అధ్యాయం -13

 అధ్యాయం -13

నంది ముఖ దర్శనం 

•••••••••••••••••••••••••••



మనకి అరుణగిరి మీద సహజ సిద్ధమైన రాళ్లతో నిర్మితమైన ఒక మహానంది ముఖము మాత్రమే కనపడుతుంది… కాకపోతే ఇది అపసవ్య దిశలో అనగా గిరి అగ్రభాగము వైపు చూపు కాకుండా గిరిప్రదక్షిణం చేసే రోడ్డుని చూస్తున్నట్టుగా పురాణంలో ఒక కథనముగా చెప్పబడింది.. అది ఏమిటంటే నందీశ్వరుడు కాస్త స్వామి వారి కార్యాలు మొదలు పెట్టేముందు అరుణాచల క్షేత్రంలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఉన్న, చిదంబర స్వామి ఆలయం దగ్గర ఉన్న, అతిపెద్ద బిల్వ వృక్షము దగ్గర ఉన్న, అతి పెద్ద రాతి త్రిశూల దర్శనము చేసుకొని … స్వామివారి సేవలు చేయటం ఒక నియమంగా పెట్టుకోవడం జరిగింది. ఇలా దర్శనం చేసుకున్న రోజు ఈయన ఒంటిమీద మూడు విభూతి రేఖలు సహజసిద్ధంగా పడతాయి…. ఇలా ప్రతిరోజు నందీశ్వరుడు కాస్త ఈ రాతి త్రిశూల దర్శనం చేసుకుని…. గీతలు పడిన తరువాత స్వామివారి సేవలు చేయడం ప్రతిరోజు చేసేవాడు.  ఇలా ఒకరోజు స్వామివారు కాస్త నందీశ్వరుడిని పిలిచి…. ఏంటి? ఈరోజు నీ ఒంటిమీద మూడు గీతలు కనిపించడం లేదు…. త్రిశూల దర్శనం చేసుకోలేదా? చేసుకోకుండా నా సేవకి ఎలా వచ్చావు? అనగానే…. అప్పుడు కానీ నందికి తను చేసిన తప్పు గుర్తుకు వచ్చి….. ఈ రాతి త్రిశూల దర్శనం చేసుకోవడానికి వచ్చి…..దీనిని అలా చూస్తూ శిలా మూర్తిగా మారిపోయాడు.  దానితో ఈయన చూపు కాస్త  సవ్య దిశ అనగా గిరి అగ్రభాగమునకు కాకుండా అపసవ్య దిశగా కొండ దిగువ భాగము అనగా రాతి త్రిశూల దర్శనం వైపు  చూస్తూ శాశ్వతంగా  మిగిలిపోయింది.  విచిత్రం ఏమిటంటే….. గిరి చుట్టూ పంచభూత నందులతో పాటుగా 14 నందులు ఉంటాయి. వీటి చూపు అంతా కూడా గిరి వైపు చూస్తూ ఉంటే…. ఈ దేవనంది అయిన నందీశ్వరుడు ముఖం మాత్రం గిరి కింద భాగం అనగా రాత్రి త్రిశూలము వైపు చూస్తూ ఉండటం గమనించవచ్చును…


ఈ నందిముఖ దర్శనం మనకి గిరి ప్రదక్షిణంలో వచ్చే దుర్వాస మహాముని ఆశ్రమం దాటి పది అడుగులు వేసి….. గిరికేసి చూస్తే ఈ దైవ నంది ముఖ దర్శనం చాలా సుస్పష్టంగా కనపడుతూ దర్శనమిస్తుంది. అలాగే గిరి వలయం ఆరంభంలో వచ్చే విజయ గణపతి ఆలయం దగ్గర నుండి చూసినా కూడా మనకి ఈ నంది ముఖ దర్శనం అవుతుంది. మరియు పంచ శిఖర ప్రాంతం దగ్గరికి వచ్చేముందు నందిముఖ దర్శనం అనే బోర్డు కనపడుతుంది.  కానీ ఇక్కడి నుంచి చూస్తే…..నంది ముఖ దర్శనం ఇప్పుడు కావడం లేదు.  కారణం అక్కడ చాలా ఎత్తులో చెట్లు బాగా పెరిగిపోయి….. నందిముఖ దర్శనం అవడం లేదు.  ఇలా మూడు చోట్ల నుండి చూస్తే మనకి అరుణగిరి మీద దైవ నంది ముఖ దర్శనం అవుతుంది. ఇక ఎక్కడి నుండి చూసినా మనకి ఈ నందిముఖ దర్శనం అవ్వదని గ్రహించండి.


ఇకపోతే ఈ గిరి చుట్టూ ఉన్న 18 నందుల వివరాలలోకి వెళితే….ఈ పద్దెనిమిది నందులలో అతి ముఖ్యమైన అష్ట నందులు ఉంటాయి. ఇవి గిరి చుట్టూ నంది అష్టదిగ్బంధనము లాగా ఉన్నాయి. ఈ నందులు తప్పనిసరిగా అందరూ కూడా గిరిప్రదక్షిణం చేసేటప్పుడు దర్శనముగా చేసుకోవాలి. అవి 1) పృధ్వీ నంది 2) అప్పనంది 3) తేయునంది 4) ఆకాశ నంది 5) సింహనంది 6) వాయునంది 7) అధికార నంది 8) యజమాని నంది.  ఇందులో పృథ్వీ నంది ముందు దీపారాధన చేస్తే… ధన ధాన్యానికి లోటు రాదని,  అదే అప్పనంది నీ జలనందిగా పిలుస్తారు అని….దీనిని కొమ్ముల ద్వారా గిరి దర్శనం చేస్తే అమ్మవారిగా, అయ్యవారిగా దర్శనమిస్తుంది అని ….అదే తేయునది నుండి చూస్తే గిరి కాస్త చతుర్ముఖ బ్రహ్మగా దర్శనమిస్తుంది అని….. అలాగే అధికార నంది దగ్గర మన గోత్రనామాలు చెబితే గిరి ప్రదక్షణ ఫలితం అలాగే గిరి దర్శనా ఫలితం ఇస్తారని …..ఈ క్షేత్ర దర్శనానికి సాక్షిగా ఉండటం వలన ఈ నందికి సాక్షి నంది అని పిలుస్తారని…. ఇక యజమాన నందిని ఈశాన్య నందిగా పిలుస్తారని…. స్థల పురాణం చెప్పడం జరుగుతుంది.  ఇలా ఈ అష్ట నందులే కాకుండా ఇంకా 13 నందులు ఉన్నాయి. అవి… 1. ఉదైచి మండప నంది 2) ఆదినంది 3) కొలత నంది 4) యానై. ముడి నంది 5) మెట్టు నంది 6) పలమారం నంది 7) పే గోపుర నంది 8) సోన నంది 9) అన్న నంది 10) కురుప్పన్ నంది 11) రాజనంది 12) నంది కుండ్రు 13) వరుణ నంది విగ్రహమూర్తులు ఉన్నాయి… ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే… ఏ శివాలయంలో చూసినా కూడా శివలింగమూర్తిని చూస్తూ నందీశ్వరుడు ఉంటాడు కదా!  కానీ అరుణాచల క్షేత్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది . అంటే ఇక్కడ ఉన్న అష్ట శివలింగములకు  అష్ట నందులు ఉంటాయి కానీ ….ఇవి ఆయా శివలింగ మూర్తులను చూడకుండా అరుణగిరి కేసి ముఖం పెట్టి దీనిని చూస్తూ ఉంటాయి. అంటే వీటి దృష్టిలో అరుణగిరి అతిపెద్ద శివలింగమూర్తి అన్నమాట!  వీటికి ఇది  యే పరమేశ్వర శివరూపం అన్నమాట. 


ఈ క్షేత్రంలో ఉన్న అరుణగిరి చుట్టూ ఉన్న 18 నందులలో…. ఏ నంది ఏదో మనకి తెలియకపోయినా…. కనిపించిన ప్రతి నందిని దర్శించుకుని నమస్కారం చేయండి. ఈయన అనుగ్రహం పొందితే కానీ మనకి అరుణాచల శివ అనుగ్రహం కలగదని తెలుసుకోండి… గ్రహించండి… దేవాలయానికి పూజారి ఎలాగో శివయ్యకి ఈ నంది అలా అన్నమాట! ఈయన చెవిలో మన కోరికలు చెబితే…. ఆయన చెవిలో చెబుతాడు. తద్వారా ఈయన అనుగ్రహం పొంది, ఆయన అనుగ్రహం కలిగి మన కోరికలు తీరుతాయి. సూక్ష్మములో మోక్షము అంటే ఇదే అన్నమాట!  మనకి తక్షణమే శివయ్య అనుగ్రహం కావాలంటే… వీరి బంటు అయిన నంది అనుగ్రహం పొందితే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా అరుణాచల క్షేత్రము వచ్చినప్పుడు సహజ రాతితో ఏర్పడిన అరుణగిరి మీద ఉన్న రాతి దైవ నంది ముఖ దర్శనం తప్పక చేసుకోండి.  అలాగే మనకి గిరిప్రదక్షిణములో పంచభూతనందులు అలాగే మిగిలిన నందులు కనపడతాయి.  వాటిని కూడా దర్శించుకోండి. తరించండి. 


త్రయోదశ అధ్యాయం సమాప్తం 

శుభం భూయాత్ 

సర్వం అరుణాచల శివార్పణమస్తు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి