడిలో ఉన్న స్వర్ణాకర్షణ భైరవమూర్తి దగ్గర శుక్రవారం నాడు మీరు 11 రూపాయి నాణేలు తీసుకొని అర్చన చేయించి…. వాటిని మీ ఇంటిలో ధనం దాచే చోట ఉంచితే…. మీకున్న ఆర్థిక సమస్యలు అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే పరిష్కారం మార్గాలు దొరకడం….. ఇక్కడి స్థానిక భక్తుల స్వానుభవాలు ఎన్నో నిదర్శనంగా నిలుస్తాయి. ఎందుకంటే మహాలక్ష్మికి అలాగే కుబేరుడికి ఈ స్వర్ణాకర్షణ భైరవమూర్తి అనుగ్రహిస్తేనే వీళ్ళకి ధనప్రాప్తి యోగం ఉంటుందని చాలామందికి తెలియని విషయం అన్నమాట. కాబట్టి మీ ఆర్థిక సమస్యల నివారణ కోసం…. ఈ అరుణాచల క్షేత్రంలో ఉన్న త్రిమూర్తుల స్వర్ణాకర్షణ భైరవమూర్తులలో అనగా….. అరుణాచలేశ్వర ఆలయంలోని రెండవ ప్రాకారంలో ఒక స్వర్ణాకర్షణ భైరవమూర్తి ఉంటే, ఇక రెండవది మనకి దుర్గాదేవి ఆలయంలో ఉంటే, మూడవది ఈ అరుణగిరి ఆలయంలో ఉంది. ఈ మూడింటిలో మీరు ఎవరికైనా పూజలు చేయించినా …..మీ ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని… నిశ్చయముగా చెప్పుకోవచ్చును. అలాగే ఈ గుడి అనేది మీకున్న కోరికలను కూడా తీరుస్తుంది… అంటే ఆది అన్నామలై ఆలయం అనేది మోహమాయ తొలగిస్తే…. రెండవది అయిన అరుణాచలేశ్వర ఆలయం అనేది అకాల మృత్యుభయము నుండి….. అలాగే మీ అజ్ఞానమును తొలగించి పూర్ణజ్ఞాన ప్రాప్తి కలిగిస్తే…. ఇక మూడవది అయిన ఈ అరుణగిరి నాధర్ ఆలయంలో మీ కోరిక ఏదైనా కూడా తీరుస్తుంది. ఎలా అంటే ఈ ఆలయంలో ఉన్న చండీశ్వర స్వామి దగ్గరికి వెళ్లి చప్పట్లు కొట్టి , ఆయన చెవిలో మీ కోరిక చెబితే…. ఈయన కాస్త అరుణగిరి నాధర్ స్వామి చెవిలో మీ కోరిక నివేదిస్తాడని…. స్థల గుడి పురాణం చెపుతుంది . పైగా మీరు ఖచ్చితంగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈ చండీశ్వర స్వామి ఎప్పుడూ కూడా ధ్యాన సమాధి స్థితిలో ఉంటారు… ఈ స్థితి నుండి బయటకు తెప్పించడానికి మనం చప్పట్లు లేదా చిటికెలు వేస్తే…. ఈ శబ్దనాదానికి ఈయన చెవిలో మనం చెప్పిన కోరిక విని…. స్వామివారికి చెప్పి…. తిరిగి ఈయన సమాధి స్థితిలోనికి వెళ్లడం జరుగుతుంది. ఇలా ఈ చండీశ్వర స్వామి దగ్గర చప్పట్లు కొడితే మీ కోరిక తీరుతుంది. అలాగే ఇక్కడ స్వర్ణాకర్షణ భైరవమూర్తికి నాణాలతో పూజిస్తే మీ ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఖచ్చితంగా…. నిశ్చయముగా చెప్పవచ్చును. అంతెందుకు…. శంకరాచార్యులు కాస్త ఈ ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు ఈ దేవాలయం కాస్త ఒక మహా శివలింగంగా దర్శనం ఇచ్చేసరికి…. ఈ ఆలయంలోనికి ప్రవేశిస్తే ఈ శివలింగం మీద అడుగు పెట్టినట్లేనని ఈయన వెనుతిరిగి వెళ్ళిపోయారు. అలాగే ఈ ఆలయం లోపల వెనుక వైపు మనకి వేణుగోపాల స్వామి ఉప ఆలయం దర్శనమిస్తుంది . వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారముగా ఏర్పాటు చేసుకుని ఆపై అరుణగిరి నాధర్ శివలింగమూర్తి దర్శనం అయ్యేటట్లుగా చేస్తారు… ఇదే విధి విధానానికి వక్షస్థల బాగా ఆలయమైన అరుణాచలేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఉన్న వేణుగోపాల స్వామికి దర్శనం ఏర్పాట్లు చేయడం బట్టి చూస్తే …..శివ కేశవుడికి అభేదము అనగా … బేధం లేదని…. వీరిద్దరూ ఒక్కటేనని…. శివకేశవ అర్ధనారీశ్వర తత్వమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇప్పటికైనా శివకేశవుడికి భేదం లేదని తెలుసుకోండి…గ్రహించండి…. అలాగే ఆది అన్నామలై గుడిలో మనకి చతుర్ముఖ బ్రహ్మ లింగ దర్శనం అయితే…..అరుణాచలేశ్వర స్వామి రెండవ ప్రకారములో మనకి చతుర్ముఖ బ్రహ్మ శివలింగం….. అలాగే బ్రహ్మ తీర్థము దర్శనం అవ్వడం బట్టి చూస్తే ….బ్రహ్మకి అలాగే శివుడికి కూడా అభేదమని వీరిద్దరూ కూడా వేరు కాదని ఒక్కటేనని అర్థం అవుతోంది కదా! అంటే ఈ లెక్కన చూస్తే త్రిమూర్తుల స్వరూపాలు మూడు కాదని…..ఏకైక ఆది బ్రహ్మ స్వరూపమని తెలుసుకోండి. ఇకపోతే ఈ మూడు దేవాలయాలలో ఉన్న శివలింగమూర్తి ,అమ్మవారు ,గణపతి, కుమారస్వామి, దుర్గాదేవి, దక్షిణామూర్తి, లింగోద్భవ మూర్తి, భైరవమూర్తి విగ్రహమూర్తులు ఒకే విధంగా ఉండడం బట్టి చూస్తే…..ఈ మూడు దేవాలయాలకి ఖచ్చితమైన అవినాభావ సంబంధం ఉంటుందని అవుతుంది. కాకపోతే ఒకే రోజులో లేదా శివరాత్రి నాడు లేదా పౌర్ణమి తిథిలో ఈ మూడు ఆలయాల దర్శనం అనేది…. శివయోగం ఉన్న శివయోగులకే సాధ్యపడుతుంది అని…. నా స్వానుభవాలలో గ్రహించాను. ఇలా ఎప్పుడైతే ఒకే రోజులో ఈ మూడు ఆలయాల దర్శనం చేసుకుంటారో…. వారికి ఉన్న సమస్త కోరికలు తీరి…. ఆపై విశ్వ పూర్ణ శూన్యం నందు శూన్యమై…. పూర్ణ మోక్షం పొందుతారని అనడానికి ఎటువంటి అనుమానభయం లేకుండా ఖచ్చితంగా నిశ్చయముగా చెప్పుకోవచ్చును. ఇలా స్థానిక సాధువులు అలాగే శివయోగులు మరియు సన్యాసుల స్వానుభావాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ అరుణాచల క్షేత్రానికి వచ్చినప్పుడు ఒకేరోజు అనగా సూర్యోదయం మొదలుపెట్టి సూర్యాస్తమయం లోపుల ఈ మూడు ఆలయాలు అనగా పాదభాగం అంటే అరుణగిరి నాధర్ గుడి వక్ష భాగమైన అరుణాచలేశ్వర స్వామి గుడి ,శిరోభాగమైన ఆది అన్నామలై గుడిని దర్శించుకుని….. మీ కోరిక తీర్చుకొని….. మోక్ష ప్రాప్తి యోగము పొంది తరించి ధన్యులు అవ్వండి .
ద్వాదశ అధ్యాయము సమాప్తము
శుభం భూయాత్
సర్వం అరుణాచల శివార్పణమస్తు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి