అధ్యాయం - 37

 అధ్యాయం - 37

పార్వతి దేవి ఆవిర్భావం

`````````````````````````````````



ఆ తర్వాత సతీదేవి అయిన దాక్షాయణి కాస్త….. మరుజన్మలో హిమవంతుడు, మేనకాదేవి దంపతులకి పార్వతీ నామంతో పుత్రికగా జన్మించింది.  ఈమె కాస్త యుక్త వయసుకి వచ్చేసరికి ఈమె భర్త శివుడు తప్ప మరొకరు కాదని హిమవంతుడు గ్రహించి….ఈమెను తీసుకుని వెళ్లి కైలాసంలో ఉన్న శివుడికి పరిచర్యలు చేయడానికి నియమించాడు.  అప్పుడు శివుడు కాస్త బ్రహ్మచర్య దీక్షలో బ్రహ్మచారిగా ఉంటే…. పార్వతీదేవి కాస్త కన్యకగా ఉండి సేవలు చేస్తూ ఉన్నది. 


ఇదిలా ఉండగా తారకాసురుడు అనే రాక్షసుడు కాస్త బ్రహ్మ సాక్షాత్కారమును పొంది… శివుడికి పుట్టిన సంతానము వలనే మరణం పొందాలని వర ప్రభావంతో ముల్లోకాలను ఈతి బాధలకు గురిచేయడం ఆరంభించాడు.  దేవతలు కాస్త విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి….. తారకాసురుడి వికృత చేష్టల గురించి వివరించగా…. దానికి విష్ణువు కాస్త శివుడి మీద మన్మధుడు కాస్త మన్మధ బాణాలు వేస్తే, పార్వతీదేవి మీద  మోహావేశాలు  కలిగి తద్వారా కలిగే సంతానం వలన ఈ రాక్షస సంహారం జరుగుతుందని సెలవివ్వగా….. మన్మధుడు కాస్త తపోనిష్ఠలో ఉన్న శివుడి మీద కామ మోహ బాణము వేయడం జరిగే క్రమంలో….. విషయం తెలిసిన శివుడు కాస్త….. కోపావేశాలకు లోనై….మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు.  ఎందుకంటే పార్వతీ కన్యక అలాగే తన బ్రహ్మచారి కావటంతో….. వారిద్దరి మధ్యన అన్యోన్యత పెరిగితే….. వివాహం జరగకుండా అక్రమ సంతానం పుట్టే అవకాశం ఉన్నదని …. మన్మధుని దహనం చేస్తాడు.  ఆ తర్వాత బ్రహ్మ అలాగే విష్ణువు ద్వారా మన్మధుడు చేసిన పని యొక్క అంతరార్థం తెలుసుకొని అనగా తారకాసురుడి సంహారం కోసం తనకి అలాగే పార్వతికి మధ్య కామ మోహావేశాలు కలిగించాలని మన్మధుడు కాస్త….. తన మీద మోహబాణాలు ప్రయోగం చేశాడని తెలుసుకొని….. ఇదిలా కాదు అని తన దగ్గర ఉన్న సప్త ఋషులను పిలిపించి….. హిమవంతుడి దగ్గరికి పెళ్లికోసం రాయబారిగా పంపించి….. తన కుమార్తె అయిన పార్వతిని తనకిచ్చి వివాహం జరిపించమని అడగటానికి పంపించడంతో…… హిమవంతుడు విషయం తెలుసుకుని….. పరమానంద భరితుడై పార్వతికి శివుడికిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించడం జరుగుతుంది. కాలక్రమమైన ఈ ఆదిదంపతులకు బ్రహ్మ, విష్ణువు అంశ ప్రతికలుగా బాల గణపతి అలాగే బాల కుమారస్వామి జన్మించడం జరుగుతుంది. కాలక్రమంలో కుమారస్వామి చేతిలో తారకాసుడి రాక్షస సంహారం జరుగుతుందన్నమాట!  ఈ బిడ్డలు కాస్త పార్వతీ పరమేశ్వరుల సమక్షంలో ఉండి పరస్పరంగా ప్రేమగా పెరుగుతూ ఉంటారు. ఈ ఆదిదంపతులు కాస్త ఒకప్పుడు వినోదంతో…. మరొకవైపు చిత్రలేఖనంతో…. మరోసారి నృత్యాలతో…. మరొకసారి  జలములో ఈదుతూ….. మరొకసారి పూల వనాలలో విహరిస్తూ…. పూలు కోస్తూ ….ఆనంద డోలికలలో ఉంటూ…. మరొకసారి నృత్య గానాలతో…. మరొకసారి పాచికల ఆటలు ఆడుతూ…. ఆనంద డోలికల్లో తేలియాడుతూ…. కాలమును గడుపుతూ ఉన్నారు. 


ఇదిలా ఉండగా శుంభ నిశుంభ అనే రాక్షసులు కాస్త బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి తమని ఏ పురుషుడి వలన మరణం లేకుండా కోరుకుని ……త్రిలోకాలను అల్లకల్లోగా చేస్తూ ఉండేసరి…..కి దేవతలు కలిసి విష్ణుమూర్తి దగ్గర ఈ విషయం చెప్పగానే…. బ్రహ్మ మరియు విష్ణువు అలాగే సమస్త దేవతలందరూ కలిసి మహాదేవుడైన శివుడి దగ్గరికి వెళ్లి విషయం చెప్పగానే …..ఇది విన్న ఈయన కాస్త వీరితో కంగారు పడకండి శుభప్రదమైన కాలము వచ్చేదాకా….మనము వేచి ఉండక తప్పదు.  ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవి ఈ సమస్యకి పరిష్కార మార్గం అవ్వక తప్పదు అని వారందరికీ అభయం ఇచ్చి పంపించి వేశాడు.  కాలము గడుస్తుంది .ఆ శుభ సమయం రానే వచ్చింది. 


ఒకానొక సమయంలో పార్వతీదేవిని చూసిన శివుడు కాస్త ఓ కాళీ!  అని పిలవగానే అప్పటిదాకా నల్లటి శరీరంతో ఉన్న పార్వతీదేవి కాస్త శివుని ప్రీతి కొరకు…. తన నల్లని శరీరమును తక్షణమే విసర్జించింది.  దానితో ఈ చర్మము కాస్త భూమి మీద పడి…. అది కాస్తా మహా కాశీ క్షేత్రం అయింది. ఈ నేల మీద పడిన చర్మము కాస్త కాళిగా రూపాంతరం చెంది ….కౌశికి అనే నామముతో వింధ్యా పర్వతం చేరి…. శక్తుల కోసం ఘోర తపస్సు చేసి…. శక్తి పొంది…. ఈమె కాస్త శుంభ నిశుంభల రాక్షస సంహారం చేయడం జరిగింది.


ఆ తరువాత పార్వతీదేవి కాస్త…. తెల్లని మేలిమి చర్మమును ధరించి…  గౌరీగా అయ్యింది.  ఇలా పార్వతీ పరమేశ్వరులు కాస్త ఆదిదంపతులై సకల చరాచరములకు తల్లిదండ్రులై…. హిమవంతుని కోరిక మీద హిమవంతుని భవనములో ఆవాసం చేస్తూ….. మేరు పర్వతంపై క్రీడలతో వినోదం చేసుకుంటూ హాయిగా ఉన్నారు.ఒకనాడు సంధ్యా సమయంలో ధ్యానం చేస్తున్న శివుడి కేసి చూస్తూ…. తనలో తాను….ఈయన కాస్త కనులు మూసుకుని ఏ సౌభాగ్యవతిని ధ్యానిస్తున్నాడో తెలియడం లేదు….. పైగా భగీరథ మహర్షి కోరిక మేర గంగను సరాసరి భూమి మీదకు పంపించకుండా…. తన తలకొప్పుతో ఈమెను బంధించి…. నాకు సవతిగా తెచ్చి పెట్టాడు.  నా పుత్రుల యందు ఈమెకు అనురాగం మెండుగా చూపిస్తుంది. దానితో పురుషుల మనస్సుని నమ్మరాదు.. చాలా మోసపూరితమైనవి. ఎప్పుడు ఎలా మారతారో ఎవరికీ ఎరుక.  మాటలకి మాత్రమే నేను కావాలి….!  ఎక్కువ సమయం ధ్యానంలో గడపడం…. తనతో సమయం గడపకపోవడం… పైగా తనతో నీ తపస్సుకి మెచ్చి నీకు నేను దాసుడిని అయ్యాను అని అబద్ధపు మాటలు చెప్పి…. మోసపోతున్నానని…. ఇప్పుడు తపస్సు చేస్తూ తనని కాకుండా వేరే ఎవరినో చింతిస్తూ తపస్సు చేస్తున్నాడేమో….. ఎవరికి ఎరుక! ఎందుకైనా మంచిది…. ఒకసారి ఇతగాడి కళ్ళు మూస్తే…..ఇతని మనసులో ఉన్న ఆ స్త్రీ మూర్తి ఎవరో తెలుస్తుంది కదా అనుకుంటూ…. తపస్సు చేస్తున్న శివుడు దరిచేరి స్వామి! స్వామి! అనగానే …….శివుడు కాస్త ధ్యాన నిష్ట నుండి బయటకు వచ్చి…. కళ్ళు తెరిచి దేవి! ఏమైంది!  అనగానే…. ఏమీ కాలేదులే స్వామి!  నాకు చిన్న ధర్మసందేహం వచ్చింది.  సూర్యుడు, చంద్రుడు ఎవరు అనగానే దేవి ! వీళ్లిద్దరూ నా భౌతిక నేత్రాలే కదా!  అనగానే …..అవునా స్వామి!  చూద్దాం..!  అంటూ రెప్పపాటులో శివుడే ఊహించని విధంగా….. తన రెండు చేతులతో శివుడు రెండు భౌతిక నేత్రాలను ఒక అర్థ నిమిషం పాటు మూసేసరికి….. ముల్లోకాలు కాస్త సూర్య, చంద్ర కాంతి లేక కొన్ని కోట్ల సంవత్సరాల పాటు అల్లాడిపోయాయి.  దానితో శివుడు కాస్త తన త్రినేత్రము తెరవగానే …..ఈ వేడిమి తట్టుకోలేక…. పార్వతీ కాస్త తను అడ్డుపెట్టిన చేతులు తియ్యగా…యధావిధిగా శివుడు కళ్ళు అడ్డు తొలగడంతో సూర్య,చంద్ర కాంతితో విశ్వజగత్తు తిరిగి ప్రకాశవంతమైంది. దానితో కరుణామూర్తి అయిన శివుడు కాస్త …..అమ్మవారితో దేవి! ప్రియ ! నీవు యధాలాపంగా కుతూహలముతో…. ఒక నిమిషం పాటు నా కనులు మూశావు. దానితో లోకాలు అన్నీ కూడా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు గాఢ అంధకారంలో మునిగిపోయాయి.  కారణం నా నేత్రాల అంశలైన సూర్యచంద్ర కాంతి ప్రసరించలేదు. సరియైన విచారణ లేకుండా నువ్వు చేసిన తప్పిదం వలన సర్వలోకాలు దుఃఖ సాగరంలో మునిగిపోయాయి.  అన్నీ తెలిసిన దానివి…. నువ్వే ఇలా చేయడం సరి అయినది కాదు కదా!అనగానే…. స్వామి! నన్ను క్షమించండి. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు.  ఊహించలేదు. మీ నేత్రములే సూర్య చంద్రులు అని మీరు నాతో అపహాస్యం చేస్తున్నారని…. అనుకొని ఇది నిజమా కాదా!  అని మీ కన్నులను యథాలాపంగా ముయ్యడం జరిగింది.  ఇప్పుడు నేను ఏమి చేయాలి?దీనికి తగిన ప్రాయశ్చిత్త మార్గమును చెప్పండి అనగానే…


దేవి!  నువ్వు వేరు…. నేను వేరు…. కాదు కదా!  నా స్వరూపమే నీవే కదా!  ఇంక నీకు ప్రాయశ్చిత్తం ఎందుకు!  అయినా….. ధర్మం తప్పరాదు కదా!  నీవు లోక ఉపకారం కోసం…. ప్రాయశ్చిత్త ధర్మం పాటించక తప్పదు.  చేసుకోక తప్పదు.. కావున ప్రాయశ్చిత్త మార్గాలు ఆరు విధాలుగా ఉన్నాయి. అందులో ఉపవాసం, ధ్యానం, తపస్సు, దానము, క్షేత్ర దర్శనం, పరిత్యజించుట. వాటిలో నీవు చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్త కర్మగా…. నా చేత పరిత్యజించబడి…. కైలాసం నుంచి భూలోకమునకు చేరి…. జ్ఞాన తపస్సు సిద్ధిపొంది…. తిరిగి నన్ను చేరడమే అన్నమాట! ఈ ప్రాయశ్చిత్తం వలన నువ్వు కాస్త భూలోకమును చేరితే…..అది కాస్త నీ తపస్సు వలన, నీ పాదస్పర్శ వలన నీ సాంగత్యం వలన భూమి కాస్త ఫలవంతం అవుతుంది. తద్వారా భూశాంతి పొందడం జరుగుతుంది. నీ తపస్సుకి భూమండలంలో ఉన్న మహా పుణ్యక్షేత్రమైన కాంచీపురంనకు చేరి….. అక్కడ ఉన్న నాలుగు వేదాలాకి ప్రతీక అయిన  నాలుగు రుచులు కలిగి ఉన్న… చూత అనగా మామిడి వృక్షం కింద కూర్చుని తపస్సు ఆచరింపుము. ఈ వృక్షం కింద చేసే తపస్సు.. జపము ….ధ్యానము… దానాలు అనేది అంతులేని ఫలితాలను ఇచ్చును.  అనుకున్న కోరికలు తీర్చును . పైగా ఈ క్షేత్ర పరిసరాలలో సర్వపాపాలు హరించే కంపానది ప్రవహిస్తుంది. కావున ఈ క్షేత్రం అనేది తపోధనులకు భూతల స్వర్గం కావడం చేతనే… దేవతలు ,మునులు, మహర్షులు, సిద్దులు, ఋషులు ఎప్పుడూ…. ఈ క్షేత్ర ఆవాసం చేయాలని కోరుకుంటూ ఉంటారు.  అంతెందుకు …..ఇక్కడ  ఏకంగా విష్ణుమూర్తి కాస్త వరదరాజస్వామిగా ఆవాసం చేస్తూ…… సర్వదేవతలు ధాకిని, శాకిని, యోగిని మొదలైన నా గణాలు కాస్త ఆవాసం చేస్తున్నాయి.  కాబట్టి నువ్వు ఈ క్షేత్రమునకు చేరి తపస్సు ఆచరిస్తే….మానవులకి శ్రద్ధ కలిగి తపస్సు నందు ఆసక్తి పెరుగుతుంది.  తద్వారా భూమికి పాపభారం తగ్గి…. పుణ్య ఫలం పెరిగి…. కృతార్థురాలు అవుతుంది.  కానీ నిన్ను విడిచి నేను ఒక క్షణం కూడా ఉండలేను కాబట్టి…. నీ మనసు అనే పద్మంలో నివసిస్తాను. అందుచేత దేవి!  నువ్వు నా విరహవేదనను…..విరహ బాధను పొందవలసిన అవసరమే ఉండదు కదా!  అందుచేత నీవు నా యందు నిలిచి….. తపస్సు ఈ క్షేత్రంలో చేస్తే…. తద్వారా నీకు ప్రాయశ్చిత్తం కలిగి నీవు చేసిన ఈ అపరాధ భావ దోషం తొలగిపోతుంది.  ఆపైన సాక్షాత్కారమును తప్పకుండా పొందడం జరుగుతుంది అనగానే…. 


స్వామి! మీరు చెప్పిన ఈ కాంచీపురం క్షేత్రానికి చేరి… నా తపస్సుతో అపరాధ దోషములు తొలగించుకొని…. మీ సాక్షాత్కారం పొంది…. తిరిగి మీ సన్నిధికి అతి త్వరలో చేరుకుంటాను అంటూ ….స్వామి!  నాకు ఒక ధర్మ సందేహం.  ఇప్పుడు నేను కాస్త దేవతామూర్తిగా భూలోకమునకు వెళ్లి తపస్సు చేయలేను కదా!  మరి నా మనుష్య జన్మ ఎలా వస్తుంది అనగానే…


దేవి! భూలోకంలో నా ప్రియ భక్తుడైన కాత్యాయన మహర్షి కాస్త తీవ్రమైన ధ్యాన తపస్సు చేసి నా సాక్షాత్కారము పొంది…..ఆదిపరాశక్తి నాకు కూతురిగా జన్మించాలని వరమును పొందడం జరిగింది.  కాబట్టి…..నువ్వు కాస్త బాలా రూపంతో అయోనిజ జన్మతో ఈ మహర్షి దరికి చేరి…. నీ తపస్సుకి అనువైన ప్రదేశంలో…. నీ అనుకూల సమయము తెలిసే విధంగా…. ఈ మహర్షి నీకు కావలసిన సహాయ సహకారాలు అలాగే ఏర్పాటు చేసి పెడతాడు అనగానే…. ధన్యోస్మి స్వామి ! అంటూ శివుని పాదములకు నమస్కరించి…. పార్వతి దేవి కాస్త కైలాసమును వీడి భూలోకంలో ఉన్న కాత్యాయణ మహర్షి ఆశ్రమానికి బాలగా మారి వెళ్ళటం జరుగుతుంది. దానితో పార్వతీ లేని కైలాసంలో శివుడు ఉండలేక అరుణాచల క్షేత్రం  చేరుకొని పర్వతలింగమైన శోణ గిరి యొక్క అంతర్గతగుహ యందు ధ్యాన తపస్సులో ఉంటూ పార్వతీదేవి  రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.


సప్తత్రింశత్(37వ )అధ్యాయం సమాప్తం

శుభం భూయాత్ 

సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి