అధ్యాయం 5

 అధ్యాయం 5 

శక్తి రూపాల నిజరూప దర్శనం 

••••••••••••••••••••••



స్కాంద పురాణం ప్రకారం చూస్తే…. ఈ క్షేత్రంలో మనకి ఆదిపరాశక్తి కాస్త పచ్చయన్ అమ్మన్ అలాగే మహాలక్ష్మి దేవిగా నిజరూప దర్శనాలు ఇస్తుందని చెప్పటం జరిగింది. ఇది సత్యం అని ఇక్కడ స్థానిక భక్తుల , శివయోగుల, సాధువుల స్వానుభవాలు చెబుతున్నాయి. ఎలా అంటే గిరిప్రదక్షిణ సమయంలో కొంతమందికి అనుకోకుండా కాలికి దెబ్బ తగిలి రక్తం కారడం అప్పుడప్పుడు జరుగుతుంది. ఇలా జరిగిన కొద్ది మందికి కొంతసేపటికి రక్తం కారడం ఆగిపోతుంది …కానీ మరి కొంతమందికి కాలికి గాయమైతే రక్తం ఆగకుండా ధారాపాతంగా కారుతూనే ఉంటుంది. ఎన్ని కట్లువేసిన ఆగదు . ఎన్ని మందులు లేదా ఇంజక్షన్లు వేసిన ప్రయోజనం ఉండదు. ఏకథాటిగా మూడు గంటలకు పైగా కారుతూనే ఉంటుంది. 



ఇలాంటి వారిని రక్షించడానికి ఆదిపరాశక్తి కాస్త మహాలక్ష్మి దేవి అంశతో ఒక వయోవృద్ధురాలిగా వచ్చి…తన చేతి సంచిలో ఉన్న ఏవో వనమూలికలు తీసి వాటి పసరును ఈ గాయం మీద వేయగానే ఏదో మంత్రం వేసినట్లుగా రక్తప్రవాహం ఆగిపోయి….  పది నిమిషాలలో గాయమైన కాలు కాస్త సాధారణ స్థితికి రావడం జరుగుతుంది. ఇలా ఎంతోమంది ఈ విధంగా రక్షించబడటం ఇక్కడి స్థానికులు చూసే సాధారణ విషయమే కానీ  స్థానికేతరులకి ఇది అసాధారణ విషయం అవుతుంది.


నా స్వానుభవం ప్రకారం చూస్తే…. నేను కాస్త గిరి ప్రదక్షిణం గావించుకొని గుడి దర్శనానికి వెళ్లి వస్తూ ఉండగా… గుడి దగ్గర ఒక గుంపు నిలబడి ఆందోళన పడుతూ ఉంటే ఏం జరిగిందా?  అని అక్కడికి వెళ్లడం జరిగింది. ఎవరో సంపన్నురాలు కాస్త గిరి ప్రదక్షిణం గావించుకుని గుడిని దర్శించుకుని తిరిగి వస్తుంటే చూసుకోకుండా గుడి స్తంభం యొక్క కొనకు ఈమె కాలి బొటనవేలు తగలడంతో గాయమై రక్తం కారటం ఆరంభమైంది. మొదటిగా సాధారణ స్థాయిలో మొదలై మూడు గంటలపాటు అవుతున్నప్పటికీ… రక్త ప్రవాహం ఆగటం లేదు.  అప్పటికే స్థానిక వైద్యులు వచ్చి ఎన్ని కట్టులు కట్టినా …రక్త ప్రవాహం ఆగటం లేదు రక్తం కాస్త చిన్న మడుగు లాగా మారింది.  ఈ దృశ్యం చూసిన నాకు కడుపులో తిప్పేసినట్లగా అనిపించింది. అంతటి రక్తపు మడుగును నేను ఎప్పుడూ చూడలేదు. అందరూ కూడా ఎవరికోసమో చూస్తున్నట్టు…. ఆలయం ద్వారం వైపుకి చూస్తున్నారు.నాకు అర్థం కాలేదు. ఎవరైనా పెద్ద వైద్యుడి కోసం ఎదురు చూస్తున్నారేమో అనిపించింది. ఇంతలో ఒక ముత్తైదువ వృద్ధురాలు కాస్త ఆలయంలోనికి  రావడంతో…. అక్కడున్న స్థానికులు కాస్త అమ్మ వస్తుంది…. అమ్మ వస్తుంది…మహాలక్ష్మి మాత వస్తుంది… ఇక కంగారు పడకండి.. భయం లేదు…అంటూ ఉండగా.. ఇవి ఏమీ పట్టించుకొని ఆ పెద్దావిడ కాస్త గాయమైన సంపన్నురాలి దగ్గరికి వచ్చి కాలి పరిస్థితి చూసి… తన చేతి సంచిలో నుంచి ఏవో మూలికలు తీసి వాటిని నూరి ఆ పసరును ఈ గాయం మీద వేసిన కొన్ని క్షణాలకి రక్త ప్రవాహం ఆగిపోయింది. నీరసించి పోయి కోమాకి వెళ్తున్న ఆమె కాస్త….తెలివి తెచ్చుకుని ఈమెకు నమస్కారం చేయగానే…ఆ ముత్తైదువ గుడి దర్శనానికి వెళ్ళడం గమనించాను. కొద్దిసేపటికి ఈ సంపన్నులు కాస్త లేచి తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గుడి బయటకు వెళ్ళింది. గుడిలో దర్శనానికి వెళ్లిన ఈ  ముత్తయిదువ ఎంతసేపటికి బయటకు రాలేదు. అప్పుడు అక్కడ ఉన్న వారిని విచారణ చేస్తే…. ఓ…ఆవిడా…! మానవమాత్రురాలిగా కనిపించే దైవాంశ సంభూతురాలు…ఆవిడ సాధారణ స్త్రీ మూర్తి కాదు…. సాక్షాత్తు మహావిష్ణువుకి పాద సేవ చేసే మహాలక్ష్మి మాత.  ఇలా ఎవరికైనా కాలికి గాయమైతే…. కాలికి కట్టు కట్టడానికి ఈ రూపంలో వస్తుంది. ఇది మాకు సాధారణ విషయమే…. మీలాంటి వారికి అసాధారణ విషయం అవుతుంది. ఇలాంటి కార్యం వలన ఎన్నోవేల జన్మలలో తెలిసి లేదా తెలియక చేసిన పాపరాశి ఇలా  గాయమైన కాలి రక్త ప్రవాహం వలన పోతాయని…ఎప్పుడైతే ఈ పాపపు కర్మ పూర్తి అవుతుందో…. ఆ మరుక్షణమే అమ్మ కాస్త ఇలా ముత్తైదవ స్త్రీగా వచ్చి కాలికి పసరు వేసి వెళ్ళిపోతుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా!  జై మహాలక్ష్మి మాత …అంటూ నాకు చెప్పి అతను వెళ్ళిపోయాడు. నేను కాస్త స్థానికేతర స్థాయి నుండి స్థానికుడి అనగా ఇక్కడ  స్థిర వాసిగా…  ఈ క్షేత్ర వాసిగా మారడంతో ఇలాంటి దృశ్యాలు,  అలాగే ఈమె వైద్యము నాకు కూడా సాధారణమైంది .విషయం తెలియనంత వరకు అది అద్భుతమవుతుంది.  విషయం తెలిసిన తరువాత అది సాధారణ విషయం అవుతుంది…అంతే కదా ! 


ఇకపోతే గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చాలామంది సాధారణంగా తెలిసి లేదా తెలియక ఒక తప్పు చేస్తూ ఉంటారని గ్రహించాను.  అది ఏమిటంటే అష్ట శివలింగ మూర్తుల దర్శనాల ప్రకారం గిరి ప్రదక్షిణం తప్పకుండా అందరూ చేయాలి. ఇదే విధి విధానంలో చేస్తే గిరి ప్రదక్షిణ పూర్తి ఫలితం మనకి వస్తుంది. కానీ చాలామంది కాస్త పంచముఖ ప్రాంతం దాకా వచ్చి…. ఎడమవైపు T-జంక్షన్ లో నందికి ఎడమవైపు సందులో ఉన్న ఈశ్వర లింగమూర్తిని దర్శించుకోకుండా ఈ జంక్షన్ కి కుడి వైపు ఉన్న పచ్చియమ్మన్ గుడికి వెళ్ళటం…. లేదంటే  ఈ గుడిని దాటుకొని బస్టాండ్ మీదుగా ఇంద్ర శివలింగమూర్తిని దర్శించుకుని ఆపై  వచ్చే రాజగోపురం దగ్గర ఉన్న అరుణాచలేశ్వర లింగ దర్శనానికి  వెళ్ళిపోతారు. నిజానికి పంచముఖ ప్రాంతానికి వచ్చి లోపలిగా ఉన్న  పచ్చియమ్మన్ అమ్మవారి గుడి దర్శనం చేసుకుని… ఆ పక్కనే మరో సందులో ఉన్న ఈశాన్య దిక్కు అధిపతి అయిన ఈశ్వర లింగమూర్తిని దర్శించుకుని ఆపై అరుణాచలేశ్వర స్వామి పడమటి గాలిగోపుర దర్శనం చేసుకొని ఆ పైన వచ్చే ఆఖరిదైన ఇంద్ర లింగమును దర్శించుకోవాలి. లేదంటే గిరిప్రదక్షిణ ప్రారంభించేటప్పుడే.. తొలి శివలింగ దర్శనముగా ఈ ఇంద్ర శివలింగమును దర్శించుకుని తిరిగివచ్చి ఈశాన్య లింగ దర్శనంతో గిరిప్రదక్షిణం పరిసమాప్తి చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఈశ్వర లింగమూర్తిని ఖచ్చితంగా దర్శించుకోవాలి.  శివక్షేత్రమైన ఈశ్వర లింగమూర్తిని దర్శించుకోకుండా ….గిరిప్రదక్షిణం చేస్తే అది అసంపూర్ణ గిరిప్రదక్షిణమే అవుతుంది.  సంపూర్ణ గిరిప్రదక్షిణ ఫలితం మీకు రావాలంటే …..ఖచ్చితంగా గిరిప్రదక్షిణలో వచ్చే అష్ట శివలింగములు దర్శనం చేసుకోక తప్పదు.  చేసుకోవాలి…  




పచ్చియమ్మన్ గుడి

ఈ విషయం మనకి గుర్తు చేయడానికి అలాగే ఓపికలేక బడలికతో అలసిపోయి….. ఈశ్వర శివలింగమూర్తిని దర్శించుకోకుండా వెళ్లే వారికి… ధైర్యం చెప్పడానికి పచ్చియమ్మన్ గుడిదగ్గర ఒక ముత్తయిదువ కాస్త పచ్చని కుంకుమ బొట్టుతో…. పచ్చని గాజులతో ….పచ్చని చీరతో మనకి అగుపించి ….నాయనా ఇంత దూరం వచ్చావు…గిరిప్రదక్షిణం ముప్పావు భాగం పూర్తి చేసుకున్నావు.  కాస్త ఓపిక తెచ్చుకుని ఈశ్వర లింగమూర్తిని కూడా దర్శించుకుని వెళ్ళు …..అలసిపోయిన ఈ శరీరానికి కాస్త ఈ గుడియందు విశ్రాంతిని ఇచ్చి…. ఆ గుడికి చేరుకొని ఆయన అనుగ్రహం పొంది…. గిరి ప్రదక్షిణ పూర్ణ ఫలితమును పొందు అని మనకి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పి ఇలా అదృశ్యం అవుతుంది.  స్థానికులకి ఈమె కొత్త కాదు…. స్థానికేతరులకి ఈమె కొత్తగా కనపడుతుంది… నా స్వానుభవంలోనే కాదు…. ఇలా నా మిత్రుల అనుభవంలో… వాళ్ళ కుటుంబ సభ్యుల అనుభవాలు చూసి ఈ విషయం మీకు చెప్పడం జరుగుతుంది. 


పచ్చయ్యన్ అమ్మ

అంతెందుకు ఒక శివరాత్రి నాటి అర్ధరాత్రి …..రెండు గంటల 30 నిమిషాల సమయంలో…. మా గిరి ప్రదక్షిణలో ఈ పచ్చయమ్మన్ గుడి దాకా వచ్చి….. నేను బాగా అలసిపోయాను.  విశ్రాంతి తీసుకుందామని…. గుడి బయట కూర్చున్నాను.  గుడి తలుపులు వేసి ఉన్నాయి….కొంత మంది సాధు సన్యాసులు ధ్యాన నిష్టలో ఉండటం గమనించాను.  కళ్ళు మూసుకున్నాను ….నాకు ఆ రోజు  ధ్యానానుభవంగా ….ఒక పెద్దవిడ కాస్త ఆకుపచ్చని చీర కట్టుకుని…. నెత్తి మీద బుట్టతో… పాల కుండలు పెట్టుకొని….కొండపైకి ఎక్కి పిలవగానే వివిధ రంగులలో ఉన్న దేవత సర్పాలు కాస్త….ఈమె దగ్గరికి వచ్చి,  ఈమె ఇచ్చే పాలను స్వీకరించి… వాటి ఆకలి తీర్చుకొని ….యధావిధిగా గుహలలోకి వెళ్లిపోవడం….ఈవిడ కాస్త ఖాళీ బుట్టలు నెత్తిన పెట్టుకొని కొండ దిగిరావడం కనిపించింది. ధ్యాన భంగం అయింది… కళ్ళు తెరిచి చూస్తే,  నాకు ధ్యానంలో కనిపించిన ఆవిడ కాస్తా నెత్తి మీద బుట్టతో ఆకపచ్చని చీరతో మూసి ఉన్న గుడి లోపలికి వెళ్లి  దృశ్యం చూసేసరికి నాకు నోట మాట రాలేదు. ఇంతలో అక్కడ ఉన్న సాధు సన్యాసులు కాస్త…. ఈమె వెళ్తున్న వైపుకు నమస్కారం చేస్తూ…. అమ్మ మమ్మల్ని పచ్చగా చూడు…. పచ్చయ్యన్ అమ్మ అని అంటూ….నా వైపు చూసి అద్భుతాన్ని ఆస్వాదించు!  అంతేగాని అది నిజమా కాదా? అని శోధించకు. అది నీకు మంచిది కాదు… ధ్యానానుభవాలు అనుభవంలోకి రావు.  వస్తే నమ్మక తప్పదు.  నువ్వు ధ్యానంలో చూసింది… అమ్మ నిత్యం చేసే ప్రక్రియ.  ఇలా చూసింది అమ్మ నిజస్వరూపమే…. కలలో అలాగే ఇలలో చూసింది అక్షరసత్యమే… నమ్మితే బాగుపడతావు… లేదంటే బాధపడతావు…. అమ్మ అనుగ్రహం పొందటానికి ప్రయత్నించు… అంతేకానీ అమ్మ ఆగ్రహం పొందకు.  అధోగతి పొందుతావు… అంటూ వీళ్ళు వెళ్లిపోయారు.  ఇలా తను ఉన్నానని ఇప్పటికీ ఇద్దరు అమ్మలు ఈ క్షేత్రంలో సంచారం చేస్తున్నారు. భౌతిక దర్శనాలతో పాటుగా నిదర్శనాలు చూపిస్తున్నారు…అనుగ్రహిస్తున్నారు.అలాగే నాకు ధ్యానంలో కనిపించిన ఈ పచ్చయమ్మన్ విగ్రహ మూర్తి మనకి అరుణాచలేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో ఉన్న ఈ క్షేత్ర వృక్షమైన పొగడ చెట్టు ఉన్న వైపు చూస్తున్న గణపతి గాలిగోపురంపై భాగంలో వెనక చివరిలో ఆకుపచ్చ చీర కట్టుకొని నెత్తిన పాలకుండ  పెట్టుకున్న ఒక స్త్రీ మూర్తి విగ్రహం కనపడుతుంది. నా అనుభవం సత్యమని ఈ విగ్రహ మూర్తి సాక్ష్యం గానూ… నిదర్శనం గాను నిలవడం జరిగింది. ఈసారి ఎప్పుడైనా అరుణాచల క్షేత్రానికి వచ్చినప్పుడు తప్పకుండా పచ్చయమ్మన్ గుడి దర్శనానికి వెళ్ళండి.  అక్కడ ప్రత్యేకంగా పచ్చ రంగు కుంకుమ  అలాగే పచ్చ గాజులు కొనుక్కోవడం మర్చిపోవద్దు….ఇలా అమ్మ అనుగ్రహం పొందండి… మీరు తరించండి… ధన్యులు అవ్వండి.


పంచమ అధ్యాయం సమాప్తం

శుభం భూయాత్ 

సర్వం  అరుణాచల శివార్పణమస్తు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి