అధ్యాయం 23
గౌతమ మహర్షి వృత్తాంతం
``````````````````````````````````
గౌతమ మహర్షి అంగీరస వంశానికి చెందిన రాహుగణుడి కుమారుడు. అలాగే ఈయన వేద కాలానికి చెందిన సప్త ఋషులలో అనగా కశ్యపుడు… భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు,వశిష్ఠుడు జమదగ్నిలలో ఒకరిగా ఉన్నారు. ఈయన మంత్రాల సృష్టికర్త. ఋగ్వేదంలో ఈయన పేరు మీదగా అనేక సూక్తులు అనగా గౌతమ సూక్తులు ఉన్నాయి. ఈ సప్త ఋషులు అంతా కూడా సనాతన ధర్మాన్ని…. అలాగే గోత్ర వ్యవస్థ నడిపించే మూలపురుషులు అన్నమాట! ఇందులో గౌతమ మహర్షి కాస్త గౌతమస్య గోత్ర వ్యవస్థకు మూలపురుషుడిగా ఉన్నారు. అలాగే వీరంతా కూడా ప్రతి మన్వంతరములో మారుతూ ఉంటారు. ప్రస్తుతం వైవస్వత మన్వంతరం నడుస్తోంది. ఈ సప్త ఋషులుగా మరిచి, అత్రి,అంగీరస, పులస్య, పులహ, క్రతు ,వశిష్టుడుగా ఉన్నారు. ఇలా సప్త ఋషులు ఆవాసం చేసే నక్షత్రం మండలమును సప్తర్షి మండలంగా పిలవడం జరుగుతుంది . ఇప్పటికీ కూడా పౌర్ణమి తిథులలో అర్థరాత్రి సమయంలో…. ఆకాశంలో ఉన్న సప్తర్షి మండల నక్షత్రాల నుండి…. కొన్ని కాంతిపుంజములు కాస్త అరుణగిరి మీద వచ్చి అదృశ్యమయ్యే మహత్తర దృశ్యాలను ఇక్కడి స్థానికులు అలాగే యోగులు, స్వానుభవాల బట్టి తెలుస్తోంది. ఇక గౌతమ మహర్షి వ్యక్తిగత జీవితమును చూస్తే ఈయన భార్య పేరు అహల్య. ఈమె బ్రహ్మ మానస పుత్రిక అన్నమాట! అందానికి అహంకారం ఉండటం సహజమే కదా ! అందుకు సరస్వతీదేవి కోరిక మేరా…. అందానికి అనుకువగా ఉండే ముగ్ధ మనోహర సుందరిని సృష్టించమని అడిగితే…. బ్రహ్మ అందుకు సరే ! అని మనసులో సంకల్పించుకోగానే…. మానస పుత్రిక ఇలాంటి లక్షణాలతో అహల్య జనించింది. ఈమెను ఉత్తమమైన పురుషుడికి ఇచ్చి వివాహం చేయాలని బ్రహ్మ సంకల్పించుకొని…. ఎవరైతే ఒక మారు భూప్రదక్షిణం చేసి వస్తారో… వారికి తన కుమార్తె అయిన అహల్యను ఇచ్చి వివాహమును చేస్తానని దండోరా వేయించడం జరుగుతుంది. ఈ వార్త ఆ నోట ఈ నోట పడి దేవతల రాజు అయిన ఇంద్రుడికి అలాగే అష్టదిక్పాలకు చేరి ఈమెను వివాహం చేసుకోవాలని బ్రహ్మ దగ్గరికి వస్తారు. దేవేంద్రుడి రాజ భోగ వైభోగాలను చూసిన అహల్య కాస్త…..మనసు చెదిరి ఇతనిని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. కానీ బ్రహ్మకి ఇది ఇష్టం లేదు. ఎందుకంటే దేవేంద్రుడు వేశ్య లోలుడు కదా! అందుకు అహల్యకి ఇతనిని ఇవ్వడం సశేమిరా ఈయనకి ఇష్టం లేదు. ఇంతలో నారదుడు కాస్త భూలోకంలో ఉన్న 60 సంవత్సరాల వయస్సు ఉన్న గౌతమ మహర్షిని తన వెంట తీసుకొని బ్రహ్మలోకానికి వచ్చి… అహల్యా స్వయంవరం పరీక్షకి ఇంద్రాది దేవతలతో పాటుగా ఈ మహర్షి కూడా పాల్గొనాలని చెప్పడంతో….. అందరూ కూడా దీనికి అంగీకరించి భూప్రదక్షిణం కోసం బయలుదేరతారు. కానీ గౌతమ మహర్షి మాత్రం ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే కడుపుతో ఉండి ఈనటానికి సిద్ధంగా ఉన్న కామధేనువు చుట్టూ మూడు ప్రదక్షిణం చేసి… వేద సూక్తి ప్రకారం ఎవరైతే ఈనటానికి సిద్ధంగా ఉన్న గోవు చుట్టూ ప్రదక్షిణం చేస్తారో వాళ్లకి భూప్రదక్షణం చేసిన ఫలితం వస్తుందని చెప్పిన విషయాన్ని విడమర్చి చెప్పగా…. బ్రహ్మ అందుకు సంతోషించి తన కుమార్తె అహల్యను ఈ గౌతమ మహర్షికి ఇచ్చి వివాహం చేయడం….. ఇంతలో నిజంగానే భూప్రదక్షిణము చేసిన ఇంద్రాది దేవతలకి బ్రహ్మ చేసిన పని అవమానం జరిగినట్లుగా భావించి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. గౌతమ మహర్షి కాస్త తన భార్య అహల్యను తీసుకొని భూలోకమునకు తిరిగి వస్తాడు. ఇలా వీరిద్దరూ కూడా దాంపత్య జీవితమును మనస్ఫూర్తిగా అనుభవిస్తూ…. ఇద్దరు కుమారులనీ అలాగే ఒక కుమార్తెను జన్మనిస్తారు. శతానందుడు అక్కడ మొదటి సంతానంగా పుడతాడు… కానీ ఇతను చిన్న వయసులోనే స్మశాన వైరాగ్యం చెంది తపస్సు చేయటానికి వెళ్ళిపోతాడు. ఇతను కాస్త పెరిగి పెద్దవాడై మహాశక్తి సంపన్నుడై మిథిలా రాజ్యానికి రాజైన జనకుడి మహారాజు కొలువులో ప్రధాన ఆచార్యుడిగా ఉంటాడు. ఇతనికి వివాహమై కృపి,కృపాచార్యుడు జన్మిస్తారు. అలాగే గౌతమ మహర్షికి మరొక సంతానముగా వ్యోధనుడు. ఇతను కూడా మహా తపస్వి …శక్తి సంపన్నుడిగా ఖ్యాతి చెందాడు. అలాగే గౌతమ మహర్షికి ఆఖరి సంతానముగా అంజనాదేవి పుడుతుంది. ఈమె ఆంజనేయుడికి తల్లి అన్నమాట! వానర రాజైన కేసరిని వివాహం చేసుకుంటుంది. ఈమె కూడా అమిత శివ భక్తురాలిగా ఖ్యాతి చెందింది.
వాలి- సుగ్రీవుల జన్మ వృత్తాంతం
అలాగే చాలామంది కూడా వాలి సుగ్రీవులు కూడా ఈ గౌతమ మహర్షి సంతానమని అంటారు. ఇది నిజం కాదు. వారిద్దరూ ఈయనకి జన్మించలేదు.ఇందుకు నిదర్శనముగా ఉత్తర రామాయణంలో ఉత్తరకాండములో ఈ విషయము మనకి దొరుకుతుంది. రావణ సంహారం నుంచి వచ్చి తిరిగి అయోధ్యను పాలిస్తున్న శ్రీరాముడు దగ్గరికి ఒకసారి అగస్త్య మహర్షి వస్తే…. వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతం గురించి తెలుపమని శ్రీరాముడు అడిగితే ….అప్పుడు ఈ మహర్షి చెప్పడం జరిగింది.
ఒకసారి మేరు పర్వతం మీద బ్రహ్మ కాస్త తీవ్రమైన ధ్యాననిష్టలో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నాడు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఈయనకి ధ్యాన భంగమై కళ్ళు తెరవగా…. ఈయన కంటి నుండి ఒక కన్నీటి బిందువు జారీ…. నేల మీద పడి పడగానే ఒక మగ కోతిగా మారింది. దానికి ఈయన కాస్త బుక్షరజనుడు అని పేరు పెట్టాడు. ఇది పగలంతా ఈ గిరి పరిసరాలలో ఉన్న చెట్ల మీద తిరుగుతూ రాత్రి సమయానికి జలము, పండ్లు తీసుకువచ్చి ఈయన ఆకలి తీర్చి… ఈయనతో పడుకునేది. ఇలా ఉండగా ఒక రోజు ఈ కోతి కాస్త ఒక విచిత్రమైన సరస్సును చూసింది. దాని దగ్గరికి వెళ్లి అందులో తన ప్రతిబింబమును చూసుకొని…. తన లాంటి జీవి ఈ సరస్సులో మరొకటి ఉన్నదని భ్రమపడి ఇందులోకి దూకింది. పాపం ఈ సరస్సుకి అమ్మవారి శాపం ఉంది. ఎవరైతే ఈ సరస్సులోకి దూకుతారో…. వాళ్ళు బయటకు వస్తే స్త్రీమూర్తిగా మారాలని శాపం ఇచ్చింది. ఈ విషయం బ్రహ్మకు తెలుసు కానీ… ఈ కోతికి తెలియదు. దానితో ఇలా సరస్సులో దూకిన కోతి కాస్త లోపల ఎవరూ లేరని తెలుసుకొని ఒడ్డుకు చేరే సరికి… ఒక అందమైన స్త్రీ మూర్తిగా మారేసరికి కంగారుపడి ధ్యానం చేసుకుంటున్న బ్రహ్మ దగ్గరికి వెళ్లి….అసలు విషయం చెప్పగా…. ఆయన కాస్త ఇది అమ్మవారి శాపం వలన నీకు ఇలా జరిగింది. కంగారు పడకు. నీకు సంతానం కలిగి తర్వాత నీ యధార్థ కోతి రూపం నీకు తిరిగి వస్తుందని చెప్పగానే ….బాధతో ఈ స్త్రీ మూర్తి కాస్త ఈ విచిత్ర సరస్సు దగ్గరికి తిరిగి చేరుకొని ….తన శాప విముక్తి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉండగా ఒకసారి ఇంద్రుడు అలాగే సూర్యదేవుడు కాస్త బ్రహ్మను దర్శించుకుని తిరిగి వస్తూ ఈ విచిత్ర సరస్సు దగ్గర ఉన్న ఈ స్త్రీ మూర్తిని చూసి….వీరిద్దరూ మోహించడముతో ఇంద్రుడి వలన ఈమెకి వాలి అలాగే సూర్యుడి వలన సుగ్రీవుడు సంతానముగా పుడతారు. వీరిద్దరిని తీసుకొని ఇంద్రుడు కాస్త గౌతమ మహర్షి దగ్గరికి తీసుకొని వెళ్లి….. వీళ్ళని పెంచమని అహల్యను అడిగితే …..అందుకు గౌతమ మహర్షి ఒప్పుకోడు. ఈయన కాస్త దివ్య దృష్టితో అంతా చూసి వీళ్ళు మానవ పుత్రులు కాదని చెప్పి… తన ఇంటిలో ఉన్న సరస్సులో దిగి బయటకు రమ్మని చెప్పి… వీళ్ళు మానస పుత్రులు అయితే మానవ తలలతో బయటకి వస్తారు. లేదంటే వారి నిజస్వరూపాలలో బయటకు వస్తారు అనగానే…. వీరిద్దరూ కాస్త సరస్సు నుండి బయటకు రాగానే కోతి ముఖాలతో రావడం జరుగుతుంది. అప్పటిదాకా వీళ్ళ మధ్య స్త్రీ మూర్తి రూపంలో ఉన్న బుక్షరజనుడు కాస్త మగ కోతిగా మారేసరికి…. గౌతముడు కాస్త అసలు విషయం ఇంద్రుడికి చెప్పేసరికి…. ఇది విన్న ఇతను కాస్త ఈ పిల్లల్ని ఈ కోతికి అప్పజెప్పి తను ఇంద్రలోకానికి వెళ్లిపోతాడు. ఇక చేసేది ఏమీ లేక ఈ మగ కోతి కాస్త నర కోతులుగా ఉన్న వాలి అలాగే సుగ్రీవుని బ్రహ్మ దగ్గరికి తీసుకొని వస్తే….అప్పుడు ఈయన కాస్త నువ్వు కాస్త వీళ్లిద్దరిని తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న కిష్కింద పురికి చేరుకొని వానర రాజుగా మారి వానర జాతిని ఉద్భవింప చెయ్యి… ఇందులో వీరిద్దరిలో వాలికి కాస్త ఇంద్రుడు ఇచ్చిన బంగారు తామరమాలతో కూడిన సురపుష్పామాల వలన ఎదురుగా ఇతనితో పోరాడిన వారి శక్తిలో సగం శక్తి వస్తుంది. ఎప్పుడైతే ఈ మాలను ఇతను తీసివేసి ఎవరికైనా ఇస్తాడో…. వాడి వలన ఇతని మరణం ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే సుగ్రీవుడికి సూర్యుడు అనుగ్రహం వలన రాబోవు కాలంలో శ్రీరాముడి సాంగత్యం పొందడం జరుగుతుందని చెప్పి…. అక్కడి నుండి ముగ్గురు కాస్త ఈయన దగ్గరకు సెలవు తీసుకొని కిష్కింధ పురికి వెళ్ళడం జరిగింది. ఇలా వీరిద్దరూ కూడా ఒక పురుషుడికి జన్మించడం జరిగిందన్నమాట! తర్వాత కాలంలో సుగ్రీవుడు కాస్త శ్రీరాముడు చెంతకు చేరడం అలాగే వాలి మెడలో ఉన్న ఇంద్రుడిచ్చిన సుర పుష్పమాల గురించి చెప్పడం…. ఈ మాలను కాస్త వాలి నుండి సుగ్రీవుడు పొందడం…. ఆపై శ్రీరాముడు కాస్త చెట్టు చాటు నుండి రామబాణం వేసి వాలి సంహారం జరగటం జరిగింది.
అహల్య- ఇంద్రుడికి శాపాలు
గౌతమ మహర్షి ఆశ్రమానికి తరచుగా ఇంద్రాది దేవతలు కాస్త ఆతిథ్యులుగా రావటం మొదలైంది. ఇంద్రుడు మనస్సు కాస్త అతి సుందరమైన అహల్యను కోరుకోవడం ఆరంభం అయింది. ఈ విషయం గ్రహించిన అహల్య కాస్త ఏమీ పట్టించుకోనట్లుగా….. అతిథికి సేవ చేయాలనే ఆలోచనలో ఉండేది. రాను రాను ఇంద్రుడి కోరిక కాస్త ఆవేశంగా మారసాగింది. తను ఇంద్రుడిగా ఈమె దగ్గరికి వెళితే తన కామకోరిక తీర్చదని…. తనని అతిధి గానే చూస్తుందని గ్రహించి… మాయోపాయంతో గౌతమ మహర్షి గా అహల్య దగ్గరికి వెళ్లి…. తన కామకోరికను తీర్చుకోవడం ఆరంభించాడు. ఈ విషయం ఈమెకి తెలియదు. కానీ ఈమె కుమార్తె అయిన అంజనా దేవికి తెలుసు. కానీ తల్లికి మాయా రూపంలో ఉన్న ఇంద్రుడు వస్తున్నాడని చెప్పదు. ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత వీరిద్దరూ శృంగార సమయంలో ఉండగా గౌతమ మహర్షి వచ్చేసరికి అహల్య కంగారుపడుతుంది. బయట నుండి ఒకరు… తన ఒడిలో మరొకరు… ఇలా ఇద్దరు గౌతమ మహర్షులు ఉండేసరికి….ఇందులో ఎవరు నిజమైన గౌతమ మహర్షి అనేది అర్థంకాక పోయేసరికి నిజ గౌతమ మహర్షి కాస్త తన యోగదృష్టితో చూసి జరిగినదంతా తెలుసుకొని…. తన రూపంలో ఉన్న మాయ గౌతమ మహర్షి చూస్తూ ఓరి ఇంద్రుడా ! ఇంతకీ తెగిస్తావా…! దేవతలకి రాజు అయ్యుండి ….ఒక మానవ మాతృరాలి యోని కోసం కుట్ర పన్ని…. ఈమెను లొంగ తీసుకొని పాతివ్రత్య ధర్మమునకు హాని కలిగిస్తావా! ఏ యోని కోసం అయితే ఇంతటి మోసానికి ఒడిగట్టావో….. ఆ యోనులే … నీ ఒంటిమీద వెయ్యి దాకా ఉద్భవించాలి. వాటిని నీవు నిరంతరంగా చూస్తూ నువ్వు చేసిన అతి ఘోరాతి ఘోరమైన ఈ తప్పిదమును గుర్తు చేస్తూ పశ్చాత్తాపంతో….. ప్రశాంత స్థితి లేకుండా…. కుమిలి పోవాలి అని శాపం ఇచ్చేసరికి….మాయా రూపంలో ఉన్న ఇంద్రుడు కాస్త గౌతమ మహర్షి కాళ్ళ మీద పడి తను చేసిన తప్పును క్షమించమని… అలాగే తనకిచ్చిన శాపం నుంచి శాప విముక్తి కలిగించమని పదేపదే వేడుకునేసరికి….దయార్థ హృదయుడైన గౌతమ మహర్షి కాస్త ఇంద్రుడుతో నాయన ! నా శాపానికి తిరుగులేదు. శాపమును అనుభవించక తప్పదు. కానీ నీకు మాత్రమే వెయ్యి యోనులుగా కనపడతాయి. మిగిలిన వాళ్ళందరికీ ఇవి కాస్త వెయ్యి కన్నులుగా కనపడతాయి. ఇది ఇంతకంటే శాప ఉపశమనం నేను ఇవ్వలేను. చేసిన కర్మను అనుభవించక తప్పదు అనగానే…. బాధతో ఇంద్రుడు కాస్త గౌతమ మహర్షి దగ్గర నుండి సెలవు తీసుకొని ….అక్కడి నుంచి తన ఇంద్రలోకానికి వెళ్లిపోవడం జరిగింది.
అప్పుడు గౌతమ మహర్షి కాస్త అహల్యకేసి చూస్తూ శాపం ఇవ్వబోతుండగా…. తన కుమార్తె అయిన అంజనాదేవి కాస్త నాయనా! ఇందులో అమ్మ తప్పులేదు. ఆయన కాస్త మీ రూపంలో వస్తున్నాడని నాకు తెలుసు కానీ అమ్మకి తెలియదు…. అనగానే, ఇది విన్న అహల్య కాస్త కూతురు కేసి చూస్తూ… అంటే ఇంద్రుడు కాస్త మీ నాన్న రూపంలో నా దగ్గరికి వస్తున్నాడు అని తెలిసి నీవు ఎందుకు నాకు చెప్పలేదు. చెప్పి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదు కదా! అతిధి సత్కారాలు చేయాలి కానీ ….ఆ అతిథి వలన మనకి ఏమైనా సమస్యలు వస్తే పెద్దలకి చెప్పాలి అనే ఆలోచన నీకు రాలేదా! నాకైనా చెప్పాలని అనిపించలేదా! అన్నీ తెలిసి నువ్వు కావాలని తప్పు చేశావు. కళ్ళుండి కూడా అంధురాలిగా ప్రవర్తించావు కాబట్టి…. నీ కళ్ళు నీకు కనిపించవు. అలాగే నీ మనసు కాస్త చంచలంగా కోతి మనస్సు వలె ప్రవర్తించింది కాబట్టి నీకు సంతానముగా కోతి యే పుడుతుంది అని శాపం ఇచ్చేసరికి… గౌతమ మహర్షి కాస్త ..అహల్యతో దేవి! తప్పు జరిగిపోయింది. అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా! నా రూపానికి అలాగే మాయా రూపానికి నీకు తేడా తెలియని అమాయకురాలవేమీ కాదు కదా! నీకు అన్ని తెలుసు. ఎందుకంటే నీవు బ్రహ్మ మానస పుత్రికవి కదా! కానీ ఏమీ తెలియనట్లుగా ప్రవర్తించావు అని నాకు తెలుసు. ఎందుకంటే నా రూపంలో వచ్చింది దేవతలకి రాజైన ఇంద్రుడు కాబట్టి స్వయంగా ఇతను నిన్ను కోరుకుంటున్నాడు… స్వయంగా ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా …అతనికి నీ శరీరం ఇచ్చి కామకోరిక తీర్చి తృప్తి పరుస్తూ వచ్చావు. ఈ విషయం నాకు తెలిసేసరికి అన్నీ తెలిసిన అంజనా దేవి మీద నింద వేస్తున్నావు. కాబట్టి నువ్వు కూడా ఒక రాయిగా మారిపో అనగానే….. అహల్య కాస్త స్వామి! మీకు తెలియందేమీ లేదు. సర్వం తెలుసు. అతనికి అతిథి సేవ చేయాలనే తపన తాపత్రయంలో అనుకోకుండా ఈ తప్పిదం నా వలన జరిగింది. అందుకే నన్ను క్షమించండి… మీరు ఇచ్చిన ఈ శాపమును మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. నా పాప ప్రక్షాళన చేసుకుంటాను. నా మనసు పరిశుద్ధం చేసుకుంటాను. నాకు మళ్ళీ ఎప్పుడు ఈ శాప విముక్తి కలుగుతుందో ….నా యందు దయవుంచి సెలవు ఇవ్వండి…అనగానే దేవి ! త్రేతా యుగంలో విశ్వామిత్రుడు కాస్త రామలక్ష్మణులను ఈ ఆశ్రమానికి తీసుకొని రావడం జరుగుతుంది. అప్పుడు ఆయన సమక్షంలో పరమ పునీతుడైన పాతివ్రత్య ధర్మ గుణం ఉన్న శ్రీరాముడి పాదము నీ ఆకార రాయి మీద పడగానే…. ఈయనకి ఉన్న ఈ ధర్మ గుణం చేత నీ తప్పిన పాతివ్రత్య ధర్మ దోషం నశించి…. పునీతురాలివై తిరిగి మానవ శరీర అహల్యగా మారతావు. అప్పటిదాకా నేను హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకుంటూ ఉంటాను అని చెప్పగానే…. అహల్య కాస్త రాయిగా మారిపోవడం జరుగుతుంది. కూతురైన అంజనాదేవికి కేసరి అనే వానర రాజుతో వివాహం జరిపించి …..గౌతమ మహర్షి కాస్త తన ఆశ్రమును వదిలిపెట్టి తపస్సు కోసం హిమాలయానికి వెళ్ళటం జరుగుతుంది.
ఇలాంటి కృతయుగం పూర్తి అయిన తర్వాత త్రేతా యుగము మొదలైంది. శ్రీరాముడి ఆవిర్భావము జరిగింది. విశ్వామిత్రుడు కాస్త సీతాదేవి స్వయంవరం కోసం… శ్రీ రామ లక్ష్మణులను ఆశ్రమాల మీదుగా మిథిలా రాజ్యానికి తీసుకొని వెళుతూ ఉండగా….వీరికి పాడుబడిన స్థితిలో ఉన్న గౌతమ మహర్షి ఆశ్రమం కనిపించింది . దానితో శ్రీరాముడు కాస్త గురువర్య! ఇప్పటిదాకా మేము ఎన్నో ఆశ్రమాలు చూస్తూ వస్తున్నాము కదా! అవి అన్ని కూడా కళకళలాడుతూ ఉన్నాయి.. కానీ ఈ ఒక్క ఆశ్రమం మాకు కళ తప్పి పాడు పడినట్లుగా కనపడుతుంది . ఇది ఎవరి ఆశ్రమం. దీని పూర్వ వివరాలు మాకు తెలియజేయండి అనగానే…. విశ్వామిత్రుడు కాస్త రామా! ఇది మంత్ర శాస్త్ర ప్రావీన్యుడైన గౌతమ మహర్షి ఆశ్రమము. ఇది ఇలా వెలవెలలాడడానికి కారణం అహల్య అలాగే ఇంద్రుడు చేసిన తప్పిదమే కారణమని అంటూ అన్ని వివరాలు చెప్పేసరికి….ఇది విన్న శ్రీరాముడు కాస్త ఎంతో నొచ్చుకుంటూ అహల్య మాత నాకోసం ఇన్నాళ్లుగా తపిస్తోందా ! రాయి రూపంలో నా పాద స్పర్శ కోసం….. శాప విముక్తికై ఎదురుచూస్తుందా! ఆ తల్లి యున్న రాయి ఏదో సెలవివ్వండి గురుదేవా! అనగానే ఆశ్రమం బయట ఉన్న ఒక పెద్ద బండరాయి కేసు చూపిస్తూ…. అదే ఇది…. అనగానే ఈ రాయి కేసి శ్రీరాముడు నమస్కారం చేస్తూ…. అమ్మ! మీరు కూడా మా అమ్మతో సమానమైన వారు …..కానీ నా పాదస్పర్శ వల్లనే మీకున్న శాప విముక్తి కలుగుతుందని నా గురువర్యులు ఆజ్ఞ మీద నా పాదమును మీ మీద మోపుతున్నాను.. అందుకు నన్ను క్షమించండి…. అంటూ పాదమును ఈ రాయిని తాకి తాకగానే ఈ రాయి కాస్త బద్దలై అదృశ్యమై…. దాని స్థానంలో అహల్య కనిపించేసరికి….వీరిద్దరూ ఈమెకి నమస్కారం చేయగానే…. ఈమె కాస్త విశ్వామిత్ర మహర్షికి నమస్కారం చేస్తూ ఉండగానే…. అదృశ్య శక్తితో అదృశ్యముగా అక్కడ గౌతమ మహర్షి కనిపించేసరికి….అహల్య అలాగే రామలక్ష్మణుడు కాస్త ఆయనకి నమస్కారం చేయగానే….వీరిని గౌతమ మహర్షి దీవించి….వారి ఆశ్రమం నందు వీరిద్దరికీ అతిధి సత్కారాలు చేసి… మిథిలా నగరానికి పంపించడం జరిగింది. ఇలా శ్రీరామ అనుగ్రహంతో పునీతురాలైన అహల్యను తోడుకొని శివధ్యాన తపస్సు చేసుకోవడానికి ….నాసిక్ ప్రాంతంలో ఉన్న బ్రహ్మగిరి పర్వతానికి వీరిద్దరూ చేరుకోవడం జరిగింది.
గోదావరి ఉద్భవం
ఇలా గౌతమ మహర్షి అలాగే అహల్య కాస్త …నాసిక్ ప్రాంతంలో ఉన్న బ్రహ్మగిరి పర్వతము మీదకి చేరుకొని…. అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకొని…. వీరిద్దరూ కూడా శివ ధ్యాన తపస్సు ఆరంభించారు. అనుకోకుండా ఈ ఆశ్రమం చుట్టుపక్కల ప్రాంతాలలో తీవ్రమైన క్షామం ఏర్పడసాగింది. త్రాగటానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకని పరిస్థితి అన్నమాట! కానీ గౌతమ మహర్షి ఆశ్రమంలో మాత్రం వరుణ దేవుడి అనుగ్రహం వలన ఎప్పుడు ఇంకిపోని నీటి సరస్సు ఉన్నది. ఇది ఉందని ఇతర ప్రాంతాలలో ఆవాసం చేస్తున్న బ్రాహ్మణులు ఒక్కొక్కరిగా తెలుసుకుంటూ అతిథి సేవ పేరుతో అందరూ కూడా నెమ్మదిగా ఈ ఆశ్రమానికి రావడం ప్రారంభించారు. ఇలా 12 సంవత్సరాల పాటు వచ్చిన వారిని వచ్చినట్టుగా ఈ మహర్షి దంపతులు ఆదరిస్తూ అతిధి సత్కారాలకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవడం…. ఈయన ఖ్యాతి కాస్త నలుమూలలకి పాకడంతో ఈర్ష అసూయలకు చెందిన ఈ బ్రాహ్మణులంతా కూడా గణపతిని ప్రార్థించడం జరిగింది.
అప్పుడు గణపతి కాస్త ఒక బాల బ్రాహ్మణుడిగా మారి గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకొని…అతిధి సత్కారాలు పొందుతూ….ఈయన ఖ్యాతి అపఖ్యాతిగా మారే సమయం కోసం చూస్తూ పన్నాగం కోసం ఎదురుచూడ సాగాడు. ఆ కాలము రానే వచ్చింది. ఒకరోజు తన తల్లి దగ్గర పని చేసే ఒక చెలికత్తెను ఒక మాయ గోవుగా మారమని ఆజ్ఞాపించాడు. ఈమె కాస్త మాయ గోవుగా మారి ఈ ఆశ్రమానికి వచ్చి కాపుకు సిద్ధంగా ఉన్న వరి పంటను తినటం ఆరంభించింది. ఇది చూసిన గౌతమ మహర్షి కాస్త ఒక చిన్న గడ్డి పరకను తీసుకొని…. ఈ ఆవును అదిలించేసరికి ఇది కాస్త చచ్చిపోతుంది. దానితో అక్కడున్న బ్రాహ్మణులు కాస్త ఈ ఆశ్రమంలో అతిథులుగా ఇంకా ఉంటే ….తమకి కూడా గోహత్య దోషం అంటుతుందని…. గౌతమ మహర్షిని భయపెట్టి వెళ్ళిపోతుంటే ….మహర్షి కాస్త ఈ గో హత్య దోష పరిహారం ఏదైనా ఉంటే సెలవు ఇవ్వండి చేస్తాను…. అతిధులకి కోపం తెప్పించరాదు…. దోషం అంటించరాదు….అతిధులు ఆ కారణం తో వెళ్లిపోతే ఆతిథ్యం ఇచ్చిన వారి 96 తరాల పుణ్యఫలము పోతుంది కదా అంటూ ఉండేసరికి….. బాల బ్రాహ్మణ రూపంలో ఉన్న గణపతి తన తల్లి పార్వతి దేవికి ఇచ్చిన వాగ్దానం అనగా తన సవతిగా వచ్చిన గంగాదేవిని ఈ మహర్షి శాప నివృత్తి కోసం తన తండ్రి అయిన శివుని జటాజూటం నుంచి భూమి మీదకు తెప్పిస్తే తన తల్లికి సవతి పోరు తప్పుతుంది. ఈ మహర్షికి శాప విముక్తి కలుగుతుందని అనుకుని…. భూమి మీదకి గంగాదేవిని రప్పించి…. ఈ గోవు శరీరం ఆ నీటిలో శుద్ధి చేసి…. ఆ గంగాజలముతో ఇక్కడ ఉన్న వారంతా స్నానాధికాలు చేస్తే … ఎవరికీ కూడా గో హత్యాదోషం అంటదని చెప్పడంతో…. గౌతమ మహర్షి ఇదంతా విని, ఇక తన శివధ్యాన తపస్సు చేసి…. జటాధారి కొప్పులో ఉన్న గంగమ్మను… భూమి మీదకు తీసుకొని వచ్చేటట్లుగా చేస్తానని అప్పటిదాకా అందరూ ఆశ్రమంలోనే ఉండాలని కోరడంతో…. దీనికి వీరందరూ కూడా అంగీకరించగా ….గౌతమ మహర్షి అమితానంద పడుతూ ….శివానుగ్రహం కోసం ప్రతిరోజు 108 మట్టి శివలింగాలు చేసి వాటిని పూజించి నిమజ్జనం చేస్తూ….. 12 సంవత్సరాల పాటు ఇలా శివ ధ్యానంలో ఉండేసరికి…. శివుడు ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యేసరికి…. గౌతమ మహర్షి కోరిక అనుసారం తన జటాజూటం నుంచి గంగాదేవిని ఈ భూమి మీదకు పంచ పాయలు ద్వారా పంచ గంగలుగా ప్రవహింప చేస్తాడు. ఈ గంగానది కాస్త ఒక స్త్రీ మూర్తిగా మారి… ఈ మహర్షి ఆశ్రమానికి వైపు ప్రవహిస్తుంది. అక్కడ చచ్చిపడి ఉన్న మాయాగోవు శరీరంలో తాకగానే ఇది కాస్త మాయం అయ్యేసరికి….గౌతమ మహర్షి కాస్త యోగ దృష్టితో జరిగింది అంతా తెలుసుకొని గణపతి చేసింది లోక కళ్యాణార్థమే కదా! అని అనుకొని… కానీ రాగ ద్వేషాలకు గురి అయ్యి బ్రాహ్మణులు చేసిన అపరాధములను క్షమించరాదని అనుకుంటాడు. ఈ విషయం తెలిసిన గణపతి కాస్త… అతను వచ్చిన పని పూర్తి అవ్వడంతో ఈయన ఆశ్రమం నుంచి అదృశ్యం అవుతాడు. విషయం తెలియని బ్రాహ్మణులు కాస్త మహర్షి దగ్గరికి వచ్చి…. ఈరోజు నీ వలన భూమి మీద గంగ వచ్చింది. గోవుని శుద్ధి చేసింది కాబట్టి… గోదావరీ అని నామకరణం చేద్దామని…. ఇక తమకు అంటిన పాప దోషాలను నివృత్తి కోసం గంగా స్నానం చేయాలని అనుకునేసరికి… గంగాదేవి మాయమవుతుంది.
అప్పుడు గౌతమ మహర్షి కాస్త తన యోగదృష్టితో చూసిన విషయం వీళ్ళందరికీ చెప్పేసరికి…. తాము చేసిన తప్పును క్షమించమని …ఇందుకు పరిహార దోషం చెప్పమని అడిగేసరికి బ్రహ్మగిరి పర్వతం చుట్టూ మూడుసార్లు గిరి ప్రదక్షిణం చేస్తే తమకి అంటిన ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు ఉన్న తమోగుణం నశించును అని….. అప్పుడే తిరిగి గంగాదేవి ప్రత్యక్షమై గంగా స్నానం చేయడానికి అనుమతిస్తుందని చెప్పేసరికి…. తాను చేసిన తప్పిదములకు శిక్ష అనుభవించక తప్పదు కదా ! అని బ్రహ్మగిరి చుట్టూ అందరూ కూడా గిరిప్రదక్షిణం చేస్తారు. దానితో గౌతమ మహర్షి ప్రార్థనతో గంగాదేవి మళ్ళీ అవతరించి వీరందరికీ కూడా స్నానం చేసే అవకాశం ఇవ్వటంతో ….గంగా స్నాన ఫల ప్రాప్తి వీరందరూ పొందడంతో…. వీరికి ఉన్న సకల పాప దోషాల నుంచి విముక్తి పొందడం జరుగుతుంది. ఆనాటి నుండి గంగాదేవి కాస్త ఈ క్షేత్ర తీర్థం నందు గోదావరి నామంతో ప్రసిద్ధి చెందడం జరిగింది. అలాగే గౌతమ మహర్షి అనుగ్రహంతో…. భూమి మీదకి రావడంతో ఈ నది గౌతమి అని కూడా పిలవడం జరిగింది. అలాగే ఈ మహర్షి అనుజ్ఞ మేర త్రిమూర్తులు కాస్తా త్రిలింగాలుగా మారి ఈ క్షేత్రం కాస్త ఈ గోదావరి నది ఒడ్డున త్రయంబకేశ్వర క్షేత్రముగా ఖ్యాతి చెందడం జరిగింది. ఆ తర్వాత గౌతమ మహర్షి అలాగే అహల్య కాస్తా శివుడి కోరిక మేర కైలాసమునకు చేరుకోవడం జరిగింది.
త్రయో వింశతిః (23వ )అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి