అరుణాచల చరిత్ర - చరిత్రలో అరుణాచలం
అరుణాచల క్షేత్రము… తమిళనాడు రాష్ట్ర ప్రాంతంలో ఉన్న వెల్లూరు ప్రాంతానికి ,83 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే కాంచీపురానికి 120 కిలోమీటర్లు ….అలాగే తిరుమల తిరుపతికి 190 కిలోమీటర్లు ….అలాగే 195 కిలోమీటర్ల దూరంలో చెన్నైకి…. మరియు 204 కిలోమీటర్ల దూరంలో బెంగళూరుకి ఉంది. అరుణాచలం అనగా ‘అరుణ’ అంటే ఎర్రని అచలం. అంటే కొండ అని అనగా…. ఎర్రని కొండ అని అర్థం ఉంది. అలాగే అ- రుణ అనగా ఋణము లేనిది… పాపాలు లేనిది, అంటే ఋణ పాపాలు హరించు కొండ అని మరియొక అర్థము కూడా ఉన్నది. తమిళంలో అరుణాచలమును “తిరువన్నామలై” అంటారు . ఇందులో తిరు అంటే “శ్రీ” అని అన్నామలై అనగా “పెద్ద కొండ” అని అర్థం ఉంది.
ఈ అరుణాచల క్షేత్రమును పంచభూత క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. పంచభూత లింగ క్షేత్రాలలో నాలుగు తమిళనాడులో ఉంటే ….అనగా కాంచీపురంలో పృధ్వీ లింగము అనగా “భూమి” ఉంటే…. శ్రీరంగ క్షేత్రానికి దగ్గరలో ఉన్న జంబుకేశ్వరంలో జల లింగము ఉంటే…. చిదంబర క్షేత్రంలో ఆకాశ లింగము ఉండటం జరిగితే…. ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాళహస్తి క్షేత్రంలో వాయు లింగం ఉంది. అదే అరుణాచల క్షేత్రంలో అగ్నితత్వం అనేది స్వయంభు తేజోలింగముగా ఉద్భవించింది. ఎర్రని కాంతి తేజస్సుతో అగ్నిస్తంభములాగా ఈ తేజోలింగ ఉద్భవము మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆదిలో జరగటం వలన ఈ కాలమును లింగోద్భవ కాలము గా పరిగణిస్తారని స్కాంద పురాణంలో మరియు లింగ పురాణము మరియు శివపురాణాలలో చెప్పడం జరిగింది. ఈ లింగోద్భవ కాల జ్యోతిర్లింగములో మధ్య భాగంలో ఆది శివ మూర్తి ఉంటే…. లింగ అగ్రభాగంలో బ్రహ్మదేవుడు కాస్త హంస రూపంలో ఉంటే….. లింగ కింద భాగములో విష్ణుమూర్తి కాస్త వరాహ రూపంలో ఉండడం జరిగింది. ఈ త్రిమూర్తుల రూప శివలింగమే ఈ అరుణాచల క్షేత్ర అగ్నితేజో లింగోద్భవశివలింగం అయింది. పైగా ఈ అగ్నికొండయే శివుడని చెప్పడంతో ఈ కొండకి తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ కొండకి ప్రతినిత్యం గిరిప్రదక్షిణము చేస్తే… సాక్షాత్తు కైలాస లోకంలో ఉండే కైలాసనాధుడికి ప్రదక్షిణం చేసినట్లేనని భక్తుల అమిత విశ్వాసం కావటం చేత…… వారంలో ఏడు రోజులకి ప్రదక్షిణ ఫలితాలతో పాటుగా… పౌర్ణమి రోజున చేసే గిరి ప్రదక్షిణానికి విశేష ఫలితాలు… అనగా ఆర్థిక, అనారోగ్య, మానసిక, శారీరక, అవసర కోరికలు, భోగ-యోగ కోరికలు… మోక్ష ప్రాప్తి కలుగుతాయని భక్తులు విశ్వాసముతో గిరిప్రదక్షిణం చేయడం జరుగుతోంది.
అందెందుకు ఈ గిరిప్రదక్షిణమును మనసా వాచా కర్మణా…..అరుణాచల శివనామస్మరణతో ,పాదరక్షలు లేకుండా, కాలినడకతో చేస్తే…. విశ్వ పూర్ణ శూన్యంలో శూన్యమయ్యే విశ్వ పూర్ణ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్వయంగా ఎందరో అరుణగిరి యోగులు, స్వయంగా ఇలాంటి పూర్ణ మోక్ష ప్రాప్తి దాఖలాలు ఉండటంతో…. ఇలాంటి మోక్ష ప్రాప్తి కోసం దైవాలు సైతం మారు రూపాలలో పిల్లిగాను, సింహముగాను, పులిగాను, పాముగాను, ముసలిగాను, కుక్కగా, దోమగా, ఈగగా, చీమ,గా మినుగురు పురుగుగా, గుర్రముగా, అలాగే రామచిలుకగా, పావురముగా, చకోర పక్షిగా, గ్రద్దగా, ఇలా వివిధ దేవత లోకవాసులు….. దేవతలు, మహర్షులు, సప్త ఊర్ధ్వలోక వాసులు…. ఇలా జీవరాశుల రూపంలో అనగా పక్షుల, పశువుల రూపంలో గిరి చుట్టూ అపసవ్య దిశలో ప్రదక్షిణలు చేయడం జరుగుతోంది. అదే మానవులైతే సవ్య దిశలో గిరి ప్రదక్షిణం చేస్తారని…. ఈ క్షేత్ర పురాణ ఉవాచగా చెప్పడం జరుగుతుంది. ఇలా చేస్తే జన్మాంతర జన్మలలో తెలిసి లేదా తెలియక చేసిన ఎన్నో కోటానుకోట్ల జన్మల పాపాలు ఋణాలు దగ్ధమవుతాయని స్థల పురాణం చెప్పడం జరిగింది.
ఇక యోగ సాధన ప్రకారంలో చూస్తే అరుణగిరికి అగ్నితత్వం ఉండడం చేత …దీనిని మణిపూరక చక్ర అగ్నితత్వముగా భావిస్తారు. కానీ ,అనుభవ సాధన ప్రకారం చూస్తే, ఈ అరుణగిరి యొక్క అగ్ని తత్వము అనేది స్వయంభు తేజోగ్ని కావటం చేత ఇది కాస్త బ్రహ్మరంధ్రంలోని చితాగ్నికి ప్రతీకయని ఎంతోమంది అరుణగిరి యోగుల స్వానుభవాలు చెబుతున్నాయి. అలాగే కాశీఖండంలోని ఈ శ్లోకం ప్రకారం చూస్తే
"దర్శనాత్ అబ్రసదసి
జననాత్ కమలాలయే
స్మరణాత్ అరుణాచలే
కాశ్యాంతు మరణాన్ ముక్తిః”
చిదంబరంలో ఆకాశ లింగం దర్శించినా ….అలాగే తిరువాయుర్లో జననం జరిగినా ….లేదా కాశీలో మరణం పొందినా ….లేదా అరుణాచల క్షేత్రంలో అరుణాచల నామస్మరణ చేతనే జీవన్ముక్తి, అదే మోక్షము కలుగుతుందని చెప్పడం జరిగింది. అంటే ఈ లెక్కన చూస్తే స్మరణ చేతనే మనకి అరుణాచల క్షేత్ర శివమూర్తి మోక్షమునొసగే క్షేత్రమని అర్థమవుతుంది కదా!
శివ సాకారోపాసనగా శివ అష్ట లింగమూర్తి లింగాలు సాధన చేయవచ్చునని శాస్త్ర వచనం ఉంది. అనగా కంచిలో పృధ్వీ లింగముగా… జంబుకేశ్వరంలో జల లింగముగా…. అరుణాచలంలో అగ్ని లింగముగా ….శ్రీకాళహస్తిలో వాయు లింగముగా….. చిదంబరంలో ఆకాశలింగముగా…. కోణార్క్ లో సూర్య లింగముగా…. సీతాలో గుండంలో చంద్ర లింగముగా అదే ఖాట్మండులో యజమాన లింగముగా… ఈ ఎనిమిదింటిని శివ అష్టమూర్తి లింగాలుగా పూజిస్తారు. ఈ అష్టమూర్తి లింగతత్వమే మనకి అరుణాచలేశ్వరుని అగ్ని లింగం చుట్టూ అష్టదిక్కులలో అష్ట లింగాలుగా ఉన్నాయి. అవే ఇంద్ర లింగము, అగ్ని లింగము, యమలింగము, నైఋతి లింగము, వరుణ లింగము, వాయు లింగము, మరియు కుబేర లింగము అన్నమాట! ఇవి కాకుండా తొమ్మిదవ దిక్కు అయిన భూమికి పై భాగంలో ఆకాశ దిక్కుకి ప్రతీకగా సూర్య, చంద్ర లింగాలు ఉంటే …..పదవి దిక్కు అయిన భూమికి కింద భాగంలో ఉన్న పాతాళ దిక్కుకి ప్రతీకగా ప్రధాన ఆలయ ఆవరణలో ఉన్నపాతాళ లింగము …..ఇలా పది దిక్కుల 10 శివలింగ మూర్తులు ఈ క్షేత్రంలో ఉండటం జరిగింది.
బ్రహ్మ దేవుడికి అలాగే విష్ణుమూర్తికి కలిగిన గర్వ అహంకారాలను రూపుమాపటానికి సాక్షాత్తు పరమశివుడే అనంత జ్యోతి అగ్నిస్తంభముగా వెలియడం జరిగింది. ఈ జ్యోతిర్లింగము యొక్క ఆది అంతాలు వీరిద్దరూ కనుగొనలేక పోవడంతో అహంకార రహితులై….. ఈ అనంత జ్యోతి అగ్ని లింగమును సర్వస్య శరణాగతి భావముతో ప్రార్థించడంతో…. ఈ అనంత జ్యోతి రూపాన్ని కాస్త అగ్నికొండగా మార్చి అరుణాచల క్షేత్ర అరుణ జ్యోతి అయిన అరుణ గిరిగా పూజలు అందుకుంటున్నాడు… అన్నామలై అంటే తమిళంలో “అన్ను” అంటే చేరుకోదగినది మరియు “అన్నా” అంటే చేరుకోలేనిది…. మలై అంటే కొండ అని ….అన్నామలై అంటే చేరుకోనే అవకాశం ఉన్నా ….చేరుకోలేని కొండ అని అర్థం ఉన్నది. అందుకే బ్రహ్మ విష్ణువు దీని పరిధిని చేరుకోలేదు అన్నమాట! ఈ అరుణగిరి కాస్త కృతయుగంలో అనంత జ్యోతి కొండగాను ….త్రేతాయుగంలో పచ్చ మణుల కొండగాను…..ద్వాపర యుగంలో బంగారు కొండ గాను….. కలియుగంలో ఎర్రని శిలలు ఉన్న అగ్నిరాతి కొండగాను….. పూజలు అందుకోవటం జరుగుతుంది. అచలము అంటే కదలని వాడు కదలనిది. అంటే జ్ఞానమే కదా! అంటే ఎప్పుడు తనలో తాను రమించే పరమేశ్వరుడు కాస్త ఈ జ్ఞానాన్ని కొండ రూపంలో అచలుడై ఉంటాడు. అరుణము అంటే ఎర్రనిది… అలాగే కారుణ్యమూర్తి అని అర్థం. ఆదిపరాశక్తి కాస్త ఈ కొండమీద అపారమైన దయతో ఉంటుంది. ఇలా అయ్యవారు, అమ్మవారు కలిసి అర్ధనారీశ్వర తత్వమై వెలిసిన కొండయే అరుణగిరి అయింది.
అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత , విశ్వకర్మ చేత నిర్మించబడిందని….. దీని చుట్టూ అరుణీమనే పురము నిర్మింపబడిందని…. స్థల పురాణం చెబుతుంది. అలాగే ఇక్కడ జరగవలసిన పూజా విధివిధానమంతా కూడా, గౌతమ మహర్షికి శివాజ్ఞ చేత ఏర్పాటు చేయబడిందని, తనని ఈ క్షేత్రంలో 89 నామాలతో పూజించాలని ….ఆ నామాలు ఏమిటో కూడా చెప్పడం జరిగిందని మనకి స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యంలో తెలుస్తుంది.
చరిత్రలో అరుణాచలమును చూస్తే,
దక్షిణ భారతంలో శైవ, వైష్ణవ ధర్మానికి ప్రాచుర్యం ఎక్కువగా ఉండేది. ఈ క్షేత్ర మహత్య గాథలను బట్టి చూస్తే…. ఈ క్షేత్ర దర్శనానికి బహు పురాతన కాలంలో దక్షిణ భారతానికి అగస్త్య, గౌతమ, విశ్వామిత్ర, పతంజలి , వ్యాఘ్రపాద, సనందన, ఇతర ఋషులు…. ఈ క్షేత్ర దర్శనానికి వచ్చారని, వీరంతా పూజించిన శివలింగాలు ఈ క్షేత్రంలో ఇప్పటికీ ఉన్నాయని….అలాగే అగస్త్యుల వారు కాస్త తమిళ భాషను అధ్యయనం చేసి…. ఈ భాషకి వ్యాకరణం కూర్చి పెట్టారని…. తమిళులు చెప్పుకోవడం జరుగుతుంది. తద్వారా తమిళ రాష్ట్రంలో 63 నాయనార్లు అనే శివ భక్తులు అఖండ శివ భక్తితో….శివారాధన ప్రాముఖ్యత అంచలంచలుగా పెరిగింది. అలాగే ద్వైత అద్వైత విశిష్టాద్వైత దైవ సిద్ధాంతాలు ప్రతిపాదించిన మధ్వాచార్యుడు…. శంకరాచార్యులు…రామానుజాచార్యులు కాస్త దక్షిణాదినే జన్మించి భక్తి ప్రసారం కావించారు. అలాగే కన్నడ వాసి అయిన శూన్య సిద్ధాంతకర్త మరియు ఇష్ట సిద్ధలింగ ఆరాధ్య మూలపురుషుడైన బసవన్న మరియు కబీరుదాసు గురువైన శ్రీ రామానంద స్వామి మరియు 13వ శతాబ్దం మధ్యలో మహారాష్ట్ర పాండురంగ భక్తులలో ముఖ్యులైన జ్ఞాన దేవుడి తండ్రి సిద్ధోజిపంతు మరియు నామదేవుడు అలాగే శివాజీ గురువైన సమర్థ రామదాస స్వామి…. ఇలా ఉన్న భక్తాగ్రే సరులు ఈ అరుణాచల క్షేత్రమును దర్శించి… పునీతులైనారని చరిత్రను చెబుతోంది. ఇలా వీరందరూ కూడా పరమాత్మ యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదించారు. ఆచరించారు… నిరూపించారు… అమలు చేశారు…అమరత్వం పొందారు.
ఇక అరుణాచల ఆలయ విషయానికి వస్తే…
అరుణాచల ఆలయం ఒక నిర్మాణ కళాఖండం అని చెప్పవచ్చును. ఇది 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 9 గాలిగోపురాలతో… 9 ప్రాకారాలతో….. 56 ప్రాంగణాలతో…. దీని చుట్టూ నాలుగు ఎత్తయిన రాతి గోడలతో నిర్మితమై, చూడటానికి ఒక రాజసం ఉన్న కోటలాగా కనబడుతుంది. ఈ ఆలయాన్ని చోళ రాజులు తొమ్మిదవ శతాబ్దంలో నిర్మించారని భావిస్తారు. విజయనగర రాజులు, సంగమ రాజవంశం, సాలువ రాజవంశం, తులువ రాజవంశమునకు చెందిన పాలనకి సంబంధించిన శాసనాలు…. మనకి కనపడుతున్నాయి. చోళులు ,పల్లవులు, పాండ్యులు, హయాసలులు, తంజావూరు నాయకులు, కడప రాయలు, టిప్పు సుల్తాను పరిపాలనా శాసనాలు ఉన్నాయి. ఇలా ఈ శాసనాలు తమిళం, సంస్కృతం, కన్నడ భాషలలో వందలాదిగా ఉన్నాయి. వీటిలో గుర్తించబడిన శాసనాలు 119 మాత్రమే. గంగై కొండ రాజేంద్ర చోళుని శాసనం…. మొదటి ప్రాకారం గోడపై కనబడుతుంది. ఈ ప్రకారంలో ఉన్న ఏకాంబరేశ్వర మరియు చిదంబరేశ్వర క్షేత్రాలు 12వ శతాబ్దానికి చెందిన శాసనాలుగా కనిపిస్తాయి. అలాగే “కిలి” గోపురంలో మనకి 33 శాసనాలు కనుగొనబడడం జరిగింది. విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయల ఈ ఆలయంలో 20 విధాలుగా ప్రధాన అభివృద్ధి చేశారని శాసనాలు చెబుతున్నాయి. అనగా తూర్పు రాజగోపురం, శివ గంగచెరువు,గర్భగుడిలోతలుపులు, అపిత కుచాంబిక ఆలయ తలుపులు, అమ్మవారి ముందు తవ్విన అరణముడు బావి, అమ్మవారికి అయ్యవారికి ఇచ్చిన ఆభరణాలు….. అనగా నాగాభరణం, వెండి కుండములు, బంగారు శివలింగం, ఈ లింగంతో అగ్ని లింగమును అష్ట లింగ బంధనం చేయడం జరిగింది. వెయ్యి స్తంభాల మండపము, తిరుమల దేవి సముద్ర సరోవరము, ఇంద్ర విమానం, వినాయక రథం, ఏడవ రోజు ఉత్సవ మండపం, ఇలా ఈయన అభివృద్ధి చేశారని శాసనాల ద్వారా తెలుస్తోంది. పల్లవ రాజులు చేసిన విరాళాలున్న శాసనాలు ఉన్నాయి. అమ్మవారికి అయ్యవారికి అన్న ప్రసాదం (భిక్షాటన యజ్ఞ సేవ)కి ఉషత్కళ, కలశాంది, మధ్యాహ్నిక ,సాయరక్ష , అర్థజామ రాళ్లు చేసిన భూదాన వివరాలున్న శాసనాలు ఉన్నాయి. అలాగే విజయనగర రాజులు పరిపాలన అనంతరము తంజావూరు నాయక రాజులు ఈ క్షేత్ర ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది.
ఇలా ఎంతోమంది రాజులు ఈ ప్రాంతాన్ని రాజ్య కేంద్ర బిందువుగా చేసుకొని…. ఎన్నో యుద్ధాలు చేశారు. ఆ తర్వాత క్రీస్తుశకం 1791 వ సంవత్సరంలో టిప్పు సుల్తాన్ ఈ క్షేత్రాన్ని ముట్టడించి …. వశపరచుకోవడంతో ఇతర రాజులు చేసే యుద్ధాల బెడత తప్పింది. కానీ ఈ పరిపాలనలో ఈ క్షేత్రం కాస్త జీర్ణావస్థకు చేరుకోవడంతో ఈ క్షేత్ర ప్రజలు కాస్త తమ ప్రాణాలు పణంగా పెట్టి ….ఈ రాజును ఎదిరించి, జయం పొంది, ఈ క్షేత్రాన్ని కాపాడుకొని పునః వైభవం పొందేటట్లుగా చేశారు. ఇలా ఎందరో ముస్లింలు, ఫ్రెంచి, బ్రిటిష్ వాళ్ళు మరియు ఇతర రాజులు యుద్ధాలే చేసినా ….లేదా రాజ్యాలు ఎన్ని మారినా ఈ తిరువన్నామలై ఆలయం అలాగే ఈ అరుణాచల క్షేత్రము మరియు అరుణగిరి కొండ ఏమాత్రం చెక్కుచెదరకుండా పచ్చగా కళకళలాడుతూ…. కనువిందు చేస్తూ…. ప్రశాంత స్థితిని ఇంకా మనకి అందిస్తోంది అంటే…. అర్థనారీశ్వర దంపతులైన అరుణాచలేశ్వరుడి అలాగే అపిత కుచాంబిక దేవి అనుగ్రహ లీలా విన్యాసమని చెప్పకనే చెబుతోంది కదా!
ఇంతటి మహిమాన్వితమైన అరుణాచల క్షేత్రమునకు ఎవరు పడితే వారు ప్రవేశించలేరు. అలాగే దర్శించలేరు. గిరిప్రదక్షిణము చేయలేరు. అరుణాచల శివనామస్మరణ చేయలేరు. ఈ క్షేత్ర ప్రవేశమునకు ఖచ్చితంగా మనకి అధికారం, యోగం ఉండాలి. దీనికి అరుణాచల శివానుగ్రహం పొందాలి. కావాలి ….ఈయన కాస్త మనల్ని చూడాలి అనుకుంటే తప్ప, మనం ఆయన్ని చూడాలని అనుకున్నా చూడలేము. ఈ క్షేత్రానికి రావడానికి ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు, సమస్యలు వస్తాయి. అదే ఆయన మనల్ని చూడాలని సంకల్పించిన క్షణమే….. అనుకోని రీతిగా ఉత్తర క్షణమున ఈ క్షేత్రానికి వెళ్లే అర్హత, యోగ్యత ,యోగం లభిస్తుంది. అన్ని క్షేత్రాలలో మన మానవ ప్రయత్నం ద్వారానే దర్శనమైతే,..... ఈ విశ్వ ప్రపంచంలో ఈ ఒక్క అరుణాచల క్షేత్రంలో ఆయన అనుగ్రహం ఉంటే తప్ప ఈ క్షేత్రములోనికి ప్రవేశం చేయలేము.
చెయ్యలేరని ఘంటా పథంగా చెప్పవచ్చును. ఇలా ఎంతోమందిని చూడవచ్చును. అరుణాచలేశ్వరుడికి మనల్ని చూడాలని తపన, తాపత్రయం, కుతూహలం ఆయనకి కలగాలంటే ఆయన అనుగ్రహం కోసం ఆయన చరితమైన ఈ “అరుణాచల శివ మహత్యం గ్రంథ పారాయణం” అలాగే “అరుణాచల శివ” నిత్య నామస్మరణ చేస్తే అరుణాచలేశ్వరుడి అనుగ్రహం శీఘ్రముగా కలిగి….. ఈ క్షేత్ర దర్శనానికి.. గిరి ప్రదక్షిణానికి…. అరుణ జ్యోతి దర్శనానికి…. లింగరూపుడైన అరుణాచలేశ్వరుని దర్శనానికి…. ఆదిపరాశక్తి అయిన అపిత కుచాంబికా దేవి దర్శనానికి మనకి అర్హత ,యోగ్యత ,యోగము లభిస్తుంది. ఇది అక్షర సత్యము. మనసా వాచా కర్మణా సర్వస్య శరణాగతితో…. అచంచల శ్రద్ధ భక్తి విశ్వాసాలతో….. ఈ గ్రంథ పారాయణం చేస్తే మీరు అనుకున్న ఎట్టి కోరిక అయినను, ఏడు రోజుల నుంచి ఏడు నెలల లోపు తీరుతుంది. మీ సమస్యకి సరి అయిన పరిష్కార మార్గం చూపబడుతుంది. ఈ శివయ్య అనుగ్రహం కలిగి అరుణాచల క్షేత్ర దర్శనానికి ప్రవేశించడానికి అనుమతి అనుగ్రహం కలుగుతుంది.
యద్భావం తద్భవతి
సర్వం అరుణాచల శివార్పణమస్తు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి