అధ్యాయం 14
సిద్ధుల లోక దర్శనం
~~~~~~~~~~~~~~~~
శివ భక్తులు లేదా శివయోగులు కాస్త అరుణగిరిని దర్శిస్తే…వారికి ఇది భూలోక కైలాస పర్వతముగా దర్శనమిస్తుంది. అదే దేవీ భక్తులు లేదా దేవి యోగినీలు కాస్త ఈ అరుణగిరిని దర్శిస్తే వారికి 44 భుజాలు ఉన్న శ్రీ చక్రం లాగా మణిద్వీపము లాగా దర్శనమిస్తుంది. ఇదే విషయమును మన ఆదిశంకరాచార్యుల వారు కాస్త ఈ అరుణగిరిని గురించి ప్రస్తావిస్తూ…. ఇది చూడటానికి కొండయే …..స్పటిక లింగ రూపంలో … స్పటిక శ్రీ చక్రములాగా నాకు దర్శనమిస్తోంది అని…. ఈయన అయ్యంగారి కొలను వద్ద ఉన్న శ్రీ విష్ణుమూర్తి ప్రతిష్ట శివలింగమైన అరుణగిరి గుడి దగ్గర నుండి అరుణగిరిని చూసి…. చెప్పి…. అక్కడనుండి ఈ గిరిని దర్శించుకుని వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఈ అరుణగిరి చుట్టూ కూడా 44 శక్తి కేంద్రాలను గిరి ప్రదక్షిణం చేస్తూ దర్శించుకోవాలని స్థల పురాణం చెప్పడం జరుగుతుంది. అలాగే మురుగన్ భక్తులకి ఈ అరుణగిరి కాస్త దేవ జాతులు ఉన్న వివిధ రకాల పాములు ఉన్న పాము పుట్టగా దర్శనమిస్తోంది. అదే గణపతి భక్తులకి ఈ గిరి కాస్త గజముఖ గణపతి గా దర్శనమిస్తోంది. అంటే ఈ లెక్కన చూస్తే ఈ అరుణగిరి కాస్త యద్భావం తద్భవతిగా…. ఎవరు ఏ భావంతో చూస్తారో ఆ భావ రూపముగా అది కనపడుతోందన్నమాట!
ఇకపోతే సిద్దయోగులకి లేదా సిద్ధ సాధకులకి ఈ అరుణగిరి లోపల ఏకంగా సిద్దుల లోక దర్శనం ఉన్నట్లుగా వారి స్వానుభవాలు చెబుతున్నాయి . ఇందులో 18 మంది సిద్ధగురువులు ఇప్పటికీ సజీవ రూపంగా సజీవ మూర్తులుగా లోపల ఆవాసం చేస్తూ ఉన్నారు. వీరంతా ప్రతిరోజు రాత్రి పది గంటలకి జ్యోతి శరీరాలతో సింహాసనము పైన ఆసీనులైవున్న దక్షిణామూర్తి సమక్షంలో భవిష్యత్తులో వచ్చే విపత్తుల నివారణ కోసం సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారని….. స్థానిక అరుణగిరి యోగుల స్వానుభవాలు చెబుతున్నాయి. అలాగే పౌర్ణమి సమయాలలో ఈ అరుణగిరి కేసి చూస్తే అప్పుడప్పుడు కొన్ని దివ్య దీప జ్యోతులు కాస్త ఈ అరుణగిరి లోపలికి వెళ్లి అదృశ్యమయ్యే దృశ్యాలను సర్వసాధారణంగా చూడవచ్చును…. ఈ సమావేశాలకి వివిధ లోకవాసులు అనగా హిమాలయాలలోని కైలాస పర్వతం కింద ఉన్న శంభాల మరియు అగర్తలా గ్రామము నుండి కొంతమంది సిద్దయోగులు ఇలా జ్యోతి శరీరంతో దివ్య జ్యోతులుగా ఈ అరుణగిరి లోపలికి ప్రవేశిస్తూ ఉంటారని…. మా గురువుగారైన నిరాకారానంద స్వామీజీ స్వానుభవం చూసి నేను చెప్పడం జరిగింది. ఇలాగే శ్రీశైలం, కాశీ క్షేత్రం, ఉజ్జయిని క్షేత్రం, ఓంకార క్షేత్రం, సోమనాధ క్షేత్రం, ద్వారకా క్షేత్రం, కంచి క్షేత్రం, చిదంబర క్షేత్రం ఇలా మున్నగు క్షేత్రాల నుండి వివిధ యోగులు కాస్త ఈ సమావేశాలకి హాజరవుతూ ఉంటారని…. అంతెందుకు మా నిరాకారానంద స్వామి కాస్త రాత్రి పది గంటలకి తమ స్థూల శరీరానికి యోగనిద్ర ఆవరించగానే…… ఈయన ఈ శరీరం నుంచి ఒక దివ్య జ్యోతి బయలుదేరి…. ఈ గిరి లోపలికి వెళ్లి అదృశ్యం అయ్యేది. ఆ తరువాత తెల్లవారుజాము ఉదయం ఐదు గంటలకి తిరిగి ఈ గిరి నుండి బయటకు వచ్చి యధావిధిగా తన స్థూల శరీరంలోనికి ప్రవేశించేది.. అప్పటిదాకా అచేతన స్థితిలో ఉన్న ఈ స్థూల శరీరంలో కదలిక వచ్చి… చైతన్యమయ్యేది. ఇలా నేను ఎన్నోసార్లు చూడటం జరిగింది. ఇది అక్షరసత్యమే. అప్పుడు ఆయన తన స్వానుభవాలు పూర్తిగా చెప్పేవారు కాదు… చెప్పి చెప్పనట్లుగా చెప్పేవారు…. సమావేశానికి ఈరోజు ఎవరు వచ్చారో చెప్పేవారు… ఎందుకు వచ్చారు అని ….ఈ సమావేశంలో ఏం జరిగిందో చెప్పేవారు కాదు . అది గుప్తము… అది దైవ రహస్యం చెప్పరాదని దాటేసేవారు. మేము కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళం కాదు… చెప్పేది అయితే ఆయనే చెప్పేవారు కదా! అని విని ఊరుకునే వాళ్ళం. ఈ సమావేశాలు రెండు విధాలుగా జరుగుతాయని… శివయోగులు కాస్త దక్షిణామూర్తి సమక్షంలో ఉండి యోగపరమైన సమావేశాలు చేస్తే, అదే ఈ గిరి అంతర్గత గుహయందు ఉన్న మణిద్వీపంలో అమ్మవారి యోగులు కాస్త ఆదిపరాశక్తి సమక్షంలో రాజేశ్వరి మాత మండాకృతిలో ఆసీనులైన భోగపరమైన సమావేశాలు నిర్వహిస్తారని చెప్పేవారు. ఈ సమావేశాలకి జ్యోతి శరీరంతో ఉచ్చ శివా అని పిలవబడిన నారాయణ్ యోగి వెళ్లేవారని ఈయన జీవిత చరిత్రలో ఈ స్వానుభవం చదివితే తెలుస్తుంది.
నిజానికి ఒక యోగ సాధకుడు కాస్త సాధన చేసి అనగా 12 సంవత్సరాల పాటు గురువుకి సేవ చేసి…. ఆయన అనుగ్రహం పొంది…. అష్టసిద్ధులు అనగా అనిమ,గరిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి ,ప్రాకార్యం, ఇచ్చా, వాచా, అనే సిద్దులను పొందిన వారిని మాత్రమే సిద్ధుడు అంటారు. అదే వీళ్ళకి ఈ అష్ట సిద్దులతో పాటుగా తత్వశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం, ఖగోళ శాస్త్రం, సాహిత్యం, లలిత కళలు, సంగీతం, నాట్యం, నాటకం, నృత్యం వంటి మున్నగు వాటిలో ప్రావీణ్యం పొందిన దానినిబట్టి వారిని సిద్ధగురువులు అంటారు. ఇలా వీరంతా తాము పొందిన జ్ఞాన ప్రావీణ్యంతో నగరసంచారాలు చేస్తూ….ప్రజలు ఈతి బాధలు తెలుసుకొని…. వాటి పరిష్కార మార్గాలు చెప్పి …పరిష్కరించి…. అక్కడి నుండి మరొక ప్రాంతానికి వెళ్లిపోయేవారు . ఇలాంటి సిద్ధ సంప్రదాయానికి ఆదిమూల పురుషుడిగా అగస్త్యముని అని చెప్పడం జరుగుతుంది.
ఇలా తమిళ సిద్ధ సాంప్రదాయంలో…. మనకి 18 మంది సిద్ధులు అగుపిస్తారు. వీరికి అష్టసిద్ధులతో పాటుగా ఆధ్యాత్మిక జ్ఞానం, యోగ సిద్ధ వైద్యం మున్నగు వాటియందు నిష్ణాతులైన పరిపూర్ణ యోగులుగా గుర్తించబడ్డారు.
1) అగస్త్య సిద్దుడు ఆ తర్వాత ……
2)సత్తముని ఈయన యోగ శాస్త్రంలో నిష్ణాతుడు…
3) పాంబట్టి సిద్దుడు… ఈయన కాస్త పాములను నియంత్రించే శక్తి గలవాడు…
4) కొంకణర్ సిద్దుడు ఈయన కాస్త లోహాలను బంగారంగా మార్చే రసవిద్యను ప్రావీణ్యం పొందిన రససిద్దుడు…
5)ధన్వంతరి సిద్దుడు… ఈయన కాస్త ఆయుర్వేద సిద్ధ వైద్య నిపుణులు అయితే…
6) పతంజలి యోగ సిద్ధుడు
7) కొరక్కర్ సిద్ధుడు కాస్త ……
వీళ్ళిద్దరూ కాస్త…..కుండలీని యోగ సూత్రాల కర్తగా ఉండేవారు ….ఇక
8)కరుపురార్ సిద్ధుడు అయితే ఆలయ శిల్ప శాస్త్ర ప్రావీణ్యం పొందాడు. ఈయన తంజావూరు బృహదీశ్వరాలయ నిర్మాణములో ముఖ్యపాత్ర వహించడం జరిగింది.
9) భోగర్ సిద్దుడు కాస్త నవపాషాణ పదార్థాలతో వైద్యం చేయడంలో సిద్ధి పొందాడు. ఈయన కాస్త పళని క్షేత్రంలోని నవపాషాణ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ మూర్తిని తయారు చేయడం జరిగింది.
10) కడువెలి సిద్దుడు అయితే… తత్వశాస్త్రమునందు ప్రావీణ్యం పొంది దీని బోధ గురువుగా ఖ్యాతి పొందడం జరిగింది.
11)మలై సిద్దుడు కాస్త గిరిజన ప్రాంతాలలో మూలికా వైద్యము నందు ప్రావీణ్యం పొంది ఇక్కడ సంచారం చేస్తూ ఉండేవారు.
12)కుడంబై అనే స్త్రీ మూర్తి సిద్ధురాలు… ఈమె కాస్త సంజీవని సిద్ధి పొంది అమరత్వం పొందడం జరిగింది.
13) అలుక్కిని సిద్దుడైతే…బ్రహ్మ జ్ఞాన సిద్దుడిగా ఖ్యాతి పొందడం జరిగింది.
14) అగసైయసిద్ధుడు,
15) వాశిష్ఠర్ ……..
వీళ్ళిద్దరూ కాస్త బ్రహ్మవిద్య యందు సిద్ధి పొంది పూర్ణ బ్రహ్మ జ్ఞానమును బోధించిన బోధ గురువు అయ్యారు.
16) తరువాత కమలముని ఈయన వైద్య, యోగశాస్త్ర ప్రవీణులు… తరువాత ఇకపోతే ఆ తరువాత
17) ఇడయ్ కడార్ సిద్దుడు కాస్త విష్ణుమూర్తి అవతారంగా అందరూ భావిస్తారు. ఇతను సుమారుగా 600 సంవత్సరాలు జీవించాడని నమ్ముతారు. ఈయన తమిళనాడులోని తిరువన్నామలై లో పుట్టి సిద్ది పొందిన యోగ సిద్దుడు .
ఇక ఆఖరివాడైన
18)వాల్మీకి కాస్త రామాయణ ఇతిహాస గ్రంథకర్తగా ఉండి బ్రహ్మ జ్ఞానిగా ఖ్యాతి పొందడం జరిగింది.
ఇలా పద్దెనిమిది మంది సిద్ధులు కాస్త తమిళనాడులోని ‘తనిప్పరై’ గ్రామానికి సమీపంలో ఉన్న చతురగిరి అనే ఆధ్యాత్మిక పర్వతము నందు సజీవ మూర్తులుగా కొన్ని యుగాలపాటు ఉండి నివసించారని… చాలామంది యోగ సిద్ధులు విశ్వసిస్తూ ఉంటారు. ఆ తర్వాత వీరంతా మోక్షం పొంది 18 సిద్ధగురువులుగా ఈ అరుణాచల క్షేత్రంలోని అరుణగిరి యందు ఆవాసం చేస్తున్నారని…. ఇక్కడ స్థానిక అరుణగిరి యోగులు విశ్వసిస్తూ ఉంటారు. వీరికి ధ్యానానుభవాలలో ఆయా సిద్ధగురువులు అగుపించి రసవిద్య, మూలికా వైద్యం, సిద్ధ వైద్యం, సంగీత జ్ఞానం, నవపాషాణ జ్ఞానం మున్నగు వాటిని భావితరాల యోగసిద్ధులకు అందించాలని చెబుతూ ఉంటారు. అలాగే ఈ క్షేత్ర అరుణగిరి యోగి అయిన శ్రీ శేషాద్రి స్వామిగళ్ వారి ఆదేశం తో చెన్నైలోని మడంబక్కం వద్ద ఈ 18 సిద్దులతో శ్రీ చక్ర మహామేరును ఏర్పరచి దానికి 18 సిద్దర్ల బృందావన శక్తిపీఠముగా స్థాపించబడింది.
చతుర్దశ అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం అరుణాచల శివార్పణమస్తు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి