అధ్యాయం - 3
సజీవ గురుదక్షిణామూర్తి దర్శనం
దక్షిణా మూర్తి స్తోత్రం
శాంతిపాఠః
ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై ।
తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే ॥
ధ్యానం
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః ।
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥ 1 ॥
మౌనముగా చేయబడిన వ్యాఖ్యానముతో, స్పష్టము చేయబడిన పరబ్రహ్మస్వరూపముకలిగి, బ్రహ్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వృద్ధులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువగురువు శ్రీ దక్షిణామూర్తిని నేను ఆరాధిస్తాను.
వటవిటపిసమీపేభూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ ।
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి ॥ 2 ॥
మర్రిచెట్టు క్రింద కూర్చొని, తనచుట్టూ ఉన్న మహర్షులకు బ్రహ్మవిద్యను అందిస్తూ, జనన మరణాలతో కూడిన సంసారదుఃఖాలను నిర్మూలిస్తూ, ముల్లోకాల చేతనూ గురువుగా కొలువబడే శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా ।
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ॥ 3 ॥
ఆహా ! ఏమి ఆశ్చర్యకరం ! యువకుడైన గురువుచుట్టూ, వృద్ధులైన శిష్యులు శ్రద్ధాభక్తులతో కూర్చొని ఉన్నారు, గురువు తన మౌనంతోనే వారి సర్వసందేహాలనూ నివారింపగలుగుతున్నాడు.
నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ ।
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః ॥ 4 ॥
భవరోగ రోగులకు వైద్యుడై జగద్గురువై, సర్వవిద్యలకు నిధియై, సమస్తలోకములకు గురువైన దక్షిణామూర్తికి నా నమస్కారములు.
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే ।
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ॥ 5 ॥
ప్రసన్నస్వరూపుడై, శుద్ధజ్ఞానమే మూర్తిగా, ప్రణవనాదమైన ఓంకారానికి లక్ష్యార్థంగా భాసిస్తూ, నిర్మలుడైన దక్షిణామూర్తికి నా నమస్కారములు.
చిద్ధనాయ మహేశాయ వటమూలనివాసినే ।
సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః ॥ 6 ॥
వటవృక్షం కింద మూలభాగంలో నివాసం ఏర్పరచుకొని... శుద్ధ జ్ఞానానికి ప్రతీకగా... సచ్చిదానంద స్వరూపంతో... గురు స్వరూపంగా భాసిస్తున్న దక్షిణామూర్తికి నమస్కారం
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే ।
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః ॥ 7 ॥
ఈశ్వరుడు, గురువు, ఆత్మ అనే విభిన్న రూపాలను అంతర్లీనంగా కలిగిన ఆధ్యాత్మిక లేదా చిదాకాశం అంతటా వ్యాపించి ఉన్న దక్షిణామూర్తికి నమస్కారం
అంగుష్ఠతర్జనీ యోగముద్రా వ్యాజేనయోగినామ్ ।
శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః ॥ 8 ॥
అంగుష్టము (బొటనవేలు) తర్జని(చూపుడువేలు ) కలిపినా చిన్ముద్ర లేదా జ్ఞానముద్రతో యోగులకు మార్గనిర్దేశం చేస్తూ జీవుడు, బ్రహ్మము ఒకటే అనే పరమ సత్యాన్ని శివుడు మనకు బోధిస్తున్నాడు.
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
స్తోత్రం
విశ్వం దర్పణ-దృశ్యమాన-నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 1 ॥
ఈ చరాచర ప్రపంచమునంతా, ఆత్మచైతన్మమయిన తనలో లీలా మాత్రంగా, స్వానుభవంగా, స్వాత్మగా, అద్దంలో కనిపించే నగరంవలె, స్వప్నదృశ్వం వలె తన కంటే భిన్నంగా ఉందన్న భ్రమకలిగిస్తోందని గుర్తిస్తున్న జగద్గురువైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
బీజస్యాంతరి-వాంకురో జగదితం ప్రాఙ్నిర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ ।
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 2 ॥
చిన్నివిత్తనంలో మహావ్యక్షం దాగి ఉన్నట్టుగా గోచరించే ఈ మహాజగత్తంతా, దేశకాలావృతమైన సమస్త చరాచర ప్రపంచమును, ఇంద్రజాలికునివలె, మహాయోగి వలె, బహిర్గతం చేసి తన మాయాశక్తితో స్వేచ్ఛగా జగన్నాటకాన్ని నడిపే మహాత్ముడైన నా గురువునకు, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు.
యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ ।
యస్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 3 ॥
ఎవని వ్యక్తరూపం ఈ ప్రపంచంగా స్ఫురిస్తూ కూడా నిత్యసత్యమై ప్రకాశిస్తూ ఉంటుందో, శ్రద్ధతో శరణువేడినవారికి తత్త్వమసి అను మహావేదవాక్కుచే ఎవరు జ్ఞానబోధ చేస్తుంటారో, ఎవరి జ్ఞానబోధ వల్ల జననమరణయుక్తమైన ఈ సంసార చక్రం నుండి ముక్తిపొందుతున్నారో, అట్టి పరమ పవిత్రమయిన గురుమూర్తికి, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు.
నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే ।
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 4॥
ఎవని చైతన్యం, మన కళ్ళు, చెవులు మొదలయిన ఇంద్రియాలద్వారా, అనేక చిల్లులు కలిగిన కుండలో ఉన్న దీపకిరణాలవలె, పైకి ప్రసరిస్తూ ఉందో, ఏ చైతన్యం ప్రకాశించడం వలన ఈ వస్తుమయ మహా ప్రపంచమంతా తెలియబడుతూ ఉందో, అటువంటి దివ్యమూర్తికి సద్గురువుకు, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు.
దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః ।
మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 5 ॥
బుద్ధిపరంగా స్త్రీలవలె, చిన్నపిల్లలవలె, మూఢులవలె, విషయాలనర్ధం చేసుకునే శక్తిహీనులు, మాయా ప్రభావానికి లోనై శరీరమే సత్యమనీ, ప్రాణమే సత్యమనీ, ఇంద్రియాలనే సత్యమనీ, మనస్సే సత్యమనీ, నిత్యమూ మార్పుచెందే బుద్ధే సత్యమనీ, శూన్యమే సత్యమనీ, శాస్త్రం నుండి తప్పుగా గ్రహిస్తారు. అట్టివారి భ్రమలను తొలగించగలిగే పరమగురువుకు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు.
రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ ।
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 6 ॥
గ్రహణ సమయంలో సూర్యచంద్రులు రాహువుచే కప్పబడినట్లుగా, సర్వేంద్రియ వ్యవహారాలూ ఉపశమించిన సుషుప్తి అవస్థలో ప్రవేశించి మాయావరణతో కూడిన సత్యం సన్నిధిలో విశ్రాంతినంది మళ్ళీ మెలకువలో తాను నిద్రపోయినట్లుగా తెలుసుకునే పరమసత్యానికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు.
బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా ।
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 7 ॥
బాల్యకౌమార యౌవన వ్యద్ధాప్య దశలలోనూ, జాగ్రత్ స్వప్న సుషుప్తి మొదలైన అన్ని అవస్థలలోనూ భూత వర్తమాన భవిష్యత్ కాలాలలోనూ, సర్వదా అన్ని ప్రాణులలోనూ “నేను” గా ఉంటూ, తన భక్తులకు చిన్ముద్ర ద్వారా తన నిజ తత్త్వాన్ని వ్యక్తం చేసే సద్గురుమూర్తి శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః ।
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 8 ॥
ఏ పురుషుడు మాయాప్రభావంతో తనలో – కార్యకారణ సంబంధరూపమయిన విశ్వాన్నీ, శిష్యాచార్య విభేదాన్నీ, పితృపుత్ర మొదలయిన తేడాలనీ జాగ్రత్ స్వప్నావస్థలనీ చూస్తున్నాడో, ఆయనను, ఆ పరమగురువుకి, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు.
భూరంభాంస్యనలోఽనిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ ।
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ॥ 9 ॥
ఎవని అష్టమూర్తులు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం సూర్యడు చంద్రుడు జీవుడు విరాజిల్లుతున్నారో, ఎవరు చరాచరమయిన జగత్తుగా వ్యక్తమవుతున్నారో, ఎవనిని ఆరాధించి సర్వవ్యాప్తమయిన ఆత్మతత్వంకంటే వేరుగా రెండవ దేదీలేదని సాధకులు తెలుసుకుంటున్నారో… అట్టి సద్గురువునకు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కారములు.
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ ।
సర్వాత్మత్వ మహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య-మవ్యాహతమ్ ॥ 10 ॥
సర్వాత్మత్వం ఈ స్తుతిలో వివరించబడింది. కాబట్టి దీనిని విని, మననం చేసి, ధ్యానించి, కీర్తించడంలో అష్టవిభూతి సహితమయిన సర్వాత్మత్వం, ఈశ్వరత్వం, స్వరూపానుభూతి సిద్ధిస్తాయి.
సంసార బంధములు, జనన మరణ ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించబడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం దక్షిణామూర్తిస్తోత్రం సంపూర్ణమ్ ॥
========================================================================
స్కాంద పురాణము అలాగే అరుణాచల పురాణము నందు మనకి ఈ అరుణాచల క్షేత్రంలో ఉన్న అరుణగిరి మీద ఇప్పటికీ సిద్ధ పురుషుని రూపముగా దక్షిణామూర్తి ఆవాసం చేస్తున్నారని రెండు శ్లోకాల ద్వారా మనకి తెలుస్తోంది అది ఏమిటంటే…
అస్త్యుత్తరేస్మిన్ శిఖరే దృశ్యతే వటభూరుహః
సిద్ధ వేష స్సదైవాస్తే యస్యమూలే మహేశ్వరః
యస్యఛ్ఛాయాతి మహతీ సర్వదా మండలాకృతిః
లక్ష్యతే విస్మయోపేతైః సర్వదా దేవమానవైః
భావం:- అరుణగిరి పర్వతమునకు ఉత్తర దిక్కులో ఉన్న శిఖరంలో ఒక మహా వటవృక్షముగా మర్రిచెట్టు ఉంది. ఈ వటవృక్షం కింద మహేశ్వరుడు కాస్త సిద్దవేషధారియై ఎల్లప్పుడూ విరాజిల్లుతూ ఉన్నాడు.ఈ వృక్షం నీడలో… ఈ వృక్షం చుట్టూ మండాకృతి ఆకారము చాలా దూరంగా వ్యాపించి ఉన్నది. ఈ మనోహర దృశ్యం దేవతలకి,మానవులకి ఆశ్చర్యానందాలకు గురిచేస్తుంది.
ఈ శ్లోకంలో చెప్పబడిన మర్రి వటవృక్షము మనకి రమణ మహర్షి బ్రిడ్జి దగ్గర నుండి అరుణగిరిని చూస్తే….ఆకుపచ్చని ఆకులతో, చిన్న సైజు పర్వతాకృతిలో కనబడుతుంది. కానీ సిద్ధ పురుషుడు కనిపించడు. పోనీ కొండ ఎక్కి ఈ చెట్టు ఉన్నచోటికి వెళ్లి చూస్తే… అక్కడ మనకి సాధారణమైన మర్రి చెట్టుగా కనబడుతుంది. దాని కింద ఎవరూ ధ్యానం చేస్తున్నట్లుగా అనిపించదు. కాకపోతే ఈ చెట్టు కింద కొంతమంది సాధువులు, సన్యాసులు ధ్యానం చేసుకుంటూ కనబడడం జరిగిందని… అక్కడకి వెళ్ళిన కొంతమంది ఔత్సాహికులు చెప్పడం జరిగింది. మరి ఈ సిద్ధ పురుషుడు ఎక్కడ ఉన్నాడని అనుకుంటే ….మనకి ఈ శ్లోకంలో చదివితే అర్థం అవుతుంది. అది ఏమిటంటే…
అత్రసిద్ధః పునర్నిత్యం వసామ్యగ్రే సురార్చితః
మమాంతరే గుహా దివ్యా ధ్యాతవ్యా భోగసంయుతాః
అగ్నిస్తంభ మయం రూపం అరుణాద్రి రితిశ్రుతః
ధ్యాయన్ లింగంమమ,బృహన్మదం,కుర్యాత్ ప్రదక్షిణం.
భావం:-అరుణాద్రి కొండ లోపల అంతర గుహ యందు అగ్నిస్తంభ జ్యోతిలింగముగాను ధ్యానస్థితిలో నేను ఉన్నాను అని గ్రహించి, భావించి ఎవరైతే గిరి ప్రదక్షిణం చేస్తారో….. వారికి ధ్యానమునందు నా భావరూప దర్శనం అవుతుందని చెప్పటం జరిగింది.
అరుణగిరి యోగి అయిన రమణ మహర్షి స్వానుభవం ప్రకారం చూస్తే, ఈయనకి పురాణంలో చెప్పబడిన సిద్ధయోగి రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడని చెప్పిన విషయం తెలుసుకున్నారు. ఒకరోజు ఈయన కాస్త అటు పంచముఖ దర్శన ప్రాంతానికి అలాగే ఇటు పచ్చయమ్మన్ ఆలయం వెనుక ఉన్న ప్రాంతానికి మధ్య భాగమునకు చేరుకొని…కొండ ఎక్కటం ఆరంభించారు. కొంత దూరం ప్రయాణించిన తరువాత ఈయనకి ఒక విస్తరాకు అంత పరిమాణం ఉన్న మర్రి ఆకు, ఎండిపోయిన స్థితిలో గాలికి కొట్టుకు వస్తూ కనిపించింది. ఈ ఆకు ఆనవాళ్లు చూసి…. సిద్ధ పురుషుడు ఆవాసం చేస్తున్న మర్రిచెట్టు ఆకు అని గ్రహించి…. అంటే ఈ వటవృక్షం ఇక్కడ ఎక్కడో దగ్గర్లోనే ఉన్నదని గ్రహించి…. అమితానందంతో కొండపైకి ఎక్కడం ఆరంభిస్తూ ఉండగా…. అనుకోకుండా ఈయన చెయ్యి ఒక కొమ్మకి తగిలి, అక్కడ ఉన్న తేనె తుట్టె కాస్త కదలడంతో… తేనెటీగలు కాస్త మూకుమ్మడిగా ఈయన కాలు మీద దాడి చేశాయి. వీటి ఆవాసం కదిలించిన పాపానికి ఇవి కుట్టడం సబబే అనుకుని…. అవి కుట్టి వెళ్లే దాకా…. ఆ కాలును కదపలేదు. అరగంట తర్వాత ఇవి ఎగిరిపోయాయి. కాలు చూస్తే బాగా వాచిపోయి…. నడవటానికి వీలు లేకుండా పోవడంతో సిద్ధ పురుషుడి మరియు వటవృక్ష దర్శనం అనేది భౌతిక దేహంతో ,భౌతిక నేత్రాలతో సాధ్యపడదని తనకి ఈ విధంగా దక్షిణామూర్తి తనకి సూచన ఇస్తున్నారని గ్రహించి…. వెనుతిరిగి విరూపాక్ష గుహకి చేరుకోవటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆనాటి ఔత్సాహికులు కొంతమంది కలిసి ఒక జట్టుగా వటవృక్ష దర్శనానికి బయలుదేరారు. సాయంత్రం అయ్యేసరికి దారి తప్పారు. దారి తెన్ను తెలియని అయోమయ స్థితిలో పడి… పరమేశ్వరుని వేడుకోవడం ఆరంభించారు. అప్పుడు కట్టెలు కొట్టుకునే వ్యక్తి వీళ్ళకి కనిపించి….అతని ద్వారా తిరిగి విరూపాక్ష గుహకి రాత్రికల్లా అందరూ క్షేమంగా చేరుకోవటం జరిగింది. ఆ తర్వాత ఇతని గురించి ఆరా తీస్తే…కట్టెలు కొట్టుకునే వ్యక్తి లాంటివాడు లేడని…. తెలిసి ఆశ్చర్యపోయారు. తర్వాత వీళ్ళకి ధ్యానంలో ఆ కట్టెలు కొట్టుకునే వ్యక్తి కాస్త గురు దక్షిణామూర్తిగా దర్శనం ఇచ్చారు.
ఆ తర్వాత కొన్ని రోజులకి అరుణాచలేశ్వర ఆలయ మరమ్మత్తులు జరుగుతున్నప్పుడు…. అరుణగిరి అంతర గుహకి వెళ్ళటానికి వీలుగా ఉండే సొరంగ మార్గం కనిపించాయి. ఒకటి ఈ ఆలయ ఈశాన్య దిక్కులో ఉన్న గుడిలో బయటపడిన సొరంగ మార్గం కాస్త ఆది అన్నామలై గుడిలో బయట ఉన్న బావి దగ్గరికి తీసుకుని వెళుతుందని తెలుసుకున్నారు. ఇక రెండవ సొరంగ మార్గం అయితే, అరుణాచలేశ్వర గుడి లోపల బావిలో నుండి మొదలైతే ఇది కాస్త ఆది అన్నామలై గుడి అంతరాలయంలో ఉన్న బావి దగ్గరకు తీసుకుని వెళుతుందని…. అంటే ఈ ఆలయంలోని బయట మరియు లోపల ఉన్న బావులలో ఉన్న అంతర్గత సొరంగ మార్గములలో వెళితే…. అది అరుణగిరి లోపల ఉన్న అంతర గుహకి వెళుతుందని గ్రహించారు. ఆ తర్వాత మూడవ సొరంగ మార్గం అనేది…. పడమర గాలిగోపుర దగ్గర ఉన్న రుద్ర పాదాల గుడిలో పాదాల క్రింద తవ్వితే ఒక సొరంగ మార్గం బయటపడటం… ఇది కాస్త సరాసరి అరుణగిరి అంతర గుహలోనికి తీసుకుని వెళుతుందని కొంతమంది ఔత్సాహితులు ఈ మార్గం గుండా కొంత దూరం ప్రయాణించి ఇది కాస్త అరుణగిరి అంతర గుహకి తీసుకొని వెళుతుందని గ్రహిస్తూ ఉండగా …..వీరికి విపరీతమైన శ్వాస ఆడని సమస్య రావటంతో వెనుతిరగడం జరిగింది. అరుణ యోగి సమాధి మండపంలో కూడా ఒక సొరంగ మార్గం ఉన్నదని…. ఈ మార్గం ద్వారా వెళితే ఇది కాస్త సరాసరిగా అరుణగిరి అంతర గుహకి తీసుకొని వెళుతుందని….. ఈ మార్గం నుండే ఆ సిద్ద పురుషుడైన అరుణ యోగి అప్పుడప్పుడు బయటకు వచ్చి…. ఈ ఆలయ వృక్షమైన పొగడ చెట్టు కింద ఆసీనులై వెళ్తూ ఉంటారని…. తనని కొలిచి ఆరాధించి, పూజించే యోగభక్తుల కోసం వస్తూ ఉంటారని స్థానిక శివ యోగుల స్వానుభవాలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ భౌతిక దేహంతో, భౌతిక నేత్రాలతో అరుణ యోగి సిద్ధ పురుషుడి భౌతిక దర్శనం అలాగే ఈయన కూర్చుని ధ్యానం చేసే సిద్ధ వటవృక్షం కానరాదని గ్రహించండి. తెలుసుకోండి.
అసలు పురాణంలో చెప్పిన ఈ విషయం నిజమా?కాదా అన్నప్పుడు రమణ మహర్షి కాస్తా క్షణకాలం పాటు ధ్యాన సమాధికి వెళ్లి బయటకు వచ్చి…. అక్కడ ఉండి ఈ ప్రశ్న అడిగిన వారితో ఇది అక్షర సత్యమే….అద్భుత వటవృక్షం కింద ఆసీనుడై నీలి వర్ణ శరీరధారిగా సిద్ధ పురుషుడు కాస్త అరుణగిరి యోగిగాను నీలివర్ణలోక దర్శనమైనట్లుగా… ఆకుపచ్చని ప్రకృతి సోయగాలతో… అందమైన నీటి సెలయేరులతో… మానవాతీత అద్భుత లోక దర్శనం అయినదని….కాకపోతే ఇది మానవ భౌతిక నేత్రానికి దర్శనం కాదని…. యోగ సాధన చేసి తెరుచుకున్న మనోనేత్రంతో చూస్తే…. ఈ అద్భుత ధ్యాన దృశ్యం ఆవిష్కరించబడుతుంది అని…. ఎంతో మంది దేవతలు మహర్షులు, యోగులు, సాధువులు, సన్యాసులు కాస్త జ్యోతి శరీరాలతో సొరంగ మార్గాలలో ప్రయాణించి వారిని దర్శించుకుని అనుగ్రహం పొందడం జరుగుతుంది. కాబట్టి మానవుల వలన ఈ సొరంగ మార్గాలకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రహించి…. అన్నీ సొరంగ మార్గాలను మూయించి వేయడం జరిగింది.
ఇలా సిద్ధపురుషుడు కాస్త…..అరుణగిరి యోగిగా సజీవ మూర్తిగా భౌతిక దేహంతో పలురూపాలతో పలు భక్తులకి కనిపించి… వారి ఈతి బాధలు, సమస్యలు పరిష్కరించారని పురాణ ఇతిహాసాలు సాక్ష్యంగా చెబుతున్నాయి. పంగుముని అనే సాధువుకి చిన్నప్పుడే రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. నడవడానికి ఎల్లప్పుడూ చేతి కర్ర సహాయం అవసరం పడేది. దమ్మిడి ఆదాయం లేకపోవడంతో ఇంట్లో వాళ్ళు చేసే అవమానాలు, చీత్కారాలు భరించలేక , తట్టుకోలేక తనకి ఇలాంటి జన్మ ఇచ్చిన ఆ అరుణాచల శివయ్య సన్నిధిలోనే ఈ దేహత్యాగం చేసుకోవాలని అరుణాచలం బయలుదేరారు. అక్కడికి చేరుకొని గిరి ప్రదక్షిణము చేస్తూ…. ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో చావాలని అనుకుంటూ…. గిరిప్రదక్షిణ చేస్తూ ఉండగా…. ఒక సాధువు ఇతని దగ్గరికి వచ్చి ఏమోయ్! చూడటానికి కుంటివాడి లాగా ఉన్నావు. మూడవ చెయ్యిగా ఈ కర్ర సహాయంతో నడుస్తున్నావు. ఈ కర్ర ఆభరణం నీకు అవసరమా? నడక వచ్చి నడవలేని వాడిగా నటిస్తున్నావా? అంటూ చేతికర్ర లాక్కుని పారిపోతుంటే ఈ సాధువు కాస్త కర్ర కోసం ఆ సాధువు వెంటపడ్డాడు. పట్టుకునే సమయానికి ఆ సాధువు అదృశ్యం అయ్యాడు. ఈ పంగుముని సాధువుకు అప్పుడు తెలివి వచ్చి…. తన చచ్చుపడిన కాళ్లు కాస్త ఆరోగ్యం పొంది నడవడానికి పనికి వచ్చాయని గ్రహించి ….అదృశ్యమైన సాధువు ఎవరో కాదని… శ్రీ అరుణాచల శివయ్య అని గ్రహించి… అరుణగిరికి పాదాభివందనాలు చేయడం జరిగింది. కాళ్లు పనిచేయడంతో ఆరోగ్యవంతుడై….ఇంటికి వెళ్లి సంపాదనాపరుడై…. కుటుంబ సభ్యులతో ఆనంద జీవితాన్ని అనుభవించాడు.
బ్రిటిష్ కాలంలో జరిగిన రెండు యదార్థ సంఘటనలు చూస్తే…. ఇప్పటికీ ఈ కాలంలో కూడా అరుణగిరి యోగి రూపంలో అరుణాచల శివుడే సజీవ మూర్తిగా తిరుగుతున్నారని ప్రబల సాక్షములుగా నిలుస్తున్నాయి. ఒకానొక సమయంలో ఒక సంపన్నురాలు కాస్త అరుణాచలంలో పెళ్లికి అర్ధరాత్రి ఈ క్షేత్రానికి చేరుకొని…. అక్కడున్న గుర్రపు బండిని బాడుగ చేసుకొని… పెళ్లివారింటికి బయలుదేరింది. కానీ ఈ బండివాడు కాస్త ఈవిడ ఒంటిమీద ఉన్న ఆభరణాల మీద అత్యాశ కలిగి దారి తప్పించి అరణ్యంలోకి తీసుకొని పోతుండగా…. ఎందుకో అనుమానం వచ్చి వాడితో నువ్వేమిటి? ఈ దారిన తీసుకొని వెళ్తున్నావు ?ఇది పెళ్లి ఇంటికి వెళ్ళదు….బండి ఆపు! నేను దిగుతాను….. అనగానే బండి వాడు కాస్త ….అరిస్తే చంపుతాను.. నీ ఒంటి మీద ఉన్న ఆభరణాలు ఇచ్చి వెను తిరగకుండా పారిపోయి నీ ప్రాణాలు కాపాడుకో! లేదంటే నిన్ను చంపైనా…. నీ ఆభరణాలు తీసుకొని పోతాను. అనగానే…. ఆమె కాస్త అరుణాచల శివ నామ స్మరణ పెద్దగా చేస్తూ ఉండగా…. ఒక పోలీసు అధికారి జీపు అక్కడికి రావడం…. విషయం తెలుసుకున్న వీళ్లంతా ఆ బండివాడికి దేహశుద్ధి చేసి అక్కడ నుంచి పంపించడం…. ఆ తర్వాత ఈవిడని తమ జీపులో ఎక్కించుకొని పెళ్లి వారింటికి తీసుకొని వెళ్లి దింపగానే…. ఆవిడ కాస్త వారి దగ్గర పోలీసు అధికారుల బాడ్జీ నెంబర్లు తీసుకుని కృతజ్ఞతలు చెప్పడంతో…. వీళ్లంతా వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఈవిడ కాస్త తనని రాత్రి రక్షించిన పోలీసు అధికారులు ఉన్న స్టేషన్ దగ్గరికి వెళ్లి…. వారి బ్యాడ్జి నెంబర్లు చెప్పి ….ఆ అధికారి పోలీసులని పిలిపిస్తే వారికి నగదు బహుమతులు ఇస్తానని చెప్పడంతో…. అక్కడున్న పోలీసులు కాస్త ఈమె చెప్పిన బ్యాడ్జి నెంబర్లు ఉన్న పోలీసులు తమ రాష్ట్రంలోనే లేరు… వచ్చిన వాళ్ళు నిజమైన పోలీసులు కాదని చెప్పగానే… ఈవిడ కాస్త గతుక్కుమంది. నిజమే కావచ్చును… ఎందుకంటే తనని రక్షించమని తను అరుణాచల శివ నామస్మరణ చేస్తూ ఉండగానే ….వీళ్లంతా వచ్చారు. వాళ్ళ పేరు చూస్తే శివ, నంది, బృంగి, గణపతి, కుమార మంగళ అని ఇలా ఉన్న వాళ్ళ చొక్కాల మీద పేర్లు గుర్తుకు వచ్చేసరికి…. సాక్షాత్తు అరుణాచల శివుడే తన గణాలతో వచ్చి తనని రక్షించడానికి వచ్చారని … గ్రహించడానికి ఈమెకి అట్టే సమయం పట్టలేదు. ఆనందంగా ఇంటికి చేరుకుంది.
ఒక బ్రిటిష్ ఉన్నత అధికారి కాస్త అరుణాచల శివ మీద అంచంచల భక్తి విశ్వాసాలతో అర్ధరాత్రి పూట తను ఒక్కడే ఈ గిరిప్రదక్షణం…..అది కూడా బూట్లతో చేస్తున్నాడు. ఎందుకంటే బూట్లు లేకపోతే ఈయన నడవలేడు. ఇలా వీటితో కొంత దూరం చేస్తూ ఉండగా బూటు చిరిగిపోయింది. కుట్టితే తప్ప ఇది పనికిరాదని ఈ అధికారి గ్రహించి…“ స్వామి! నీ అనుగ్రహం కోసం ఈరోజు వీలు చూసుకుని గిరి ప్రదక్షిణం చేయటానికి వచ్చాను… అనుకొని అవాంతరంగా ఈ సమస్య వచ్చింది. నీ అనుగ్రహం నా మీద ఉంటే ఈ సమస్యకి నువ్వే పరిష్కారం చూపించు” అని అరుణాచల శివనామ స్మరణ చేస్తూ ఉండగా…. అర్ధరాత్రి సమయంలో ఈయన దగ్గరికి ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి వచ్చి,ఈ అధికారి యొక్క తెగిపోయిన బూటు కుట్టి, ఇచ్చి వెళ్లిపోయాడు. డబ్బులు తీసుకోలేదని ఆ అధికారి గ్రహించి మర్నాడు ఉదయం ఇద్దామని ఆ రాత్రికి సంతోషంగా…. ఎలాంటి ఇబ్బంది లేకుండా…. గిరిప్రదక్షిణ పూర్తి చేసుకుని మర్నాడు డబ్బులు ఇద్దామని అక్కడ ఉన్న చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళితే…. వీళ్ళలో ఎవరూ కూడా రాత్రి తన బూటు కుట్టలేదని గ్రహించి….ఆ వచ్చింది ఎవరో కాదని…. సాక్షాత్తు అరుణాచల శివుడేనని గ్రహించి…. ఈ గిరికి కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది.
ప్రస్తుత ఆధునిక కాలంలో స్వామిగళ్ అనే అరుణాచల యోగి, ఒకసారి అనుకోకుండా కొండెక్కి ఎటో వెళ్లవలసిన వాడు , దారితప్పి ఎటో వెళ్ళాడు. తను దారి తప్పానని తెలుసుకొని చింతించడం ప్రారంభించాడు. అరుణాచల శివ నామస్మరణ చేసుకుంటూ ఉండగా…. ఒక బోయవాడి దంపతులు ఈయన దగ్గరికి వచ్చి విషయం తెలుసుకుని….సరియైన దారి చూపించి… వాళ్ళు కాస్త అదృశ్యం అయ్యేసరికి…వచ్చిన వాళ్ళు మానవమాత్రులు కాదని గ్రహించి… అప్పటికే చేరుకున్న పంచముఖ ప్రాంతం దగ్గర జ్ఞాన తపస్సు చేయగానే….పంచముఖ శిఖరాలు కాస్త పంచముఖాలు ఉన్న పరమేశ్వరుడిగా ధ్యానానుభవం అవ్వడం…. అలాగే ఆ బోయ దంపతులు ఎవరో కాదని…. ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరుల జ్ఞాన స్ఫురణ అందడంతో… ఆ రోజు నుండి అక్కడే ఉండి సాధన చేసుకుంటూ… జీవ సమాధి చెందడం జరిగింది. ఇలాగే రమణ మహర్షి యోగి కూడా ఒకసారి తమ భక్త బృందముతో కొండ ఎక్కుతూ దారి తప్పడం జరిగింది. అందరికీ విపరీతమైన దప్పిక వేసింది. తెచ్చుకున్న నీళ్లు అయిపోవడంతో చివరికి రమణ మహర్షికి విపరీతమైన దాహం వేస్తూ ఉండడంతో…. ఏం చేయాలో అర్థం కాకపోతే అప్ప ఉన్నాడు కదా! మన దప్పిక ఆయనే చూసుకుంటారులే అని భరోసా ఇచ్చారు. కొన్ని క్షణాల తర్వాత ఒక బోయవాడు వచ్చి అయ్యా !మీరు కూర్చున్న బండ కిందనే నీటి ఊట ఉంది .దప్పిక తీర్చుకోండి. సాహసాలు చేయకండి…అనుకోని ప్రమాదాలు తెచ్చుకోకండి…. అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఆ వచ్చిన వారు ఎవరో వీళ్ళకి అర్ధమయ్యి అరుణాచల శివ అని నామస్మరణ చేసుకున్నారు.
అంతెందుకు…. భక్త కన్నప్ప అనే భక్తుడికి తొలిసారిగా ఆటవిక బోయవాడి రూపంలో ఇక్కడే ఈ క్షేత్రంలోనే దర్శనం ఇచ్చి… అతనికి రసవిద్యా జ్ఞానం ప్రసాదించడం జరిగింది. దీనికి గుర్తుగా మనకి భక్తకన్నప్ప దేవాలయం కాస్త గిరిప్రదక్షిణంలో వచ్చే రాజరాజేశ్వరి గుడి ఎదురుగా ఉన్న భక్త కన్నప్ప గుడి ప్రధాన ద్వారం దాటి లోపలికి 100 మీటర్ల దాకా వెళితే….ఎలాంటి గోపురం లేని భక్తకన్నప్పను అనుగ్రహించిన ….బోయవాడి రూపములో ఉన్న దక్షిణామూర్తి రూపాన్ని చూడవచ్చును. ఇది అన్నివేళలా తెరిచి ఉండదు.
ఈ అన్ని కథనాలు విన్న ఒక భూగర్భ శాస్త్రవేత్త అయిన పరమ నాస్తికుడు కాస్త దేవుడు లేడు…దయ్యం లేదు…. అంతా మూఢనమ్మకాలే ! అని కొట్టి పడేస్తూ ఉండేవాడు. ఈ ఆధునిక కాలంలో కూడా దేవుడు కాస్త అరుణాచల శివకాస్తా బోయవాడిగా… ఆటవిక యువకుడిగా రావటం ఏమిటి ?రక్షించడం ఏమిటి ?ఈ అడవి పరిసరాలలో ఆవాసముండే ఎవరో చెంచులు లేదా గూడెం యువకులు వచ్చి రక్షిస్తే ,సహాయం చేస్తే, అది కాస్త దేవుడే ఈ రూపంలో వచ్చి రక్షించాడని భక్తి బాగా ముదిరి ప్రచారం చేస్తున్నారని… అవహేళన చేశారు. ఇది విన్న స్థానిక సాధువులు మౌనం వహించి కాలమే బుద్ధి చెబుతుందని మిన్ను కుండిపోయారు. ఇలా కొన్ని రోజుల తర్వాత నాస్తికుడు కాస్త కొండ ఎక్కి సిద్ధ పురుషుడు అవాసం చేస్తున్నానని చెప్పిన వటవృక్ష మర్రి చెట్టును చూడటం జరిగింది. ఇది చూస్తే కొండ కింద భాగంలో కనిపించే సాధారణ మర్రిచెట్టు లాగానే ఈ చెట్టు ఉంది కదా! ఇందులో ఏమి ప్రత్యేకత ఉన్నదని? అనుకొని…. ఈ చెట్టు కింద ధ్యానం చేస్తున్న సాధువు దగ్గరికి వెళ్లి ఇదే విషయం గురించి అడిగితే…. ఆయన కాస్త ఇతనితో “దేవుడు ఉన్నాడు అనుకునే వారికి…. దేవుడు ఉంటాడు.లేడు అనుకునే వారికి లేకుండా పోతాడు. నేను ఉన్నాను అని భావన చేస్తుంటే….. నువ్వు ఉంటావు. నేను లేను అని భావన చేస్తే…. నువ్వు లేకుండా పోతావు కదా! అంటే ఇదంతా కూడా నీ భావం బట్టి ఉంటుంది. కనపడుతుంది …కనపడకుండా పోతుంది… యద్భావం తద్భవతి…” అనగానే ఆ నాస్తికుడు కాస్త
“స్వామి! మీరు కాస్త దేవుడు ఉన్నాడని భావం చేయడం వలన…. మీకు ఆయన కనబడుతున్నారు. నేను కాస్త దేవుడు లేడని భావంతో ఉండడం చేత ….ఉన్న వాడు లేకుండా పోయాడని అంటున్నారు. ఇప్పుడు నేను కాస్త ఉన్నాడని భావం చేస్తే , లేనివాడు ఉన్నవాడిగా కనపడతాడా ?మీ పిచ్చి కానీ…. లేనివాడు కాస్త ఉన్నవాడిగా అది కూడా సజీవ మూర్తిగా ఎలా కనపడతాడు… మీలాంటి దొంగ స్వామీలు, దొంగ గురువులు, దొంగ సాధువులు, దొంగ సన్యాసులు ఉన్నంతవరకు ఈ లోకం బాగుపడదు ”అనగానే
అలాగా స్వామి !అయితే లేని వాడు కాస్త ఉన్నవాడిగా నీకు ఎలా కనపడతాడో చూడు….. అంటూ ఇతని భ్రుకుటి స్థానమునందు అతని బొటనవేలు ఉంచిన కొన్ని క్షణాలకి… ఇతనికి యోగమత్తు ఆవరించి ధ్యాన సమాధి పొందడం జరిగింది. ఇదంతా చేసిన ఆయన కాస్త ధ్యాన తపస్సు లోనికి వెళ్లడం జరిగింది. అర్ధరాత్రి 2: 30 నిమిషాల సమయంలో వివిధ లోకవాసులు కాస్త తమ హంస ఆకార పుష్పక విమానాలు ఎక్కి గిరికి పై భాగంలో ఆకాశమునందు గిరిప్రదక్షిణలు చేసి….ఈ వటవృక్షమునకు నమస్కారం చేసుకొని…. ఆ పక్కనే ఉన్న రాతిబండ మహా ద్వారమును ఏదో మంత్ర బంధముతో విముక్తి చేయగానే ….అది తెరుచుకోవడం…. లోపలికి ఇలా వచ్చిన దైవాత్మలు, యోగాత్మలు, మహర్షి ఆత్మలు, పుణ్యాత్మలు, వివిధ లోకముల ఆత్మలు, సాధువు, సన్యాస ఆత్మలు వివిధ రంగులలో అనగా ఎరుపు, నలుపు, తెలుపు, పసుపు, ఆకుపచ్చ, నీలి, కాషాయ వర్ణ ఆత్మలు కాస్త….అరుణగిరి అంతర గుహ మధ్యభాగానికి చేరుకోవటం…. ధ్యాన సమాధి లోనికి వెళ్లిన నాస్తికుడి ఆత్మ గమనించి లోపలికి వెళ్ళటం జరిగింది. మధ్యభాగం అతి సుందరమైన అద్భుత రీతిగా మండాకృతి ఆకారముగా ఉన్న మర్రిచెట్టు కింద నీలివర్ణ శరీరధారిగా వీరాసన భంగిమలో ..మౌనబ్రహ్మగా ….ఉన్న సిద్ధ పురుషుడు కాస్త అరుణ యోగిగా గురుదక్షిణామూర్తిగా ధ్యాన సమాధిలో ఉన్నట్లుగా కనిపించసాగింది. ఈయన చుట్టూ చేరిన వీరందరూ కలిసి ఈయనకి సుప్రభాత సేవ చేయడం ఆరంభించారు. ఇలా సుమారుగా 4:30 గంటల దాకా కొనసాగింది. ఆ తర్వాత వీరందరూ కూడా ఎవరికి వారే ఎలా వచ్చారో… అలా వెనక్కి వెళ్లి అదృశ్యం అవ్వడం…. ఈ నాస్తికుడి ఆత్మ గమనించింది . ధ్యాననిష్ట లో ఉన్న అరుణగిరి యోగి దగ్గరికి వెళ్లి మౌనముగా స్వామి! నీవు ఉన్నావని ఈ మూర్ఖుడికి సత్య నిరూపణ చేసి చూపించావు కదా! నీకు ఏమీ ఇచ్చి ఋణం తీర్చుకోగలను… పరమ నాస్తికుడిని పరమ భక్తుడిగా చేసుకున్నావు కదా! ఈ క్షణం నుంచి ఈ దేహం నీదే …నాది కాదు. ఉన్నది నీవే… నేను లేను.. అంటూ ఆవేదన భక్తిలో ఉండగా ….అరుణయోగి మౌనము నుండి…..నిరాకారానంద…. నిరాకారానంద…. నిరాకారానంద… అనే మౌనభాష అంతర్వాణిగా ఇతని మనసుకి అందడంతో ధ్యానభంగం అయింది. లేచి చూస్తే రోడ్లమీద ఉన్న పరమ నాస్తికుడైన గుమ్మడిపాటి వెంకటాచలం సజీవ సమాధి దగ్గర తను ఉన్నానని ఆ నాస్తికుడు గ్రహించి ….మరుక్షణం పైన అరుణాచలేశ్వరుని గుడి దగ్గరకు వెళ్లి తలనీనాలు సమర్పించి….గురుదక్షిణామూర్తి గుడి యందు నగ్నంగా మారి కాషాయ వస్త్రాలు ధరించి పరమ నాస్తికుడు నుండి పరమ భక్తుడే కొండెక్కి వటవృక్షం కింద చేరి 25 సంవత్సరాల పాటు ధ్యాననిష్టలో ఉండి చివరికి తన అంతిమ భౌతిక దేహమునకు కపాలమోక్షం కలిగి దేహము కాస్త యోగాగ్నితో బూడిద కుప్పగా మారి…. గాలిలో ధూళిగా మారి….విశ్వ శూన్యంలో శూన్యమై… దీక్ష నామానికి తగ్గట్లుగా నిరాకారానంద స్వామిగా నిరాకారమయ్యారు. ఈయన ఎవరో కాదు నా ప్రత్యక్ష గురుదేవులు. వారి ఈ ప్రత్యక్ష స్వానుభవం నేను కూడా పొందడంతో…. ఇప్పటికీ సజీవ మూర్తిగా దక్షిణామూర్తి కాస్త అరుణయోగిగా ఈ క్షేత్రంలో ఆవాసం చేస్తున్నారని ఈ గ్రంథ రచనకు పూనుకోవడం జరిగింది.
నా స్వానుభవం ప్రకారంగా…స్కాంద పురాణం చదివి… దక్షిణామూర్తి కాస్తా సజీవంగా సిద్ధ పురుషుడిగా వటవృక్షం కింద ఆసీనుడై ఉన్నారని చదివి… అరుణాచల క్షేత్రమునకు చేరుకోవడం జరిగింది. దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు 192 గిరిప్రదక్షిణలు చేస్తూ అక్షరలక్షలు గా ఏడు లక్షల అరుణాచల శివ నామస్మరణ పూర్తి చేసినప్పటికీ…. నాకు ఎలాంటి అనుభవం అనుభూతి కలగలేదు. ఇక ఈ క్షేత్రము వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని…రాత్రివేళ యందు గురుదక్షిణామూర్తి గుడికి చేరుకొని… తన కోరిక నెరవేరలేదని…ఆవేదన భక్తిని ఆయనకు నివేదించి… ఈ క్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని వేడుకొని… బయటకు వస్తూ ఉండగా… ఒక సిద్ధ సాధువు వచ్చి నా భ్రుకుటి స్థానంలో తన బొటనవేలు ఉంచి… నీ మనోనేత్రం తెరవబడిన ఈరోజే నా నిజరూప దర్శనం నీకు అవుతుంది అంటూ వెళ్లిపోయారు. నేను తిరిగి అద్దె ఇంటికి వచ్చాను. ఇంటి పైకి ఎక్కి ఎదురుగా ఉన్న అరుణగిరిని చూస్తూ… ధ్యాననిష్టలోకి వెళ్లిపోయాను. కాలం తెలియ రాలేదు… మనస్సు స్థిరమైంది.. ఆలోచనల ప్రవాహం తగ్గింది… సుమారుగా అర్ధరాత్రి సమయంలో నా స్థూల శరీరం నుండి నాలాంటి రూపధారి అయిన సూక్ష్మ శరీరం కాస్త కొండ ఎక్కే ధ్యాన దృశ్యం నా మనోనేత్రం నందు ఆవిష్కరింపబడింది..అంతవరకు నేను ఈ కొండను ఎక్కలేదు.కారణం ఈ కొండయే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమని …. స్పటిక శివలింగం అని నా భావనగా ఉండేది. కానీ, ఈరోజు నా సూక్ష్మధారి కాస్త ఈ కొండను ఎక్కుతూ చూతవృక్ష గుహ అనగా మామిడి చెట్టు గుహకు చేరుకుంది. ఈ కొండమీద ఈ గుహ అలాగే విరూపాక్ష గుహ, స్కంద ఆశ్రమము,ఓం నమశ్శివాయ గుహ ఇలా మనకు గుహలు ఉన్నాయని నాకు తెలిసి ఉండటంతో…. నా సూక్ష్మధారి వెళ్లిన గుహ కాస్త చూతగుహ అని గ్రహించాను. అప్పటికే అక్కడికి గిరి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ భిక్షాటన చేసే సాధువుల యొక్క సూక్ష్మధారుల ఆత్మలు ఉండటం గమనించాను. ఇంతలో ఒక పెద్దాయన కాస్త తన చేతిలో ఉన్న త్రిభుజాకార రాయితో… ఈ గుహ యొక్క గోడమీద ఏదో మంత్రము అక్షరంగా రాయగానే… కాంతిపుంజం అలాగే ప్రయాణించగానే …ఈ ద్వారబంధనం తెరుచుకోవడం జరిగింది. ఒక అంతర్గత సొరంగ మార్గం కనిపించింది. అందులో మోకాళ్ళ లోతు వరకు నీళ్లు ఉండటం గమనించాను. మాకు కొంతమంది ఆత్మలు ఎదురు రావడం జరిగింది. ఇలా కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత… వటవృక్షం కనిపించే చోటుకి అందరూ చేరుకున్నారు. ఆ తర్వాత ఈ పెద్దాయన కాస్త అక్కడ ఉన్న రాతిబండ ద్వార బంధనం మీద తన చేతిలో ఉన్న త్రికోణపు రాయితో ఏదో అక్షరముతో బంధ విముక్తి చేయగానే… ఈ రాతిబంధం తెరుచుకునేసరికి… లోపలికి అన్ని ఆత్మ శరీరాలు చేరుకోవటం జరిగింది. అక్కడ లోకానికి తెలియని… భౌతిక నేత్రాలకు కనిపించని….ఒక అద్భుత లోకం ఉన్నట్లుగా… నాకు అర్థమైంది. చుట్టూ ఆకుపచ్చని చెట్లతో… స్వచ్ఛమైన సెలయేరులతో… పక్షులతో…జంతువులతో… అలలారుతుండగా ఈ అంతర్గత మధ్య భాగంలో దివ్య తేజస్సుతో ఉన్న మర్రిచెట్టు వటవృక్షం కింద ఆసీనులైన దక్షిణామూర్తి స్వరూపం నాకు అగుపించింది. ఈయన చుట్టూ వయోవృద్ధులుగా నలుగురు శిష్యులు కూర్చొని ఉన్నారు . ఈయనేమో యువకుడి రూపంలో ఉంటే.. ఈయన శిష్యులేమో వయోవృద్ధులుగా ఉండటం గమనించాను. ఈ గుహకి ఉన్న నాలుగు ద్వారాలలో… ఒక ద్వారం నుండి సాధువులు,సన్యాసులు వస్తుంటే… మరొకద్వారం నుండి దైవాత్మలు వస్తుంటే… మరోద్వారం నుండి వివిధ లోకవాసులు…ఆత్మలు… వస్తుంటే, మరోద్వారం నుండి మహర్షులు, యోగులు, సిద్ధగురువులు ,ఆత్మలు వచ్చి ఇలా వీరంతా ఈయన వద్దకు చేరి… సుప్రభాత సేవ చేయడం జరిగింది. ఈ స్వామివారి ముందు గుండ్రని ఆకారంలో అగ్ని తీర్థకొలను ఉండటం గమనించాను. దీని లోపలికి కొన్ని ఆత్మల దిగటం గమనించి… నేను కూడా ఈ తీర్థంలో దూకటం జరిగింది. దీని లోపల మరో అంతర్గత గుహ ఉన్నట్లుగా గ్రహించాను. దీని లోపలికి వెళితే అక్కడ తేజోలింగ అగ్నిస్తంభం సుమారుగా 20 అడుగుల ఎత్తులో కనిపించింది. కాకపోతే దీనికి ఆది అలాగే అంత్యమూ కనిపించలేదు. కేవలం ఈ అగ్ని లింగ మధ్యభాగమే కనపడుతుందని తెలుసుకున్నాను. అంటే శ్లోకంలో చెప్పినట్లుగా అరుణ శోణాద్రి యందు అగ్ని జ్యోతి స్తంభంగా…. అలాగే వటవృక్షం కింద దక్షిణామూర్తి ఆశీనులై ఉంటానని చెప్పింది అక్షర సత్యం అని అనుకునే అనుభవ దృశ్యం అదృశ్యం అయింది. నా సూక్ష్మ శరీరం నా దగ్గరికి చేరుకోవడంతో…. నా స్థూల శరీర ధ్యానానికి ధ్యాన భంగమై కళ్ళు తెరిచి చూస్తే…. తెల్లవారుజామున నాలుగున్నర అయింది. అంటే ప్రతినిత్యం అర్థరాత్రి 2:30 గంటలకి అరుణగిరి యందు అరుణాచల దక్షిణామూర్తికి సకల దైవాత్మలు ,మహర్షుల ఆత్మలు, యోగాత్ములు వివిధ లోక వాసుల ఆత్మలు, సాధువు ఆత్మలు, సన్యాసుల ఆత్మలు వచ్చి సుప్రభాత సేవ చేసి ఆయనలను దర్శించుకుని వెళ్తారని గ్రహించాను. ఈ అనుభవ అనుభూతి పొందటం జరిగింది. ఆనాటితో ఈ క్షేత్రం వదిలి పెట్టాలనే ఆలోచన మానుకొని…మోక్షం పొందే దాకా ఈ క్షేత్ర స్థిరవాసిగా ఉండాలని నిశ్చయించుకుని ….గృహస్థాశ్రమం నుంచి తప్పుకొని… సన్యాసదీక్షతో సన్యాసం స్వీకరించి…మోక్ష సన్యాసిగా మారి… ఆయన అనుగ్రహంతో శివశక్తి అర్ధనారీశ్వర స్వరూప దర్శనానుభవంతో… వీరి అనుగ్రహంతో …తిరిగి నా మోక్ష జీవితం కొనసాగిస్తున్నాను. ఆకాశంలోని పూర్ణ శూన్యంలో శూన్యం అయ్యే అంతిమ పిలుపు కోసం ఎదురుచూస్తున్నాను. నా స్థూల శరీర ఆఖరి నిద్ర కోసం… ఆఖరి కర్మ నివారణ కోసం… ఆఖరి భోజనం కోసం… ఎదురుచూపులతో ఓంకార నాదముతో ఆ అరుణాచల శివుని అనుగ్రహము కోసం సాధన చేస్తూ… ఈ దేహ జీవితముగా ఉన్నది ఆయనే…. నేను లేను అని… నాలో ఉన్నది జీవం కాదని… శివమని అనుభవ అనుభూతి భావంతో ఆరాధన కొనసాగిస్తున్నాను. శివుడే శివుడిని చూస్తున్నాడు. శివుడే శివుడిని ఆరాధన చేస్తున్నాడు . శివము కానిది లేదు… లేనిది లేదు.. అంతా సర్వం శివమయం .
అంతెందుకు… ఇలా మా అందరి అనుభవాలు పక్కన పెడితే… దక్షిణామూర్తి కాస్త సజీవ మూర్తిగా ఉన్నారని భౌతిక ప్రత్యక్ష నిదర్శనముగా మనకి అరుణగిరి యొక్క దక్షిణ దిక్కు వైపుగా ఉన్న కొండను అనగా రమణ స్వామి ఆశ్రమం ఉన్న కొండ భాగమును చూస్తే…. దీనికి ఒక వైపు పడుకొని ఉన్న దక్షిణామూర్తి తలభాగము ప్రస్ఫుటంగా అందరికీ భౌతికంగా కనపడుతుంది. కావాలంటే దీనికి సంబంధించిన ఫోటోని పెడుతున్నాను చూడండి… మీకే తెలుస్తుంది… మీకే అర్థమవుతుంది… తల, జుట్టు ,కన్ను ,ముక్కు, పెదవులు, గడ్డం ఉన్నట్లుగా… చాలా స్పష్టంగా ఇప్పటికీ కనపడుతుంది. ఇంకా ఇంతకంటే ప్రత్యక్ష నిదర్శనం మనకి అవసరమా? మీరే ఆలోచించండి. ఈ క్షేత్రంలో అరుణగిరి లోపల అంతర గుహలో ఇప్పటికీ సజీవ మూర్తిగా మనకి ఈయన ఉన్నారని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. వాటిని మీరు నమ్మితే ఉంటాడు . నమ్మకపోతే ఉండరు. యద్భావం తద్భవతి
ఇకపోతే దక్షిణామూర్తి అవతారం గురించి చాలామందికి తెలియదు. ఈ అవతార విశేషాలు చూస్తే బ్రహ్మదేవుడు కాస్త తన సృష్టిని ఆరంభించేటప్పుడు …సనక ,సనంద, సనాతన, సనత్కుమారుడు అనే నలుగురు కుమారులను సృష్టించడం జరిగింది. వీరంతా కూడా ఐదు సంవత్సరాల వయస్సుకి వచ్చేసరికి… గోచికట్టి మేము సృష్టిని కొనసాగించలేము… మేము బ్రహ్మజ్ఞానం పొందాలి. అందుకు మీ సృష్టికి మేము మీకు సహాయపడలేము…. అని చెప్పి భోగ జీవితంలో స్మశాన వైరాగ్యం చెంది…. యోగ జీవితము నందు బ్రహ్మజ్ఞానులై…జ్ఞానాసక్తులై ….అనురక్తితో తమకి జ్ఞానబోధ చేసే బోధ గురువు కోసం అన్వేషణ చేయడం ఆరంభిస్తారు. అప్పుడు వీరికి త్రిమూర్తులు కాస్త త్రిమాతల మోహమాయలో ఉన్నారని ….వీరు తమకి ఇంక ఏమీ బ్రహ్మ జ్ఞానం బోధిస్తారని… భావించి త్రిలోకాలనుండి వెనుతిరిగి…. వెళ్ళిపోతుంటే వీరి అజ్ఞానాన్ని చూసిన పరమశివుడు కాస్త బాధపడి… వీరికి తనే బ్రహ్మజ్ఞానమును బోధించాలని నిశ్చయించుకొని….. వీళ్ళు వెళ్లే దారిలో ఒక మర్రిచెట్టు కింద వీరాసనం వేసుకొని…. దక్షిణ దిక్కు వైపు చూస్తూ….దక్షిణామూర్తిగా కూర్చోవడం జరుగుతుంది. ఈ నలుగురు కాస్త ఈ మూర్తి స్వరూపాన్ని చూసి ఇతని దివ్య తేజస్సుకి ఆకర్షితులై , మోహితులై ఈయనని తమ బ్రహ్మ జ్ఞాన బోధ గురువుగా గుర్తించి… భావించి… ఈయన చుట్టూ శిష్యులుగా చేరి కూర్చోవడం జరుగుతుంది. అప్పుడు వీరికి దక్షిణామూర్తి కాస్త కేవలం తన మౌనం భాషతో వీరందరికీ బ్రహ్మజ్ఞానమును పొందేటట్లుగా చేయడం జరుగుతుంది. ఇలా ఎందుకు చేశారు అంటే ….బ్రహ్మం అంటే మనసు. మనసు అంటే అందని స్థితి కదా.అలాగే మాటలకి అందని స్థితి కదా! అందుకే ఈయన ఈ నలుగురికి మౌన బోధ చేయడం జరిగింది. ఆనాటి నుండి దక్షిణామూర్తి కాస్త మౌన బ్రహ్మగా ఖ్యాతి పొందడం జరిగింది. ఇప్పుడు ఈ మూర్తి స్వరూపం ఆది గురు దక్షిణామూర్తిగా అరుణగిరి యందు సజీవమూర్తిగా ఉన్నారు.
మూడవ అధ్యాయం సమాప్తం
శుభం భూయాత్
సర్వం అరుణాచల శివార్పణమస్తు







కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి