అధ్యాయం - 20

 అధ్యాయం - 20

తేజోమూర్తి ఆవిర్భావం 

~~~~~~~~~~~~~~~~~




విష్ణువు అన్వేషణ

విష్ణువు కాస్త వరాహ రూపాన్ని ధరించి… ఈ తేజోలింగము యొక్క మూలాన్ని కనుగొనుటకు బయలుదేరుతూ ….తేజో స్తంభమునకు నమస్కరించి తన వరాహ రూపములో ….రోమాలను నిక్కబొడుచుకొని ఉండగా…. తన ముట్టెతో సహజ  ఘింకార  ధ్వనితో పాతాళ లోకయాత్ర ప్రారంభ సూచనగా భూమిని తోలుచుట ఆరంభించాడు… అప్పుడు పాతాళము నుండి శేషుడు మొదలైన నాగులు, సర్పాలు కనిపించసాగాయి. హేమాద్రి మూలమై ఆది కూర్మ దర్శనం అయ్యింది. మదము శ్రవించే కుంభములతో దిగ్గజములు ఆధారంగా… భూదేవి దర్శనం అయ్యింది. మధు రాక్షస శత్రువైన మహా మండుకము దర్శనము అయ్యింది. అంటే ఈ మండుక శక్తి వల్లనే భూమండలమునకు ఆధారమైన ఆదిశేషుడికి అలాగే మహా కూర్మములకు కారణా శక్తిగా ఉన్నదని గ్రహించాడు. ఆ తర్వాత సప్త పాతాళాలు అనగా అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, మరియు పాతాళం లోకాలను తొలిచి శోధించాడు.  బలి చక్రవర్తి నివాసమగు భోగవతి పురము దర్శనమైంది.  అక్కడ ఉన్న ఇతర రాక్షసుల నివాసములు కూడా దర్శనమైనాయి. ఇది చూశాను… అది చూసాను… అనుకుంటూ మోహమాయా పరవశుడై…. ఈయన కాస్త లోలోతులు వెళ్ళినా కానీ,  అంతములో కనిపించే సాగరం కనిపించినా కూడా….. తేజోస్తంభము వెలుగులు ఇంకా విరజిమ్ముతూ కనపడసాగింది. ఇలా సుమారుగా 1000 సంవత్సరాలు ఈ భూమి అడుగు భాగము తవ్వినప్పటికీ….. ఈ తేజస్సు యొక్క మూలము కనిపించలేదు. అగుపించలేదు.. తేజస్సు ఆగలేదు… దానితో ఈ తేజస్సు మూలము తెలుసుకోవడం అసాధ్యమని ఈయనకి అర్థమయింది.  దానితో బాగా అలసిపోయి…. చేతులు,కోరలు విడిపోయాయి.  విపరీతమైన శ్రమ చేత దేహము బాగా అలసిపోయింది.  దాహముతో నోరు ఎండిపోయింది. కాలు ముందుకు సాగలేదు.  కదలలేని స్థితిలో ఇతని వరాహ దేహము చేరుకోవడంతో…. ఆ రూపమును వదలడం కూడా సాధ్యము కాకపోవటంతో…. విష్ణువు కాస్త చాలా విషాదముతో డీలా పడిపోయాడు. అప్పుడు కానీ ఈయనకి తన తండ్రి అయిన పరమేశ్వరుడు గుర్తుకు రాలేదు. దానితో పరమేశ్వరుని శరణువేడి చి….చి…. ఏమి నా అజ్ఞానము. ఆత్మకు ఆత్మ అయిన పరమాత్మ పరమేశ్వరుడే కదా!  సర్వ వేదములకు, సర్వదేవతలకు, సర్వ సృష్టికి, సర్వస్థితికి మూలం అయిన ఆదిదేవుడైన ఆ  దేవాదిదేవుడైన పరమశివుడి మూలము కనుగొనుట… సాధ్యమయ్యే పనేనా ..! నేనే ఈయన నుండి ఉద్భవించాను కదా!  ఒక వరాహ జంతు రూపము ధరించి ఈ శివుడు తేజోలింగం యొక్క మూలం తెలుసుకోవాలని ప్రయత్నించిన నేను…. అజ్ఞాన మాయలో పడిన మూర్ఖుడిని.  బుద్ధిహీనుడిని కదా!  ఎటువంటి పక్షపాతము లేని కరుణతో నిండిపోయిన ఆ పరమశివుడి కరుణా దయవలన ఇప్పటికైనా నేను అజ్ఞానము నుండి బయటపడ్డాను… మేలుకున్నాను… స్వయంగా మహాదేవుడైన శివుడు ఎవరిని కరుణించునో వారికి మాత్రమే అహంకారము నుండి విముక్తి లభిస్తుంది కదా!  ఈ జగద్ధారుని మూలశక్తిని పూజించే అంత శక్తి నాకేమీ ఉంది.  ఆ శంకరుడినే శరణు వేడుతాను…. అనుకుంటూ పరమేశ్వరుడి గురించి ధ్యానము చేస్తూ స్తోత్రములు చేయడం ఆరంభించాడు.  అప్పుడు ఏ తేజో స్తంభ మూలము అన్వేషిస్తున్నారో …. ఆ తేజో స్తంభం యొక్క కాంతి ఈయనకి దారి చూపించే దీపం అయింది.  ఎంతో కష్టముతో పైకి లేవబోయిన విష్ణువు యొక్క ఆ శ్రమ వలన ఏర్పడిన చెమటయే ….మహాసముద్రం అయింది.  అక్కడి నుండి బయటకు రావాలని,అనుకున్న విష్ణువుకు  తేజో స్తంభమే త్రాడుగా సహాయము చేసింది.  ఇలా సర్వప్రాణులకి నాధుడైన శివుని అనుగ్రహం వలన విష్ణువు మరలా భూమి పైకి చేరుకున్నాడు. అప్పుడు విష్ణువు కాస్త తన మనస్సులో నేను ఎలా అయితే ఈ తేజో మూలం కనుగొనలేదో…అలాగే బ్రహ్మ కూడా శిరోభాగం కనుగొనలేక పోయి ఉండవచ్చును. ఈ మహా తేజము ఎక్కడ అయితే మొదట తనకి దర్శనమిచ్చిందో…. అక్కడికి వెళ్లి ఈ తేజస్సుని శరణు పొందాలి…. ఈ విశ్వానికి పరమశివుడే విశ్వాధిపతి అనే మాటను మరచిపోయి ఈ విధంగా కావాలని చిక్కుల్లో పడ్డాను అనుకుంటూ…. అహంకార రహితుడై….…. వినయవంతుడై …. తనకి తేజో స్తంభము దర్శనమిచ్చిన ప్రదేశమునకు విష్ణుమూర్తి చేరుకోవడం జరిగింది.


బ్రహ్మ అన్వేషణ


దివ్యమైన హంస రూపముతో… దివ్య జ్యోతి స్తంభమైన తేజో లింగము శిరోభాగమును చూడటానికి బ్రహ్మ కాస్త ఆకాశము వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ హంస రెక్కల వేగానికి…. ఇతనికి ఆకాశంలో వచ్చే సర్వ ప్రతిబంధకాలు తప్పుకోవడం ఆరంభం అయ్యింది. భూమిని దాటడంతో… ఇది కాస్త చిన్న కణము వలె కనిపించసాగింది.  క్రమక్రమంగా ఈయన కాస్త మొదట చంద్రమండలం దాటాడు…. ఆ తర్వాత మేఘమండలం దాటాడు…..ఆ తరువాత విమాన మార్గం దాటాడు…. ఆ తరువాత సిద్దులు ఉండే తపస్సు చేసుకునే తపోలోకమును దాటాడు… ఎన్ని లోకాలు దాటినా….  ఇలా తన మనో వేగముతో దాటినప్పటికీ…. తేజో స్తంభం యొక్క అగ్ర భాగం అగుపించలేదు.  ఈ తేజో లింగం తేజస్సు ఇంకా ఇంకా పెరుగుతూనే కనపడసాగింది. ఎక్కడా కూడా అంతమయ్యే సూచన ఈయనకి అగుపించలేదు. రెక్కలు అలిసిపోయాయి… శరీరం సొలసిపోతుంది…. కానీ, మనసు కాస్త ఓటమిని అంగీకరించకపోవడంతో.. మొండి పట్టుదలతో… పట్టు వదలకుండా… ఏమీ సహకరించకపోయినా… మొండి ధైర్యంతో… ఎగరసాగాడు. ఎంతెంత పైకి పోతున్నాడో…..తేజో స్తంభం తేజస్సు కాస్త… అంతకంతకి దూరంగా వ్యాపించసాగింది. మరుత్తుల మార్గమును దాటి బ్రహ్మాండము దగ్గరికి వచ్చినా కూడా… ఈ తేజస్సు అంతా కూడా దీనిని వ్యాపించి ఉండేసరికి… బ్రహ్మకి ఆశ్చర్యం వేసింది.. దానితో తనలో తాను ఇలా అనుకోసాగాడు… ఇప్పుడు ఈ దివ్య తేజస్సు యొక్క శిరోభాగం తను చూడలేదని హరి ఎదుట ఎలా నిలబడాలి….. ఒకవేళ ఇందులో హరి గెలిస్తే తను ఓడి ప్రాణాలతో ఉండి ఏమి ఉపయోగం.  ఇప్పుడు నా గతి ఏమిటి? దీనికి ఏదైనా ఉపాయం లేదా!  పరిష్కార మార్గం దొరికితే బాగుండును కదా.! ఎవరైనా నాకు సహాయం చేస్తే నా గొప్పతనమును చూపుటకు అవకాశం ఉంటుంది కదా!  న్యాయముగా శత్రువులను  గెలవలేనప్పుడు కనీసం మోసంతోనైనా గెలవాలి కదా!  మహాత్ములకి అభిమానమే ధనము కదా!  అనుకున్న ప్రతిజ్ఞ నెరవేర్చుకోలేనప్పుడు… నీచత్వం పొందితే …. అందరూ కాస్త తనని నీచముగా చూస్తారు కదా! అంతరిక్షమంతా ఆవరించి ఉన్న ఈ దివ్య తేజస్సు ఎక్కడ ..!  రెక్కలు అలిసి విరిగిపోయే స్థితిలో ఉన్న నేనెక్కడ? ఈ పరీక్షలో నా ప్రయత్నాలు విఫలమవడం ఖచ్చితంగా  జరిగింది.  నా కళ్ళు తిరుగుతున్నాయి… శరీరం అలసిపోతుంది…. అంధకారం ఆవరించసాగింది… నా సర్వ అవయవాలు శిథిలమై… నేలపై కూలిపోయే ప్రమాదం ఉంది. నా ప్రాణాలు పోతున్నాయి… ఈ తెజోరాశి ఔన్నత్యమును తెలుసుకోవడం అనితర సాధ్యము.  ఇవి నాకు గాని, నారాయణుడుకి కానీ ఇతర దేవతలకి కూడా సాధ్యపడదు.  ఇక నాకు పైకి ఎగిరే శక్తి నశించింది అని  నిశ్చయించుకుని ఈ దివ్య తేజోలింగం యొక్క అగ్ర భాగం కోసం ఆకాశం కేసి చూస్తూ ఉండగా…. ఆకాశంలో చిన్న చందమామ వంటి ఒక కాంతిపుంజం కనిపించింది.  ఇది ఏమి వస్తువు? ఇది ఎక్కడినుండి వస్తుంది ….అని అనుకుంటూ ఉండగా… బ్రహ్మ కాస్త దీని సువాసనలు రావటం చేత, ఇది ఒక మొగలిరేకు అని గ్రహించి… వెంటనే దానిని పట్టుకోగానే, ఈ మొగలి పువ్వు కాస్త నన్నెందుకు పట్టుకున్నావు? నేను శత సహస్ర సంవత్సరాలనుండి కిందకి ప్రయాణిస్తూ భూమికి చేరుకొని విశ్రాంతి పొందాలని అనుకుంటున్నాను.  నన్ను వదులు…. అనగానే బ్రహ్మ కాస్త దీనితో నువ్వు ఎవరు?  ఎక్కడి నుండి వస్తున్నావు?  అనగానే….. దానికి కేతకి పుష్పం కాస్త నేను కేతకి పుష్పమును… శివాజ్ఞ చేత చిరకాలపు ఈ శంభుని శిరస్సునందు చైతన్య వంతురాలై ఆవాసం చేశాను. భూలోకము నందు చేరి విశ్రాంతి తీసుకోవాలని బయలుదేరాను అనగానే….. ఈ మాటలు విన్న బ్రహ్మ కాస్త దీనితో అయితే ఈ తేజో స్తంభం  ఇంకా ఎంత ఎత్తులో ఉన్నదని అడగగానే…. దానికి ఈ కేతకి పుష్పం కాస్త విరగబడి నవ్వి….. నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ…. మూర్ఖుడి లాగా ఉన్నావు.  సర్వ బ్రహ్మాండాలు అన్నింటిని సృష్టించిన ఈ దివ్య తేజోరాశి యొక్క ఆది,అంతమును ఎలా తెలుసుకుంటావు. ఇది సాధ్యపడే విషయమేనా? ఆది అంత్యం లేని దానికి ఆది అంత్యం ఎలా కనపడతాయో ఆలోచించు.  నేను 40 వేల యుగముల నుండి భూమిని చేరటానికి కిందకి దిగుతూనే ఉన్నాను….ఇంకా ఇప్పటికి కూడా చేరలేదు అనగానే …..అప్పుడు బ్రహ్మకి ఇసుమంత అహంకారం తగ్గి…. దీనితో ఓ కేతకి!  నీకు నమస్కారాలు.  నువ్వు ఒక సిద్ధ మహాత్మురాలవని నాకు అర్థం అయింది.  నేను ఒక మూఢుడను అని గ్రహించాను.  లేకపోతే ఆది అంత్యము లేని తేజోస్తంభము యొక్క అగ్ర భాగం చూడాలని ఆలోచన చేసినప్పుడే….నేను ఎంత మూర్ఖుడినో నాకు తెలియాలి కదా! తెలియలేదు.. అర్థము కాలేదు… అర్థం చేసుకునే స్థితిలో నేను లేను.. ఎందుకంటే అంతటి అహంకార మాయ అనగా శివమోహ మాయలో ఉన్నానని… ఇప్పుడు మీ పరిచయముతో నాకు అర్థం అయింది.  తప్పు తెలిసింది.  కానీ నా ఓటమి అంగీకరించే స్థితిలో నా మనసు లేదు.  ఎందుకంటే సృష్టికర్త అయిన నాకు అలాగే స్థితికర్త అయిన విష్ణుమూర్తితో కలహం ఏర్పడింది. మేమిద్దరం మాలో  ఎవరు  అధికులో తెలుసుకోవాలని ఈ విశ్వ ప్రయత్నం అనగా నేను కాస్త హంస రూపంలో ఈ తేజో లింగం యొక్క అగ్రము చూడాలని ఆకాశముకేసి ప్రయాణిస్తూ ఇక్కడిదాకా రావటం జరిగితే….. అదే విష్ణువు కాస్త వరాహ రూపంతో ఈ తేజోలింగం యొక్క అంత్యం  అనగా మూలము చూడాలని భూమిని తవ్వుతూ పాతాళ లోకం వైపుకు చేరుకోవటం జరిగింది. ఇప్పుడు అతని పరిస్థితి ఏమిటి… నాకు తెలియదు. మూలం తెలుసుకున్నాడో లేక నాకులాగా చతికిలపడ్డాడో నాకు తెలియడం లేదు.  ఒకవేళ ఇతను తెలుసుకోకపోతే మంచిది . ఎందుకంటే నేను కూడా తెలుసుకోలేదు కదా. ఒకవేళ ఇతను తెలుసుకుంటే…. నా ఓటమి అంగీకరించక తప్పదు.  ఇది నాకు ఇష్టం లేదు.  కాబట్టి నువ్వు ఈ విషయంలో నాకు సహాయం చేయాలి.  7 అడుగులు కలిస్తే నడిస్తే…. స్నేహం ఏర్పడుతుందని అంటారు కదా!  ఇప్పుడు ఈ స్నేహభావంతో నాయందు  దయ ఉంచి …..నువ్వు నా కొరకు ఒక చిన్న అబద్ధపు సాక్ష్యం చెప్పాలి. అది ఏమిటంటే…. నిన్ను నేను కాస్త నా శత్రువైన విష్ణువు దగ్గరికి తీసుకొని వెళతాను. అప్పుడు నువ్వు వాడితో ఈ బ్రహ్మ   తేజో స్తంభం యొక్క శీర్షమును చూశాడు…. అందుకు నేనే సాక్షి అని చెప్పు.  నీవు ఇలా చెబితే నాకు త్రి లోకాధిపత్యం సృష్టికర్త అనే బ్రహ్మ పదవి వస్తుంది అనగానే…. దీనికి కేతకి పుష్పం కాస్త ఇలా అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి అంగీకరించింది. దానితో బ్రహ్మ కాస్త ఈ కేతకీ పుష్పము సాక్ష్యముగా తీసుకొని వెనుతిరిగి…. ఎక్కడైతే తనకి  తేజో స్తంభము దర్శనం జరిగిందో…. అక్కడికి చేరుకోవటం జరిగింది. అప్పటికే ఇక్కడ విష్ణుమూర్తి ఉండడం గమనించి, ఇతని ద్వారా అసలు విషయం అనగా ఇతను ఈ తేజో స్తంభం  యొక్క మూలము చూడలేదని తెలియగానే….. దానికి బ్రహ్మ కాస్త బ్రహ్మానంద పడిపోతూ…. విష్ణువుతో నేనైతే ఈ తేజో స్తంభం యొక్క శిరోభాగమును చూడటం జరిగింది. దీనికి సాక్ష్యము ఈ కేతకీ పుష్పం చెబుతుంది అని అనగానే….. ఈ  పుష్పము కాస్త విష్ణువుతో ఇది నిజమే. అందుకు నేనే సాక్ష్యం అని చెప్పడంతో…. ఇది విన్న విష్ణుమూర్తి కాస్త వీరిద్దరూ అసత్యం ఆడుతున్నారని…..బ్రహ్మ ఈ తేజోలింగం యొక్క అగ్ర భాగం చూడలేదని…..ఇది నిజమైతే తను కూడా ఈ తేజో స్తంభం యొక్క మూలము చూసే వాడిని కదా!  తను చూడలేదు అంటే…. ఇతను కూడా  చూడలేదు. ఎందుకంటే ఈ తేజోస్తంభానికి ఆది అంతము లేనిది అని నాకు మరియు ఇతనికి కూడా తెలుసు గ్రహించాడు.  కానీ తన బ్రహ్మ పదవి ఆదిపత్యం కోసం తనకి ఎక్కడో దొరికిన ఈ కేతకి పుష్పమును పట్టుకుని తెచ్చి…. దీని చేత అబద్ధపు సాక్ష్యం చెబుతున్నాడు అని మనసులో అనుకొని…. పైకి మాత్రం బ్రహ్మ తో నిజ నిజాలు ఈ తేజోస్తంభ శివుడే నిర్ణయిస్తాడు.  ఎవరు గెలిచారో…. ఎవరు ఓడారో…. అప్పుడు కానీ తెలియదు.  నేనైతే ఈ మూలము చూడలేదు. నాలో అహం పోయింది. అణుకువ మొదలయ్యింది… నేను ఈ తేజోలింగానికి సర్వస్య శరణాగతుడిని అవుతున్నాను అంటూ… ఈ తేజో స్తంభమును ఉద్దేశించి స్తోత్రాలు చేయడం ఆరంభించాడు. కానీ బ్రహ్మకు ఇంత జరిగినా కూడా ఇసుమంత అహంకారం కూడా  పోలేదు.  తను స్వయంభూ శంభు పుత్రుడని జ్ఞానం అందినా కూడా…. తనకి ఉన్న  అహంకార మాయవలన పట్టించుకోవడం లేదు.  తను ఈ  తేజోలింగము యొక్క అగ్ర భాగం చూసానని…. ఈ లింగమూర్తి కనపడితే చెబుతానని…. విష్ణువుతో అని ఊరుకున్నాడు. 


శంభు ఆవిర్భావము - తేజో మూర్తి ఆవిర్భావము

విష్ణువు కాస్త ఈ అగ్ని స్తంభ తేజో లింగమును చూస్తూ…. జయ పృథ్వీమయాకార… జయ ప్రభాకరాకార… జయ జయ అమృతాకృతే….జయ వైశ్వనరాకార…. జయ గంధవతాకృతే…. జయ హోత్రుమయాకార…. జయ ఆకాశమయాకృత ….త్రిగుణాతీత… కాల విగ్రహ …. అక్షయ, ఐశ్వర్య కరుణాకర నన్ను రక్షించు…. సర్వజగదృష్టి…సర్వ జీవ రక్షాకర…. సర్వభూతభర్తా…. సమస్త లోకములకు మూలకారకుడైన నీకు  నమస్కారము.  ఎవరి చేతనయితే ఈ విశ్వ లోకాలు సృష్టించబడి… పోషించబడి…. నాశనం అవుతున్నాయో …..

అటువంటి నిన్ను స్తోత్రము చేయకపోతే,  మీ అనుగ్రహమును పొందకపోతే, పుట్టు గుడ్డివాడు ఎలా అయితే సూర్యుని చూడలేడో ….అలా నిన్ను దర్శించలేరు.  నీకు అన్యమైనది లేదు.  నీవు అణువు కంటే సూక్ష్మాతి సూక్ష్మమైన వాడివి. మహత్తు కంటే మహత్తరమైన వాడివి…. నీవే సర్వ జగత్తుకి బాహ్యముగాను అలాగే అంతరముగాను వెలుగుతున్నావు. నీ నుంచే సర్వ వేదాలు ఉద్భవించాయి… నీ ఉచ్ఛ్వాస నిచ్వాసలే  వేదాలు కదా! నీవే విషయము… నీవే జ్ఞానము… నీవే ఆత్మవి… నీవే పరమాత్మవి… దేవతలు,  దానవులు మహర్షులు, సిద్దులు, విద్యావంతులు, మానవులు, జంతువులు, పక్షులు, పర్వతాలు అన్నియు… నీవే.  నీవే మోక్షము.. నీవే ఓంకారము… నీవే యోగము… నీవే స్వర్గ నరకాలు… నీవే కష్టసుఖాలు… నీవే సుఖదుఃఖాలు… నీవే ఏకత్వం… నీవే ద్వైతము… సర్వము నీవే… చరాచరములకు ఆది అంత్యమూ నీవే… నీవే కాలస్వరూపుడవై సకల జగములను నడిపిస్తున్నావు.


నీకంటే అధికుడు లేడు.  నీవే సర్వేశ్వరుడివి. నీవే శాశ్వతుడివి… నీవే నిత్యుడువు …నీవే సత్యుడవు . నీ ఆజ్ఞ చేత వాయువు వీచుచున్నది… అందుకే వాయుదేవుడు నిన్ను నిత్యం వాయు లింగముగా ఆరాధిస్తున్నాడు. సూర్య చంద్రులు మీ ఆజ్ఞ చేత వెలుగుతున్నారు. ఆదిశేషుడు కాస్త నీ ఆజ్ఞ చేత భూమి యొక్క భారమును మోస్తున్నాడు.  నీ అనుజ్ఞ చేతనే సముద్రంలో బ్రహ్మాండాలు తేలుతున్నాయి.  నీ ఆజ్ఞ మేర ఆకాశంలో జ్యోతులనే నక్షత్రములు ప్రకాశంతో వెలుగుతున్నాయి.  నీ మహిమ వలన సముద్రాలు మీ అదుపు ఆజ్ఞలో ఉన్నాయి.  సర్వసిద్ధులు నీ ఆధీనమే కదా!  నీ ఆజ్ఞవల్లనే భూమి బలము కోసం పంటలు పండుతున్నాయి.  ఇంతటి మహోన్నతమైన నిన్ను కాక ఇతర దేవతలను ఎలా స్తుతి చేస్తాము.  సుఖములోను… కష్టములోనూ మేము నిన్నే స్తుతిస్తాము.  సర్వ దేవాది దేవా..!  నా యందు ఆగ్రహం ప్రదర్శించకు.  నీ భక్తులమని మమ్మల్ని అనుగ్రహించు. నీ అనుగ్రహము చేతనే మాలో అహంకారము తగ్గి… భక్తి పెరిగింది. నీవే నీ మోహమాయలో ఉంచుతావు.  మోహము నీవే ఇస్తావు… అలాగే మోహ  నివారణ జ్ఞానము నీవే ప్రసాదిస్తావు.  నీవల్లనే బంధము… అలాగే బంధ విముక్తి ….మోక్షమునకు కారణం అవుతున్నాయి కదా!  యథా శక్తితో నిన్ను నేను ప్రార్థిస్తున్నాను.  నన్ను అనుగ్రహించండి ప్రభు….నిన్ను ఆశ్రయించిన వాడు కూడా నీకు లాగానే అధికుడు అవుతాడు కదా!నీ కరుణను పొందితే …..మహత్యము పొందడం  నిత్యమే కదా! ఇది సత్యమే కదా!  నీకు అర్పించబడిన ఈ మనస్సును నీ వియోగము భరించలేని స్థితిని చేరుకుంటుంది.  ఇనుము కాస్త అగ్నిలో కాలిస్తే….వేడిని పొందుట లేదా తుమ్మెద కాస్త కీటకమును ఆకర్షించి తనలా చేస్తుంది కదా!  దేవతలు అందరూ చివరికి నేను కూడా…. నీ నుండి వచ్చిన వారలమే కదా! ఓ దయానిది…. పరమావధి!  నీ పరమ అనుగ్రహం నాయందు చూపి….నీ నిజ స్వరూప దర్శనం దర్శించే భాగ్యమును  నాకు కలుగజేయి…నిన్ను తెలుసుకోవడానికి నీవే సమర్థుడివి కదా!  నీ అనుగ్రహం పొందిన వారికి నిన్ను తెలుసుకునే శక్తి సామర్థ్యాలు కలుగుతాయి కదా!  స్వామి… నీ మహత్యము గురించి చెప్పుటకు… నీ గురించి వివరించుటకు….. నా వద్ద వాక్కులు లేవు.  ఉన్న వాక్కులు సరిపోవు.  ఓ మహాదేవ!  ఈశ్వర..! సర్వలోకాదీశ్వర…. నిన్ను నేను విధేయుడై వినయముతో…..నీ ఆజ్ఞ కోసం,  నీ భక్తుడి లాగా నీకోసం ఎదురు చూస్తున్నాను.  నన్ను కరుణించు మహాదేవ…. నాయందు దయ చూపు. నీ కరుణ, జాలి నాపై ప్రసరించు…. నీ వియోగము నేను భరించలేక ఉన్నాను అంటూ విష్ణుమూర్తి చేసే స్తోత్రాలు వింటున్న బ్రహ్మ కాస్త తన గర్వ అహంకార మదముతో అపహాస్యము చేస్తూ ఉండగా….. ఆ దయానిధి అయిన పరమేశ్వరుడైన శంభూమూర్తి కాస్త లింగమూర్తిగా ఈ తేజోస్తంభం నుండి ఆవిర్భవించాడు. ఈయన చూచుటకు కపిల వర్ణముతో…. నల్లని కంఠముతో ఉండి…. రెండు చేతులలో  గొడ్డలి, జింక ఉండగా…. మరో రెండు చేతులలో అభయ ముద్రలతో అనుగ్రహిస్తూ ప్రత్యక్షమయ్యాడు.  అప్పుడు ఈయన కాస్త తన కుమారులతో మాట్లాడినట్టుగా మాట్లాడటం మొదలుపెట్టాడు . 


ఓయి! మీరిద్దరూ కూడా అధికార, అహంకార మాయలో పడి నన్ను మరిచారు. అహంకరించారు . జీవులకి పదవి వలన అహంకారం రావడం సహజమే ….కానీ నా శక్తిని పరీక్షించదలచిన విష్ణువు కాస్త అసలు జ్ఞానమును పొందాడు అంటూ ……బ్రహ్మకేసి చూస్తూ ఏమిరా!  ఇప్పటికైనా సత్యము నా ముందు చెప్పు.  నీవు నా శిరోభాగమును చూసావా?  అనగానే అహంకారపూరిత బ్రహ్మ కాస్త స్వామి!  చూశాను…. అందుకు ఈ కేతకీ పుష్పమే సాక్ష్యము అనగానే అప్పుడు ఈ పుష్పము అవును!  చూశాడు సత్యమే….. అనగానే అప్పటిదాకా శాంతమూర్తిగా ఉన్న శంభు  మూర్తి కాస్త….ఉగ్ర మూర్తిగా మారిన తక్షణమే…. ఈయన నుండి ఒక ఉగ్రస్వరూపమైన భైరవమూర్తి రావటం జరిగింది. ఈయన కాస్త శంభు మూర్తితో స్వామి!  ఏమి మీ ఆజ్ఞ… అనగానే శంభు  మూర్తి కాస్త పంచముఖ బ్రహ్మ వైపు చూస్తూ…. వీడి ఐదవ తల అహంకారపూరితమై నాతోనే అసత్యం చెబుతుంది.  వెంటనే దీనిని ఖండించు… అనగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా భైరవమూర్తి కాస్త తన చేతిలో ఉన్న త్రిశూలంతో ఈ బ్రహ్మ పంచమ ముఖము ఖండించడంతో…. ఆనాటి నుంచి పంచముఖ బ్రహ్మ కాస్త చతుర్ముఖ బ్రహ్మ గా మారడం జరిగింది.  అనుకొని ఆపద అన్నట్లుగా భైరవమూర్తి చేసిన ఈ తలఖండన వలన ఇతనికి బ్రహ్మహత్యాపాతక దోషము రావటంతో…. ఈ ఖండన బ్రహ్మ ముఖము కాస్త తన చేతికి అతుక్కుని పోయింది.  ఎంత విదిలించినా ఊడకపోవటంతో …శంభు  మూర్తి కాస్త…. భైరవ!  నీకు బ్రహ్మహత్యా పాతకదోషం అంటింది.  దీని నివారణ కోసం భూలోకంలో ఉన్న అన్ని క్షేత్ర తీర్థాలు దర్శించు.  అప్పుడు నీకు ఏదో ఒక క్షేత్ర తీర్థములో ఈ బ్రహ్మ శిరస్సు కాస్త బ్రహ్మ కపాలముగా మారి… నీ చేతి నుండి విడిపోతుంది.  ఆనాటితో నీకు వచ్చిన బ్రహ్మ హత్యపాతక దోష విముక్తి పొందుతావు…. అనగానే అలాగే స్వామి!  మీ అనుజ్ఞ…అని చెప్పి శంభు  మూర్తికి నమస్కారం చేసి…. అక్కడి నుండి భైరవమూర్తి వెళ్లిపోవడం జరిగింది.


ఆ తరువాత శంభు మూర్తి కాస్త ….అక్కడే ఉన్న కేతకి పుష్పముకేసి చూస్తూ…. నీవు నీ స్నేహభావం మాయలో పడి అసత్యము చెప్పావని నాకు తెలుసు.  బ్రహ్మయే కాదు… నీవు కూడా నా తేజోలింగం అగ్ర భాగం చూడలేదని నీకు  తెలుసు. అన్ని తెలిసిన నువ్వు…. నాతో స్వయంగా అసత్యం చెప్పిన కారణం చేత …..ఈ క్షణము నుండి నిన్ను నా అర్చనలో…  వినియోగించడానికి ఉన్న అర్హత కోల్పోయావు అని చెప్పి…. చతుర్ముఖ బ్రహ్మకేసి చూస్తూ ఇప్పటికైనా నీవు చేసిన తప్పిదమునకు గల  పరిహార దోషము యొక్క ఫలితం వలన పంచముఖ బ్రహ్మ కాస్త చతుర్ముఖ బ్రహ్మ అయ్యావు.  ఇప్పటికైనా నీలో ఉద్భవించిన అహంకారము పోయినదా!  నీవు చేసిన ఈ అహంకారపూరిత పనికి,  ఈ రోజు నుండి నిన్ను భూలోకంలో ఎవరూ కూడా పూజించరు గాక!  అనగానే బ్రహ్మ కాస్త తెప్పరిల్లి అహంకార రహితుడై స్వామి!  నన్ను క్షమించండి…. అజ్ఞాన, అహంకారం మోహమాయలో పడి… నేను ఏమి చేస్తున్నానో ఏమి చేశానో కూడా నాకు అర్థం కాలేదు. మీ ఆగ్రహం వలన నా అహంకారం పోయింది.  అహంస్థానంలో వినయం అబ్బింది.  విషయ జ్ఞానం అందింది. నన్ను క్షమించి నన్ను అనుగ్రహించండి అంటూ….. ఈయన గురించి స్తుతించగానే శాంతమూర్తి అయిన శంభు మూర్తి కాస్త…బ్రహ్మ ! నా శాపం నీ అహంకారం వలన ఇవ్వడం జరిగింది. అది మారదు…. కానీ బ్రహ్మ జ్ఞాన రూపం లో నీ సంచారం ఉంటుంది. ఎవరైతే సాధన చేసి బ్రహ్మ జ్ఞానమును పొంది బ్రాహ్మణులు అవుతారో ….వారి యందు నీవు బ్రహ్మకర్త అయి పూజ ఫలితాలు ఇస్తావు.  దేవతల ఉత్సవాలు… నీ సమక్షంలో జరిగే బ్రహ్మోత్సవాలుగా అవుతాయి.  బ్రహ్మకర్త అయిన యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేస్తావు.  ఇలా ఎవరైతే బ్రాహ్మణులను పూజిస్తారో…. నిన్ను పూజించినట్లే అని వరం బ్రహ్మకి ఇచ్చి…. వీరిద్దరి కేసి  చూస్తూ….. పుత్రులారా!  నేను మీ తండ్రి అని , గురువు అని ఇప్పటికైనా గ్రహించారు.  మీ అహంకారమాయను త్యజించారు . మీ ఈ భక్తికి సంతోషించాను.  ఇకనుంచి మీరిద్దరూ కూడా మీ సృష్టికర్త అలాగే స్థితికర్త బాధ్యతలను నిర్వహించండి.  మీ ఇష్ట కోరిక మేరా నేను ఇక్కడే ఆవిర్భవిస్తాను….మీరు కోరే వరములు ఇచ్చుటకు నేను సిద్ధంగా ఉన్నాను…మీ కోరికలు ఏమిటో తెలపండి…. అనగానే స్వామి!  మీ అనంత తేజస్సు వలన సమస్త విశ్వము అల్లాడిపోతుంది.  దిక్కులు తెలియడం లేదు… మీ కాంతి వేడిమి వలన భూమి తపించిపోతుంది.  ఈ విశ్వ జగత్తును కాపాడే నిమిత్తం…. మీ తేజస్సును తగ్గించుకోమని… జ్యోతిరూపముగా అరుణ జ్యోతి గాను….. అరుణాచలం అనే అగ్ని లింగముగాను ….అరుణగిరిగా పర్వత రూపంలో…. ఇక్కడే కదలకుండా….. మా కోసం నిలిచి ఉండు. నీతో పాటుగా కల్పవృక్షం లాంటి దేవతా వృక్షాలు ఉండి జనులు సమస్త కోరికలు తీరుస్తూ ఉండాలి. దివ్యమైన ఔషధ గుణాలున్న మొక్కలు మరియు వృక్షాలు ఇక్కడ ఉండాలి.  క్రోధ జంతువులైన సింహాలు, పులులు వంటివి కూడా ఇక్కడ శాంత గుణముతో సంచరించాలి. నీకు నమస్కరించినంత మాత్రమే….మానవులు కాస్త మాధవుడు అవ్వాలి.  నీ సన్నిధికి చేరుకున్న మానవులకి తక్షణ మోక్ష ప్రాప్తి కలగాలి.  వారి కోరికమేరా అమరత్వము పొందాలి.  అదే సిద్దులు చేరితే వారికి రస సిద్ధి జ్ఞానం పొందాలి.  అలాగే ఈ   ఈసిత్వ, వసిత్వ వంటి  అష్టసిద్ధులు లభించాలి. అలాగే మానవుల  సమస్త కోరికలు తీర్చే దేవుడవి అవ్వాలి.  నిన్ను నిత్యం వివిధ లోకవాసులు కాస్త మానవరూపాలు ఎత్తి నిన్ను సేవించుకోవాలి. అలాగే దివ్య దుందుభి నాదాలతో …. అప్సరసలతో నిన్ను ఎప్పుడూ సేవిస్తూ ఉండాలి అంటూ…. బ్రహ్మ వేడుకునే సరికి సదాశివుడు కాస్త తధాస్తు…. అని దీవించడం జరిగింది. 


అప్పుడు విష్ణుమూర్తి కాస్త స్వామి!  తండ్రి.!  లోకములకు మేలు చేయుటకు జ్ఞానాగ్ని శివలింగ మారుటకు అనుగ్రహించినందుకు ధన్యుడిని.  నేను ఎలా అయితే నిన్ను ఆశ్రయించి నా భక్తితో నీ అనుగ్రహమును పొంది…. విశ్వ జగత్తుని పాలించే వాడిని అయ్యానో ….అలాగే ప్రతి మానవుడు కూడా తన భక్తితో నిన్ను సేవిస్తే… వారి అన్నీ కోరికలు కూడా తీరి ఆనందం కలిగించాలి. నిన్ను నాట్యము,గానము పూజలతో పాటుగా నీ గిరి ప్రదక్షిణాలు చేసినప్పుడు… వారి జన్మాంతర పాపాల నుండి విముక్తి పొందాలి. శివరాత్రి నాడు నీకు పూజ చేసి, ఉపవాసం ఉండి, జాగరణ చేస్తే… వారికి సమస్త ఐశ్వర్యాలు పొందేటట్లుగా అనుగ్రహించాలి.  అలాగే నీ పేరు మీద మండపాలు, బావులు, చెరువులు, తోటలు, సమర్పణ చేస్తే వారు నిన్ను పొందేటట్లుగా అనుగ్రహించాలి. అంగప్రదక్షిణ చేస్తే సదా శాశ్వతముగా…. నీ సన్నిధానం ఆవాసం పొందాలి.  నీ గిరి యందు అంతర గుహలలో…. నీ గిరి అరణ్యాలలోనూ… తపోనిష్ఠులు… ధ్యాన…. మునులు ఆవాసం చేస్తే వారి దివ్య తేజస్సు కోటి సూర్యుల ప్రభావముగా ఉండాలి.  ప్రళయ కాలములో సమస్త సముద్రాలు పొంగి… భూమి అంతా మునిగిపోయినా కూడా…. ఈ అరుణగిరి అచంచలమై …..స్థిరముగా నిలిచి ఉండిపోవాలి.  గొప్ప మేఘాలు నీ గిరి చుట్టూ చేరి విశ్రాంతి తీసుకోవాలి. సూర్య గమనం నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్లుగా నిత్యము ఉండాలి.  చంద్ర కిరణాలు ప్రతి పౌర్ణమి తిథి లో నీ గిరిపై పడి నీకు చల్లదనాన్ని ఇవ్వాలి.  అలాగే ఔషధ మొక్కలపై పడి వాటి ఔషధ గుణాలు పెంచాలి.  మరియు ఈ తిధిలో గిరిప్రదక్షిణ చేసే వారికి….నీ అనుగ్రహం మరియు ఈ ఔషధ గుణాలు వారికి అపారముగా చేరాలి. మహాప్రళయ కాలంలో నీ గిరి యందు సర్వసృష్టి బీజాలు నిక్షిప్తంగా ఉండేటట్లుగా అనుగ్రహించు.  ప్రళయానంతరము బ్రహ్మచేత ఈ బీజాల పునః సృష్టి జరిగే విధంగా అనుగ్రహించు. నీకు పాద సేవ చేయువారికి అలాగే వేదాలు చక్కగా అధ్యయనం చేసే వారికి …సకల శాస్త్ర విజ్ఞాన మరియు జ్ఞానము అందేటట్లుగా అనుగ్రహించు. అంతేందుకు…. నిన్ను పూజించే భక్తులకి పరమ సులభముగా సదాశివ స్థానమైన అరుణాచలం పొందేటట్లుగా అనుగ్రహించు….. అంటూ వేడుకునేసరికి సదాశివమూర్తి కాస్త తధాస్తు…. అని దీవించడం జరిగింది. 


ఆ తర్వాత వీరిద్దరూ కలిసి… స్వామివారితో ఓ మహాదేవ… పరమేశ్వర… సదాశివమూర్తి!  ఓ జగదాధర…. నీవలనే జగత్తు నడుస్తోంది. దానికి నీవే అసలు సిసలైన మూలస్థానం…. ఆధారభూతానివి. మా ప్రార్థన ఆలకించి దేవాది దేవుడైన మహాదేవుడైన నీవు ఈ గిరి రూపంలో తూర్పున ఉన్న ఆహ్లాదకరమైన గిరి యందు అందునా…. మహా వటవృక్షమైన మర్రిచెట్టు కింద ఆవాసం చేసుకుని…. మాకు గురువు అయి సర్వశాస్త్రాలు… ఆగమ, నిగమ శాస్త్రాలు… మొదలగు వాటిని బోధింపుము.  28 శైవాగమములు ఏ విధంగా అనుష్టించాలో మాకు తెలియజేయము. ప్రతీ సంవత్సరం కార్తీకమాసంలోని కృతిక నక్షత్రం ఉచ్చ దశయందు ఉండగా….నీ దివ్య రుద్ర తేజమును ఈ కొండమీద సారించుము . ఇది మోక్షమునకు గని లాంటిదని సామాన్య భక్తులకి మీ మహత్యము, ఆధిక్యము వలన తెలిసేటట్లుగా చేయుము.  ఈ రూపంలో నువ్వు మా కోసం నివసిస్తూ… మమ్ము ధన్యులు చేస్తుంటే….మేమిద్దరం నిన్ను అభిషేకాలతో మొదలైన విధివిధానాలతో అర్చన చేస్తూ…. ప్రతినిత్యం నిన్ను కేదార,చూత, కేసర , మరువక, మందార, నాగ, పున్నాగ, మున్నగు పుష్పాలతో అర్చన చేస్తూ ఉంటాము. నిత్యం నీవు ఇక్కడ నివసించి… మా పూజలు అందుకొని మమ్ము అనుగ్రహించు. అప్పుడే మా బుద్ధులు పరిశుద్ధము అవుతాయి.  మా అజ్ఞానము తొలగుటకు నీ అనుగ్రహము మా యందు ఉండాలి అనగానే….. దానికి శివమూర్తి సంతృప్తి చెందుతూ…. వత్సలారా ! మీ ఇద్దరి భక్తి  ప్రపత్తులకి నేను సంతృప్తి చెందాను.  మీ కోరిక మేరా నేను ఇక్కడే శోణాద్రిగా వెలుస్తాను . నా జ్ఞానాన్ని కాస్త శివలింగమూర్తిగా మారుస్తాను.  నా అనంత జ్యోతి దివ్య తేజస్సు కాస్త మీరు కోరిన విధంగా కార్తీకమాస కృత్తిక నక్షత్ర సమయమున అరుణ జ్యోతిగా దర్శనం ఇస్తాను.  నేను మీ ఇద్దరినీ అనుగ్రహించి.. ఈ క్షేత్రంలో మీరు కూడా ఆవాసం చేసి మోక్షమార్గమును అన్వేషించండి. ఈ క్షేత్రమునకు మూడు యోజనముల పరిధిలో నివసించే ప్రజలకు  ఎలాంటి ఇతర దీక్ష అవసరం ఏమీ లేకుండానే…. నా శివ దీక్షతో నా సాయుజ్యం లభిస్తుందని  ఆజ్ఞ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న స్థావర జంగమములు అన్నీ కూడా వారు ఏమీ కోరకుండానే వారి కోరికలు…. అలాగే వారు మోక్షము కోరనప్పటికీ ఇది కూడా లభిస్తుంది. దూరమునుండి నన్ను నిత్యం స్మరించే వారికి ఆయా జ్ఞానాలు అందుతాయి. నా ఈ దివ్య తేజోమూర్తి కాస్త అరుణాద్రి పేరుతో ఇక్కడే శాశ్వతంగా నిలిచి ఉంటుంది. నేనెవరిని అనుగ్రహిస్తానో…. వారు ఇక్కడ జన్మిస్తారు.  నన్ను పూజిస్తారు.  జ్ఞానంతో నిమిత్తం లేకుండా దేహ అంతిమ కాలంలో వారు సర్వకర్మ ఋణ బంధాల నుండి విముక్తి పొంది…. మోక్షం పొందుతారు.  ఎంతటి పాపాలు చేసినా… పాపాత్ములైన వారికి….ఈ క్షేత్ర ఆవాసం లేదా ఆరాధన లేదా నామస్మరణ వలన వారి జన్మాంతర  మహా పాపారాశి నా ఙ్ఞానాగ్ని తో భస్మమై…. మోక్ష ప్రాప్తి కలుగుతుంది.  ఇంతటి మహోన్నతమైన మోక్షము కోరుకునే భక్తులు… ఈ క్షేత్రము ఎప్పుడు వదిలి పెట్టరాదు. ఈ స్థలమును విడవరాదు.అందుచేత మీ ఇద్దరూ కూడా ఈ క్షేత్రములో ఆవాసం చేయండి.మీరు మోహము  చేత మరిచిపోయిన శైవ సంహిత జ్ఞానమును తిరిగి పొందండి.  మీరు ఇప్పుడు నన్ను  కాయిక మార్గంతో  అర్చించండి . నా ప్రసాదం వలన హృదయంలో జ్ఞానము తిరిగి ప్రకాశించును…. అని తెలిపి మహాశివ మూర్తి అంతర్దానం అయ్యారు. 


ఆ తర్వాత అనంత తేజో స్తంభం కాస్త ఙ్ఞానాగ్ని స్థావర లింగముగా ఉద్భవించింది.  ఈ జ్ఞానాగ్ని లింగమును చూసిన బ్రహ్మ, విష్ణువు కాస్త అమితానందపడి దానికి  తొలి పూజ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ స్థావరలింగమునకు అరుణాచలేశ్వరుడిగా నామకరణం చేసి…. విశ్వకర్మను పిలిపించి…. స్వామివారికి అద్భుతమైన దేవాలయమును కట్టించారు.  ఆపై దీనిని చుట్టూ కూడా అరుణమనే అరుణ పురమును నిర్మింపచేశారు.  ఇది  చూస్తే …..కైలాసమును చూడటానికి ఇష్టపడని రీతిలో కట్టించారు.  ఈ పురముగ్ధ సౌందర్యమునకు  ముగ్దులై దేవతలు, ఋషులు, మహర్షులు, యోగులు, మునులు, బ్రహ్మర్ర్షులు, గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు, యక్షులు మొదలైన వాళ్ళు ఇక్కడ పౌరులుగా నివసించడం ఆరంభించారు.  గంగా, యమునా, సరస్వతి మొదలైన పవిత్ర నదులు కాస్త….ఈ గిరి మీద పాయలుగా ఏర్పడి పురమునందు…. బావులలో చేరి…. నివసించడం జరిగింది. ఆగమములు కాస్త కొండలు, గోపుర శిఖరాలుగా…. స్మృతులు కాస్త విధులుగాను మారడం జరిగింది. భూత, ప్రేత, పిశాచ ,రాక్షస గణాలు కాస్త మానవ రూపాలు, జంతువులు, వృక్షాల రూపాలు ధరించి…. ఇక్కడ నివసించడం జరిగింది. నందనవనాలు కాస్త చిన్నచిన్న అడవులుగా మారాయి.  భూలోకంలోని సర్వ గోవులు కాస్త ఈ పురమునందు కపిల గోవులుగా తెల్లని, నల్లని ఆవులుగా మారి… ఆవుపాలు ఇవ్వడం ఆరంభించాయి.


మహాదేవుడైన పరమేశ్వరుడు కాస్త సిద్ధ పురుషుడిగా మారి….యోగియై గుండు చేసుకొని…. కౌపీన దారియై…. ఎవరికి కనిపించకుండా ఈ అరుణగిరి యొక్క ఉత్తర భాగమున ఉన్న అంతర గుహ యందు ఉన్న ఒక మహా వటవృక్షమైన మర్రిచెట్టు యందు గురుదక్షిణామూర్తిగా వీరాసన భంగిమలో కూర్చొని ధ్యాన నిష్ఠలో మౌనబ్రహ్మగా ఉండటం జరిగింది. ఈ చెట్టు నీడ కాస్త మండాకృతి ఆకారంలో చాలా దూరం వ్యాపించడం జరిగింది.  ఆ తర్వాత సరస్వతి,సావిత్రి ,మహాలక్ష్మి, భూదేవి, గంగాదేవి మున్నగు దేవతలు ఈయనను అర్చించడం ఆరంభమైంది.  ఈ గిరి నాలుగు దిక్కుల యందు దేవతల ఆవాసం అయింది.  ఈ గిరికి రెండు యోజనాల వరకు దేవతలు ఉండి అరుణాచలేశ్వర స్వామిని సేవించుకుంటున్నారు. 


బ్రహ్మ అలాగే విష్ణుమూర్తి కూడా జటాధారిగా మారి విభూదిని ధరించి…. ఈ స్వామివారిని సేవించడం ఆరంభించారు. ఇక్కడున్నవారికి వీరు గురువులై వారికి శివ దీక్ష ఇచ్చి… వారిని తరింప చేయడం ప్రారంభించారు. క్రమముగా వీరంతా కూడా శైవాగమ రహస్యాలను తెలుసుకొని… బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేచి… స్నానాధికాలు చేసుకొని… శివుడికి ప్రీతికరమైన బిల్వాలు, సువాసనలు ఇచ్చే పువ్వులు, ఇష్ట పదార్థ నైవేద్యాలతో….దూపదీప నైవేద్య… గీత వాయిద్య…. సంగీత నృత్యాలతో ….ప్రదక్షిణలతో ….అరుణాచల మంత్రము సర్వదా నామస్మరణ చేస్తూ…. ఇలా ఆరు అంగ విధివిధానాలతో షట్కాల పూజాదికాలు చేయడం….బ్రహ్మ, విష్ణువు కాస్త 16 వేల సంవత్సరాలు చేసి పూర్ణ శివ మోక్ష జ్ఞానమును పొందడం జరిగింది.


వింశతిః(20) అధ్యాయం సమాప్తం

శుభం భూయాత్ 

సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి