అధ్యాయం 11
విచిత్ర శిలామూర్తుల దర్శనం
మనకి అరుణాచల క్షేత్రంలోని అరుణగిరి పైన అలాగే చుట్టూ ఉన్న ప్రాంతాలలో కొన్ని విచిత్ర ఆకారం మూర్తులుగా శిలలు దర్శనం ఇస్తాయి. వీటిలో ప్రధానముగా ఈ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా పద్మాసన శివలింగమూర్తి దర్శనం మనకి పంచముఖ దర్శన ప్రాంతములో కనపడుతుంది. అనగా ఈ ప్రాంతంలో మనకి ఒక్కసారిగా ఏకకాలంలో పంచ శిఖరాలు కనబడతాయి. ఈ ప్రాంతము నందు స్వామిగళ్ అనే యోగికి ఈ పంచ శిఖరాలు కాస్త పంచముఖ శివుడిగా ధ్యాన తపస్సు నందు సాక్షాత్కరించడంతో ఆనాటి నుండి ఈ ప్రాంతమును పంచముఖ దర్శన ప్రాంతముగా ఖ్యాతి పొందటం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో మనకి పద్మాసన భంగిమలో ఉన్న ఒక స్త్రీ మూర్తి పాదాలతో ఉండి…. నడుము భాగంలో ఒక శివలింగ అగ్రభాగముతో ఉన్న స్త్రీ పద్మాసనా శివలింగమూర్తి దర్శనం ఇస్తుంది. ఈ లింగ భాగాన్ని సూక్ష్మముగా పరిశీలిస్తే ఒక మనోనేత్రము, అలాగే రెండు చెవులు ఉన్నట్లుగా కనపడుతుంది. దీనికి కిందగా ఒకే రూపముతో…. ఒకే పరిమాణముతో పంచరాతి శివలింగ మూర్తులు ఉంటాయి. దీని కింద గా గౌతమ మహర్షి తలభాగము దర్శనమిస్తుంది. ఈయన ముందు 16 రేకుల పద్మములో శివ రుద్ర పాదాలు దర్శనం ఇస్తాయి. ఇలా ఈ పద్మాసన శివలింగమూర్తి మనకి దర్శనమిస్తూ…. ఆశ్చర్యపరుస్తూ…. అలౌకిక అద్భుత ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడి స్థానిక శివయోగుల స్వానుభవాల ప్రకారముగా చూస్తే, ఇక్కడికి దగ్గరిలో ఉన్న మోక్షద్వారం లోనికి జీవుడు కాస్త స్థూల శరీరంతో ప్రవేశిస్తే…. బయటకు వచ్చేటప్పుడు మనో శరీరంతో వస్తాడు. మనో శరీర జీవులే మోక్ష లోకపు మోక్ష జీవులుగా ఆవాసం చేస్తూ ఉంటారు. అలా ప్రస్తుతం ఉన్న ఈ పద్మాసనా భంగిమ శివలింగమును స్త్రీ మూర్తి మోక్షజీవిగా ఉంటే…..అదే అరుణాచలేశ్వర ఆలయంలో లోపలి వైపున దక్షిణ గాలిగోపురమునకు మధ్య భాగంలో మనకి శివలింగ అగ్రభాగము ఉండి నడుము మీద చేతులు వేసుకున్న భంగిమలో ఉండే పురుష శివలింగమూర్తి ఉంటాడని…. దాన్ని పురుష మోక్ష జీవుడని చెప్పడం జరిగింది. ఈ విచిత్ర శివలింగ మూర్తులను ఫోటోలను పెట్టడం జరుగుతుంది. తద్వారా వీటి ద్వారా మోక్షలోకములో ఉండే మోక్ష జీవుల లింగమూర్తులను దర్శించుకోవచ్చును. అంతెందుకు ……భక్త రామదాసు అంతిమక్షణాలలో ఉన్నప్పుడు శ్రీరాముడు సాక్షాత్కరించి నిత్యం ఆనందం తప్ప మరి ఏమీ లేని మోక్షలోకమునందు లోకవాసుడిగా చేస్తానని అనడంతో….. ఇతను కాస్త స్వామి! మీరులేని ఆ మోక్షలోకమునందు నాకు ఏమీ ఆనందం ఉంటుంది….. కాబట్టి నాకు ఆ లోకం వద్దని నీ నివాసమే కావాలని కోరినాడని మనకి ఈ భక్తుడి చరిత్రలో చదివితే తెలుస్తుంది. అందుకే దీనిని బట్టి చూస్తే అంతరిక్షంలో తప్పనిసరిగా నిత్య ఆనందమును ఇచ్చే మోక్షలోకము ఒకటి ఉన్నదని నమ్మక తప్పదు కదా! అలాగే ఈ క్షేత్రమునందు ఈ మోక్షలోకానికి వెళ్ళటానికి ఉన్న ద్వారమే మోక్షద్వారము అన్నమాట! ఇలా ఈ ద్వారం ద్వారా వెళితే…. వచ్చే మోక్ష లోకానికి ఆవాసముగా మోక్ష జీవులు కూడా ఎలా ఉంటారో ఈ రెండు రకాల శివలింగ మూర్తుల రూపమును మనకి తెలియజేశారని అర్థమవుతుంది కదా! ఈ లెక్కన చూస్తే….. మోక్షలోకము అలాగే మోక్షద్వారము మరియు ఈ లోకవాసులైన మోక్ష జీవులు ఉంటారనేది అక్షర సత్యమేనని…. నమ్మక తప్పదని ఈపాటికైనా గ్రహిస్తే మంచిది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ క్షేత్రానికి వస్తే ఈ మోక్షద్వారము నందు ఒక్కసారి అయినా ప్రవేశించి…. మీరు మోక్ష ప్రాప్తి పొందటానికి కావలసిన అర్హత, యోగ్యత , యోగము పొందండి. మోక్ష ప్రాప్తి పొందండి. అలాగే ఈ రెండు రకాలైన మోక్ష జీవ లింగాలను అరుణాచలేశ్వరుని గుడి లోపల ఉన్న పురుష మోక్ష జీవి లింగమును… అలాగే పంచముఖ దర్శన ప్రాంతములో ఉన్న స్త్రీ మూర్తి మోక్షజీవి పద్మాసన శివలింగమూర్తిని తప్పకుండా దర్శించుకుని…. ధన్యులై తరించండి.
ఇకపోతే గిరి పైన ఉన్న గుహలలో మొదటిగా వచ్చే గుహై నమఃశివాయ గుడి దగ్గర నుండి గిరి పైకి చూస్తే……. మనకి ఒక వైపు తాబేలు తల ఆకారంలో ఒక రాతి శిల స్పష్టంగా కనపడుతుంది దీనిని దగ్గరికి వెళ్లటానికి అటవీశాఖ అధికారుల అనుమతి కావలసి ఉంటుంది. ఈ అనుమతి లేకుండా వెళితే….అక్కడ కాపలా కాసే పోలీసులకు దొరికితే….. జరిమానా విధించే అవకాశం లేకపోలేదు. తస్మాత్ జాగ్రత్త! గిరిని కాపాడాలనే సదుద్దేశంతోనే….. ఈ ఏర్పాటు చేశారని తెలుసుకోండి. ఇక్కడ ఉన్న స్థానిక సాధువులని ఈ తాబేలు రాతిబండ గురించి అడిగితే…. ఇది 400 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక సజీవ తాబేలు యొక్క శిలాజ మూర్తి అని…. ఇది చూడటానికి తాబేలు డిప్పలో నుంచి తల బయటపెట్టిన విధంగా ఇది ఉంటుందని చెప్పడం జరిగింది. పైగా దీని పక్కనే కూర్చుని మాట్లాడుకోవడానికి వీలున్న ఒక రాతిశిల ఉంటుందని….దీనిమీద రమణ స్వామి, గురు నమఃశివాయ కాస్త కూర్చోని ఒకరినొకరు సాధనలో వచ్చే సాధన సందేహాలను…. తమ వాదప్రతి వాదనలు చేసుకుంటూ…. ఉండేవారని చెప్పడం జరిగింది. ఇలా ఎంతోమంది సిద్ధులు కాస్త ఈ శిల దగ్గరికి వచ్చి సాంగత్యంతో ఎన్నో సాధనా సందేహాలు, ధర్మసందేహాలు తీర్చుకుంటూ ఉండేవారని…. ఇలా ఈ తాబేలు కాస్త ఈ సిద్దుల ,మహర్షుల, సాధువుల సంభాషణలను రహస్యముగా మౌనంగా విని ఉండటం జరిగిందని తద్వారా ఈ రాతి శిల మీద కూర్చొని తమకి వచ్చిన సందేహానికి నివృత్తి సమాధానం కోసం ధ్యానం చేసుకోగానే ఈ తాబేలు తల నుండి దాని తగ్గ సమాధానాలు ఇతగాడికి ఙ్ఞాన స్పురణ రూపంలో చేరి నివృత్తి చేసుకొని వెళ్లడం ఇప్పటికీ కూడా జరుగుతూ ఉందని వీళ్ళు చెప్పడం జరిగింది. ఇది అక్షర సత్యం అని మనకి రమణ మహర్షి, గురు నమఃశివాయ చరిత్ర చదివితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ రాతి శిల మీద వీళ్ళు కూర్చొని ఎన్నో సాధనా సందేహాలకు నివృత్తి కోసం ధ్యాన స్ఫురణలు పొందడం జరిగిందన్నమాట! అంతెందుకు…. విష్ణుమూర్తి అవతారాలలో మనకి కూర్మావతారం అనేది ఉన్నది కదా!ఇందుకు ప్రతీకగా ఈ తాబేలు ఉండి ఉండాలి… ఎందుకంటే శివకేశవ తత్వానికి భేదం లేదని చెప్పటానికి ఇది నిదర్శనమై నిలిచి ఉంటుంది.
ఇకపోతే ఈ గుహకి దగ్గరిలో మనకి సిద్ద సాధువులు స్నానం చేసే సిద్ధ కొలను తీర్థం ఉంటుంది. ఇందులో నీళ్లు మనకి వర్షాపాతం బట్టి ఉంటాయి… వర్షాలు పడితేనే ఈ తీర్థంలో నీళ్లు ఉంటాయి అన్నమాట! ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఒకటి ఉంది…. అది ఏమిటంటే ఈ తీర్థములో మనకి కేదారేశ్వర క్షేత్రంలో ఉండే రాతి శిలా శివలింగమైన కేదార లింగం లాంటి రాతిశిల మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ స్థానిక సాధువుల అభిప్రాయం ప్రకారం…. ఈ శిల అనేది సాక్షాత్తు కేదారేశ్వర శివలింగ ప్రతీక అని నీళ్లు లేనప్పుడు ఈ శివలింగ దర్శనం ఇస్తుందని….. కొంతమంది సాధువులు అయితే నీళ్లు ఉన్నప్పుడు లేదా లేనప్పుడు కూడా ఈ శిలా మూర్తి కేదారేశ్వర శివలింగంగా భావించి పూజలు, అభిషేకాలు చేసి విభూతితో త్రిపుండ్రాలు పెట్టి….ఆరాధన చేస్తూ ఉండడము మనం చూడవచ్చును. ఎవరి నమ్మకం వారిది. యద్భావం తత్ తద్భవతి అన్నమాట! శివలింగం కానిది ఏది? ప్రతి కంకర కూడా శంకరుడే కదా!
అలాగే జడై స్వామి గుహ దగ్గర మనకి ఒక రేకుల షెడ్డులో రూపాలు లేని శిలామూర్తులు రెండు కనపడతాయి. అందులో పెద్ద దానిని గణపతి శిల అని,చిన్నదానిని అమ్మ శిల గా పూజిస్తూ ఉంటారు.ఇది గాక ఆది అన్నామలై గుడి బయట ఉన్న పిల్లల గణపతి కూడా ఇలా రూపం లేని గణపతి శిల యే…..అన్న మాట! అంటే దీనికి గణపతి యొక్క ఆకార రూపురేఖలు అనగా సర్వాంగాల రూప దారిగా కనిపించడు…. కేవలం ఈ శిల మీద ఉన్న మడతల ఆకారమును బట్టి దీనిని గణపతి శిలగా గుర్తించి….. గణపతిగా ఆరాధన చేస్తున్నారు. ఇది కూడా ఒకానొక సమయంలో గిరి అగ్రభాగం నుండి డోర్లుకుంటూ రావడం జరిగిందని….. ఈ శిలకి ఉన్న మడతల ఆకారమును గణపతిగా గుర్తించి పూజిస్తూ ఉన్నారని….. అలాగే కొండల మధ్యలో ఇరుక్కుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లవాడిని ఈయన దగ్గరికి తీసుకుని వస్తే, ఆ పిల్లవాడు ఆరోగ్యం పొందడంతో…. అంతేకాకుండా చిన్నపిల్లలకి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే, ఈ గణపతి దగ్గరికి తీసుకొని వస్తే…. ఆరోగ్య ప్రాప్తి పొందడంతో ఈ గణపతిని పిల్లల గణపతి అని కొలవడం ఆరంభమైనదని…. ఇక్కడ స్థానిక భక్తులు అలాగే సాధువులు చెప్పడం జరిగింది. అలాగే పాండవులు నిర్మించిన పాండవ గుడి బయట ఉన్న భీముడి కొలను తీర్థములో మనకి చేప ఆకారంలో ఉన్న చేపశిల అలాగే చేప మణి ఆకారముగా ఉన్న త్రికోణాకార చేపశిల ఇప్పటికీ కనపడతాయి. మనము చూసే దృష్టి కోణమును బట్టి ఆయా ఆకారాలు కనపడుతాయని అర్థమయింది. ఇక్కడ చేపయే చేప శిలాజముగా మారిందన్నమాట! ఇలా ఈ గిరి పైన మరియు గిరి కింద చుట్టుపక్కల ఇలా నాకు ఈ ఆకారాలలో శిలాజమూర్తులు కాస్త శిలలుగా దర్శనం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ అరుణాచల క్షేత్రానికి వచ్చినప్పుడు సజీవ మూర్తులైన ఈ శిలాజమూర్తుల యొక్క శిలలను దర్శించుకుని అద్భుత అనుభవ అనుభూతి పొంది ఆనందించండి.భగవత్ స్వరూపానికి ప్రతీక ఈ విగ్రహ మూర్తికి ఆధారమే ఇలాంటి శిలాజా శిలామూర్తులని మీకు స్వానుభవం అవుతుంది.
ఏకాదశ అధ్యాయము సమాప్తము
శుభం భూయాత్
సర్వం అరుణాచల శివార్పణమస్తు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి